22, మే 2024, బుధవారం

శ్రీలలితా సహస్రనామ భాష్యము*



*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*378వ నామ మంత్రము* 


*ఓం జాలంధర స్థితాయై నమః*


అధిభూతము *(పరమాత్మ-పరబ్రహ్మము)*

అయిన జాలంధరపీఠమునందు విలసిల్లు జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *జాలంధరస్థితా* యను ఆరక్షరముల (షడక్షరీ) నామ మంత్రమును *ఓం జాలంధరస్థితాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఆరాధించు సాధకులకు ఆ పరమేశ్వరి కరుణచే సకలార్థసిద్ధి కలుగును.


*జాలంధర పీఠము*


తులసీకృష్ణ జీవనీ!


ఈ తులసీ దేవి నామములు స్మరిస్తేనే చాలు జీవన్ముక్తి కలుగుతుందని, అశ్వమేధ యజ్ఞ ఫలం లభిస్తుందని దేవిభాగవతం చెపుతోంది.   తులసి మొక్క క్షీర సాగరమధనంలో కామధేనువు, కల్పతరువులు, అమృతంతో బాటు ఉద్భవించిందని పద్మ పురాణంలో ఉంది. ఇంత విశిష్టమైన తులసి ఎవరు? ఒక మొక్కకి ప్రపంచమంతటా పవిత్రంగా భావించే శక్తి ఎలా వచ్చింది అని ఆశ్చర్యం వేస్తుంది. ఇంటింటా ఉంటూ, అనుదినం అర్చించబడుతూ, మూలికగా, మౌలిక దేవతగా అపురూప దివ్యశక్తిగా కీర్తించబడే తులసీ దేవి అసలు ఎవరు? 


తులసిని స్త్రీ పురుషులు,బాలురు, వృద్ధులు ఎవరైనా పూజిస్తారు. దివ్య మహద్భుత రామ గాథను *రామాయణం* గా అందించిన మహర్షుల్లో *తులసీ దాసు* మహిమాన్వితులు. దీన్ని బట్టి తులసీ అర్చన అనేక కాలాల్లోంచి వస్తోందనీ తెలుస్తోంది. తులసి అసలు *జలంధరుడు* అనే రాక్షసుని భార్య అనియు, ఆమె పాతివ్రత్య మహిమతోనూ, తన బలంతోనూ జలంధరుడు శక్తివంతుడై అందరిని క్షోభింపచేశేవాడు.


ఇప్పటికి పంజాబ్ లో *జలంధర్* ఈ రాక్షసుని పేరు మీదే వచ్చింది. దీన్నే *జాలంధర పీఠం* అని అష్టాదశ శక్తిపీఠముల్లో ఒకటిగా కొలుస్తారు  ఈ పీఠంలో నివసిస్తుంది గనుక అమ్మవారు *జాలంధరస్థితా* యని అనబడినది.


కాత్యాయనీ చోఢ్యాణె కామాఖ్యా కామరూపకే పూర్ణేశ్వరీ పూర్ణగిరౌ చండి జలంధరే స్మృతా (కాళీ పురాణం)


*జలంధరుడు, మరియు అతని భార్య బృంద తులసిమొక్కగా జన్మించిన వృత్తాంతం:*


శివపురాణంలో జలంధరుని పుట్టుక గురించిన కథను గురించి తెలుసుకుంటే వనమాలి కథ గురించి తెలుస్తుంది. శివుని కోపాగ్ని నుండి పుట్టినవాడు జలంధరుడు. ఇంద్రుణ్ణి శిక్షించడానికి దావాగ్నిని శివుడు గంగా సాగరంలో దాచిపెట్టాడు. ఆ అగ్ని బాలుని రూపం ధరించగా సముద్రుడు ఆ బాలుడిని బ్రహ్మకు అప్పగించాడు. ఆ బాలుడికి పేరు పెట్టడానికి బ్రహ్మ దగ్గరకు తీసుకోగానే కంటి నుండి నీరు వచ్చిందట. అప్పుడు బ్రహ్మ స్వయంగా ఆ బాలుడికి జలంధరుడు అని పేరుపెట్టాడు. 

 

శివుడు తప్ప మరెవర్వరు ఇతణ్ణి చంపలేరని వరమిచ్చాడు. శుక్రుని శిక్షణలో జలంధరుడు రాక్షస రాజు అయ్యాడు. క్షీర సాగర మథనంలో దేవతలు రాక్షసులకు చేసిన అన్యాయానికి జలంధరుడు చాలా బాధపడి దీక్షగా బ్రహ్మ కోసం తపస్సు చేసి మరణం లేకుండా వరమిమ్మన్నాడు. అప్పుడు బ్రహ్మ అతనితో నీ భార్య పాతివ్రత్యం తొలిగిపోనంతవరకు నీకు మరణంలేదని వరమిచ్చాడు. మరణ భీతి లేని జలంధరుడు దేవతలపై గెలుపొంది స్వర్గం కైవసం చేసుకున్నాడు. 

 

దీంతో దేవతలంతా శ్రీమహావిష్ణువుని శరణు వేడుకున్నారు. ఐతే సముద్రంలో తనతో పుట్టినవాడు కనుక జలంధరుని చంపవద్దని మహాలక్ష్మీ బ్రతిమాలగా మహావిష్టువు అతడిని క్షమించాడు. పైగా బావమరిది కోరిక కాదనలేక సతీసమేతంగా వెళ్ళి అతడి ఇంట్లోనే కాపురం పెట్టాడు. అలాంటి సమయంలో నారద మహర్షి జలంధరుడి ఇంటికి వచ్చి అతనితో నీ సోదరియైన లక్ష్మీ ఇంటిలోనే వుంది. నీకు తగిన ఇల్లాలు పార్వతీ దేవియే. లక్ష్మీకి తోడు పార్వతి కూడా నీ ఇంట వుంటే నీకు తిరిగేలేదు అని పురికొల్పాడు. 


నిజమేననుకొని జలంధరుడు కైలాసానికి బయలుదేరాడు. వస్తున్న ముప్పును ముందుగానే పసిగట్టిన పార్వతి దేవి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది. పార్వతి కోరిక మేరకు విష్ణువు మాయ రూపం ధరించి బృంద పాతివ్రత్యాన్ని చెడగొట్టాడు. అనంతరం శివుడు అతడిని వధించాడు. ఇది తెలుసుకున్న బృంద కూడా మరణిస్తుంది. వారి మరణానికి పశ్చాత్తాపంతో వారిద్దరికి చెరో వరం ఇచ్చాడు. బృందను తులసీ చెట్టుగా జలంధరుడుని అత్తిపత్తిగా భూలోకంలో ఉండమని దీవించాడు. బృంద శాపాన్ని ఔదలదాల్చి ప్రతి ఇంటి తులసి కోటలో రాయిగా విష్ణువు స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు.


జాలంధర పీఠం మనశరీరంలో ఆజ్ఞాచక్రమందు గలదు. అది ఎలాగంటే,  సాధకుడు మూలాధారంలో ఉన్న కుండలినీ శక్తిని మేల్కొలిపి, సుషుమ్నానాడిద్వారా ఊర్ధ్వముఖంగా పయనింపజేయగా, కుండలినీ శక్తి బ్రహ్మ, విష్ణు, రుద్రగ్రంథులను భేదిస్తూ, షట్చక్రమలకావల సహస్రారం చేరుక్రమంలో ఆజ్ఞాచక్రంలో కూడా ఒకింత సమయం నివసిస్తుంది. షట్చక్రాలలో ఒకటి అయిన ఆజ్ఞాచక్రమే *జాలంధరపీఠము* మరియు అందు కుండలినీ శక్తిస్వరూపిణి అయిన పరమేశ్వరి *జయ* అను పేరుతో విలసిల్లుతుంది గనుకనే ఆ తల్లి *జాలంధరస్థితా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు  *ఓం జాలంధరస్థితాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమను ప్రసాదించినవారు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు అయిన కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను.  

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: