22, మే 2024, బుధవారం

మహాభాగవతం

 *


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఆరవ అధ్యాయము*


*శ్రీకృష్ణుడు గోపకాంతలకడకు ఉద్దవుని పంపుట*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*


*46.1 (ప్రథమ శ్లోకము)*


*వృష్ణీనాం ప్రవరో మంత్రీ కృష్ణస్య దయితః సఖా|*


*శిష్యో బృహస్పతేః సాక్షాదుద్ధవో బుద్ధిసత్తమః॥10049॥*


*శ్రీశుకుడు నుడివెను* పరీక్షిన్మహారాజా! వృష్ణివంశము వారిలో ప్రముఖుడైన ఉద్ధవుడు మిగుల ప్రజ్ఞాశాలి. అతడు సాక్షాత్తుగా బృహస్పతికి శిష్యుడు. శ్రీకృష్ణునకు ప్రాణమిత్రుడు, ఆంతరంగికుడు.


*46.2 (రెండవ శ్లోకము)*


*తమాహ భగవాన్ ప్రేష్ఠం భక్తమేకాంతినం క్వచిత్|*


*గృహీత్వా పాణినా పాణిం ప్రపన్నార్తిహరో హరిః॥10050॥*


కృష్ణభగవానుడు ప్రపన్నుల (శరణాగతుల) ఆపదలను తొలగించువాడు. ఆ స్వామి ఒకనాడు తనకు అనన్యమగు ప్రియభక్తుడగు ఆ ఉద్ధవుని తనకడకు పిలిపించుకొనెను. తన చేతితో ఆయన చేతిని కలిపి పట్టుకొని, ఆ ప్రభువు ఏకాంతమున ఇట్లు నుడివెను.


*46.3 (మూడవ శ్లోకము)*


*గచ్ఛోద్ధవ వ్రజం సౌమ్య పిత్రోర్నౌ ప్రీతిమావహ|*


*గోపీనాం మద్వియోగాధిం మత్సందేశైర్విమోచయ॥10051॥*


"సౌమ్యుడవైన ఉద్ధవా! నీవు వ్రజభూమికి వెళ్ళుము. మా తల్లిదండ్రులైన యశోదానందులకు ప్రీతిని గూర్పుము. నా యెడబాటువలన గోపికలు మిగుల మనస్తాపము చెందియున్నారు. నా సందేశమును వినిపించి వారి వేదనను తొలగింపుము.


*46.4 (నాలుగవ శ్లోకము)*


*తా మన్మనస్కా మత్ప్రాణా మదర్థే త్యక్తదైహికాః|*


*మామేవ దయితం ప్రేష్ఠమాత్మానం మనసా గతాః|*


*యే త్యక్తలోకధర్మాశ్చ మదర్థే తాన్ బిభర్మ్యహమ్॥10052॥*


ఆ గోపకాంతలు తమ మనస్సులయందు నిరంతరము నన్నే నిలిపికొనియుందురు. వారి ప్రాణములు, జీవితములు, సర్వస్వము నేనే. వారు నా కొఱకై తమ దేహముతో సంబంధముగల పతి, పుత్ర బంధువులందరిని కూడ త్యజించివేసిరి. వారు హృదయపూర్వకముగా నా యెడ ఆత్మీయత గలిగియుండి నన్ను తమకు ప్రియతమునిగా భావించుచుందురు. నా కొరకై లోక పరలోకధర్మములను, సుఖములను  ప్రక్కనబెట్టి నన్నే నమ్ముకొనియున్న వారిని నేను సర్వదా పాలించుచుందును.


*46.5 (ఐదవవ శ్లోకము)*


*మయి తాః ప్రేయసాం ప్రేష్ఠే దూరస్థే గోకులస్త్రియః|*


*స్మరంత్యోఽఙ్గ విముహ్యంతి విరహౌత్కంఠ్యవిహ్వలాః॥10053॥*


ఉద్ధవా! ఆ గోపికలకు మిక్కిలి ప్రియతముడనైన నేను దూరము కాగా, వారు నన్నే స్మరించుచుందురు. నా యెడబాటు కారణముగా ఉత్కంఠతో విహ్వలులై నన్ను గుర్తుచేసికొని మీదు మిక్కిలి వ్యామోహమును పొందుచుందురు.


*46.6 (ఆరవ శ్లోకము)*


*ధారయంత్యతికృచ్ఛ్రేణ ప్రాయః ప్రాణాన్ కథంచన|*


*ప్రత్యాగమనసందేశైర్వల్లవ్యో మే మదాత్మికాః॥10054॥*


మిత్రమా! నేను గోకులమునుండి మథురకు బయలుదేఱు నప్పుడు వారికి 'నేను వ్రజభూమికి తప్పక తిరిగి వత్తును' అని మాట ఇచ్చి యుంటిని. అందు వలన తమ చిత్తముల యందు నన్నే నిలుఫుకొనియున్న ఆ గోపికలు అనుక్షణము నా రాకకై ఎదురు చూచుచు అతికష్టము మీద తమ ప్రాణములను నిలుపుకొనియుందురు.


*శ్రీశుక ఉవాచ*


*46.7 (ఏడవ శ్లోకము)*


*ఇత్యుక్త ఉద్ధవో రాజన్ సందేశం భర్తురాదృతః|*


*ఆదాయ రథమారుహ్య ప్రయయౌ నందగోకులమ్॥10055॥*


*శ్రీశుకుడు వచించెను* పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు ఇట్లు పలికిన పిమ్మట ఉద్దవుడు ఆ స్వామి సందేశమును సాదరముగా స్వీకరించి, రథమునందు ఆసీనుడై నందగోకులమునకు బయలుదేరెను.


*46.8 (ఎనిమిదవ శ్లోకము)*


*ప్రాప్తో నందవ్రజం శ్రీమాన్ నిమ్లోచతి విభావసౌ|*


*ఛన్నయానః ప్రవిశతాం పశూనాం ఖురరేణుభిః॥10056॥*


శోభాసంపన్నుడగు ఉద్ధవుడు సూర్యుడు అస్తమించు సమయమునకు గోకులమునకు చేరెను. అప్పుడే మేతకై వనమునకు వెళ్ళిన గోవులు ఇండ్లకు చేరుచుండెను. వాటి కాలిగిట్టల తాకిడికి చెలరేగిన దుమ్ము ఉద్ఢవుని రథమును కప్పివేసెను.


*46.9 (తొమ్మిదవ శ్లోకము)*


*వాసితార్థేఽభియుధ్యద్భిర్నాదితం శుష్మిభిర్వృషైః|*


*ధావంతీభిశ్చ వాస్రాభిరూధోభారైః స్వవత్సకాన్॥10057॥*


పశువుల మందలోని బలిష్ఠములై, మదించియున్న ఆబోతులు ఎదకు వచ్చిన గోవులకొఱకై పరస్పరము పోట్లాడుకొనుచు ఱంకెలు వేయుచుండెను. ఆ ఱంకెలు గోకులమునందు అంతటను ప్రతిధ్వనించు చుండెను. క్రొత్తగా ఈనిన ఆవులు లేగల కొఱకై తమ పొదుగుల భారమును విస్మరించి పరుగులు తీయుచుండెను.


*46.10 (పదియవ శ్లోకము)*


*ఇతస్తతో విలంఘద్భిర్గోవత్సైర్మండితం సితైః|*


*గోదోహశబ్దాభిరవం వేణూనాం నిఃస్వనేన చ॥10058॥*


ఇటునటు గెంతులు వేయుచు, పరుగులు తీయుచున్న ఆవుదూడలు చూడముచ్చట గొలుపుచుండెను. గోకుల మంతటా పాలను పితికే శబ్దములతో, పిల్లనగ్రోవుల కమ్మని ధ్వనులతో మారుమ్రోగుచుండెను.


*46.11 (పదకొండవ శ్లోకము)*


*గాయంతీభిశ్చ కర్మాణి శుభాని బలకృష్ణయోః|*


*స్వలంకృతాభిర్గోపీభిర్గోపైశ్చ సువిరాజితమ్॥10059॥*


చక్కని వస్త్రాభరణములను ధరించిన గోపికలు, గోపాలురును బలరామకృష్ణుల సుచరిత్రములను, అద్భుతలీలలను పారవశ్యముతో గానము చేయుచుండిరి. మనోరంజకముగా నున్న వారి మధురగానములు వ్రజభూమిని ఆనందధామముగా జేయుచుండెను.


*46.12 (పండ్రెండవ శ్లోకము)*


*అగ్న్యర్కాతిథిగోవిప్రపితృదేవార్చనాన్వితైః|*


*ధూపదీపైశ్చ మాల్యైశ్చ గోపావాసైర్మనోరమమ్॥10060॥*


గోపాలుర గృహములలో అగ్ని, సూర్యుడు, అతిథులు, గోవులు, విప్రులు, పితృదేవతలు, దేవతలు ఆరాధింపబడు చుండిరి. ఆ సందర్భముగా వేయబడిన ధూపములు పరిమళములను వెదజల్లుచుండెను. దీపముల కాంతులు దర్శనీయముగా ఉండెను. పూలమాలలచే అలంకృతములై ఆ భవనములు నందగోకుల శోభలను ఇనుమడింప చేయుచుండెను.


*46.13 (పదమూడవ శ్లోకము)*


*సర్వతః పుష్పితవనం ద్విజాలికులనాదితమ్|*


*హంసకారండవాకీర్ణైః పద్మషండైశ్చ మండితమ్॥10061॥*


అచటి వనముల యందలి వృక్షములు అన్నియును చక్కగా పూవులతో అలరారుచుండెను. వాటిపై జేరియున్న పక్షులయొక్క కలరవములు, పుష్ప మకరందములను గ్రోలి మత్తిల్లియున్న తుమ్మెదల ఝంకారములు వినసొంపుగా నుండెను. నిర్మల జలములుగల సరస్సులలో పూర్తిగా వికసించియున్న కమలములు శోభాయమానముగా ఉండెను. అందు సంచరించుచున్న హంసలు, కారండవములు మొదలగు పక్షుల కదలికలు మనోజ్ఞముగానుండెను. ఇవి యన్నియును వ్రజభూమియొక్క అందచందములకు వన్నె చిన్నెలను దిద్దుచుండెను.


*46.14 (పదునాలుగవ శ్లోకము)*


*తమాగతం సమాగమ్య కృష్ణస్యానుచరం ప్రియమ్|*


*నందః ప్రీతః పరిష్వజ్య వాసుదేవధియార్చయత్॥10062॥*


*46.15 (పదునైదవ శ్లోకము)*


*భోజితం పరమాన్నేన సంవిష్టం కశిపౌ సుఖమ్|*


*గతశ్రమంభూ పర్యపృచ్ఛత్పాదసంవాహనాదిభిః॥10063॥*


శ్రీకృష్ణునకు అనుచరుడు, ఆయనకు మిగుల ప్రీతిపాత్రుడు ఐన ఉద్ధవుడు తమ ఇంటికి వచ్చినందులకు నందుడు ఎంతయు సంతసించి, ఆయనను అక్కున జేర్చుకొనెను. పిదప నందుడు ఆ ఉద్ధవుని సాక్షాత్తు శ్రీకృష్ణునిగా భావించి, భక్తిశ్రద్ధలతో పూజించెను. అనంతరము షడ్రసోపేతములైన పదార్థములతో ఆయనకు భోజనమిడెను. హాయిగా మృదుశయ్యపై జేరిన పిమ్మట ఆ మహాత్మునకు పాదసేవలతో బడలికలు తీర్చుచు క్షేమసమాచారములను గూర్చి ఇట్లు  ప్రస్తావించెను-


*46.16 (పదహారవ శ్లోకము)*


*కచ్చిదంగ మహాభాగ సఖా నః శూరనందనః|*


*ఆస్తే కుశల్యపత్యాద్యైర్యుక్తో ముక్తః సుహృద్వృతః॥10064॥*


"మహాత్మా! ఉద్ధవా! మాకు పరమమిత్రుడైన వసుదేవుడు చెఱసాలనుండి విముక్తుడైనాడు గదా! ఆ మహాపురుషుడు పుత్రులతోడను, బంధుమిత్రులతోడను గూడి క్షేమముగా ఉన్నాడు గదా!


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

కామెంట్‌లు లేవు: