6, సెప్టెంబర్ 2020, ఆదివారం

భాగవతామృతం*

కథా సూచనంబు

1-54-వ.వచనము
అని యిట్లు మహనీయగుణగరిష్ఠు లయిన శౌనకాది మునిశ్రేష్ఠు లడిగిన రోమహర్షణపుత్త్రుం డయి యుగ్రశ్రవసుం డను పేర నొప్పి నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుం డైన సూతుండు.
అని = అని పలికి; ఇట్లు = ఈ విధముగా; మహనీయ = మిక్కిలి గొప్ప; గుణ = గుణవంతులలో; గరిష్ఠులు = శ్రేష్ఠులు; అయిన = అయినట్టి; శౌనక = శౌనకుడు; ఆది = మొదలగు; ముని = మునులలో; శ్రేష్ఠులు = శ్రేష్ఠమైనవారు; అడిగిన = అడుగగా; రోమహర్షణ = రోమహర్షణుని; పుత్త్రుండు = పుత్రుడు; అయి = అయి; ఉగ్రశ్రవసుండు = ఉగ్రశ్రవసుడు; అను = అనే; పేరన్ = పేరుతో; ఒప్పి = ప్రసిద్ధుడైనట్టియు; నిఖిల = సమస్త; పురాణ = పురాణములను; వ్యాఖ్యాన = వ్యాఖ్యానము చేయు; వైఖరీ = మంచి నేర్పు; సమేతుండు = కలిగినవాడు; ఐన = అయినటువంటి; సూతుండు = సూతుడు.
ఈ విధంగా సద్గుణాలనిధి అయిన శౌనకుడు మొదలైన మునీంద్రులు అడిగారు. రోమహర్షుని కుమారుడు, సమస్త పురాణాలను చక్కగా వివరించి చెప్పే నేర్పు కలవాడు అయిన ఉగ్రశ్రవసు డని ప్రసిద్ధుడైన సూతుడు ఇలా ఉపక్రమించాడు.
1-55-మ.మత్తేభ విక్రీడితము

"సముఁడై యెవ్వఁడు ముక్తకర్మచయుఁడై సన్న్యాసియై యొంటిఁ బో
వ మహాభీతి నొహోకుమార! యనుచున్ వ్యాసుండు చీరంగ వృ
క్షములుం దన్మయతం బ్రతిధ్వనులు సక్కం జేసె మున్నట్టి భూ
తమయున్ మ్రొక్కెద బాదరాయణిఁ దపోధన్యాగ్రణిన్ ధీమణిన్.
సముఁడు = సర్వ సమత్వము సిద్ధించిన వాడు; ఐ = అయి; ఎవ్వఁడు = ఎవడు; ముక్త = విమోచనము చెందిన; కర్మ = కర్మల; చయుఁడు = సమూహము గలవాడు; ఐ = అయి; సన్న్యాసి = సన్యాసి; ఐ = అయి; ఒంటిన్ = ఒంటరిగా; పోవ = వెళ్ళగా; మహా = మిక్కిలి; భీతిన్ = భయముతో; ఓహో = ఓ; కుమార = కుమారా; అనుచున్ = అనుచు; వ్యాసుండు = వ్యాసుడు; చీరంగన్ = పిలువగా; వృక్షములున్ = చెట్లు సైతము; తన్మయతన్ = తన్మయత్వంతో; ప్రతిధ్వనులు = ప్రతిధ్వనులను; సక్కన్ = చక్కగా; చేసెన్ = చేసినవి; మున్ను = పూర్వము; అట్టి = అటువంటి; భూతమయున్ = సకలభూతములు తానైనవానికి; మ్రొక్కెద = నమస్కరించెద; బాదరాయణిన్ = శుకుని {బాదరాయణి – బాదరాయణుడైన వ్యాసుని కుమారుడు, శుకుడు}; తపస్ = తపస్సుచేత; ధన్య = ధన్యమైనవారిలో; అగ్రణిన్ = శ్రేష్ఠమైనవాడిన; ధీమణిన్ = బుద్ధిశాలిని {ధీమణి - జ్ఞానము కలవారి అందు మణి వంటి వాడు (లేదా) బుద్ధి యను మణి కలవాడు}.
“సర్వభూతము లందు సమభావంతో సంచరించే మహాత్ముడు శుకమహర్షి సర్వసంగ పరిత్యాగియై, విరాగియై, మహాయోగియై, ఒంటరిగా అరణ్యంలో వెళ్తున్న సమయంలో తండ్రియైన వ్యాసులవారు అత్యంత వాత్సల్యంతో ఓ కుమారా! అని పెద్దగా పిలుస్తుంటే, అడవిలోని చెట్లన్నీ తన్మయత్వంలో”ఓయ్ ఓయ్" అంటూ ప్రత్యుత్తర రూపంగా ప్రతిధ్వనులు చేశాయి. అట్టి సకలభూతములు తానైనవాడు, తపోధనులలో అగ్రేసరుడు, మహామనీషి, మహానుభావుడు, బాదరాయణుడైన వ్యాసుని పుత్రుడు అయిన శుకునికి నమస్కారం చేస్తున్నాను.
1-56-సీ.సీస పద్యము

కార్యవర్గంబును గారణ సంఘంబు;
నధికరించి చరించు నాత్మతత్త్వ
మధ్యాత్మ మనఁబడు నట్టి యధ్యాత్మముఁ;
దెలియఁ జేఁయఁగఁ జాలు దీప మగుచు
సకలవేదములకు సారాంశమై యేక;
మై యసాధారణమగు ప్రభావ
రాజకంబైన పురాణ మర్మంబును;
గాఢ సంసారాంధకార పటలి
1-56.1-తే.
దాఁటఁ గోరెడివారికి దయ దలిర్ప
నే తపోనిధి వివరించె నేర్పడంగ
నట్టి శుకనామధేయు మహాత్మగేయు
విమల విజ్ఞాన రమణీయు వేడ్కఁ గొలుతు.
కార్య = కార్యముల యొక్క; వర్గంబునున్ = సమూహమునూ; కారణ = కారణముల; సంఘంబున్ = సమూహమునూ; అధికరించి = అతీతముగ; చరించు = వర్తించునట్టి; ఆత్మతత్త్వము = ఆత్మ యొక్క తత్త్వము; అధ్యాత్మము = అధ్యాత్మము); అనఁబడున్ = అని చెప్బబడుతుంది; అట్టి = అటువంటి; అధ్యాత్మమున్ = అధ్యాత్మమును; తెలియన్ = తెలియునట్లు; చేయఁగజాలు = చేయగలిగినట్టి; దీపము = దీపము; అగుచు = అవుతూ; సకల = సమస్త; వేదములకు = వేదాలకు; సారాంశము = సారాంశము; ఐ = అయి; ఏకము = ప్రత్యేకమైనది / అనన్యమైనది; ఐ = అయ్యి; అసాధారణము = అసాధారణము; అగు = అయినటువంటి; ప్రభావ = ప్రభావముతో; రాజకంబు = ప్రకాశించునది; ఐన = అయినట్టి; పురాణ = పురాణములలోని; మర్మంబును = మూలసూత్రమును; గాఢ = దట్టమైన; సంసార = సంసారమనే; అంధకార = చీకటి; పటలి = సమూహము;
దాఁటన్ = తరించాలని; కోరెడి = కోరుకొను; వారి = వారి; కిన్ = కి; దయ = దయ; తలిర్పన్ = చిగురించగా; ఏ = ఏ; తపస్ = తపస్సు అను; నిధి = నిధి కలవాడు; వివరించెన్ = వివరించాడో; ఏర్పడంగన్ = అర్థమయ్యేటట్లు; అట్టి = అటువంటి; శుక = శుకుడనే; నామ = పేరు; ధేయు = ధరించిన; మహా = గొప్ప; ఆత్మ = ఆత్మకలవారి చేత; గేయున్ = కీర్తింపబదగువానిని; విమల = నిర్మలమైన; విజ్ఞాన = విజ్ఞానముగల; రమణీయు = మనోహారుని; వేడ్కన్ = ఆసక్తితో; కొలుతున్ =ఆరాధిస్తున్నాను.
కార్యకారణాలను వశీకరించుకొని అలరారే ఆత్మతత్త్వాన్ని పెద్దలు అధ్యాత్మికం అంటారు. అటువంటి అధ్యాత్మతత్త్వాన్ని సమగ్రంగా సాక్షాత్కరింపజేసేటట్టిది, సకల వేదాల సారభూతమైనట్టిది, అనన్యము, అసామాన్యము, మహాప్రభావ సంపన్నము, సమస్త పూరాణ రహస్యము అయినట్టి మహాభాగవతాన్ని సంసారమనే గాఢాంధకార సముహాన్ని తరించగోరే విపన్నులకు ఉపదేశించిన అపారకృపాపయోనిధి, తపోనిధి, విశేష వివేక విజ్ఞానాల పెన్నిధి, వేదవ్యాసుల పుత్రుడు, సుధీజనస్తుతిపాత్రుడు అయినట్టి శ్రీశుకులవారిని అసక్తితో ఆరాధిస్తున్నాను.
1-57-క.కంద పద్యము

నారాయణునకు నరునకు
భారతికిని మ్రొక్కి, వ్యాసు పదములకు నమ
స్కారము సేసి వచింతు ను
దారగ్రంథంబు, దళిత తను బంధంబున్."
నారాయణున = నారాయణున; కున్ = కు; నరున = నరున; కున్ = కు; భారతి = సరస్వతీ దేవి; కిని = కి; మ్రొక్కి = నమస్కరించి; వ్యాసు = వ్యాసుని; పదముల = పాదముల; కున్ = కు; నమస్కారము = నమస్కారము; చేసి = చేసి; వచింతున్ = చెప్పెదను; ఉదార = ప్రకాశించే; గ్రంథంబు = గ్రంథము; దళిత = ఖండింపబడిన; తను = జన్మ; బంధంబున్ = బంధములు కలది.
నరనారాయణలకు నమస్కారం చేసి; సరస్వతీదేవికి మ్రొక్కి;, వ్యాసులవారి పాదపద్మాలకు ప్రణామం కావించి; జనన మరణ బంధాలను పటాపంచలు చేసే పవిత్ర గ్రంథం అయిన భాగవతాన్ని వినిపిస్తాను.”
1-58-వ.వచనము
అని యిట్లు దేవతాగురు నమస్కారంబుసేసి యిట్లనియె”మునీంద్రులారా! నన్ను మీరు నిఖిల లోక మంగళంబైన ప్రయోజనం బడిగితిరి; ఏమిటం కృష్ణ సంప్రశ్నంబు సేయంబడు? నెవ్వింధంబున నాత్మ ప్రసన్నంబగు? నిర్విఘ్నయు నిర్హేతుకయునై హరిభక్తి యే రూపంబునం గలుగు? నది పురుషులకుఁ బరమ ధర్మం బగు, వాసుదేవుని యందుఁ బ్రయోగింపఁ బడిన భక్తియోగంబు వైరాగ్య విజ్ఞానంబులం బుట్టించు; నారాయణ కథలవలన నెయ్యే ధర్మంబులు దగులువడ వవి నిరర్థకంబులు; అపవర్గపర్యంతం బయిన పరధర్మంబునకు దృష్ట శ్రుత ప్రపంచార్థంబు ఫలంబు గాదు; ధర్మంబు నందవ్యభిచారి యైన యర్థంబునకుఁ గామంబు ఫలంబు గాదు; విషయభోగంబైన కామంబున కింద్రియప్రీతి ఫలంబు గాదు; ఎంత తడవు జీవించు నంతియ కామంబునకు ఫలంబు; తత్త్వజిజ్ఞాస గల జీవునకుఁ గర్మంబులచేత నెయ్యది సుప్రసిద్ధం బదియు నర్థంబు గాదు; తత్త్వజిజ్ఞాస యనునది ధర్మజిజ్ఞాస యగుటఁ గొందఱు ధర్మంబె తత్త్వం బని పలుకుదురు. తత్త్వవిదులు జ్ఞానం బనుపేర నద్వయం బైన యది తత్త్వ మని యెఱుంగుదురు; ఆ తత్త్వంబు నౌపనిషదులచేత బ్రహ్మ మనియు, హైరణ్యగర్భులచేతం బరమాత్మ యనియు, సాత్వతులచేత భగవంతుం డనియును బలుకంబడు; వేదాంత శ్రవణంబున గ్రహింపంబడి జ్ఞాన వైరాగ్యంబులతోడం గూడిన భక్తిచేతఁ దత్పరులైన పెద్దలు క్షేత్రజ్ఞుండైన యాత్మ యందుఁ బరమాత్మం బొడగందురు; ధర్మంబునకు భక్తి ఫలంబు; పురుషులు వర్ణాశ్రమధర్మ భేదంబులం జేయు ధర్మంబునకు మాధవుండు సంతోషించుటయె సిద్ధి; ఏక చిత్తంబున నిత్యంబును గోవిందు నాకర్ణింపనుం వర్ణింపనుం దగుఁ; జక్రాయుధ ధ్యానం బను ఖడ్గంబున వివేకవంతు లహంకార నిబద్ధంబైన కర్మంబు ద్రుంచివైతురు; భగవంతుని యందలి శ్రద్ధయు నపవర్గదం బగు తత్కథాశ్రవణాదుల యం దత్యంతాసక్తియుఁ బుణ్యతీర్థావగాహన మహత్సేవాదులచే సిద్ధించు కర్మనిర్మూలన హేతువు లైన కమలలోచను కథలం దెవ్వండు రతిసేయు విననిచ్చగించు, వాని కితరంబు లెవ్వియు రుచి పుట్టింపనేరవు; పుణ్యశ్రవణకీర్తనుం డైన కృష్ణుండు తనకథలు వినువారి హృదయంబు లందు నిలిచి, శుభంబు లాచరించు నశుభంబులు పరిహరించు; నశుభంబులు నష్టంబు లయిన భాగవతశాస్త్రసేవా విశేషంబున నిశ్చలభక్తి యుదయించు; భక్తి కలుగ రజస్తమోగుణ ప్రభూతంబు లైన కామ లోభాదులకు వశంబుగాక చిత్తంబు సత్త్వగుణంబునఁ బ్రసన్నం బగుఁ; ప్రసన్నమనస్కుం డైన ముక్తసంగుం డగు; ముక్తసంగుం డైన నీశ్వరతత్త్వజ్ఞానంబు సిద్ధించు; నీశ్వరుండు గానంబడినఁ జిజ్జడగ్రథనరూపం బైన యహంకారంబు భిన్నం బగు; నహంకారంబు భిన్నంబైన నసంభావనాది రూపంబు లగు సంశయంబులు విచ్ఛిన్నంబు లగు; సంశయవిచ్ఛేదం బైన ననారబ్దఫలంబు లైన కర్మంబులు నిశ్శేషంబులై నశించుం గావున.
అని = అని; ఇట్లు = ఈవిధంగా; దేవతా = దేవతలకు; గురు = గురువులకు; నమస్కారంబున్ = నమస్కారము; చేసి = చేసి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; ముని = మునులలో; ఇంద్రులారా = శ్రేష్ఠులారా; నన్ను = నన్ను; మీరు = మీరు; నిఖిల = అన్ని; లోక = లోకములకు; మంగళంబు = శుభకరము; ఐన = అయినట్టి; ప్రయోజనంబు = ప్రయోజనము; అడిగితిరి = అడిగారు; ఏమిటన్ = దేనివలన; కృష్ణ = కృష్ణుని; సంప్రశ్నంబు = ఆశ్రయము, శరణు; సేయంబడున్ = కలుగుతుందో; ఏ = ఏ; విధంబునన్ = విధము వలన; ఆత్మ = ఆత్మ; ప్రసన్నంబు = సంతుష్టము; అగున్ = అవుతుంది; నిర్విఘ్నయు = ఆటంకములు లేనిది; నిర్హేతుకయున్ = కారణములేనిది; ఐ = అయి; హరి = హరియందు; భక్తి = భక్తి; ఏ = ఏ; రూపంబునన్ = విధము వలన; కలుగున్ = కలుగుతుందో; అది = అది; పురుషుల = మానవుల; కున్ = కు; పరమధర్మంబు = పరమ ధర్మము; అగు = అయిన; వాసుదేవుని = భగవంతుని; అందున్ = గురించి; ప్రయోగింపఁబడిన = నడప బడిన; భక్తి = భక్తి; యోగంబు = యోగము; వైరాగ్య = వైరాగ్యమును; విజ్ఞానంబులన్ = విజ్ఞానములను; పుట్టించు = కలిగించును; నారాయణ = భగవంతుని; కథల = కథల; వలనన్ = వలన; ఎయ్యే = ఏఏ; ధర్మంబులు = ధర్మములు; తగులువడవు = పట్టు బడవో; అవి = అవి; నిరర్థకంబులు = ప్రయోజనము లేనివి; అపవర్గ = మోక్షము; పర్యంతంబు = వరకు; అయిన = వ్యాపించిన; పరధర్మంబున్ = పరధర్మమున; కున్ = కు; దృష్ట = చూడబడు; శ్రుత = వినబడు; ప్రపంచ = ప్రాపంచిక; అర్థంబు = విషయములు; ఫలంబు = ప్రయోజనము; కాదు = కాదు; ధర్మంబున్ = ధర్మము; అందున్ = లో; అవ్యభిచారి = అతిక్రమించనిది {అవ్యభిచారి - (అది తప్ప) మరియొకదానియందు చరించనిది}; ఐన = అయిన; అర్థంబు = విషయము; కున్ = కు; కామంబు = కామము; ఫలంబు = ప్రయోజనము; కాదు = కాదు; విషయ = ఇంద్రియార్థములను; భోగంబు = అనుభవించుట; ఐన = అయినట్టి; కామంబు = కామము; కున్ = కు; ఇంద్రియ = ఇంద్రియములకు; ప్రీతి = ప్రియము కలుగ జేయుట; ఫలంబు = ప్రయోజనము; కాదు = కాదు; ఎంత = ఎంత; తడవు = కాలము; జీవించున్ = జీవించునో; అంతియ = అంత వరకు మాత్రమే; కామంబు = కామము; కున్ = కు; ఫలంబు = ప్రయోజనము; తత్త్వ = సృష్టిలోని సత్యమును, పరబ్రహ్మను; జిజ్ఞాస = తెలిసికొను కోరిక; కల = ఉన్నటువంటి; జీవుడు = మానవుడు; కున్ = కు; కర్మంబుల = కర్మల; చేతన్ = చేత; ఎయ్యది = ఏదయితే; సుప్రసిద్ధంబు = బాగా ప్రసిద్ధమైనదో; అదియున్ = అది కూడా; అర్థంబు = ప్రయోజనము; కాదు = కాదు; తత్త్వ = తత్త్వ; జిజ్ఞాస = జిజ్ఞాస; అనునది = అనునది; ధర్మ = ధర్మమును; జిజ్ఞాస = తెలిసికొను కోరిక; అగుటన్ = అగుట చేత; కొందఱు = కొందఱు; ధర్మంబె = ధర్మమే; తత్త్వంబు = తత్త్వము; అని = అని; పలుకుదురు = అందురు; తత్త్వవిదులు = తత్త్వము తెలిసినవారు; జ్ఞానంబు = జ్ఞానము; అను = అను; పేరన్ = పేరుతో; అద్వయంబు = అదితప్ప మరింకొకటి లేనిది; అయిన = అయినట్టి; అది = అది; తత్త్వము = తత్త్వము; అని = అని; ఎఱుంగుదురు = తెలియుదురు; ఆ = ఆయొక్క; తత్త్వంబు = తత్త్వము; ఔపనిషదుల = ఉపనిషత్తులను అనుసరించువారి; చేతన్ = చేత; బ్రహ్మము = బ్రహ్మము; అనియు = అనీ; హైరణ్యగర్భుల = హిరణ్యగర్భుని వివరించువారి {హిరణ్యగర్భుడు - బంగారు గ్రుడ్డు నందు పుట్టిన చతుర్ముఖ బ్రహ్మ}; చేతన్ = చేత; పరమాత్మ = పరమాత్మ; అనియు = అనీ; సాత్వతుల = భాగవత మతము నవలంభించినవారి; చేతన్ = చేత; భగవంతుండు = భగవంతుండు; అనియును = అనీ; పలుకంబడు = తెలుప బడుచున్నది; వేదాంత = వేదాంతమును; శ్రవణంబున = వినుట వలన; గ్రహింపంబడి = తెలిసికొని; జ్ఞాన = జ్ఞానము; వైరాగ్యంబుల = వైరాగ్యముల; తోడన్ = తో; కూడిన = కలిసియున్న; భక్తి = భక్తి; చేతన్ = చేత; తత్పరులు = దాని యందు నిష్ఠ గలవారు; ఐన = ఐన; పెద్దలు = మహాత్ములు; క్షేత్రజ్ఞుండు = శరీరమును ధరించిన జీవుడు; ఐన = అయిన; ఆత్మ = జీవాత్మ; అందున్ = లో; పరమాత్మన్ = పరమాత్మను; పొడగందురు = దర్శించెదరు; ధర్మంబు = ధర్మము; కున్ = కు; భక్తి = భక్తి; ఫలంబు = ప్రయోజనము; పురుషులు = మానవులు; వర్ణ = వివిధ వర్ణముల {చతుర్వర్ణములు - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర.}; ఆశ్రమ = వివిధ ఆశ్రమముల {చతురాశ్రమములు- బ్రహ్మచర్య, గృహస్త, వానప్రస్త, సన్యాసము}; ధర్మ = ధర్మములులోని; భేదంబులన్ = భేదముల ప్రకారము; చేయు = చేయు; ధర్మంబు = ధర్మముల; కున్ = కు; మాధవుండు = లక్ష్మీదేవి భర్త / హరి; సంతోషించుటయె = సంతోషించుటే; సిద్ధి = ప్రయోజనము; ఏక = ఏకాగ్ర; చిత్తంబున = మనసుతో; నిత్యంబును = నిత్యమూ; గోవిందుని = కృష్ణుని; ఆకర్ణింపనున్ = వినుటయును; వర్ణింపనున్ = కీర్తించుటయును; తగున్ = తగినది; చక్రాయుధ = హరి {చక్రాయుధుడు - చక్రము ఆయుధముగా కలవాడు}; ధ్యానంబు = ధ్యానము; అను = అనే; ఖడ్గంబున = కత్తితో; వివేకవంతులు = వివేకవంతులు; అహంకార = అహంకారమునందు; నిబద్ధంబు = బంధింపబడినది; ఐన = అయిన; కర్మంబు = కర్మములను; త్రుంచివైతురు = త్రుంచివైతురు; భగవంతుని = భగవంతుని; అందలి = మీది; శ్రద్ధయున్ = శ్రద్ద; అపవర్గదంబు = మోక్షమిచ్చునవి; అగు = అయినటువంటి; తత్ = అతని; కథా = కథలు; శ్రవణ = వినుట; ఆదులు = మొదలగువాటి; అందున్ = అందు; అత్యంత = మిక్కిలి; ఆసక్తియు = కుతూహలమును; పుణ్యతీర్థ = పుణ్యతీర్థములలో; అవగాహన = స్నానముచేయుట; మహత్ = మహాత్ములను; సేవ = సేవించుట; ఆదుల = మొదలగువాని; చేన్ = చేత; సిద్ధించు = కలుగును; కర్మ = కర్మలను; నిర్మూలన = నశింపచేయుటకు; హేతువులైన = కారణములైన; కమలలోచను = భగవంతుని {కమలలోచనుడు - కమలముల వంటి కన్నుల వాడు, విష్ణువు}; కథలు = కథల; అందున్ = లో; ఎవ్వండు = ఎవడు; రతిసేయు = కుతూహలపడునో; వినన్ = వినుటను; ఇచ్చగించు = ఇష్టపడతాడో; వాని = అతని; కిన్ = కి; ఇతరంబులు = మిగిలినవి; ఎవ్వియు = ఏవీకూడా; రుచి = ఇష్టమును; పుట్టింపన్ = కలుగ; నేరవు = జేయలేవు; పుణ్య = పుణ్యమును కలుగజేయు; శ్రవణ = తన కథలు వినబడువాడు / శ్రుతి; కీర్తనుండు = కీర్తింపబడు వాడు / స్తోత్రము చేయబడు వాడు; ఐన = అయిన; కృష్ణుండు = కృష్ణుడు; తన = తనయొక్క; కథలు = కథలు; వినువారి = వినే వారి; హృదయంబులు = మనసుల; అందున్ = లో; నిలిచి = నివసించి; శుభంబులు = శుభములు; ఆచరించున్ = సమకూర్చును; అశుభంబులు = అశుభములను; పరిహరించున్ = నశింపజేయును; అశుభంబులు = అశుభములు; నష్టంబులు = నాశనము; అయిన = అయినచో; భాగవత = భాగవత; శాస్త్ర = పురాణాల; సేవ = సేవయొక్క; విశేషంబున = విశిష్టత వలన; నిశ్చల = అచంచలమైన; భక్తి = భక్తి; ఉదయించున్ = ప్రాప్తించును; భక్తి = భక్తి; కలుగ = కలుగుట వలన; రజస్ = రజస్; తమో = తమో; గుణ = గుణముల నుండి; ప్రభూతంబులు = పుట్టినవి; ఐన = ఐనటువంటి; కామ = కామము; లోభ = లోభము; ఆదులు = మొదలగు; కున్ = వాటికి; వశంబుగాక = లొంగక; చిత్తంబు = చిత్తము; సత్త్వ = సత్త్వ; గుణంబునన్ = గుణములో; ప్రసన్నంబు = ప్రశాంతమైనది; అగున్ = అవుతాడు; ప్రసన్న = ప్రసన్నమైన; మనస్కుండు = మనసుగలవాడు; ఐన = అయిన; ముక్తసంగుండు = బంధవిముక్తుడు {ముక్తసంగుడు - మనసునకు పట్టిన విషయ బంధాలు విడివిడినవాడు}; అగు = అవుతాడు; ముక్తసంగుండు = బంధవిముక్తుడు; ఐనన్ = అయినచో; ఈశ్వర = భాగవత; తత్త్వజ్ఞానంబు = పరతత్త్వ జ్ఞానము; సిద్ధించున్ = సిద్ధించును; ఈశ్వరుండు = భగవంతుడు; కానంబడినన్ = దర్శనము జరిగిన; చిత్ = చైతన్య రూపమైన జ్ఞానము; జడ = అచేతన రూపమైన అజ్ఞానములు; గ్రథన = గ్రంథి {గ్రథన - ముడి పెట్టబడినది}; రూపంబు = రూపము; ఐన = అయినటువంటి; అహంకారంబు = అహంకారము; భిన్నంబగు = బ్రద్ధలగును; అహంకారంబు = అహంకారము; భిన్నంబు = బ్రద్దలు; ఐనన్ = అయితే; అసంభావన = చక్కగా భావింప కుండుట; ఆది = మొదలైన; రూపంబులు = రూపములు; అగు = అయిన; సంశయంబులు = సంశయములు; విచ్ఛిన్నంబులగు = నశించిపోతాయి; సంశయ = సంశయముల; విచ్ఛేదంబు = నాశనము; ఐనన్ = అయినచో; అనారబ్ధ = అనారబ్ద {అనారబ్దములు - ఇంకనూ ప్రారంభింపనివి (ప్రభావము చూపనివి)}; ఫలంబులు = ఫలితములు ఇచ్చేటివి; ఐన = ఐనటువంటి; కర్మంబులు = కర్మములు; నిశ్శేషంబులు = శేషము మిగలనవి; ఐ = అయి; నశించున్ = నశించి పోవును; కావున = అందువలననే.
అని దేవతలకు, గురుపులకు ప్రణామాలు చేసి సూతుడు శౌనకాదులతో ఇలా చెప్పసాగాడు మునీంద్రులారా! సమస్త విశ్వానికి శ్రేయోదాయకమైన పరమార్థాన్ని చెప్పమని నన్ను మీరడిగారు. దేనివల్ల నిర్విరామము నిర్వ్యాజము నయిన హరిభక్తి ప్రాప్తిస్తుందో అదే మానవులకు పరమధర్మం అవుతుంది. గోవిందుని యందు సమర్పితమైన భక్తియోగంవలన వైరాగ్యము, ఆత్మజ్ఞానము లభిస్తాయి. ముకుందుని కథాసుధలకు దూరమైన ధర్మాలు సారహీనాలు. కైవల్యమే గమ్యస్థానమైన పరమధర్మానికి ఫలం. కనబడుతూ వినబడుతూ ఉన్న ఈ ప్రాపంచిక సుఖం సుఖం కాదు. ధర్మాన్ని అతిక్రమించని అర్థానికి ఫలం కామం కాదు. విషయభోగరూపమైన కామానికి ఫలం ఇంద్రియసంతుష్టి కాదు. జీవించి ఉన్నంత వరకే కామానికి ప్రయోజనం. తత్త్వవిచారం ఉన్నవాడికి నిత్య నైమిత్తిక కర్మల వల్ల లభించే స్వర్గాది సుఖాలు నిరర్థకాలు, తత్త్వవేత్తలైన వారు అద్వైతజ్ఞానమే తత్త్వమని తలుస్తారు. ఆ తత్త్వాన్ని ఔపనిషదులు బ్రహ్మం అంటారు. హైరణ్యగర్భులు పరమాత్మ అంటారు. సాత్త్వతులు భగవంతుడు అంటారు. ఉపనిషత్తుల శ్రవణంచేత సంప్రాప్తమై, జ్ఞానంతోనూ, వైరాగ్యంతోనూ కూడిన భక్తి యందు ఆసక్తులైన మహాత్ములు జీవాత్మ యందే పరమాత్మను దర్శిస్తారు. ధర్మానికి భక్తియే ఫలం. వర్ణాశ్రమ ధర్మాలను అనుష్ఠించే మానవ ధర్మానికి భగవంతుడు సంతోషించుటయే ప్రయోజనం. ఏకాగ్రమైన చిత్తంతో నిత్యము పురుషోత్తముని లీలలు ఆకర్ణించటం, అభివర్ణించటం అవశ్య కర్తవ్యం. వివేకంగల మానవులు హరిస్మరణమనే కరవాలంతో అహంకార పూరితమైన కర్మబంధాన్ని కోసివేస్తారు. ముకుందుని మీది శ్రద్ధ ముక్తిని ప్రసాదిస్తుంది. పుణ్యతీర్థాలనూ, పుణ్యపురుషులనూ సేవించటం వల్లనే భగవంతుని కథలు వినాలనే ఉత్కంఠ ఉదయిస్తుంది. కర్మ బంధాలను నిర్మూలించే కమలాక్షుని కథలను ఆసక్తితో ఆకర్ణించేవానికి మరేవీ రుచించవు. పుణ్యశ్రవణకీర్తనుడైన పురుషోత్తముడూ తన కథలు ఆలకించే భక్తుల అంతరంగాలలో నివసించి వారికి సర్వశుభాలూ సమకూర్చి అశుభాలు పోగొట్టుతాడు. అశుభ పరిహారంవల్ల భాగవతసేవ లభిస్తుంది, భాగవతసేవ వల్ల అచంచలభక్తి ప్రాప్తిస్తుంది. భక్తివల్ల రజస్తమోగుణాలతో చెలరేగిన కామలోభాదులకు లొంగక చిత్తం సత్త్వగుణాయత్తమై ప్రసన్నమౌతుంది. చిత్తం ప్రసన్నమైతే బంధాలు విడిపోతాయి. బంధరహితుడైన వానికి తత్త్వజ్ఞానం సిద్ధించి ఈశ్వరదర్శనం లభిస్తుంది. ఈశ్వరదర్శనం వల్ల అజ్ఞానరూపమైన అహంకారం దూరమౌతుంది. అహంకారం దూరం కాగానే సమస్త సంశయాలూ పటాపంచలౌతాయి. సంశయాలు తొలిగిపోగానే అశేషకర్మలూ నిశ్శేషమై నశిస్తాయి.
1-59-క.కంద పద్యము

గురుమతులు తపసు లంతః
కరణంబుల శుద్ధి సేయ ఘనతరభక్తిన్
హరియందు సమర్పింతురు
పరమానందమున భిన్నభవబంధనులై.
గురు = గొప్ప; మతులు = జ్ఞానము కలవారు; తపసులు = తాపసులు; అంతఃకరణంబులన్ = లోపలి ఇంద్రియములను {చతురంతఃకరణములు -మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము.}; శుద్ధి = పరిశుద్ధి; సేయ = చేయు; ఘనతర = మిక్కిలి గొప్పదైన; భక్తిన్ = భక్తిని; హరి = హరి / భగవంతుని; అందున్ = కొరకు; సమర్పింతురు = సమర్పింతురు / నివేదింతురు; పరమ = పరమమైన / ఉత్కృష్టమైన; ఆనందమున = ఆనందముతో; భిన్న = బ్రద్దలైన; భవ = సంసార /జన్మజన్మల; బంధనులు = బంధనములు కలవారు; ఐ = అయి.
విజ్ఞాననిధులు, తపోధనులు తమ అంతరంగాలను శుద్ధి చేసుకోవటం కోసం సంసారబంధాలను త్రోసిపుచ్చి; అచంచలమైన అనురక్తితో కూడిన తమ భక్తినంతా పరమానందంతో భగవంతునికే సమర్పించుకుంటారు.
1-60-త.తరళము

పరమపూరుషుఁ డొక్కఁ డాఢ్యుఁడు పాలనోద్భవ నాశముల్
సొరిదిఁ జేయు ముకుంద పద్మజ శూలి సంజ్ఞలఁ బ్రాకృత
స్ఫురిత సత్త్వ రజస్తమంబులఁ బొందు నందు శుభస్థితుల్
హరి చరాచరకోటి కిచ్చు ననంత సత్త్వ నిరూఢుఁడై.
పరమ = ఉత్కృష్టమైన; పూరుషుడు = పురుషోత్తముడు {పూరుషుడు - కారణభూతుడు, విష్ణువు; ఒక్కఁడు = ఒకడే అయిన వాడు; ఆఢ్యుఁడు = శ్రేష్ఠమైనవాడు; పాలన = పాలనము (స్థితి); ఉద్భవ = ఉద్భవించుట (సృష్టి); నాశముల్ = నశింపజేయుట (లయము); సొరిదిన్ = వరుసగా; చేయు = చేసేటటువంటి; ముకుంద = ముకుందుడు / విష్ణువు; పద్మజ = పద్మజ / బ్రహ్మ; శూలి = శూలి / శివుడు; సంజ్ఞలన్ = పేర్లతో; ప్రాకృత = ప్రకృతి నుండి; స్ఫురిత = వ్యక్తమైన; సత్త్వ = సత్త్వము; రజస్ = రజస్సు; తమంబులన్ = తమస్సులను; పొందున్ = పొందును; అందున్ = వానిలోనే; శుభస్థితుల్ = శుభమైన స్థితులు / భోగమోక్షములు; హరి = హరి; చరా = కదిలే జీవులు; అచర = కదలనివియైన జీవులు; కోటి = అనేకము; కిన్ = నకు; ఇచ్చున్ = ఇచ్చును; అనంత = అంతములేని; సత్త్వ = సత్త్వగుణముతో; నిరూఢుఁడై = స్థిరముగా నున్నవాడై.
పరమపురుషుడు ఒక్కడే; ఆయనే ఈ అనంత విశ్వానికి అధీశ్వరుడు; ఆయనే సత్వరజస్తమోగుణాలను స్వీకరించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే మూడు రూపాలు ధరించి ఈ లోకాలను సృష్టిస్తు, రక్షిస్తూ, అంతం చేస్తూ ఉంటాడు; అందులో అనంత సత్త్వగుణ సంపన్నుడైన శ్రీహరి చరాచర ప్రపంచానికి అపార శుభాలను అనుగ్రహిస్తాడు.
1-61-వ.వచనము
మఱియు నొక్క విశేషంబు గలదు; కాష్ఠంబుకంటె ధూమంబు, ధూమంబుకంటెఁ ద్రయీమయం బయిన వహ్ని యెట్లు విశేషంబగు నట్లు తమోగుణంబుకంటె రజోగుణంబు, రజోగుణంబుకంటె బ్రహ్మప్రకాశకం బగు సత్త్వగుణంబు విశిష్టం బగు; తొల్లి మునులు సత్త్వమయుం డని భగవంతు హరి నధోక్షజుం గొలిచిరి; కొందఱు సంసార మందలి మేలుకొఱకు నన్యుల సేవింతురు; మోక్షార్థు లయిన వారలు ఘోరరూపు లైన భూతపతుల విడిచి దేవతాంతర నిందసేయక శాంతులయి నారాయణ కథల యందే ప్రవర్తింతురు; కొందఱు రాజస తామసులయి సిరియు నైశ్వర్యంబును బ్రజలనుం గోరి పితృభూత ప్రజేశాదుల నారాధింతురు; మోక్ష మిచ్చుటం జేసి నారాయణుండు సేవ్యుండు; వేద యాగ యోగక్రియా జ్ఞాన తపోగతి ధర్మంబులు వాసుదేవ పరంబులు; నిర్గుణుం డయిన పరమేశ్వరుండు గలుగుచు, లేకుండుచు త్రిగుణంబుల తోడం గూడిన తన మాయచేత నింతయు సృజియించి, గుణవంతుని చందంబున నిజమాయా విలసితంబు లయిన గుణంబులలోఁ బ్రవేశించి విజ్ఞానవిజృంభితుండై వెలుఁగు; నగ్ని యొక్కరుం డయ్యుఁ బెక్కు మ్రాఁకు లందుఁ దేజరిల్లుచుఁ బెక్కండ్రై తోఁచు తెఱంగున విశ్వాత్మకుం డైన పురుషుం డొక్కండ తనవలనం గలిగిన నిఖిల భూతంబు లందు నంతర్యామి రూపంబున దీపించు; మహాభూత సూక్ష్మేంద్రియంబులతోడం గూడి, గుణమయంబు లయిన భావంబులం దనచేత నిర్మితంబు లైన భూతంబు లందుఁ దగులు వడక తద్గుణంబు లనుభవంబు సేయుచు, లోకకర్త యైన యతండు దేవ తిర్యఙ్మనుష్యాది జాతు లందు లీల నవతరించి లోకంబుల రక్షించు" నని, మఱియు సూతుఁ డిట్లనియె.
మఱియు = ఇంకను; ఒక్క = ఒక; విశేషంబు = విషయము; కలదు = ఉన్నది; కాష్ఠంబు = కట్టె; కంటెన్ = కన్నను; ధూమంబు = పొగ; ధూమంబు = పొగ; కంటెన్ = కన్నను; త్రయీమయంబు = వేదమయము / మూడు తత్త్వములతో కూడినది {త్రితత్త్వములు - వేడిమి, వెలుగు, శక్తి.}; అయిన = అయినటువంటి; వహ్ని = అగ్ని; ఎట్లు = ఏ విధముగనైతే; విశేషంబు = విశిష్టము; అగున్ = అగునో; అట్లు = ఆ విధముగనే; తమోగుణంబు = తమోగుణంబు; కంటెన్ = కంటెను; రజోగుణంబు = రజోగుణము; రజోగుణంబు = రజోగుణము; కంటెన్ = కంటెను; బ్రహ్మ = బ్రహ్మమును; ప్రకాశకంబు = ప్రకాశింప జేయునది; అగు = అయినటువంటి; సత్త్వగుణంబు = సత్త్వగుణము; విశిష్టంబు = విశేషము; అగు = అగును; తొల్లి = పూర్వము; మునులు = మునీశ్వరులు; సత్త్వ = సత్త్వగుణములుతో; మయుండు = నిండినవాడు; అని = అని; భగవంతు = భగవంతుడైన {భగవంతుడు - మహిమాన్వితుడు}; హరిన్ = హరిని; అధోక్షజున్ = విష్ణువుని; కొలిచిరి = పూజించిరి; కొందఱు = కొంతమంది; సంసారము = సంసారము; అందలి = లోని; మేలు = కలసివచ్చుట / మంచి; కొఱకున్ = కోసము; అన్యుల = ఇతరులను; సేవింతురు = పూజింతురు; మోక్ష = ముక్తి; అర్థులు = కోరెడివారు; అయిన = అయిన; వారలు = వారు; ఘోర = ఘోరమైన; రూపులు = రూపములుగలవారు; ఐన = అయినటువంటి; భూత = భూతములకు; పతుల = నాయకులను; విడిచి = విడిచిపెట్టి; దేవత = దేవతలలో; ఇతర = ఇతరమైనవారిని; నింద = దూరుట; చేయక = చేయకుండా; శాంతులు = శాంతస్వభావులు; అయి = అయి; నారాయణ = హరి; కథల = కథలు; అందే = లోనే; ప్రవర్తింతురు = నడచెదరు; కొందఱు = కొంతమంది; రాజస = రజోగుణము; తామసులు = తామసగుణములు గలవారు; అయి = అయి; సిరియున్ = ధనమును; ఐశ్వర్యంబును = ఐశ్వర్యమును; ప్రజలన్ = సంతతిని; కోరి = ఆశించి; పితృ = పితృదేవతలు; భూత = ప్రకృతిశక్తులు; ప్రజేశ = ప్రజాపతులు; ఆదులన్ = మొదలైనవారిని; ఆరాధింతురు = పూజింతురు; మోక్షము = ముక్తిని; ఇచ్చుటన్ = ఇచ్చుట; చేసి = వలన; నారాయణుండు = నారాయణుడు {నారాయణుడు - నారము లందు వసించువాడు}; సేవ్యుండు = సేవించ దగినవాడు; వేద = వేదములు; యాగ = యాగములు; యోగ = యోగములు; క్రియ = క్రియలు; జ్ఞాన = జ్ఞానములు; తపోగతి = తపస్సులు; ధర్మంబులు = ధర్మములు; వాసుదేవ = భగవంతుని {వాసుదేవ - ఆత్మ యందు వసించే దేవుడు}; పరంబులు = గమ్యముగా కలవి; నిర్గుణుండు = గుణముల కతీతడు; అయిన = అయినటువంటి; పరమేశ్వరుండు = శ్రేష్ఠమైన ఈశ్వరుడు; కలుగుచున్ = ఉండుచును; లేకుండుచున్ = లేకుండగను; త్రిగుణంబుల = త్రిగుణముల; తోడన్ = తో; కూడిన = కూడినటువంటి; తన = తనయొక్క; మాయ = మాయ; చేతన్ = చేత; ఇంతయు = ఇదంతా; సృజియించి = సృష్టించి; గుణవంతుని = గుణములతో కూడిన వాని; చందంబున = విధముగ; నిజ = తన; మాయా = మాయవలన; విలసితంబులు = ప్రకాశించుచున్నవి; అయిన = అయినటువంటి; గుణంబుల = త్రిగుణముల {త్రిగుణములు- సత్త్వ, రజస్, తమస్}; లోన్ = లోనికి; ప్రవేశించి = ప్రవేశించి; విజ్ఞాన = విజ్ఞానము యొక్క; విజృంభితుండు = విశేషము గలవాడు / చెలరేగినవాడు; ఐ = అయి; వెలుఁగున్ = ప్రకాశించును; అగ్ని = అగ్ని; ఒక్కరుండు = ఒక్కడే; అయ్యున్ = అయినప్పటికిని; పెక్కు = అనేకమైన; మ్రాఁకులు = కట్టెలు; అందున్ = లోపల; తేజరిల్లుచున్ = విరాజిల్లుతూ; పెక్కండ్రై = అనేకులుగా; తోఁచు = కనిపించు; తెఱంగున = విధముగా; విశ్వాత్మకుండు = విశ్వమే ఆత్మగా కలవాడు; ఐన = అయినటువంటి; పురుషుండు = పరమపురుషుడు; ఒక్కండ = ఒక్కడే; తన = తన; వలనన్ = వలన; కలిగిన = సృష్టింప బడిన; నిఖిల = సర్వ; భూతంబులు = జీవులు; అందున్ = లోపల; అంతర్యామి = అంతర్యామి {అంతర్యామి - లోపలంతా వ్యాపించినవాడు}; రూపంబున = రూపముతో; దీపించు = ప్రకాశించును; మహాభూత = మహాభూతములు {మహాభూతములు - మనస్సు, పంచభూతములు}; సూక్ష్మేంద్రియంబుల = సూక్ష్మములైన ఇంద్రియములు; తోడన్ = తో; కూడి = కలిసి; గుణ = గుణములతో; మయంబులయిన = నిండినటువంటి; భావంబులన్ = భావముల ద్వారా; తన = తన; చేతన్ = చేత; నిర్మితంబులైన = సృష్టింపబడిన; భూతంబులందున్ = భూతములలో; తగులు = చిక్కు; వడక = పడకుండా; తత్ = ఆ; గుణంబుల = గుణములను; అనుభవంబుసేయుచు = అనుభవించుచూ; లోక = లోకములను; కర్త = సృష్టించినవాడు; ఐన = అయినట్టి; అతండు = అతడు; దేవ = దేవత; తిర్యక్ = పశుపక్ష్యాదులు {తిర్యక్ - చలనము గలవి, జంతువులు}; మనుష్య = మానవులు; ఆది = మొదలగు; జాతులు = జీవుల; అందున్ = లోపల; లీలన్ = లీలతో / క్రీడతో; అవతరించి = అవతరించి; లోకంబులన్ = లోకములను; రక్షించును = రక్షించును; అని = అని; మఱియు = ఇంకను; సూతుఁడు = సూతుడు; ఇట్లు = ఈ విధముగా; అనియె = చెప్పెను.
ఇక్కడ ఇంకొక విశేషం ఉంది. కట్టె కంటే పొగ విశిష్టమైనది. పొగ కంటే యజ్ఞసాధకమైన అగ్ని విశిష్టమైనది. అదే విధంగా తమోగుణం కన్నా రజోగుణము, రజోగుణం కన్నా పరమాత్మను దర్శింపజేసే సత్త్వగుణమూ ఉత్తమమైనది. పూర్వం మహర్షులు భగవంతుని సత్త్వగుణ స్వరూపునిగా కొలిచారు. కొంతమంది సంసార సుఖాలను వాంఛించి ఇతరులను ఆరాధిస్తారు. మోక్షాన్ని కోరినవారు మాత్రం వికృతాకారులైన భూతపతులను వదలి, శాంతభావులైన ఇతర దేవతలను నిందించకుండా శ్రీహరినే ఆశ్రయిస్తారు. మోక్షప్రదాత అయిన వాసుదేవుడే సేవింప దగ్గవాడు. వేదాలూ, యాగాలూ, యోగాలు క్రియలూ, జ్ఞానాలూ, తపస్సులూ, ధర్మాలూ అన్నీ వాసుదేవుని స్వరుపాలే. త్రిగుణాతీతుడైన భగవంతుడు వ్యక్తావ్యక్త స్వరూపుడై త్రిగుణాత్మకమైన నిజమాయ వల్ల విశ్వమంతా సృష్టించి, సత్త్వరజస్తమో గుణాలను అంగీకరించి, గుణసహితుని లాగా విజ్ఞాన విశేషంతో విరాజిల్లుతాడు. ఒకే అగ్ని అనేక కట్టెలలో విరాజిల్లుతూ పెక్కు రూపాలుగా కన్నిస్తున్నట్లు, విశ్వమయుడైన పరమాత్మ ఒక్కడే తాను సృజించిన ప్రాణులన్నింటి యందు అంతర్యామియై ప్రకాశిస్తుంటాడు. మనస్సు వంటి సూక్ష్మేంద్రియాలతో కూడినవాడై గుణాత్మకాలైన భావాల ద్వారా తాను సృష్టించిన ప్రాణులలో ఉండి కూడ త్రిగుణాలకు తగులుబడకుండా ఆ యా గుణాలను అనుభవిస్తుంటాడు. లోకాలను సృష్టించిన ఆ పరమాత్మ దేవ మనుష్య పశుపక్ష్యాదులలో లీలావతారుడై జన్మించి లోక రక్షణం చేస్తుంటాడు” అని చెప్పి సూతుడు మళ్లీ ఇలా చెప్పసాగాడు.
1-62-సీ.సీస పద్యము

మహదహంకార తన్మాత్ర సంయుక్తుఁడై;
చారు షోడశ కళాసహితుఁ డగుచుఁ
బంచమహాభూత భాసితుండై శుద్ధ;
సత్త్వుఁడై సర్వాతిశాయి యగుచుఁ
జరణోరు భుజ ముఖ శ్రవణాక్షి నాసా శి;
రములు నానాసహస్రములు వెలుఁగ
నంబర కేయూర హార కుండల కిరీ;
టాదులు పెక్కువేలమరుచుండఁ
1-62.1-తే.
బురుషరూపంబు ధరియించి పరుఁ డనంతుఁ
డఖిల భువనైకవర్తన యత్నమమర
మానితోదార జలరాశి మధ్యమునను యోగ నిద్రా విలాసియై యొప్పుచుండు."
మహత్ = మహత్తు; అహంకార = అహంకారము; తన్మాత్ర = తన్మాత్రలతో {తన్మాత్రలు - శబ్ద స్పర్శ రస, రూప గంధములు}; సంయుక్తుఁడై = కూడినవాడై; చారు = అందమైన; షోడశ = పదహారు; కళా = కళలతో; సహితుఁడు = కూడినవాడు; అగుచున్ = అగుచూ; పంచ = ఐదు; మహాభూత = మహాభూతములలోను {మహాభూతములు - మనస్సు, పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశము.}; భాసితుండు = వెలుగొందుచున్నవాడు; ఐ = అయ్యి; శుద్ధ = నిర్మలమైన; సత్త్వుఁడు = సత్త్వగుణము కలవాడు; ఐ = అయ్యి; సర్వ = సర్వమును; అతిశాయి = అతిశయించినవాడు; అగుచున్ = అగుచూ; చరణ = పాదములు; ఊరు = తొడలు; భుజ = భుజములు; ముఖ = ముఖములు; శ్రవణ = చెవులు; అక్షి = కళ్లు; నాస = ముక్కులు; శిరములు = తలలు; నానా = అనేకమైన; సహస్రములు = వేనవేలు; వెలుఁగన్ = ప్రకాశించుచుండగా; అంబర = వస్త్రములు; కేయూర = భుజకీర్తులు; హార = హారములు; కుండల = కుండలములు; కిరీట = కిరీటములు; ఆదులు = మొదలగునవి; పెక్కు = అనేకమైన; వేలు = వేలు; అమరుచుండన్ = ధరింపబడియుండగా; పురుష = పరమ పురుష / విశ్వరూపము; రూపంబు = రూపము;
ధరియించి = ధరించి; పరుఁడు = అన్నిటికంటె వేరైన వాడు; అనంతుడు = అంతము లేనివాడు; అఖిల = సమస్త; భువన = లోకములందు; ఏక = ఒకేమాఱు; వర్తన = ఉండు; యత్నము = ప్రయత్నము; అమర = సిద్ధించగ; మానిత = పూజనీయమైన; ఉదార = పెద్ద; జలరాశి = సముద్రము; మధ్యమునను = నడుమ; యోగ = యోగ; నిద్రా = నిద్రతో; విలాసియై = విరాజిల్లుతూ; ఒప్పుచుండు = ఒప్పియుండును.
“పరాత్పరుడు, అనంతుడు ఐన ఆ భగవంతుడు సమస్త భువనాలనూ సృష్టింప దలచి; మహదహంకారాలతో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనే తన్మాత్రలతో కూడి షోడశకళాపరిపూర్ణుడై; పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలతో ప్రకాశమానుడై; శుద్ధసత్త్వస్వరూపుడై; సర్వేశ్వరుడై; వేలకొలది పాదాలు, తొడలు, భుజాలు, ముఖాలు, చెవులు, కన్నులు, శిరస్సులతో అలరారుతూ; వేలకొలది వస్ర్తాలు, భుజకీర్తులు, హారాలు, మకరకుండలాలు, మణికిరీటాలు ధరించి; పరమపురుష రూపం ధరించి; యోగనిద్రా ముద్రితుడై మహా సముద్ర మధ్యంలో శయనించి ఉంటాడు.

కామెంట్‌లు లేవు: