*శ్రీ సూక్తము.. (మొదటి భాగము.)*
హిందూ మతం లో వేదానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. వేదం లో కూడా కొన్ని భాగాలు భావంలోనూ భాషలోనూ చాలా బాగా కుదిరాయి అని మహర్షులు భావించి ఆ భాగాలకు సూక్తాలు అని పేరు పెట్టారు. సూక్తము అంటే (సు+ఉక్తం) చక్కగా / బాగా, చెప్పబడినది అని అర్థము. వేదంలోని సూక్తాలన్నింటి లోకీ పురుష సూక్తము శ్రీ సూక్తము చాలా ప్రాచుర్యంలో ఉన్న సూక్తాలు.
పురుష సూక్తం ఉపనిషత్తులలోని అద్వైత భావాన్ని వివరిస్తుంది. ఆత్మ పరమాత్మ ల ఏకత్వాన్ని నిరూపిస్తుంది. పరబ్రహ్మాన్ని వివరిస్తుంది. అందరు దేవతలు పరబ్రహ్మ రూపాలే అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.
"శ్రేయతే సర్వైః ఇతి శ్రీ" సర్వ ప్రాణుల కు ఆశ్రయమైనది అని శ్రీ పదానికి అర్థము. శ కారము పర బ్రహ్మ కు సంబంధించిన సత్ లేదా అస్తి అనే శక్తికి ప్రతీక. అందువల్ల శ కారము ఈశ్వరుని సూచిస్తుంది అని చెప్తారు. ర కారం అగ్ని బీజము. ఈ అనేది శక్తి బీజము. ఈశ్వరుడు అగ్ని శక్తి ఈ మూడింటి యొక్క కలయిక శ్రీ. ఈ అక్షారము లక్ష్మీ కి పర్యాయపదము. శ్రీదేవి అంటే ఐశ్వర్య స్వరూపిణి. శ్రీ బీజం శుభాలను ఇస్తుంది అశుభాలను అమంగళాలను దోషాలను తొలగిస్తుంది. అందుకనే కావ్య లన్నిటికీ మొదటి పద్యంలో మొదటి అక్షరాన్ని శ్రీ అని ఉంచుతారు. కావ్యంలో ఏ దోషం ఉన్నా ఈ ఒక్క అక్షరం ఆ దోషాలు నన్నింటిని తీసి వేస్తుంది. శ్రీ, శ్రీ మత్ అనే పదాలు శ్రేష్ట వాచకాలు. ఉదాహరణకు శ్రీవిద్య శ్రీదేవి శ్రీవారు మొదలైన పదాలు. గౌరవాన్ని సూచించడం కోసము శ్రీ ని పేర్లకు ముందు వాడతారు. శ్రీ అంటే బిల్వ చెట్టు. మారేడు కాయను శ్రీ ఫలము అంటారు. శ్రీ అంటే సాలెపురుగు అనే అర్థం కూడా ఉంది.
ఓంకారం సచ్చిదానంద రూపుడైన పరబ్రహ్మ ను తెలియజేస్తే, శ్రీ బీజం ప్రకృతి స్వరూపిణి అయిన జగన్మాతను తెలియజేస్తుంది. ఓంకారం ఆధ్యాత్మికమైన ఉన్నతికి దారి చూపితే శ్రీకారం లౌకికమైన సంపదలనూ కోరికలనూ అనుగ్రహిస్తుంది.
శ్రీ సూక్తం ఋగ్వేదంలో భాగము. శ్రీ సూక్తము లో ప్రధానంగా 15 ఋక్కులున్నాయి. వేదభాగాలను ఎలా వాడాలి అనే విషయాన్ని తెలియజేసే శాస్త్రాన్ని కల్పము అంటారు. కల్ప సూత్రాల ప్రకారము, శ్రీ సూక్తము ప్రధానంగా హవనము (యజనము) లో వాడుకోవాలి. అంగన్యాస కరన్యాసాల తో జపానికి వాడుకోవడం రెండో పద్ధతి. ఇందులో కూడా మొత్తం సూక్తాన్ని అంగన్యాస కరన్యాసాల తో జపం చేయడం ఒక పద్ధతి. ఒక్కొక్క ఋక్కును ప్రత్యేకంగా అంగన్యాస కరన్యాసాల తో జపం చేయడం వేరొక పద్ధతి.
శ్రీ సూక్తము తాత్పర్యం చూస్తే అది మహాలక్ష్మి ప్రార్థన అని అనిపిస్తుంది. కానీ నిజానికి శ్రీ సూక్తము లక్ష్మీ సరస్వతి పార్వతి ముగ్గురు కలిసి ఉన్న (అంటే దుర్గా సప్తశతి లో వర్ణించిన) దుర్గా స్వరూపాన్ని, ప్రకృతి రూపిణి మూల శక్తి రూపిణి అయిన లలితా అమ్మవారికి ప్రార్ధనా రూపంలో ఉంటుంది. శ్రీ సూక్తం మొత్తంగా కానీ లేదా అందులో ఉన్న ఋక్కులను విడిగా గాని జపం చేయడానికి అంగన్యాస కరన్యాసాలు చేసేటప్పుడు వాడే బీజాలు సంకల్పం శ్రీ సూక్తం పరాశక్తి కి సంబంధించినది అని నిరూపిస్తాయి. అందుకనే శ్రీ సూక్తాన్ని శైవులు శాక్తేయులు కూడా వారి పూజలలో ఉపయోగిస్తుంటారు.
వేదం లో భాగం కాబట్టి శ్రీ సూక్తాన్ని వేదం చదివినట్లు స్వరయుక్తంగా చదవాలి. కానీ, రుగ్వేదంలోని ఖిల భాగంలో ఉన్నది కాబట్టి స్వరం లేకుండానే ఈ సూక్తాన్ని స్తోత్రం లాగా చదువుకునే వెసులుబాటు ఉన్నది. అందువల్ల ప్రస్తుతం అందరూ శ్రీ సూక్తాన్ని స్వరం లేకుండా స్తోత్రం గానే చదువుతున్నారు. ఆడవాళ్ళు ఇంటి పనులు చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ కూడా ఈ సూక్తాన్ని చదువుతుంటారు. అది కూడా మంచిదే.
వేదమంత్రాలు అర్థం తెలియకుండా చదివినా ఫలితాన్నిస్తాయి. కానీ ఎవరిని పూజిస్తున్నాము మనం చేసే ప్రార్థన ఏమిటి అందులో మనం ఏమి కోరుకుంటున్నాము తెలుసుకొని చదివితే అప్పుడు ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుంది.
శ్రీ సూక్తాన్ని గురించిన పరిచయం కొంత వరకూ పూర్తయింది కాబట్టి ఇక ఋక్కులలోకి వెళ్దాము.
ఇంకా ఉంది.....
*పవని నాగ ప్రదీప్.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి