6, సెప్టెంబర్ 2020, ఆదివారం

నొప్పింపక.. తానొవ్వక


అందరం మానవులమే అయినా, మనందరి జీవితాలూ ఒకే విధంగా ఉండవు. ఎవరి జీవితం వారిదే. ఎవరి కష్టసుఖాలు, జయాపజయాలు, మానావమానాలు, వారివే. ఎవరి ఆయుఃప్రమాణం వారిదే. ఇన్ని వైవిధ్యాల మధ్య మనమంతా కలసి బతకాల్సి ఉంటుంది. ఒకరిని ఇబ్బంది పెట్టకుండా, మనం ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా మసలడమే సరైన మార్గం. ‘నొప్పించక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ!’ అని సుమతీ శతకకారుడు చెప్పినమాట నిజమే. ఎన్ని అననుకూల పరిస్థితులు చుట్టుముట్టినా, ఇబ్బందులు ఎదురైనా సర్దుకుపోవడం నేర్చుకోవాలి. సర్దుకుపోయే మనస్తత్వం, ఇచ్చిపుచ్చుకొనే ధోరణి, సహనం, త్యాగభావం ఉంటే కాస్తంత హాయిగా ఉండవచ్చు. జాగ్రత్త, సమయస్ఫూర్తి ఉంటే వ్యతిరేక పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా జీవించవచ్చుననడానికి మన నాలుకే మంచి ఉదాహరణ. 32గట్టి పండ్ల మధ్య మృదువైన మెత్తని నాలుక నిరంతరం మసలుతుంటుంది. తినేటప్పుడు, మాట్లాడేటపుడు నాలుక అటూ ఇటూ కదలక తప్పదు. పొరపాటున నాలుక దంతాల కిందకు వస్తే.. ‘పోనీలే మన నాలుకేగదా’ అని దంతాలు ఉపేక్షించవు. క్షమించవు. మానవ జీవితం కూడా అంతే. అననుకూల పరిస్థితుల్లో, శత్రు శ్రేణుల మధ్య నివసించవలసి వచ్చినా.. క్షమాగుణం, సర్దుకుపోయే మనస్తత్వం ఉంటే ఎట్టి హానీ కలుగదు.

ఇలా ఉండడానికి ఆ భోళాశంకరుడి కుటుంబాన్నే ఆదర్శంగా తీసుకోవచ్చు. ఈశ్వర కుటుంబంలో సభ్యులు నలుగురు. శివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి. వీరిలో ఎవరి వాహనాలు వారివి. అవి పరస్పర ఆజన్మ శత్రుత్వం గలవి. ఈశ్వరుని వాహనం నంది, పార్వతీ దేవి వాహనం సింహం. కానీ ఆ రెండూ ఒకే తావులో అన్యోన్యంగానే ఉంటాయి. సుబ్రహ్మణ్యస్వామి వాహనం నెమలి. ఈశ్వరుని ఆభరణాలు, గణేశుని జంధ్యం.. సర్పాలు. నెమలికి.. పాములకు బద్ధవైరం. వినాయకుని వాహనం మూషికమైతే.. వాటి రుచిని బాగా ఇష్టపడే సర్పాలు శంకరుని మెడలో ఉంటాయి. ఇవన్నీ కలిసిమెలిసే జీవిస్తుంటాయి. పరమేష్ఠి శిరస్సుపై గంగమ్మ.. నుదుటిపై పాలనేత్రం అగ్ని ప్రజ్వలితం! నీరు, నిప్పు పరస్పర విరుద్ధాలైనా ఒకేచోట ఉండడం విశేషం. వీటివల్ల మనం తెలుసుకోవలసింది, అర్థం చేసుకోవలసింది, ఆచరించవలసిందీ ఎంతో ఉంది. ‘నా ఇష్టమే ముఖ్యం, నా అభిప్రాయమే సరైనది, నా అవసరమే ప్రధానమైనది’ అనే భావనలు బలంగా ఉంటే సమస్యలు ఉత్పన్నమవుతాయి ఇద్దరి మధ్య సమస్య ఎదురైనపుడు ఎదుటివారి కోణంలో చూసి ఆలోచిస్తే, సర్దుబాటు ధోరణి అలవరచుకుంటే సమస్యలు జటిలం కావు. అందరం హాయిగా జీవించవచ్చు. ‘నా మాటే నెగ్గాల’ని భీష్మించుకోవటమే అనేక సమస్యలకు కారణం. ఆ పంతాన్ని ఇష్టపూర్వకంగా సడలించుకోవటమే ఈ సమస్యకు పరిష్కారం.
- మాదిరాజు రామచంద్రరావు, 9393324940

కామెంట్‌లు లేవు: