6, సెప్టెంబర్ 2020, ఆదివారం

గురువుకు శిష్యులందరిపై

🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹
గురువుకు శిష్యులందరిపై ఎలాగైతే సమానమైన వాత్సల్యముంటుందో, అలాగే శిష్యులందరికీ గురువుగారంటే అవ్యాజమైన భక్తి, గౌరవాలుంటాయి.అయితే కొందరు శిష్యులు గురుభక్తిని బాహాటంగా ప్రదర్శిస్తే, కొందరు తమ గుండె గుడిలో గురువును ప్రతిష్టించుకొని,మనసులోనే నిత్యం కొలుచుకుంటారు.
        ఈ రెండో కోవకు చెందినవారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు.తమ సంగీత గురువులైన పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారంటే ఆయనకు ఉన్న ఆరాధనాభావం,గురుస్థుతిగా ఆయన పాడుకొన్న రచనలను వింటే అర్థమౌతుంది.
      గొప్ప విషయం ఏమిటంటే, బెజవాడలో పారుపల్లివారి వర్ధంతి ఉత్సవాలు గత 69 సంవత్సరాలుగా వారి శిష్యప్రశిష్యుల నిర్వహణలో జరుగుతున్నాయి.
      1982వ సంవత్సరం,డిశంబర్ లో వారి 'శత జయంతి మహోత్సవాలు' వైభవంగా 5 రోజులపాటు జరిగాయి.పంతులుగారి సోదరుని కుమారులైన పారుపల్లి శ్రీరామచంద్రమూర్తిగారు స్థాపించిన 'పారుపల్లి రామకృష్ణయ్య పంతులు సంగీత సమాఖ్య' ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగాయి.పంతులుగారి ప్రియ శిష్యులు అన్నవరపు రామస్వామిగారు ఈ ఉత్సవాలకు ప్రధాన పర్యవేక్షకులు.
       దేశం నలుమూలలా ఉన్న పంతులుగారి శిష్యప్రశిష్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని, వారికి గానార్చన చేశారు.'స ప స' (SAtha jayanti by PArupalli Ramakrishnaiah Pantulu SAngita samakhya) పేరుతో 'న భూతో న భవిష్యతి'..అన్న చందంగా ఆ ఉత్సవాలు నిర్వహించబడినాయి.కొత్తగా బెజవాడలో రూపుదిద్దుకొన్న 'తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రం'లో ఈ కార్యక్రమాలు జరగడం ఒక విశేషం!
         సహజంగా బాలమురళిగారి గానం ఆ ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణ! సహకారాలు: పంతులుగారి శిష్యులు తిరుపతి పొన్నారావుగారు-వైలిన్, మహాదేవు లక్ష్మీనారాయణరాజుగారు-మృదంగం. ఆరోజు జనంతో హాలు కిక్కిరిసిపోయింది.నాటి కచేరీలో త్యాగరాజాది వాగ్గేయకారుల కృతులతో పాటు గురుస్థుతిగా ఆయన పాడిన స్వీయరచన ప్రత్యేకించి పేర్కొనదగినది.తాను సృష్టించిన 'సుషమ' అనే రాగాన్ని కొద్దిగా ఆలపించి,ఒక్క క్షణం కనులుమూసుకొని,గురువుగారిని తలచుకొని, ప్రారంభించారు..

  'అయ్యా!గురువర్యా!
   అయ్యా!గురువర్యా!

   నీయానతితో పాడుచుంటినయ్యా!

   నీపద పల్లవ వచోవిలాసము పల్లవిగా..
   నీ అనుబంధమె అనుపల్లవిగా..
   నీ చరణములే చరణముగా..
   నీ ఆకృతియే నా కృతిగా..

   నీ ఆనతితో పాడుచుంటినయ్యా..
                   అయ్యా!గురువర్యా!...

   పదులైదైనది నా వయసు..
   పదిపదులైనా నా వయసు,
   పదిలముగా నీ పదములనే
   పాడుచుందునయ్యా!...

   ఎన్నుకొన్న ఆ రాగం..

       మురళీగారి మధుర గళంలో.. గుండెలోతుల్లోంచి పొంగిన గురుభక్తితో నిండి,నిబిడీకృతమై..శ్రోతల హృదయాలను సుతారంగా స్పృశించి, ద్రవింపచేసింది.
          ఐదుపదులు నిండిన బాలమురళీగారు తన కన్నులెదుట ఆ క్షణంలో దర్శించిన ఆజానుబాహులైన గురువుగారి దివ్యమంగళ విగ్రహం,చెరగని చిరునవ్వు..అభయ హస్తం..ఆ గానం విన్న యావన్మంది శ్రోతలకూ దర్శనమిచ్చాయి.
        నిజంగా ఆరోజు అక్కడ హాజరైన ప్రతి ఒక్కరి కళ్లలోనూ ఆనందబాష్పాలు రాలాయి.పంతులుగారి వంటి గురువుకు ఏ శిష్యుడైనా అంతకన్నా ఏమివ్వగలడు?
          ఈ విధంగా గురువుగారి సంస్మరణోత్సవాలలో ప్రతిసారీ వారికి అంకితంగా ఒక స్వీయ రచన పాడటం ఆనవాయితీగా చేసుకున్నారు బాలమురళీగారు.

వాటిలో కొన్ని..
1.మహనీయ మధుర మూర్తే-మహతి
2.మంగళదాయక మామవ మద్గురు-ఆరభి
3.గురుని స్మరింపుము-హంసవినోదిని
4.అయ్యా!గురువర్యా-సుషమ
5.గ్రహ వీక్షణము కన్న-కేదారం
6.స్వామిని వేడగ కొనియాడగ-సౌరాష్ట్ర
7.సన్నుతించెద సద్గురు-మోహన
8.భావమే మహా భాగ్యమురా-కాపీ
9.ద్రి తోం ననన- రాగ,తాళమాలికా తిల్లాన
10.సామగాన సార్వభౌమ-మంగళం
*మోదుమూడి సుధాకర్* గారి పోస్టు. (Modumudi Sudhakar)

కామెంట్‌లు లేవు: