22, మే 2024, బుధవారం

హైదరాబాద్ న’గరం’

 శీర్షిక: హైదరాబాద్ న’గరం’ (మినీ కవితలు)

             *తుమ్మ జనార్దన్ (కలం పేరు : జ్ఞాన్)*


51. వీధి వీధిలో జొన్న రొట్టెలు చేసే ఆడవారు

దేనికి సంకేతం 

పట్టణ ఆరోగ్యానికా, వారి కడు పేదరికానికా?

52. కొత్త నగర రోడ్లు కొండచిలువల్లా

        శేషనాగుల్లా కనిపిస్తున్నాయి

        పాతనగర రోడ్లే వానపాములైపోయాయి.

53. మూసీనది నగర మురికిని 

        రోజూ తోసుకేల్తూనే ఉంది

        వచ్చేవారు మళ్ళీ తీసుకొస్తున్నారు.

54. చాయి బండ్లు, కేఫ్ లు, పాన్ డబ్బాలు

        రూపం మార్చుకున్నాయి

        కార్పోరేట్ హంగులద్దుకున్నాయి

55. ORR దాటి RRR దాకా 

        నగరం మాత్రమే విస్తరిస్తుంది

        నగరవాసుల మనస్తత్వాలు కాదు.

56. నగర సంస్కృతి

        ఒక సం”స్మృతి”గా మిగిలిపోయింది.

57. మారిన నగరానికి

        రాత్రేదో, పగలేదో తెలియడం లేదు 

        విశ్వనగరం కదా!

58. ముందుచూపు లేనితనం

        పాతనగరంలో మెట్రో విస్తరణకు అడ్డం 

        ఇప్పటికైనా, కళ్ళు తెరిస్తేనే అభివృద్ధి ఫలం.

59. నగరం సంబరపడింది

        ORR ఒడ్డానంతో

        కానీ, నాయకులు RRR కూడా

        తొడగాలని ఆశపడుతున్నారు.

60. నగర మెయిన్ రోడ్లు 

        ఊడ్చే కార్మికులకు

        ఎప్పుడూ నైట్ షిఫ్టే.

కామెంట్‌లు లేవు: