25, డిసెంబర్ 2023, సోమవారం

స్వామివారితో

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*శ్రీ స్వామివారితో  నా సంభాషణ..*


1973 జనవరి నెల మొదటివారం లో సంక్రాంతి సెలవుల్లో కనిగిరి నుంచి మొగలిచెర్ల రావడం జరిగింది..ఆసరికే శ్రీ స్వామివారు, మాలకొండ నుంచి మొగలిచెర్ల లోని మా ఇంటికి రావడమూ.. కొద్దికాలం పాటు ఇంటి వద్ద గడపడమూ..అమ్మా నాన్న గార్లతో పాటు మా నాయనమ్మ సత్యనారాయణమ్మ గారికి కూడా ఆధ్యాత్మిక బోధ చేయటమూ..ఆ తదుపరి హఠాత్తుగా ఒక తెల్లవారుఝామునాడు ఇంటి వద్దనుంచి బయలుదేరి, ఫకీరుమాన్యం లో తాను ఆశ్రమం నిర్మించుకోదలచిన ప్రదేశానికి వెళ్లిపోవడమూ జరిగిపోయింది..నాన్న అమ్మగార్లు ఆ విషయమై కొద్ధి మనస్తాపం చెందినా.. శ్రీ స్వామివారు తీసుకున్న నిర్ణయాన్ని ఆపలేకపోయారు..శ్రీ స్వామివారు బస చేయడానికి తాత్కాలికంగా ఒక పాకను రెండురోజుల్లో వేయించారు నాన్నగారు..ఆ పాకలో బస చేస్తూ..ఆశ్రమం నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూ వున్నారు..


శ్రీ స్వామివారికి రోజూ ఆహారం మా ఇంటివద్దనుంచే తీసుకెళ్లి ఇచ్చేవారు..ఆహారం అంటే  రకరకాల పదార్ధాలతో కూడినది కాదు..బియ్యంలో కొద్దిగా పెసరపప్పు వేసి వుడికించి చేసేది..నేను మొగలిచెర్ల వచ్చిన మరుసటి రోజు శ్రీ స్వామివారికోసం వండిన ఆ ఆహారాన్ని తీసుకెళ్లి ఇచ్చేసి రమ్మని అమ్మ నాతో చెప్పింది..సరే అని ఆ చిన్న స్టీలు డబ్బా తీసుకొని ఫకీరు మాన్యం లో ఉన్న శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళాను..


నేను వెళ్ళేసరికి శ్రీ స్వామివారు, పాక బైట పచార్లు చేస్తూ వున్నారు..నన్ను చూసి నవ్వుతూ.."అమ్మ నిన్ను పంపించిందా?.." అన్నారు.."అవును" అని తలాడించాను..నేనిచ్చిన డబ్బా తీసుకొని పాకలో ఒక మూల పెట్టి మళ్లీ బైటకు వచ్చారు..


"ఇప్పుడు ఏం చదువుతున్నావు?.." అన్నారు.


"ఎనిమిదవ తరగతి.." అన్నాను..


"ఏ ఊళ్ళో?.." అన్నారు..


"కనిగిరి లో " అన్నాను..


శ్రీ స్వామివారు పాకలోకి వెళ్లి.."దా!..ఇక్కడ కూర్చో.." అని పాకలో ఉన్న బల్ల చూపారు..వెళ్లి అక్కడ కూర్చున్నాను..కూర్చున్నానే కానీ..ఏమి మాట్లాడాలో తెలియని ఒకానొక అయోమయ స్థితిలో వున్నాను..శ్రీ స్వామివారిని చూసాను..నిర్మలంగా..చిరునవ్వుతో నన్నే చూస్తున్నారు..


"మీ ముగ్గురికీ మీ అమ్మగారు  స్తోత్రాలు ఏవైనా నేర్పించిందా?.." అన్నారు..


"నాకు హనుమాన్ చాలీసా..లక్ష్మీనరసింహ స్వామి అష్టోత్తరం చేసుకోమని చెప్పి, అవి నేర్పించింది.." అన్నాను..


"మరి రోజూ చేస్తున్నావా?.." అన్నారు..తలూపాను..నిజానికి అప్పుడప్పుడూ ఆ రెండు స్తోత్రాలూ చేసుకోకుండా ఎగ్గొట్టిన రోజులు కూడా ఉన్నాయి..కానీ శ్రీ స్వామివారితో ఆమాట చెప్పలేదు..


"అంత ఖచ్చితంగా చేసేటట్లు గా లేవే!.." అన్నారు నవ్వుతూ..పసిగట్టేశారు..సిగ్గుతో తలొంచుకున్నాను..


"హనుమాన్ చాలీసా రోజూ చెయ్యి..అలాగే లక్ష్మీ నృసింహ స్వామి ది కూడా..ఏమరుపాటు లో ఉండొద్దు..అమ్మ చెప్పినవి ఎంతో మహత్తు కలవి.. నీకు ఇప్పుడు అర్ధం కాదులే..పిల్ల తరహాగా ఉండొద్దు.." అని చెప్పారు..


మరో రెండు నిమిషాల పాటు శ్రీ స్వామివారు ఏమీ మాట్లాడలేదు..నేను ఇక అక్కడ కూర్చోలేక, "వెళ్ళొస్తాను స్వామీ.." అన్నాను..సరే నన్నట్లు నవ్వుతూ తలూపారు..పాకలోంచి బైటకు వచ్చి ఇంటిదారి పట్టాను..


ఆరోజు నుంచీ సంక్రాంతి పండుగ అయిపోయి, నేను తిరిగి కనిగిరి వెళ్ళేదాకా..ప్రతిరోజూ శ్రీ స్వామివారికి ఆహారాన్ని తీసుకెళ్లి ఇచ్చే బాధ్యత అమ్మ నాకే అప్పచెప్పింది..నేనూ అలవాటు పడిపోయాను..మూడోరోజు నా కళ్ళ ముందు ఒక సంఘటన జరిగింది..


భూతమూ.. వైద్యమూ..రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!.


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్:523114.. సెల్..94402 66380 & 99089 73699

కామెంట్‌లు లేవు: