*🌹. గీతోపనిషత్తు -134 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚*
శ్లోకము 19
*🍀. 17. సమభావము - సమభావము, స్థిరత్వము ఎవరి మనసునకు కలదో వారి కిచ్చటనే సర్గము జయింపబడి, దోషరహితము సమము అయిన బ్రహ్మమునందు స్థితిగొన్న వారగుదురు. సర్గమును మనసుచే జయించుటవలన బ్రహ్మమునందు స్థిరపడుట తెలుపబడినది. సర్గమనగా సృష్టిసర్గము. అది భూర్భువసువరాది ఏడులోకములుగ ఏర్పడి యున్నది. ఇవన్నియు చైతన్యస్థితులు. భౌతిక స్థితి, ప్రాణమయ స్థితి, మనోమయ స్థితి, బుద్ధి స్థితి, ఆకాశ స్థితి (మహత్), తపో స్థితి, సత్య స్థితి యిట్లేడు లోకములు వర్ణింపబడినవి. ఇందు ప్రాథమిక స్థితులలో పదార్థ మెక్కువగను, ప్రజ్ఞ తక్కువగ నుండును. అట్లే ఉన్నత స్థితులలో ప్రజ్ఞ ఎక్కువగను, పదార్థము తక్కువగ నుండును. ప్రజ్ఞ ఎక్కువగ నున్న లోకములను వెలుగు లోకము లందురు. మానవుడు తన యందలి చైతన్యము యొక్క విలాసము వలన వెలుగు లోకము లందు, పదార్థమయ లోకములందు చరించుచు నుండును. హెచ్చు తగ్గులన్నియు చైతన్యము యొక్క క్రీడయని భావించి, దానికి మూలమైన సత్యమున ప్రవేశించుటకు మనసునకు సామ్యము, స్థిరము అవసరము. 🍀*
ఇహైవ ఆర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః |
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మా ధృహ్మణి తే స్థితా|| 19
సమభావము, స్థిరత్వము ఎవరి మనసునకు కలదో వారి కిచ్చటనే సర్గము జయింపబడి, దోషరహితము సమము అయిన బ్రహ్మమునందు స్థితిగొన్న వారగుదురు. సర్గమును మనసుచే జయించుటవలన బ్రహ్మమునందు స్థిరపడుట తెలుపబడినది. సర్గమనగా సృష్టిసర్గము. అది భూర్భువసువరాది ఏడులోకములుగ ఏర్పడి యున్నది.
ఇవన్నియు చైతన్యస్థితులు. భౌతిక స్థితి, ప్రాణమయ స్థితి, మనోమయ స్థితి, బుద్ధి స్థితి, ఆకాశ స్థితి (మహత్), తపో స్థితి, సత్య స్థితి యిట్లేడు లోకములు వర్ణింపబడినవి. ఇందు ప్రాథమిక స్థితులలో పదార్థ మెక్కువగను, ప్రజ్ఞ తక్కువగ నుండును. అట్లే ఉన్నత స్థితులలో ప్రజ్ఞ ఎక్కువగను, పదార్థము తక్కువగ నుండును. ప్రజ్ఞ ఎక్కువగ నున్న లోకములను వెలుగు లోకము లందురు.
మానవుడు తన యందలి చైతన్యము యొక్క విలాసము వలన వెలుగు లోకము లందు, పదార్థమయ లోకములందు చరించుచు నుండును. హెచ్చు తగ్గులన్నియు చైతన్యము యొక్క క్రీడయని భావించి, దానికి మూలమైన సత్యమున ప్రవేశించుటకు మనసునకు సామ్యము, స్థిరము అవసరము. వెండితెరపై రంగులు, శబ్దములతో కూడిన సినిమా కథ నడచుచుండగ రసవత్తరముగ నుండును.
కాని దాని కాధారమైన తెరకు సినిమా సన్నివేశము లన్నియు పట్టవు. తెరమీద కథను గమనించువారు కథలో లీనమగుదురు. తెరను కూడ గమనించు వారు సమస్తమగు సన్నివేశములు వచ్చిపోవునవిగ గమనింతురు. జీవితమందలి సంఘటనలు అనేకానేకములు వచ్చిపోవుచున్నను, తాను తెరవలె యున్నాడు అని తెలిసినవాడు, వచ్చిపోవు సన్నివేశములకు ప్రభావితుడు కాడు.
అట్లు ప్రకృతి విలాసములను గమనించుచు వాని కాధారమైన బ్రహ్మమునందు స్థితి గొన్నచో ఈ శరీరమునందే బ్రహ్మత్వము పొందవచ్చునని భగవంతుడు తెలుపుచున్నాడు.
మనసున బ్రహ్మమును గూర్చిన భావనము స్థిరపడుచున్న కొలది మనసునకు స్థిరత్వము, సామ్యము కుదురును. అట్టి మనసుతో సర్గమును (చైతన్య విలాసమును) జయించ వచ్చును. అపుడిచ్చటే బ్రహ్మమునందు స్థితిగొని యుండ వచ్చును. అదియే సామ్యము. సర్గమున కతీతమగు స్థితి. సర్గము ప్రకృతి యధీనము.
సామ్యమున ప్రకృతికూడ యధీనమై యుండును. అదియే బ్రహ్మము నందు స్థితిగొనుట యందురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి