14, అక్టోబర్ 2022, శుక్రవారం

ధర్మాకృతి : మహాస్వామి - మహర్షి - 2

 ధర్మాకృతి : మహాస్వామి - మహర్షి - 2


మహాస్వామి వారు తమ మఠగౌరవం విషయంలోనే కాదు. ఇతరుల గౌరవ విషయంలోనూ అంతే గమనంగా ఉంటారు. శ్రీవారు కంచిలో ఉంటున్న రోజుల్లో క్రొత్తగా పీఠాధిపత్యం స్వీకరించిన మైసూరు వైష్ణవ పీఠాధిపతులు స్వామివారిని కలవాలనుకొన్నారు. వైష్ణవ పీఠాలలో ధనబలం మెండుగా ఉన్న మఠం అది. ఆ స్వామివారు పరమ సాత్వికులు. వారు సిద్ధాంతంలో మహా పండితులు. మహాస్వామి వారిని వారి పూర్వాశ్రమంలో అనేకసార్లు దర్శించారు. కానీ మఠాధిపతులుగా ఆ రకంగా దర్శించడానికి ఆ మఠ అనుయాయులు తమ మఠగౌరవానికి భంగంగా తలపోశారు. కాలక్రమాన వారు కాంచీపుర యాత్రకి వచ్చారు. కంచి వచ్చి కూడా మహాస్వామిని దర్శనం చేయకుండానే వెళ్ళిపోవాలా అని బాధపడ్డారు. కంచి మహాస్వామి వారికీ విషయం తెలిసింది.


వైష్ణవులకు కంచియాత్ర కామకోటి పీఠ సమీపంలో ఉన్న గరుడాళ్వారును దర్శనం చేయందే పూర్తికాదు. మహాస్వామివారు వైష్ణవ యతి దర్శనానికి వచ్చే సమయానికి సరిగ్గా గరుడాళ్వారు సన్నిధిలో కూర్చున్నారు. వైష్ణవ స్వామి రానే వచ్చారు. గరుడాళ్వారుకు వందనం చేసి ప్రక్కనే ఉన్న స్వామివారిని చూసి ఆనందపరవశులయిపోయారు. మఠమర్యాదలకు భంగం కాకుండా కలుసుకోవడం ఎలా అనేది ప్రశ్న. కానీ సమావేశమయిన పిదప మాట్లాడుకొనే విషయంలో ఇబ్బందే లేదు కదా!


అయితే రమణులను శంకరాచార్య పరంపరకు సంబంధమున్న శివగంగ పీఠాధిపతులు, శంకర పీఠాధిపతులయిన పూరీ శంకరాచార్యుల వారు దర్శించారు. శివగంగ పీఠాధిపతులు తమ పీఠానికి దయచేయవలసినదిగా కబురు చేశారట. రమణులు “మనమేమి పండితులమా? పీఠాధిపతుల వద్దకు పోయేందుకు ఏమి అర్హత ఉన్నదని” పోలేదట. వారే బయలుదేరి వెళ్ళారు. ఓ చెట్టునీడన కలుసుకొన్నారు. పీఠాధిపతులు జరీ అంచు శాలువా. రూ.116లు సమర్పించి “స్వామీ తాము స్వీకరించాలి అన్నారట. రమణులు ఎంతో కష్టం మీద శాలువా మాత్రం గ్రహించారు. ‘సుఖి అంటే రమణులె సుఖి. ఈలాంటి సుఖం నాకు వేయి జన్మలకైనా దుర్లభం” అన్నారట వారు.

పూరీ శంకరాచార్యులు రమణులను దర్శనం చేసి వారిద్వారా సందేహ నివృత్తి చేసుకొని, వారి అనుగ్రహం వల్ల అనిర్వచనీయమైన అనుభూతిని పొంది, ఆనందభాష్యాలు కారగా కరములు శిరమున ఘటించి నమస్కరించారట.


అప్పటి శృంగేరీ స్వామి శ్రీ సచ్చిదానంద నృసింహభారతీ స్వామివారు రమణులను కలవాలని ప్రయత్నం చేశారట. పీఠాధిపతులాయె! ఎన్నో నిబంధనలు చుట్టూ ఉన్నవారు రానిస్తారా! అంటారు రమణులు. శృంగేరీ మఠపండితులు ఒకరు వీరికి సన్యాసదీక్ష ఇప్పించాలని కూడా ప్రయత్నం చేశారు. అది తెలుసుకొనిన శృంగేరీ స్వామి వారు వారిని మందలించారట. శృంగేరీ చంద్రశేఖర భారతీ స్వామి చరిత్ర ఇంగ్లీషులో వ్రాసిన శ్రీ నటరాజన్ గారు రమణ మహర్షి సెంటర్ ఫర్ లెర్నింగ్ కు అధ్యక్షులు. వారు చంద్రశేఖర భారతీస్వామి గురించి రమణులు ఏదైనా వ్యాఖ్య చేశారని గానీ, భారతీ స్వామివారు రమణుల గురించి ఏదైనా అన్నారని గానీ వ్రాయలేదు. నే చూసినంత వరకు ఇంకే రమణ గ్రంథాలలోనూ ఈ ప్రసక్తి లేదు.


కంచి స్వామి రమణులు ఉపాధిలో ఉండగా రెండుసార్లు తిరువణ్ణామలై విజయం చేశారు. 1929లో ఒకసారి 1944లో రెండవసారి. మొదటిసారి వెళ్ళేటప్పటికే రమణుల స్థితి గురించి తమ శిష్యుల వద్ద ఎంతో ఉన్నతంగా చెప్పి ఉన్నారు. అప్పటికే పాల్ బ్రంటన్ ను కూడా రమణుల వద్దకు వారే నీకు తగిన గురువు అని ప్రోత్సహించి పంపారు. 


అయినా గిరి ప్రదక్షిణ సమయంలో రమణాశ్రపు గేటు వద్ద ఒక నిమిషం నిలబడి పరకాయించి చూసి సాగిపోయారు. పీఠాధిపతులయిన స్వామివారికి ఆహ్వానించకుండా ఎక్కడికీ వెళ్ళకూడదనే నియమముంది. మరి రమణులకో! తమకు భిన్నమైన వస్తువు లేదనే ఆత్మానుభవంలో ఉన్నవారికి పిలిచే వారెవరు? పిలువబడే వారెవ్వరు? 1929 సంఘటన పుస్తకాలలో రికార్డు కాలేదు. అయితే శ్రీ రా.గణపతి గారికి కుంజస్వామి స్వయంగా చెప్పారు. కుంజస్వామి రెండు సందర్భాలలోనూ రమణులకు సమీపవర్తులుగా ఉన్నారు.


(సశేషం)


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: