. *🌻సర్వాంతర్యామికై సాధన🌻*
సర్వం ఖల్విదం బ్రహ్మ.. 3-14-1ఉన్నదంతా బ్రహ్మమే.. అంటే నామ రూపాత్మకమైన ప్రపంచమంతా బ్రహ్మమే అని ఛాందోగ్యోపనిషత్తు ఘోషిస్తున్నది.
(ఉపనిషద్రత్నాకరము 46 పు.)
మరి అంతటా వున్న పరబ్రహ్మమును అనుభూతిలోకి తెచ్చుకోవాలంటే ఏ రకమైన సాధన చేయాలి?
యోగ తత్వోపనిషత్తులో సులభోపాయంగా ఈవిధంగా చెప్పబడింది.
యద్యత్ పశ్యతి చక్షుర్భ్యాం
తత్తదాత్మేతి భావయేత్ 69
మనుష్యుడు కండ్లతో దేనిని దేనిని చూస్తాడో అదంతా ఆత్మయే అని భావించాలి.
యద్యచ్చృణోతి కర్ణాభ్యాం
తత్తదాత్మేతి భావయేత్ 70
చెవులతో ఏదేది వినిపిస్తుందో అదంతా ఆత్మయే అని భావించాలి.
అంటే కనిపించేదీ, వినిపించేదీ అంతా బ్రహ్మమే అని భావిస్తే సరి! (ఉపనిషద్రత్నాకరము 176 పు)
దీనినే మరో రకంగా శ్రీ కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు ఒకచోట ఇలా అంటారు.
"శరీరముతోను, హృదయముతోను, సంభాషణతోను ఎవ రెవరిని చూచి వ్యవహరింతుమో వా రందరును అంతర్యామి స్వరూపములే కాని మన మనుకొనుచున్న సంబంధముల వారు కారు."
(శ్రీ మద్భాగవత ప్రకాశము.. స.స్కం. 79 పు.)
ఇక్కడ ఒకింత వివరణ అవసర మనుకుంటాను.
కనిపించే దంతా వినిపించే దంతా నామ రూపాత్మకమే కదా బ్రహ్మ మెలా ఔతుంది? అన్న సందేహం అక్కరలేదు.
నామ రూపాత్మక మయింది ప్రపంచ మని, బ్రహ్మము కాదని కొందరి అభిప్రాయం. నామ రూపాత్మకమైనంతమాత్రాన బ్రహ్మము కాకుండాపోతుందా! ప్రపంచమూ బ్రహ్మమే! అలా భావించటం అలవాటు కావటానికే కనిపించేదంతా వినిపించేదంతా బ్రహ్మమే అని భావించవలె నని ఉపనిషద్వాక్యం.
కనిపించేదంతా అన్నప్పుడు ఇక్కడ చర్మ చక్షువులే అని వేరే చెప్పబనిలేదు. వినిపించేదంతా అంటే భౌతికములైన చెవులే అని వేరే చెప్పబనిలేదు. కండ్లు మూసుకొని చూడండి. చెవులు మూసుకొని వినండి అనడం లేదు. ఇక్కడ స్థూల సూక్ష్మముల ప్రసక్తి లేదు. ఇది అర్థం చేసుకోవటానికి గొప్ప విద్యావంతుడు కా నక్కరలేదు. అతి సామాన్యుని కర్థమయ్యే విధంగానే చెప్పబడింది.
ఉదాహరణకు ఒక నైష్ఠికుడు నిత్యానుష్ఠానం చేసుకుంటున్నా డనుకొనండి. ఈలోపల ఎవడో వచ్చి భంగపరచినా డనుకొనండి. వెంటనే అతనికి కోపం ముంచుకొస్తుంది. ఎడాపెడా తిట్టేస్తాడు వచ్చినవాణ్ణి పట్టుకొని. ఈలోపల ప్రశాంతంగా చేసుకుంటున్న అనుష్ఠానం కాస్త భంగమౌతుంది. తర్వాత మళ్ళీ ఎంతో సేపటికి గాని మనస్సు నిశ్చలం కాదు. ఒక్కొకసారి ఆ రోజంతా..
కాని అప్పుడే కొంచెం తమాయించుకొని దేవుడే పంపకపోతే ఇత డెలా వస్తాడు? అని.. వచ్చిన వానిలోపల కూడా దేవుడే వున్నాడు కదా అని.. వాడు మధ్యలో రావడానికి నేను కారణం కాదు కదా! నేను కారణం కాకపోతే దేవుడే అవుతాడు కదా!.. అసలు మనుష్యుల మధ్య కూర్చున్నది నేనే కదా! ఎవరూ లేని ఏకాంతంలోనో ఏ అరణ్యంలోనో కూర్చోలేకపోయాను గదా!.. అని దృష్టి నిలిపి ఒక్కసారి ఆలోచించ గలిగితే ఎంతో ప్రమాదం తప్పిపోతుంది. అంటే ఎంతో సులభమైనదానిని క్లిష్టతరంగా మనమే మార్చుకుంటున్నా మన్నమాట!
దీని కంతకూ కారణం నాయంత నైష్ఠికుడు లే డనే అహం కావచ్చు. లేదా వచ్చినవాడు వేరే బ్రహ్మమూ వేరే అనే భేదభావమూ కావచ్చు.
కనిపించేది, వినిపించే దంతా బ్రహ్మమే.. అని భావిస్తే సరిపోయేది కదా! అంతా సర్దుకునేది కదా!
బ్రహ్మ మెక్కడో వున్న దని భావించేకంటె ఎదురుగా కనిపిస్తున్నది వినిపిస్తున్నది బ్రహ్మమే అని భావించడం ఎంతో తేలిక కాదా! మనం భావించటం కాదు. యథార్థమే అది. ఈ విషయం ఏ స్వామీజీ చెప్పటమే లేదు.
మరో ఉదాహరణం. మన మొక పార్కులో నడుస్తూ వున్నా మనుకోండి. "మన పక్కన నడిచే వాళ్ళంతా పరమాత్మ స్వరూపులు" అన్న విషయం గుర్తుకు తెచ్చుకొని ఆ దృష్టితో ఒక నిమిషమైనా చూడాలి. అట్లే సిమెంటు బెంచీలమీద కూర్చొని మాట్లాడుకుంటున్న వాళ్ళంతా పరమాత్మ స్వరూపులుగా భావించాలి. పార్కులో వున్న చెట్లు పూలు పరబ్రహ్మమయములుగా ఒక్కసారైనా భావించాలి.
ఎప్పుడైనా డాబా మీద తీరిగ్గా కూర్చునే అవకాశం వస్తే రోడ్డుమీద వచ్చే పోయే వాహనాలను పరికించి చూస్తూ అవన్నీ పరబ్రహ్మ మయములుగా భావించాలి. వాహనాలపైననూ నడిచీ వెళ్ళే వాళ్ళను పరిశీలనగా చూస్తూ పరబ్రహ్మ స్వరూపాలుగా ఒకింతసేపు భావించాలి. అట్లే భూమిని, ఆకాశాన్ని, పారే సెలయేళ్ళను, పశు పక్ష్యాదులను క్రిమి కీటకాదులను పరబ్రహ్మ స్వరూపాలుగా భావించాలి.
కనిపించేదీ, వినిపించేదీ అనే దాని పరిధిలోనిదే కుటుంబం కూడాను. అంటే భార్యా పుత్రులూ భగవత్ స్వరూపాలే అన్నది స్ఫురణకు రావాలి. వాళ్ళలో పరబ్రహ్మమును చూడడం అభ్యసించాలి. ఇక అప్పుడు సంసారం వదలిపెట్టి సన్యాసం పుచ్చుకుంటా ననే మాట తలయెత్తదు. ఆ సన్యాస మేదో భగవత్స్వరూపాన్ని కనుగొనేటందుకే గదా! అది ఇక్కడే కనిపిస్తూ వుంది కదా!
అంతటా వున్నది పరబ్రహ్మమే కాబట్టి నీ కెదురుగా వున్నది ఏ వస్తువైనా సరే అది కుర్చీ కావచ్చు, మంచం కావచ్చు, బొమ్మ కావచ్చు, పెన్ను కావచ్చు, పుస్తకం కావచ్చు, టీ కావచ్చు, టీ కప్పు కావచ్చు, నీళ్ళు కావచ్చు, నీళ్ళు నిండిన బకెట్టు కావచ్చు, ఒక్క క్షణం తదేకంగా చూపు నిలిపి దాని పేరు ఉచ్చరిస్తూ "యిందులో పరబ్రహ్మం అంతర్లీనంగా వెలిగిపోతూ వుంది. అది నాకు అనుభవంలోకి వస్తూ వున్నది." అని భావించాలి. ఈ భావన మనస్సులోనే కొనసాగించవచ్చు. కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారని సంకోచించే పని లేదు. ఇంతసేపని నియమం లేదు కాబట్టి మనకు వీలైనంత సేపే భావించవచ్చు.
పైవన్నీ అచరములైన వస్తువులు. అట్లే చరములైన పశుపక్ష్యాదులను, మనుష్యులను కూడ చూస్తూ ఎప్పుడు వీలుంటే అప్పుడు పై విధంగా భావించవచ్చు. ఉదాహరణకు కోడి, కుక్క, పిల్లి, బల్లి మొదలైనవి. పాలవాడు, పనిమనిషి , అతిథులు, మిత్రులు మొదలైనవారు.
ఎందుకంటే అన్నిటిలో, అందరిలో పరబ్రహ్మమే వుంది. కాదనలేము. కాని అది ప్రయోజనకారిగా తయారుకావాలి కదా! ఎందుకు కావటం లే దంటే అది నిద్రాణమై వున్నది. మనం పదే పదే భావిస్తే అది ఆక్టివేట్ అవుతుంది. అప్పుడు ప్రయోజన కరంగా తయారౌతుంది.
పొయ్యిలో నిప్పువుం దనుకొనండి. వున్నంతమాత్రాన మనం వాడుకోలేము. కాస్త ఒకటి,రెండు నిమిషాలు ఊదామా! అది రాజుకొని మంట వస్తుంది. అప్పుడు వంట చేసుకోవచ్చు. ఇదీ అలాంటిదే!
పైన పేర్కొనబడిన ఉపనిషత్తులలోని సారభూతమైన అంశ మేమంటే చూస్తున్నవాటినే కాదు, వింటున్నవాటినీ పైవిధంగానే భావన చేయాలి. ఇదే పెద్ద ధ్యానం. ఆధ్యాత్మిక సాధన. ఎంతసేపైనా చేయవచ్చు. ఇందులో అర్థం కాని, నోరు తిరుగని ఏ సంస్కృత మంత్రాలూ లేవు. ఉపదేశాలూ లేవు.
ఈవిధంగా సాధన చేస్తే కలిగే ప్రయోజన మే మంటే....
యో మాం పశ్యతి సర్వత్ర
సర్వం చ మయి పశ్యతి
తస్యాహం న ప్రణశ్యామి
స చ మే న ప్రణశ్యతి 6-30
(శ్రీ మద్భగవద్గీత)
అతడు అందరిలో నన్ను చూస్తాడు. అట్లే అందరినీ నాలో చూస్తాడు. కాబట్టి అతని ముందు నేను అదృశ్యుణ్ణి కాను. (అతనికి ఎప్పుడూ ప్రత్యక్షంగానే వుంటాను.) ఆతడూ నా ముందు అదృశ్యుడు కానేరడు. (నా దృష్టి నుంచి తప్పించుకోలేడు.)
అంటే నిత్యమూ అలాంటి వ్యక్తి భగవత్ సన్నిధానంలోనే వుంటాడు. అతనికీ భగవంతునికీ ఎడము అనేది వుండదు... ఇదే కదా ఎవరైనా కోరుకునేది! తరువాతి శ్లోకంలోను ఈ భావాన్నే దృఢతరం చేయటం జరిగింది.
ఇటువంటి బ్రహ్మ భావన సూక్ష్మతర మయ్యేకొద్దీ మన చుట్టూ నిద్రాణమై వున్న పరబ్రహ్మం జాగృతం కాగా బ్రహ్మతత్వం ప్రయోజనాత్మకమై నిత్యజీవితంలో అనుభూత మౌతుంది. యద్భావం తద్భవతి.. అని కదా!
....స్వస్తి...
రచన: డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థకవి
1.5.21
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి