*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఎనుబది ఏడవ అధ్యాయము*
*శ్రుతిగీతలు*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*87.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*
*స్థిరచరజాతయః స్యురజయోత్థనిమిత్తయుజో విహర ఉదీక్షయా యది పరస్య విముక్త తతః|*
*న హి పరమస్య కశ్చిదపరో న పరశ్చ భవేత్ వియత ఇవాపదస్య తవ శూన్యతులాం దధతః॥11989॥*
ప్రభూ! నీవు నిత్యముక్తుడవు, మాయాతీతుడవు. అయితే నీ ఈక్షణమాత్రమున (సంకల్పమాత్రమున) మాయాశక్తిచే నీవు విహరించినప్పుడు స్థావర - జంగమాత్మకములైన ప్రాణులు తమ తమ కర్మ - సంస్కారములతో ఉత్పన్నములగును. ఆకాశమునుండి వాయువు మున్నగు భూతములు ఉత్పన్నములగును. కాని, ఆకాశము దేనికీ అంటకుండా, తనకుతాను శూన్యముగనే ఉండిపోవును. అట్లే నీనుండి చరాచరప్రాణులు ఉత్పన్నమగును. కాని, సర్వవ్యాపకుడవు ఐన నీవు ఆకాశమునకువలె అనంగుడవై ఉందువు. అనగా పరమాత్మవగు నీకు తనవాడుగానీ, పరాయివాడుగానీ ఎవడునూ లేడు.
*87.30 (ముప్పదియవ శ్లోకము)*
*అపరిమితా ధ్రువాస్తనుభృతో యది సర్వగతాః తర్హి న శాస్యతేతి నియమో ధ్రువ నేతరథా|*
*అజని చ యన్మయం తదవిముచ్య నియంతృ భవేత్ సమమనుజానతాం యదమతం మతదుష్టతయా॥11990॥*
స్వామీ! నీవు నిత్యుడవు. అఖండస్వరూపుడవు. అసంఖ్యాకులైన జీవులు అందరును నిత్యులు, సర్వవ్యాపకులు ఐనచో వారు నీతో సమానులగుదురు. అట్లైనచో నీవు శాసించువాడవుగావు, వారు శాసింపబడువారును కారు. అప్పుడు నీవు వారిని నియంత్రింపజాలవు. వారు నీనుండి ఉత్పన్నులై, నీ కంటెను తక్కువస్థితిలో ఉన్నచో అప్పుడు మాత్రమే నీవు వారిని నియంత్రించుట సంభవమగును. జీవులెల్లరును, అట్లే వారి ఏకత్వ భిన్నత్వములను నీనుండియే ఉత్పన్నమగుట నిస్సందేహము (ప్రాణులన్నియును ఇంద్రియాదులను కల్గియుండుట ఏకత్వసూచకము. వాటి ఆకారములు, స్వభావాదులు వేర్వేరుగా నుండుట భిన్నత్వ సూచకము). అందువలన నీవు వారికి కారణభూతుడవు అయ్యును వారి నియామకుడవే. వాస్తవముగా నీవు వారిలో సమరూపుడవై ఉన్నావు. కాని నీ స్వరూపము *ఇతమిత్థము* అని ఎవ్వరును తెలిసికొనజాలరు. 'మేము భగవత్స్వరూపములను తెలిసికొన్నాము' అని పలికెడివారు నిజముగా నీ వాస్తవ స్వరూపమును ఎరుగనివారే. వారు కేవలము తమ బుద్ధికి తోచిన విషయమునే తెలుపుచున్నట్లు అనుకొనవలెను. నీవు అట్టి బుద్ధికిని గోచరుడవు కావు. అభిప్రాయముల వలన నిన్ను ఎరుగలేరు. ఏలయన మతములన్నియును పరస్పరవిరుద్ధములు. నీ స్వరూపము ఈ మతములన్నింటికిని (అభిప్రాయములన్నింటికిని) అతీతమైనది.
*87.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*
*న ఘటత ఉద్భవః ప్రకృతిపూరుషయోరజయోః ఉభయయుజా భవంత్యసుభృతో జలబుద్బుదవత్|*
*త్వయి త ఇమే తతో వివిధనామగుణైః పరమే సరిత ఇవార్ణవే మధుని లిల్యురశేషరసాః॥11991॥*
ప్రకృతి మరియు పురుషుడు పుట్టుకలేనివారు. కనుక వారియందు పుట్టుక-జన్మము అనేది సంభవింపదు. జలము వాయువుతో కలిసి బుడగలు పుట్టినట్లుగా ప్రకృతి పురుషుల సంయోగముచే ప్రాణులు ఉత్పన్నమగుచున్నవి. సృష్టిలోగల నానావిధములైన నామములతో, గుణములతో పుట్టిన స్థావర-జంగమాత్మకమగు ప్రాణులన్నియునూ చివరకు పరమకారణుడవగు నీలో విలీనమగును. వేరు-వేరు నదులన్నియును సముద్రమందు కలిసినట్లుగా, సకల పుష్పముల రసములు తేనెయందు కలగలిసినట్లుగా, ఈ ప్రపంచమంతయును నీ నుండి ఉద్భవించును. నీలోనే లయము చెందును.
*87.32 (ముప్పది రెండవ శ్లోకము)*
*నృషు తవ మాయయా భ్రమమమీష్వవగత్య భృశం త్వయి సుధియోఽభవే దధతి భావమనుప్రభవమ్|*
*కథమనువర్తతాం భవభయం తవ యద్భ్రుకుటిః సృజతి ముహుస్త్రిణేమిరభవచ్ఛరణేషు భయమ్॥11992॥*
పరమాత్మా! జీవులు నీ మాయలోబడి భ్రమించుచు తమను నీనుండి వేరుగా భావించుచుందురు. అందువలన వారు జననమరణ చక్రములో తిరుగుచుందురు. కానీ వివేకవంతులు ఇట్టి భ్రమకు లోనుగాక, అనన్యభక్తితో నిన్ను శరణువేడుదురు. ఏలయన, జననమరణ చక్రమునుండి విముక్తులను గావించువాడవు నీవే. శీతకాలము, వేసవికాలము, వర్షాకాలము అను మూడు విభాగములుగాగల కాలచక్రము నీ భ్రూవిలాసమలలో (కనుసన్నలలో) మెలగుచుండును. అది అందరిని భయపెట్టుచుండును. కాని, ఈ కాలచక్రము నిన్ను శరణువేడనివారికి మాత్రమే భయానకము. నీ శరణాగతులైన భక్తులకు జన్మమృత్యురూపమైన ఈ సంసారభయము ఏమాత్రమూ ఉండదు. అట్టివారికి ఈ కాలచక్రమువలన ఎట్టిభీతియు ఉండదు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఎనబది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి