6, సెప్టెంబర్ 2020, ఆదివారం

*ధార్మికగీత - 12*

                      *****
            *శ్లో:- ఆయు ర్విత్తం గృహచ్ఛిద్రం ౹*
                   *మంత్రౌ షథ సమాగమాః ౹*
                   *దాన మానా వమానాశ్చ ౹*
                   *నవ గోప్యా: మనీషిభిః ౹౹*
                                        *****
*భా:- మనిషి అంటే మానవుడు. మనీషి అంటే ఉదాత్త మానవుడు. అలాంటి వారు 9 విషయాలలో గోప్యతను పాటించాలని శాస్త్రం చెబుతోంది. ఆవేమనగా 1. మన ఆయుష్షు మనకు తెలియదు. ఒక వేళ సిద్ధులు, యోగుల వలన తెలిసినా ఆడంబరంగా చెప్పుకోకూడదు. 2. మన నగ-నట్రా, పొలాలు, స్థలాలు, నిధులు,నిక్షేపాలు పరులకు చెప్పరాదు. చెబితే పరాధీనమే. 3.ఇంటిగుట్టు గుట్టుగానే ఉంచాలి. రచ్చ చేయరాదు. 4. తేలు, పాము, విశేష మంత్రాలతో రోగులకు సేవచేయవచ్చు కాని ఆ మంత్రం వెల్లడించరాదు. 5. అలాగే దివ్యౌషథంతో రోగాలు నయం చేయవచ్చు కాని, దాని మర్మం విప్పరాదు. 6.కీలక వ్యక్తులతో చేసిన మంతనాలను, చర్చలను బట్టబయలు చేయరాదు.చేస్తే ప్రాణాలకే ముప్పు రావచ్చు. 7.మనం చేసిన దానం, ధర్మం, ఉపకృతి రెండో చేతికే తెలియకూడదంటారు. దర్పంగా చెప్పుకోరాదు.8. మన ప్రతిభాపాటవాలకు గుర్తింపుగా జరిగిన గౌరవాన్ని, సన్మానాన్ని మనమే గొప్పగా చెప్పుకోకూడదు. పేలవంగా ఉంటుంది. 9.మనకు ఇంటా ; బయటా; సామాజికంగా ఏదైనా అవమానం ఎదురైతే సరిదిద్దుకోడానికి ప్రయత్నించాలే కాని, పది మందిలో అల్లరిచేసుకోరాదు. మనమే పలచబడిపోతాము. ప్రతివారి జీవితంలో తారసపడే యీ తొమ్మిది అంశాలలో రహస్యాన్ని పాటించాలి. లేకుంటే కలతలు,నలతలు , కష్టాలు, నష్టాలు చింతలు, వంతలు తప్పవు. ఈ నవ మర్మాలలో నర్మంగా వర్తించాలని,ఆత్మాభిమానాన్ని కాపాడుకోవాలని సారాంశము.*
                                     *****
                      *సమర్పణ : పీసపాటి* 
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: