28, జనవరి 2021, గురువారం

అపరోక్షానుభూతి

 *42- శ్రీ ఆదిశంకరాచార్య విరచితము  అపరోక్షానుభూతి*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*శ్లో|| స్నాతం తీర్థే జహ్నుజాదౌతతఃకిం| దానందత్తం ద్వ్యష్ట సంఖ్యం తతఃకిం| జప్తామంత్రాః కోటిశోవాతతఃకిం| యేనస్వాత్మానైవ సాక్షాత్కృతో7భూత్‌||*


*అపరోక్షనుభూతి మహిమ ఈ శ్లోకమును చదివి విచారించండి, సాక్షాత్తు విష్ణుపాదము నుండి పుట్టి జహ్ను మహఋషిచే సంపాదించబడి ఆకాశమండలములో నుండి బయలుదేరి సమస్త లోకముల యందు ప్రవహించుచు ఆయా లోకముల యందు ఆయా వర్ణములతో గోచరించుచు ఆయా లోకములయందున్న వారు ఆ గంగానదిని చూచినను, స్మరించినను, స్నానం చేసినను,పానము చేసినను అందరినీ పవిత్రము చేయుచూ భగీరథుడను మహానుభావునిచేత భూలోకమునకు తీసుకురాబడిన గంగానదియొక్క మహాత్మ్యము కాశీఖండం, దేవీభాగవతం యొదలగు గ్రంథముల యందు చాలా గొప్పగా చెప్పబడి యున్నది.*



*ఆ గంగానది హిమాలయ పర్వతములలోనుండి భూమండలమునకు దిగి గంగోత్తరి మొదలగు క్షేత్రములలోనుండి ప్రవహించుచు కాశీ మహాపట్టణము వద్దకు వచ్చి అటనుండి ప్రవహించుచూ వెళ్ళి సముద్రములో కలసినది.*



*ఆ గంగానది ప్రవహించిన ప్రదేశములన్నియు మహాక్షేత్రములైనవని స్పష్టమే కదా.*



*శ్రీ లలితాత్రిపుర సుoదరియే దేవతలు ప్రార్థించగా గంగానదిగా అవతరించి ప్రవహించు చున్నదని కూడా కథలున్నవి. అట్టి గంగానదిని స్మరించినను, దర్శించినను స్నానపానములు చేసినను సర్వపాప రహితులై ఉత్తమ లోకములను పొందుదురని కూడా మహాత్మ్యము కలదు. ఇట్టి అతీతమగు మహాత్మ్యముగల గంగానది యందుగాని మూడుకోట్ల యేబది లక్షల తీర్థములను దర్శించి సేవించి ఆ తీర్థములయందుగాని స్నానంచేసినను ఆత్మసాక్షాత్కారములేనిది యేమి ప్రయోజనమని శంకరాచార్యులవారు "స్నాతంతీర్థే జహ్నుజాదౌతతః కిం" అని చెప్పిరి.*



*"భగవద్గీతా కించిదధీతా గంగాజల లవకణికాపీతా, సకృదపియేనమురారి సమర్చాకురుతేతస్య యమో7పినచర్చాం"*


*ఈశ్లోకమును భజగోవింద శ్లోకములలో శ్రీ శంకరాచార్యులవారు చెప్పిరి. భగవద్గీతను కొంచెం చదివిన వారిని గంగోదకమును కొద్దిగానైనా త్రాగిన వారిని, ఒకప్పుడైనను శ్రీమహావిష్ణువును పూజించిన వారిని, యమధర్మరాజు కూడా విచారించడని యర్థము. యమధర్మరాజు విచారించడంటే యమలోకమునకు పోరని పుణ్య లోకములను పొందుదురని చెప్పవచ్చును. గాని మోక్షము లభించునని చెప్పలేదు. గనుక అపరోక్షానుభూతియే మోక్షప్రదమని గమనించవలయును.*



*"దానం దత్తం ద్వ్యష్టసంఖ్యం తతఃకిం " కొందరు ధనవంతులు షోడశమహాదానములను శాస్త్రము చెప్పినట్లుగా చాలా గొప్పగా చేయుదురు. దాని వలననే ముక్తి లభించునని భ్రమపడకూడదు. అందుచేతనే యేమి దానివలననని చెప్పిరి. '' జప్తామంత్రాః కోటిశోవాతతఃకిం" సప్తకోటి (యోడుకోట్లు) మహామంత్రములను జపించినను ఆ మంత్రముల అర్థమును విచారించినను, ఆ మంత్రముల సిద్ధిని పొందినను యేమి ప్రయోజనం.*



*" యేనస్వత్మానైవ సాక్షాత్కృతో7భూత్‌" అని చెప్పిరి. అనగా ఎవరి చేత తన ఆత్మ సాక్షాత్కరింపబడదో అని యర్థము. అనగా యెవరు నేననే ఆత్మ యొక్క పరమార్థ స్వరూపమును సాక్షాత్కరించుకొనరో వారు పైచెప్పిన మహాపుణ్యము లెన్ని చేసినను ప్రయోజనం లేదు. మోక్షము కలుగదని యర్థము.*



*ఆత్మసాక్షాత్కరమన్నను, అపరోక్షానుభూతియన్నను, బ్రహ్మ సాక్షాత్కరమన్నను, ఒకటేగాని వేరే అర్థము కాదు.*



*అపరోక్షానుభూతి యెంతమహోన్నతమైనదో గ్రహించవలసిన విషయం.*


🕉🌞🌏🌙🌟🚩

కామెంట్‌లు లేవు: