22, మే 2024, బుధవారం

మహాభాగవతం

 


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఆరవ అధ్యాయము*


*శ్రీకృష్ణుడు గోపకాంతలకడకు ఉద్దవుని పంపుట*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*46.17 (పదిహేడవ శ్లోకము)*


*దిష్ట్యా కంసో హతః పాపః సానుగః స్వేన పాప్మనా|*


*సాధూనాం ధర్మశీలానాం యదూనాం ద్వేష్టి యః సదా॥10065॥*


కంసుడు సాధువులను, ధర్మాత్ములైన యదువంశమువారిని సర్వదా ద్వేషించుచుండెను. అట్టి పాపాత్ముడు తాను చేసికొనిన దుష్కర్మల ఫలితముగా, తన అనుచరులతో గూడి హతుడయ్యెను. ఇది మన అందరి అదృష్టము.


*46.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*అపి స్మరతి నః కృష్ణో మాతరం సుహృదః సఖీన్|*


*గోపాన్ వ్రజం చాత్మనాథం గావో వృందావనం గిరిమ్॥10066॥*


*46.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*అప్యాయాస్యతి గోవిందః స్వజనాన్ సకృదీక్షితుమ్|*


*తర్హి ద్రక్ష్యామ తద్వక్త్రం సునసం సుస్మితేక్షణమ్॥10067॥*


శ్రీకృష్ణుడు మమ్ములను అందఱిని ఎప్పుడైనను జ్ఞాపకము చేసికొనుచున్నాడా? తల్లి యశోదను, నన్ను, సుహృదులను, ప్రాణమిత్రులైన గోపాలురను, గోవులను, గోవర్ధనగిరిని, తననే దైవముగా నమ్ముకొనిన వ్రజభూమిని, బృందావనమును ఎన్నడైనను స్మరించుచున్నాడా? ఆ గోవిందుడు తనకు ఆత్మీయులమైన  మమ్ములను అందఱిని చూచుటకు ఒక్కసారియైనను అచటికి వచ్చునా? ఆయనను చూచెడి అదృష్టము మాకు ఎప్పుడు కలుగును? ఒప్పిదమైన నాసికతో, మధురములైన చిఱునవ్వులతో, ప్రేమతో నిండిన చూపులతో అలరారుచుండెడి ఆ చిన్నారిముఖమును చూచి ఆనందించెడి భాగ్యము మాకు అబ్బునా?


*46.20 (ఇరువదియవ శ్లోకము)*


*దావాగ్నేర్వాతవర్షాచ్చ వృషసర్పాచ్చ రక్షితాః|*


*దురత్యయేభ్యో మృత్యుభ్యః కృష్ణేన సుమహాత్మనా॥10068॥*


మహాత్ముడైన శ్రీకృష్ణుడు మమ్ములను దావాగ్ని గండమునుండి రక్షించినాడు, పెనుగాలులతో గూడిన వర్షప్రమాదమునుండి కాపాడినాడు. వృషభాసురుని, అఘాసురుని (కొండచిలువను) వధించి మమ్ము ఆదుకొనినాడు. అంతేగాక, మృత్యురూపములైన పెక్కు విపత్తులనుండి వ్రజవాసులను అందఱిని గట్టెక్కించినాడు. ఇంతయేల? ఆపన్నులకు ఆర్తిహరుడైన ఆ సర్వశక్తిమంతుడు మాకు చేయని సహాయమేలేదు.


*46.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*స్మరతాం కృష్ణవీర్యాణి లీలాపాంగనిరీక్షితమ్|*


*హసితం భాషితం చాంగ సర్వా నః శిథిలాః క్రియాః॥10069॥*


ఆ ప్రభువుయొక్క అద్భుత కృత్యములను, విలాసశోభితములైన క్రీగంటి చూపులను, మనోహరమైన చిఱునవ్వులను, మధురభాషణములను మేము అందరము నిరంతరము స్మరించుచునే యుందుము. ఆ తన్మయత్వములో మునిగియున్నప్ఫుడు మాకు మా గృహకృత్యములు ఎవ్వియును పట్టకుండెడివి.


*46.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*సరిచ్ఛైలవనోద్దేశాన్ ముకుందపదభూషితాన్|*


*ఆక్రీడానీక్షమాణానాం మనో యాతి తదాత్మతామ్॥10070॥*


మా చిన్నికృష్ణుడు విహరించిన నదీతీరములను, పర్వతప్రాంతములను, వనభూములను, క్రీడా ప్రదేశములను, అంతేగాక, ఆయన పాదపద్మముల యొక్క చిహ్నములతో విరాజిల్లుచుండెడి ఏ ప్రదేశమునైనను గాంచినప్పుడు మా మనస్సులన్నియును ఆయనలో తాదాత్మ్యము చెందుచుండును.


*46.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*మన్యే కృష్ణం చ రామం చ ప్రాప్తావిహ సురోత్తమౌ|*


*సురాణాం మహదర్థాయ గర్గస్య వచనం యథా॥10071॥*


'బలరామకృష్ణులు సకలదేవతల పరమప్రయోజనార్థము ఈ లోకమున అవతరించిన దివ్యపురుషులు' అని గర్గమహర్షి పలికియుండెను.  ఆ మహాముని వచనములు ముమ్మాటికిని నిజమేయని నేను తలంతును.


*46.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*కంసం నాగాయుతప్రాణం మల్లౌ గజపతిం తథా|*


*అవధిష్టాం లీలయైవ పశూనివ మృగాధిపః॥10072॥*


వేయి ఏనుగుల బలముగల కంసుని, ద్వంద్వయుద్ధమున ఆఱితేఱిన చాణూరముష్టికాది మల్లురను, *కువలయాపీడనము* అను మదపుటేనుగును, సింహము వనమృగములనువలె ఆ సోదరులు అవలీలగా వధించిరి.


*46.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*తాలత్రయం మహాసారం ధనుర్యష్టిమివేభరాట్|*


*బభంజైకేన హస్తేన సప్తాహమదధాద్గిరిమ్॥10073॥*


*46.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*ప్రలంబో ధేనుకోఽరిష్టస్తృణావర్తో బకాదయః|*


*దైత్యాః సురాసురజితో హతా యేనేహ లీలయా॥10074॥*



*సాక్షాత్తు శ్రీకృష్ణునకు అనుచరుడు, ఆయనకుమిగుల ప్రీతిపాత్రుడైన ఉద్ధవుడు, శ్రీకృష్ణుని తరపున నందుని  ఇంటికి వెళ్ళగా, నందుడు ఆదరముగా ఇంకను ఇట్లు పలుకుచెండెను:-*


"కృవ్ణప్రభువు  గోవర్ధనగిరిని ఒక చేతితో ఎత్తిపట్టుకొని, ఏడుదినములపాటు దానిని సునాయాసముగా ధరించెను. మూడు తాళవృక్షముల ప్రమాణముగలిగిణ, ఇనుమువలె దృఢమైన ధనుస్సును, గజేంద్రుడు కర్రనువలె ఆ స్వామి విరచివేసెను. ప్రలంబాసురుడు, ధేనుకాసురుడు, అరిష్టాసురుడు, తృణావర్తుడు, బకాసురుడు మొదలగుదైత్యులు పెక్కుమంది దేవదానవులను జయించినవారు. అట్టి మహాయోధులను సైతము శ్రీకృష్ణుడు అనాయాసముగా హతమార్చెను".


*శ్రీశుక ఉవాచ*


*46.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*ఇతి సంస్మృత్య సంస్మృత్య నందః కృష్ణానురక్తధీః|*


*అత్యుత్కంఠోఽభవత్తూష్ణీం ప్రేమప్రసరవిహ్వలః॥10075॥*


*శ్రీశుకుడు పలికెను* పరీక్షిన్మహారాజా! నందుని హృదయమంతయును శ్రీకృష్ణునిపైగల అనురాగముతో నిండియుండెను. ఇప్పుడు అతడు ఆ ప్రభువుయొక్క లీలలలో ఒక్కొక్కదానిని స్మరించుచు ప్రేమప్రసారములో విహ్వలుడాయెను. నేత్రములు అశ్రుపూరితములయ్యెను. కంఠము మూగవోయెను.


*46.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*యశోదా వర్ణ్యమానాని పుత్రస్య చరితాని చ|*


*శృణ్వంత్యశ్రూణ్యవాస్రాక్షీత్స్నేహస్నుతపయోధరా॥10076॥*


*46.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*తయోరిత్థం భగవతి కృష్ణే నందయశోదయోః|*


*వీక్ష్యానురాగం పరమం నందమాహోద్ధవో ముదా॥10077॥*


తన కన్నయ్య గుణములను, అద్భుతలీలలను తన భర్త (నందుడు) మెచ్చుకొనుచుండగా వినుచు యశోదాదేవి మాతృ ప్రేమతో పరవశించిపోయెను. ఆ ఆనందములో ఆ తల్లికి స్తన్యము పొంగాఱెను. తన తనయునితో పెనవైచుకొనిన ఆత్మీయత కారణమున కనులనుండి అశ్రువులు స్రవించుచుండగా ఆమె మిగుల చలించిపోయెను. ఇట్లు శ్రీకృష్ణుని (కన్నయ్యను) తనివిదీర చూచుకొనెడి భాగ్యము కఱవైనందున విలవిలలాడుచున్న యశోదానందులయొక్క పుత్రప్రేమకు ముగ్ధుడై ఉద్ధవుడు నందునితో ఇట్లనెను.


*ఉద్ధవ ఉవాచ*


*46.30 (ముప్పదియవ శ్లోకము)*


*యువాం శ్లాఘ్యతమౌ నూనం దేహినామిహ మానద|*


*నారాయణేఽఖిలగురౌ యత్కృతా మతిరీదృశీ॥10078॥*


*ఉద్ధవుడు ఇట్లనెను* "మహాత్మా! ఈ లోకమునందలి ప్రాణులకెల్ల మీరిద్దరు నిశ్చయముగా ఎంతయో కొనియాడదగినవారు. ఏలనన, సకల ప్రాణులకు తండ్రియగు నారాయణునిపై మీరు అత్యధికమైన వాత్సల్య పూరితమగు ప్రేమను, పుత్రభావమును కలిగియున్నారు.


*46.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*ఏతౌ హి విశ్వస్య చ బీజయోనీ  రామో ముకుందః పురుష ప్రధానమ్|*


*అన్వీయ భూతేషు విలక్షణస్య  జ్ఞానస్య చేశాత ఇమౌ పురాణౌ॥10079॥*


ఈ బలరామకృష్ణులు పురాణపురుషులు. వీరు జగత్తునకు నిమిత్తకారణమేగాక, ఉపాదానకారణము కూడ. వీరు సమస్త శరీరములయందు ప్రవేశించి, వాటికి ప్రాణదానము చేయుటయేగాక అత్యంత విలక్షణమైన జ్ఞానమును గూడ ప్రసాదింతురు. అంతేగాక, వారిని (శరీరధారులను) నియంత్రింతురు.


*46.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*యస్మిన్ జనః ప్రాణవియోగకాలే క్షణం సమావేశ్య మనోవిశుద్ధమ్|*


*నిర్హృత్య కర్మాశయమాశు యాతి పరాం గతిం బ్రహ్మమయోఽర్కవర్ణః॥10080॥*


మానవుడు ప్రాణావసానదశయందు  క్షణకాలము పాటైనను లౌకిక విషయములయందు ఆసక్తిని వీడిన పరిశుద్ధమనస్సును శ్రీమన్నారాయణునిపై నిల్పినచో అతని కర్మవాసనలు అన్నియును దగ్ధమైపోవును. అతడు బ్రహ్మజ్ఞానమును పొంది, తేజోమయ (అపాకృత) రూపముతో పరమగతిని (మోక్షమును) పొందును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

కామెంట్‌లు లేవు: