22, మే 2024, బుధవారం

మహావైశాఖి

 *మహావైశాఖి*


 విశాఖనక్షత్రం ఉండటంవల్ల వైశాఖమాసం అనే పేరు వచ్చింది. వైశాఖమాసంలో ఆవునెయ్యి దానం చేస్తే అశ్వమేధయాగం చేసిన ఫలము లభిస్తుంది.


వైశాఖ మాసంలో వచ్చే పూర్ణిమను మహావైశాఖి అని అంటారు. విశాఖనక్షత్రంలో కలిసి వచ్చిన పూర్ణిను కనుక వైశాఖమాస పూర్ణిమ అని అంటారు. మనకున్న ఇరవైఏడు నక్షత్రాలలో విశాఖ పదహారవ నక్షత్రం. విశాఖ అనే పదానికి చాలా అర్థాలున్నాయి. కాంతిని వ్యాపింపచేసేది అనే అర్థం వాటిలో ఒకటి. వైశాఖ పూర్ణిమనాడు ప్రధానంగా సముద్రస్నానం చేయాలన్నది సంప్రదాయం.


మహావైశాఖి ఓ రకంగా చెప్పాలంటే కొన్ని వ్రతాల సమాహారంగా కూడా కనిపిస్తుంది. ఈ రోజున అనేక పూజలు జరుపుతుంటారు. వీలైనంతలో ఎవరికి వారు శక్తికొద్దీ దానాలివ్వాలని, ఈనాడిచ్చిన దానాలు మామూలు రోజుల్లో చేసే దానాలకన్నా అధిక పుణ్యాన్నిస్తాయని పురాణాలు, వ్రతగ్రంథాలు పేర్కొంటున్నాయి.


వైశాఖశుద్ధ పూర్ణిమ ఇంత పవిత్రతను సంతరించుకోవటానికి కూడా చాలా కారణాలున్నాయి. భగవంతుడు కొన్ని అవతారాలు వైశాఖ పూర్ణిమనాడే జరిగి ఉండటం ఆ కారణాలలో ఓ కారణం. స్వామి ధరించిన అవతారాలలో శరభావతారం, కూర్మావతారం లాంటి అవతారాలు వైశాఖ పూర్ణిమనాడే జరిగాయి.


భగవంతుడి అవతారాలలో శరభజయంతిని పరిశీలిస్తే గొప్ప భక్తిభావంతో మనసు ఉప్పొంగుతుంది. హిరణ్యకశిపుడి సంహారం తర్వాత నరసింహస్వామిలోని ఉగ్రం తగ్గలేదు. ఆ రౌద్ర భీకరమూర్తిని చూసి అంతా తల్లడిల్లిపోసాగారు. ఆ విషమస్థితి నుంచి ఎలా బయటపడాలా అని దేవతలంతా ఆలోచించి శివుడి గురించి ప్రార్థించారు. శివుడు తన అపార కరుణారస దృక్కులను దేవతలపై ప్రసరిస్తూ లోకాల క్షేమం కోరి తాను శరభావతారాన్ని ధరిస్తున్నట్లు చెప్పాడు. అంతేకాక వెంటనే మహాశివుడు శరభరూపాన్ని ధరించి బయలుదేరాడు. మహాశివుడు అలా శరభరూపుడైంది వైశాఖ పూర్ణిమనాడే. ఆ శరఖాన్ని చూసిన నరసింహుడు తన రౌద్రాన్ని ఉపసంహరించుకోవటంతో ఆనాటి పరిస్థితి శాంతిమయమైంది. ఈ నేపథ్యాన్ని తలచుకొంటూ శరభ జయంతిని జరుపుకోవటం ఓ ఆచారంగా వస్తోంది.


ఇక ఆ తర్వాత శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాలలో రెండవదైన కూర్మావతారం కూడా వైశాఖ పూర్ణిమనాడే జరిగింది. విష్ణువంతటివాడు తాబేలుగా మారి లోకకల్యాణానికి సహకరించిన మహత్తర పుణ్యదినం వైశాఖ పూర్ణిమ, అమృతం కోసం ఆనాడు క్షీరసాగరమధనాన్ని జరపాల్సి వచ్చింది.


ఆ పాలసముద్రాన్ని చిలకటానికి కవ్వంగా మందర పర్వతాన్ని, కవ్వపు తాడుగా వాసుకి అనే నాగరాజును సిద్ధంచేసి దేవతలు, రాక్షసులు సముద్రమథనాన్ని ప్రారంభించారు. అయితే కవ్వంగా ఉన్న మందరపర్వతం క్షీరసాగరంలో కింద ఏ ఆధారం లేని కారణంగా పట్టుతప్పి జారిపోసాగింది. దాంతో అంతా కలిసి శ్రీమహావిష్ణువును ప్రార్థించారు. విష్ణువు అప్పుడు ఓ పెద్ద తాబేలు రూపాన్ని ధరించి సముద్రపుటడుగుకు వెళ్లి తన వీపు మీద మందర పర్వతాన్ని మోపుకొని అమృత ఆవిర్భావానికి కారకుడయ్యాడు. లోకకల్యాణం కోసం విష్ణువు అలా మహాకూర్మంగా అవతరించింది వైశాఖశుద్ధ పూర్ణిమనాడే. అందుకే కూర్మజయంతి ఈనాడు జరుపుతుంటారు.


ఇలాంటి ఎన్నెన్నో మహత్తర పుణ్యకర అంశాలనేపథ్యంలో మహావైశాఖి కనిపిస్తుంది. ఈనాడు సముద్రస్నానంతో పాటు పూజలు, వ్రతాలు, దానాలు బాగా జరుగుతుంటాయి.


ఇలా జరగటం వెనుక కేవలం భక్తి, దేవుడి అనుగ్రహం అనేవి మాత్రమే కాక సామాజిక అంశాలు కూడా దాగి ఉన్నాయి. మహావైశాఖి వచ్చేది మండుటెండల కాలంలో, కేవలం దేవుడికి ఒక నమస్కారం పెట్టి కూర్చోక, ప్రత్యేకించి కొన్ని దానాలను చెయ్యాలని చెబుతుంటారు. వాటిలో విసనకర్రలు, గొడుగులు, పాదరక్షలు లాంటి వాటితోపాటు దద్ధోజనం (పెరుగన్నం), ఉదకకుంభాలు (మంచినీటితో నింపిన కుండలు) లాంటివి దానం చేయాలి. ఇవన్నీ కాలానుగుణంగా శాంతిని, హాయిని కలిగించే వస్తువులు. ఎండాకాలంలో వీటి అవసరం ఏమేరకు ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ వస్తువులను అవసరమైన వారికి దానం చేస్తే ఎంతమేలో ఎవరైనా ఊహించవచ్చు. కనుకనే వెలుగు వెన్నెలల మహావైశాఖి తరతరాలుగా తన పవిత్రతను, ప్రత్యేకతల కాంతులను విరజిమ్ముతూ వ్రతసమాహార పర్వదినంగా ఈనాటికీ కనిపిస్తోంది.

కామెంట్‌లు లేవు: