విష్ణుచిత్తుని చరితము
(ఆముక్త మాల్యద )
సీ. తలను పక్షంబులన్ దాచియు బాతువుల్
కేదారభూములన్ సేద దీర
నారెకులదిగాంచి యాశ్చర్యమున్ జెంది
'నగరమందున్నట్టి నైష్ఠికులగు
జన్నికట్టు లచట స్నానమ్ము లొనరించి
పంచెలన్ బిండి తా నుంచి' రనియు
నవ్వాని వారల యావాసమున్ జేర్చ
మదియందు దలచియు మమత తోడ
తే. నికటమున కేగి చూడగా నేల నున్న
బాతువులు రెక్క లల్లార్చి పారిపోయె
వింత గాంచిన పొలమున నింతు లెల్ల
గల గలా నవ్విరప్పుడు గట్టి గాను. 06*
సీ. సంధ్యాసమయవేళ సరసులం దిరిగెడి
హంసలు గూళ్లకు నరుగుటకును
కదలగా నవ్వాని కంఠ గరుద్థ్వనుల్
వినువీథి గప్పెను వింత రీతి
నగరమం దప్పుడే నగధారి గుడియందు
సంధ్యార్చవేళలన్ సందడిగను
మ్రోసెడు భేరుల మురజల సవ్వడుల్
నలుదిశల్ వ్యాపించె నగరమందు
తే. రయమునన్ సాగు స్వేత మరాళ తతుల
కదలు రెక్కల సవ్వడుల్ కంఠరవము,
భేరి కాహళ, వాద్యాల తీరు నొప్పి
భ్రమలు కల్పించె పట్టణవాసులకును. 07*
✍️గోపాలుని మధుసూదనరావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి