*మన కోరికలు ఎలా ఉండాలి*?
హరిద్వార్లో కొండగుహలో ఉండే స్వామీజీ వద్దకు ఇద్దరు స్త్రీలు వచ్చారు
స్వామిజికి నమస్కరించి ఇలా ప్రశ్నించారు
"స్వామిజీ! మామనసులో ఉంది ఎప్పుడూ నెరవేరదు! ఎప్పుడూ అశాంతితోనే ఉంటాము!! మా మనసులోని కోరిక నెరవేరి శాంతి కలిగే ఉపాయం చెప్పండి స్వామీ!!" అంటూ అడిగారు
"ఏమిటమ్మా! మీ మనసులో ఉన్న కోరిక?"ప్రశ్నించాడు స్వామిజీ
"నాకు ఎవరితో మాటపడవద్దని ఉంటుంది స్వామి! నన్నెవరూ తిట్టవద్దు!! అని కోరుకుంటాను. కానీ, ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వాళ్ళలా విమర్శిస్తూ వుంటే నా మనసంతా అశాంతిగా ఉంటుంది." చెప్పింది ఒక స్త్రీ
"నాకు దుఃఖాలు రావద్దని కోరుకుంటాను. కానీ ఎప్పుడూ ఏదో ఒక దుఖం వస్తూనే ఉంటుంది.. లేదా.. ఎవరో ఒకరు మాటలంటూ ఏడిపిస్తూనే ఉంటారు".. చెప్పింది రెండవ ఆమె కూడా!!
వాళ్ళ సమస్యలు విన్న స్వామీజీ ఒక పదినిమిషాలు ధ్యానముద్రలోకి వెళ్లి తర్వాత ప్రశాంతంగా ఇలా చెప్పసాగాడు.
"చూడండీ! మనం ఏది మననం చేస్తుంటామో అదే మంత్రంగా మారి ఫలితం ఇస్తుంది.. అంటే మన భావాలే మంత్రాలౌతాయి!!"
మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే....
"కావాలా? వద్దా??...జరగాలా? వద్దా?? అన్న దానితో సంబంధం లేకుండా ఈ భావంలో ఉన్న విషయమే సంఘటనలుగా ముందరికి వస్తుంది."
"భావాన్ని బట్టే అలవాట్లు కూడా ఏర్పడుతుంటాయి"
"స్వామీజీ! భావాన్ని బట్టి అలవాట్లు అంటే?" ప్రశ్నించారు ఒకరు.
స్వామీజీ సమాధానమిస్తూ..
మనకోరికలు ఎప్పుడూ పాజిటివ్ గా ఉండాలి! నెగిటివ్ గా ఉండవద్దు!!
"శతమానం భవతి"..అంటూ వంద సంవత్సరాలు జీవించు!!..అంటూ దీవిస్తామే తప్ప.."నువ్వు నూరు సంవత్సరాల వరకు చచ్చిపోకు!!"..అంటూ దీవించము!!..అంటూ చెబుతూ
"అమ్మా! నువ్వు ఇతరుల్లో తప్పులు కనిపిస్తే వెంటనే చెప్పేస్తావా? "ప్రశ్నించాడు స్వామి ఒకరిని
"అవును స్వామీ! నేను తప్పును ఓర్వనూ!! ఏదున్నా ముక్కుసూటిగా చెప్పేస్తాను!" అంది ఆమె
"నీ కష్టాలు దుఃఖం ఇతరులతో పంచుకుంటూ ఉంటావా? నువ్వు!! "అంటూ రెండవ ఆమెను ప్రశ్నించాడు స్వామిజీ
"అవును స్వామీ! కష్టాలు దుఃఖం చెప్పుకుంటేనే కదా మనసంతా తేలికపడుతుంది సమాధానమిచ్చింది!" రెండో ఆమె
"అలవాట్లంటే ఇవేనమ్మా!
మన భావాలను బట్టే మన అలవాట్లు ఉంటాయి.
ఆ అలవాట్లను బట్టే సమాజానికి మనమిచ్చే దానాలుంటాయి!"
ఆ దానాలే తిరిగి మనకు ఎటువంటి ఫలితాలు రావాలో నిర్ణయిస్తాయి!
"మీరొకరికి జ్ఞానదానం చేశారు! అప్పుడు మీ జ్ఞానం పెరుగుతుందా?తగ్గుతుందా??" అడిగాడు స్వామిజీ
"పెరుగుతుంది స్వామి" చెప్పారిద్దరొకేసారి
"సరే! మరొకరికి ధైర్యం చెప్పారు! అప్పుడు ధైర్యం పెరుగుతుందా?తగ్గుతుందా??"
"పెరుగుతుంది స్వామి" చెప్పారు మళ్ళీ..
మీరు జ్ఞానాన్ని..ధైర్యాన్ని.. సంతోషాన్ని.. ఇలా ఏ భావాన్ని దానం చేస్తున్నారో ఆ భావం మీలో పెరిగినపుడు..
మీరు విమర్శలనూ..దుఃఖాన్ని దానం చేస్తూనే ఉండడం అలవాటుగా చేసుకున్నారు కాబట్టి, అవి కూడా పెరుగుతూ పోతాయి కదా!!
"స్వామిజీ ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? " అంటూ ప్రశ్నించారు
స్వామిజీ సమాధానమిస్తూ...
"అందుకే మనసులో ఎప్పుడూ నెగిటివ్ భావంతో కూడిన కోరికలు ఉంచుకోవద్దు!"
"నేను మాటలు పడవద్దు!
నన్నెవరూ తిట్టవద్దు!!
నాకు దుఃఖాలు రావద్దు!!!
నేను బిచ్చమెత్తుకోవద్దు!!!!"
......ఇలా!!
వద్దు!..కావాలా?..అనేది ముఖ్యం కాదు ..ఆ కోరికలో భావం ఎలా వ్యక్తమైందో అదే రకరకాల సంఘటనలుగా మారి మీ జీవితంలోకి వస్తుంది.. ఆ భావమే ఒక మంత్రంలా పనిచేస్తుంది!
కాబట్టి వాటినే ఇలా అనుకోవాలి!
నేను పొగడబడాలి!
నేను బాగా కీర్తించబడాలి!!
నేను ఆనందంగా ఉండాలి!!!
నేను ధనవంతురాలను కావాలి!!!!
...ఇలా పాజిటివ్ గా ఉండాలి!అప్పుడు మీ భావమే మంత్రమై వాస్తవంగా మారుతుంది.
మీ కోరికలు తీరాలంటే వాటినే పాజిటివ్ గా అనుకోండీ!
"అమ్మా! నీ అదే కోరికను "నన్ను అందరూ పొగడాలి!" గా మార్చుకుని దాన్నే మననం చెయ్యు!!" అంటూ మొదట ప్రశ్నించిన స్త్రీతో చెప్పి...
రెండవ ఆమె వైపు తిరిగి..
"నువ్వేమో 'నేనెప్పుడూ ఆనందంగా ఉండాలి' అనుకో! దాన్నే మననం చెయ్యు!" అంటూ చెప్పాడు. "సరే !స్వామి!! ఈ క్షణంనుండే మీరు చెప్పినట్లు ప్రయత్నం చేస్తాము!
ఇది తొందరగా నెరవేరేలా ఇంకేదైనా రెమిడి చెప్పండీ!" అంటూ అడిగారు.
"సరే అమ్మా ! అలవాట్లను బట్టే ఫలితాలు ఉంటాయన్నాను కదా!! ఇక నుంచి మీ అలవాట్లను పూర్తిగా మార్చుకోవాలి!...ఇంతకు ముందు మాదిరిగా నువ్వు ఇతరులను విమర్శించడం మానేసి రోజుకు కనీసం 5 గురినైనా పొగుడు! తర్వాత క్రమంగా ఆ సంఖ్యను పెంచుతూ వెళ్లు!!"
ఇక నువ్వేమో కష్టాలు,దుఃఖాలు,బాధలు చెప్పుకుంటూ సానుభూతి కోరుకోవడం మానేసి ఆనందాలను..సంతోషాలను చెబుతూ నీ హ్యాపీ నెస్ ను పంచుతూ వెళ్లు! అలా చెప్పే వ్యక్తుల సంఖ్యను క్రమంగా పెంచుకో!!
అంటూ రెమిడి సూచించాడు స్వామిజీ!
"అద్భుతం స్వామి!! చాలా బాగా చెప్పారు!" అంది మొదటి స్త్రీ.
"కదా!! స్వామిజీ చెబుతుంటే మనసంతా ఎంత సంతోషమనిపించిందో!!!" అంది రెండవ ఆమె.
....ఆ క్షణమే రెమిడి ప్రారంభించిన ఆ ఇద్దరినీ చూసి స్వామిజీ తృప్తిగా నవ్వుతూ దీవించి పంపాడు!
ఎండుగడ్డి వంటి కోరికలను కాల్చేది ఆత్మజ్ఞానం. అది జ్ఞానాగ్ని. కాలిపోగా మిగిలే బూడిదే సమాధి. వాచామౌనం మౌనమూ కాదు, సమాధీ కాదు. దృశ్యమాన ప్రపంచాన్ని చైతన్యమయంగా చూడగలగటమే బ్రహ్మానందస్థితి. అన్నివేళలా ప్రశాంత, ప్రసన్న స్థితిలో నిలకడ చెందినవాడే యోగి. అతడికి కూడటం, వీడటం అంటూ ఉండదు. అతడిది ఏమీ అంటని ఆకాశం వంటి స్థితి!
ఉపనిషత్ భావనలో.. అంటే బ్రహ్మ భావనలో నిలకడ చెంది, నిధి ధ్యాసనంలో హృదయాన్ని బ్రహ్మమయం చేసుకున్న జీవన్ముక్తుడికి, సంసార దుఃఖం అంటదు. నిరంతర చింతన అహవినాశానికి దారితీసి శుద్ధాత్మను స్థిరం చేస్తుంది. అది అభినయం నుండి అనుభవం వైపు నడిపిస్తుంది.
వజ్రం లోపలి కాంతి లాగా జ్ఞాని హృదయం కూడా కాంతిమయంగానే ఉంటుంది. అది నిశ్చల దీపకళిక. నిద్రలో అణగిన మనసువలె, జ్ఞాని కార్యకలాపాలు ఆత్మనిష్ఠలోనే కుదురుకొని ఉంటాయి. యోగులు లోకసంబంధ కార్యాలను అద్వయ స్థితిలో ఆత్మానందాన్ని అనుభవిస్తూ నిర్వర్తిస్తుంటారు.
కోరికలు లేనివాడు మేరు గంభీరుడు, ముల్లోకాలను గడ్డిపోచలో నిలుపుకోగల ధీమంతుడు. ఖాళీకుండ లోపల, వెలుపల ఎట్లా శూన్యమో, నీటమునిగిన కుండ వెలుపలా లోపలా ఎట్లా పూర్ణమో, జీవన్ముక్తుడూ అంతే. ఇష్టాయిష్టాలు ఎరుగని జ్ఞాని, ప్రపంచ వ్యవహారాలను సాక్షిగా నిర్వహిస్తాడు. ప్రపంచంలోనూ, దేహంలోనూ ఉన్నా జ్ఞాని జీవన్ముక్తుడే!
అహం వీడిన ధ్యానాతీతమైన స్థితే జీవన్ముక్తుడిది. ఆప్తమిత్ర బేధం లేక, దృష్టి బేధం లేక అంతటా అన్నిటా సమ్యక్ దృష్టితో ఆనందధామంగా ఎవరు జీవిస్తుంటారో వారే జీవన్ముక్తులు. బంధన కానీ ముక్తిగానీ ఎరుగనిది జీవన్ముక్త స్థితి.
ముక్తి లోకాతీతమూ, దేహాతీతమూ కాదు. అది (ముక్తి) ఇక్కడే ఉన్నది అనుకోవటంలోనే అంతా ఇమిడి ఉన్నది. కోరికలే బంధన. వాటిని వదులుకోవటమే ముక్తి. జీవాత్మ పరమాత్మకంటె భిన్నం కాదు. ఆ ఎరుకే జీవన్ముక్త స్థితి. తన కంటే వేరుగా మరొక వస్తువేదీ లేదనే నిశ్చలస్థితే, జీవన్ముక్తుడిది. మనసు తనను తానే బంధించుకుంటుంది. తనను తానే విడిపించుకున్నప్పుడు ముక్తిని అనుభవిస్తున్నది. అదే ఆనందతారక స్థితి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి