🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
. *🌹శ్రీమద్భగవద్గీత🌹*
. *ప్రధమ అధ్యాయము*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
. *అర్జున విషాద యోగము*
. *శ్లోకము 1*
🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
*ధృతరాష్ట్ర ఉవాచ:*
*ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ: |*
*మామకా: పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ||*
*ధృతరాష్ట్ర ఉవాచ —* ధృతరాష్ట్రుడు పలికెను;
ధర్మ క్షేత్రే — ధర్మ భూమి;
కురు-క్షేత్రే — కురుక్షేత్రం వద్ద;
సమవేతాః — చేరియున్న;
యుయుత్సవః — యుద్ధ కాంక్షతో;
మామకాః — నా పుత్రులు;
పాండవా — పాండు పుత్రులు;
చ — మరియు;
ఏవ — నిజముగా;
కిం — ఏమి;
అకుర్వత — చేసినారు;
సంజయ — ఓ సంజయా.
*ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను:*
ఓ సంజయా! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయగోరువారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి?
శ్రీమద్భగవద్గీత విస్తారముగా ప్రకటింపబడు ఆస్తిక విజ్ఞానశాస్త్రము. అది గీతామహాత్మ్యము నందు సంగ్రహించబడినది. భగవద్గీతను కృష్ణభక్తుని సహకారమున పరిశీలనాత్మకముగా పఠించి ఎటువంటి స్వంత వ్యాఖ్యానములు లేకుండా అవగాహనము చేసికొనుటకు యత్నించవలెనని దాని యందు తెలుపబడినది.
గీతను అర్జునుడు శ్రీకృష్ణభగవానుని నుండి ప్రత్యక్షముగా శ్రవణము చేసి అవగాహన చేసికొనెను. ఈ విధముగా స్పష్టమైన అవగాహన కలుగగలదనుటకు భగవద్గీత యందే నిదర్శనము లభించుచున్నది. మనుజుడు ఆ గురుశిష్యపరంపరలో స్వకల్పిత వ్యాఖ్యానములు లేకుండా భగవద్గీతను అవగతము చేసికొనగలిగినంతటి భాగ్యవంతుడైనచో సమస్త వేదజ్ఞానమును, ప్రపంచామునందలి ఇతర శాస్త్రములను అతిశయించగలడు. ఇతర శాస్త్రములందు గల విషయమునే గాక అన్యత్రా గోచరించని విషయములను సైతము పాటకుడు భగవద్గీత యందు గాంచగలడు. అదియే గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత.
పూర్ణపురుషోత్తముడైన శ్రీకృష్ణభగవానుని ద్వారా ప్రత్యక్షముగా పలుకబడినందున ఈ భగవద్గీత సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞానశాస్త్రమై విరాజిల్లుచున్నది.
మహాభారతమునందు వర్ణింపబడిన ధృతరాష్ట్ర, సంజయ సంవాద విషయములు ఈ ఉత్కృష్ట తత్త్వశాస్త్రమునకు మూలసిద్ధాంతములై యున్నవి. అనాదియైన వేదకాలము నుండియు తీర్థస్థలముగా ప్రసిద్ధినొందిన కురుక్షేత్రమునందు ఈ తత్త్వశాస్త్రము ఉద్భవించినట్లుగా తెలియవచ్చుచున్నది.ఈ భూమిపై శ్రీకృష్ణభగవానుడు స్వయముగా ప్రత్యక్షమైనప్పుడు మానవాళి నిర్దేశనార్థము దీనిని పలికెను.
కురుక్షేత్రరణరంగమున శ్రీకృష్ణభగవానుడు అర్జునుని పక్షమున నిలిచియుండుటచే ధర్మక్షేత్రమను(ధర్మాచారములు నిర్వహింపబడు స్థలము) పదము ప్రాధాన్యత సంతరించుకొన్నది.
కౌరవుల తండ్రియైన ధృతరాష్ట్రుడు తన తనయుల విజయావకాశామును గూర్చి గొప్ప సందేహగ్రస్తుడై యుండెను. కనుకనే తన సందేహమున అతడు “వారు ఏమి చేసిరి?” అని కార్యదర్శియైన సంజయుని ప్రశ్నించెను. తన పుత్రులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయవలెనను నిశ్చయముతో కురుక్షేత్రమున సమకూడిరని అతనికి తెలిసియు ఆ విధముగా విచారణ కావించుటలో ఒక ప్రాముఖ్యము కలదు.
జ్ఞాతులైన సోదరుల నడుమ అతడు రాజీని వాంచింపలేదు. అదియును గాక రణరంగమున తన పుత్రుల విధి ఏ రీతి కలదో అతడు తెలియగోరెను. కాని దేవతలకు సైతము పూజనీయస్థానముగా వేదములలో తెలుపబడియున్న కురుక్షేత్రమునందు యుద్ధము ఏర్పాటు చేయబడుటచే యుద్ధపరిణామముపై స్థలప్రభావమును గూర్చి అతడు మిగుల భీతినొందెను. సస్వభావరీత్యా ధర్మాత్ములైనందున అర్జునుడు మరియు ఇతర పాండుసుతులకు అది అనుకూల ప్రభావమును చూపునని అతడెరిగి యుండెను. సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు. ధృతరాష్ట్రుని మందిరముననే నిలిచియున్నను అతడు వ్యాసుని కరుణచే కురుక్షేత్ర రంగమును గాంచగలిగెను. కనుకనే యుద్ధరంగమందలి పరిస్తితిని గూర్చి ధృతరాష్ట్రుడు సంజయుని అడిగెను.
పాండవులు మరియు ధృతరాష్ట్రుని తనయులు ఒకే వంశమునకు చెందినవారు. కాని కేవలము తన పుత్రులనే కురుసంతానముగా పలికి పాండుసంతానమును వంశము నుండి వేరుపరచుట ద్వారా ధృతరాష్ట్రుడు ఇచ్చట తన మనస్సును విశదపరచుచున్నాడు. సోదరుని తనయులైన పాండవుల యెడ ధృతరాష్ట్రునికి గల సంబంధము దీని ద్వారా ఎవరైననను అవగతము చేసికొనవచ్చును.
పంటపొలము నుండి కలుపు మొక్కలు తీసివేయబడు రీతి, ధర్మపితయైన శ్రీకృష్ణభగవానుడు నిలిచియున్న ధర్మక్షేత్రమగు కురుక్షేత్రము నుండి కలుపుమొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని తనయులు తీసివేయబడుదురనియు, యధిష్టరుని అధ్యక్షతన గల ధర్మయుతులైన పాండవులు భగవానునిచే సుప్రతిష్టుతులు కాగాలరనియు ఆది నుండియే ఈ విధముగా ఊహించబడినది. చారిత్రిక మరియు వైదిక ప్రాముఖ్యమే గాక “ధర్మక్షేత్రము” మరియు “కురుక్షేత్రము” అనేది పదములకు గల విశేషార్థమిదియే.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి