12, ఆగస్టు 2021, గురువారం

మనుమసిద్ధి - కాటమరాజుల ప్రక్షానా పోరాడిన యోధులపేర్లివిగో.

 మనుమసిద్ధి - కాటమరాజుల ప్రక్షానా పోరాడిన యోధులపేర్లివిగో.

........................................................


కాటమరాజు తండ్రిపేరు పెద్దిరాజు, తాతపేరు వల్లురాజు. కాటమరాజు నెల్లూరు మండలంలోని కనిగిరిసీమలోని అలవలపాడుకు అధిపతి. ఆత్రేయగోత్రానికి చెందిన యాదవుడు.అలవలపాడు సీమలో మూడు సంవత్సరాలపాటు వర్షాలు కురవలేదు. తీవ్రమైన అనావృష్టితో ప్రజలు పశువులతోపాటుగా ఇబ్బందుల పాలైనారు. అలవలపాడు యాదవుల వద్ద లక్షగోవులకుపైగానే గోసంపదవుంది.


కాటమరాజు అనుమతితో గొల్లలు మనుమసిద్ధిరాజ్యంలోని అడవులలోనికి ఆలమందను మేతకై తోలుకువెళ్ళారు. మేతబయలులో పశువులను మేపుకొన్నందుకు పుల్లరి ( పన్ను) చెల్లిస్తానని కాటమరాజు మనుమసిద్ధికి కబురు పెట్టాడు. మనుమసిద్ధి సరేనన్నాడు.


యాదవులు ఆలమందలను తోలిన అడవులలో ఆటవికులున్నారు. యాదవులు తినటానికై అడవిలో మృగాలను పక్షులను వేటాడంతోపాటు ఫలవృక్షసంపదలను హరించసాగారు. ఆటవికుల జీవనోపాధికి తీవ్రమైన ఆటంకము కల్గింది. ఆటవీకులకు పశుకాపరులకు మధ్య ఈ విషయమై తీవ్రఘర్షణ జరిగింది.


ఆటవీకులు పశువులపైబడి అనేక గోవులను సంహరించారు.దీంతో గోపాలురు పుల్లరి చెల్లించకుండా అర్ధరాత్రిపూట పశువులమందలను అలవలపాడుకు వెళ్ళిపోయారు.


విషయంతెలిసి మనుమసిద్ధి పుల్లరి చెల్లించాల్సిందిగా కాటమరాజుకు కబురు పెట్టాడు. మీ రాజ్యంలోని ప్రజలు మా ఆవులమందలోని అనేక మూగ జీవాలను చంపేశారు. మీకు చెల్లించాల్సిన పుల్లరికన్నా చనిపోయిన గోవుల విలువే ఎక్కువగావుంది. కనుక మీరాజ్యమే మాకు నష్టపరిహరం చెల్లించాలని కాటముడు తిరుగుబాబు పంపాడు.


ఆగ్రహించిన మనుమసిద్ధి ఓ ప్రయత్నంగా అన్నంభట్టును అలవలపాడుకు రాయభారం పంపాడు. రాయభారం విఫలమైంది.ఇరుపక్షాలు యుద్ధానికి సిద్ధమైనాయి.


మనుమసిద్ధికి సేనాని ఖడ్గతిక్కననే బ్రాహ్మణుడు. ఖడ్గతిక్కన ఎవరోకాదు తిక్కనసోమయాజికి స్వయాన పెదనాన్న కొడుకు. భాస్కర మంత్రికి నలుగురు కొడుకులు.మూడవకొడుకు పేరు సిద్ధానామాత్యుడు. నాలుగవవాడి పేరు కొమ్మనామాత్యుడు. సిద్ధానామాత్యుడి కొడుకుపేరు తిక్కన, ఇతనే ఖడ్గతిక్కనగా ప్రసిద్ధి. కొమ్మనామాత్యుడి తనయుడిపేరు కూడా తిక్కనే. ఇతనే సింహవిక్రమపురి (నెల్లూరు) కి రాజైన మనుమసిద్ధి దగ్గర ప్రధానామాత్యుడు. ఇతనే నిర్వచనోత్తర రామాయణకర్త, ఉభయకవిమిత్రుడు, కవిబ్రహ్మ అంతకుమించి మహాభారతాన్ని తెనిగించిన కవిత్రయంలో ఒక్కడు. మనుమసిద్ధికడ ఒకతిక్కన సేనానిగా, మరోతిక్కన అమాత్యుడుగా వున్నారు.


నెల్లూరు, అలవలపాడు ఇరుపక్షాలకు యుద్ధం తప్పనిసరైంది. సేనను సేనానులను ఇరురాజ్యాలు సమకూర్చుకొన్నాయి.


 మనుమసిద్ధిపక్షంలో తిరునామాల తిప్పరాజు, శ్రీకంఠరాజు, పెదవేగి బొక్కరాజు, పెదవరదరాజు, గయికొండ గంగరాజు, ఉర్లకొండ సోమన్న, ఉదయాద్రి ఉమ్మయ్య, అర్లుకొండ అచ్చిరాజు, చెన్నపట్నం చంద్రశేఖరుడు, దేవముని వెంగళయ్య, పట్టుకోట బసవరాజు, కాళహస్తి పాప తిమ్మరాజు, వెలుగంచి వెంగళరాజు, ప్రభగిరి పట్టణ పద్మశేఖరుడు మొదలైన యోధులు కాటమరాజును శిక్షించడానికి సిద్ధమైనారు.


యాదవులపక్షానికి బ్రహ్మరుద్రయ్య మహసేనాని. ఇంకా కాటమరాజు పక్షంలో పలనాటి పద్మనాయుడు, పల్లెకొండ ప్రభువు చల్ల పిన్నమనాయుడు, దొనకొండ అయితమరాజు,ఎఱ్ఱయ్య, భట్టావుల రాజు, వల్లభన్న, నాచకూళ్ళనాయుడు,ముమ్మయ్యనాయుడు, ఉత్తమరాజు మొదలైన యోధులు పాల్గొన్నారు. మొదటగా యాదవుల సైన్యానికి చల్లపిన్నమనాయుడు నాయకత్వం వహించాడు.


ఉభయసైన్యాలు పాలేటి దగ్గరలోని పంచలింగాల కడ ఢీ కొన్నాయి. ఈ యుద్ధంలో తిక్కన బాగా గాయపడి వెనుతిరిగాడు. స్వగ్రామంలో వీధులలో ప్రజలు నిలబడి పేడ పిడుకలు తిక్కనపై విసిరి పిరికివాడని గేలిచేశారు. ఇంట్లో తండ్రి సిద్ధనామాత్యుడు, భార్య చానమ్మ, చివరికి తల్లి కూడా ఖడ్గతిక్కన పిరికివాడని కదనరంగంనుండి పారిపోయి వచ్చాడని నిందించారు.


తిక్కన రోషంతో మరల రణరంగంలో దూకి కాటమరాజు సైన్యాన్ని అల్లకల్లోలం చేశాడు. యాదవసేనలో పెక్కుమంది ఖడ్గతిక్కన ఖడ్గానికి బలైనారు. కాటమరాజు సేనాని బ్రహ్మరుద్రయ్య తిక్కనను ఎదుర్కొన్నాడు. ఇరువురి మధ్య జరిగిన బాహాబాహియుద్ధంలో బ్రహ్మరుద్రయ్య కత్తివేటుకు తిక్కన తలతెగిపడింది. అప్పటికే తిక్కన విసిరిన కత్తివేటుకు రుద్రయ్య కూడా నేలకు కూలబడ్డాడు. ఇద్దరి ప్రాణాలు అనంతవాయువులలో కలిశాయి.


ఇరుపక్షాల వినాశానాన్ని నివారించటానికి కవిబ్రహ్మ, ఉభయకవి బిరుదాంకితుడు, మనుమసిద్ధికి అమాత్యుడైన తిక్కన సోమయాజి రాజీ కుదిర్చి శాంతిని నెలకొల్పాడు.

................................................................................................................జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

కామెంట్‌లు లేవు: