28, జనవరి 2021, గురువారం

చమత్కార పద్యాలు

 చమత్కార పద్యాలు


బాలకృష్ణుడు ఒకరోజు రాత్రిపూట ఒక గోపిక యింట  దూరి  ఏమేమో చేస్తున్నాడు. అది 

గమనించిన గోపిక కృష్ణుణ్ణి ఎలా నిలదీస్తోందో చూడండి..


             కస్త్వం బాల? బలానుజః తదిహ కిమ్? మనమందిరా శంకయా.

             బుద్ధం, తన్నవనీత కుంభవివరే, హస్తం కథం న్యస్యసి?

             కర్తు౦ తత్ర పిపీలికాప నయనం, సుప్తా కిముద్బోధితాః?

             బాలావత్సగతి౦, వివేక్తుమితి సంజల్పన్  హరి: పాతువః


---చమత్కారశతం నుండి...


ఓ బాలుడా ఎవరు నువ్వు?  అందిగట్టిగా. 


దొంగతనానికి వచ్చిన కృష్ణుడు ఆమె కోపంగా ఉందని గ్రహించాడు.  ఆమెనుండి తప్పించుకోవాలి ఎలా?    అని ఆలోచించాడు. 



ఒక మంచి ఉపాయం తట్టింది.బలరాముడు తమ్ముడిని అన్నాడు.


 ఆమాట వినగానే 

గోపిక కోప౦  తగ్గింది.ధైర్యం కూడా సన్నగిల్లింది.ఆమెకంఠం లోని తీవ్రత కూడా తగ్గింది.



కృష్ణుడు ఆశించిందీ  అదే, బలరాముడంటే అందరికీ భయం , అతను కోపిష్టి ,చేతిలో ఎప్పుడూ నాగలో రోకలో వుంటుంది.ఆదిశేషుని అవతారం కదా!బుసకొడ్తూ వుంటాడు.



అందుకే అందరికీ అతడంటే భయం.కనుక నువ్వేమైనా అంటే మా అన్నకి చెప్తాను అన్న భావం శ్రీకృష్ణునిది


. మనం సామాన్యంగా ఏదైనా ఇబ్బంది లో వున్నప్పుడు మన పెద్దవారి పేరు చెప్పి తప్పించుకోవాలని చూస్తాము కదా.

అలాగే కృష్ణుడు అన్న పేరు 

చెప్పాడు. అతని పాచిక పారింది.కోపం తగ్గింది. 


సరే  యిక్కడి కెందుకొచ్చావయ్యా?

అన్నది. 


ఏం లేదు చీకటి కదా మా యిల్లనుకొని వచ్చాను. అన్నాడు కృష్ణుడు. 



అలాగైతే వెన్నకుండలో చేయెందుకు పెడుతున్నావని  తిరిగి ప్రశ్నించింది.



 ఇందులో చీమలున్నాయి అవి యేరిపడేద్దామని వెన్నకుండలో చెయ్యి పెడుతున్నాన్నాడు. (తినటానికి కాదట పాపం)



అయ్యా! యిది బాగుందయ్యా నీవేమో బలరాముని తమ్ముడివి, రాత్రివేళ మీయిల్లనుకొని మా యింటికి వచ్చావు. పాపం చీమలున్నాయని వాటిని ఏరిపారేద్దామని మంచి బుద్ధితో 

వెన్న కుండలో చెయ్యి పెట్టావు. అంతవరకూ బాగానే వున్నది.ఆ నిద్రపోతున్న పిల్లల నేందుకు లేపుతున్నావు? అంది గోపిక. 


ఒకదానితో ఒకటి పొంతన లేని  సమాధానాలు 

చెప్తున్నా గట్టిగా ఏమీ అనలేకపోతూంది.బలరాముని తమ్ముడు గదా.ఆ ఒక్క మాటే కాపాడుతోంది.


 ఇక తెలిసిపోయింది కృష్ణుడికి ఆమె తననేమీ చేయలేదని. ఆమె మాటల్లో 

కరుకుదనం,అధికారదర్పం తగ్గిపోయాయి. అందుకని వెంటనే తడుముకోకుండా 

మా లేగదూడలు కొన్ని తప్పిపోయాయి. వాటి వివరాలు తెలుసుకుందామని ఈ పిల్లల్ని లేపుతున్నాను.అన్నాడు కృష్ణుడు.


వెనకటికెవడో తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా? అంటే దూడగడ్డికోసమని అన్నాడట. అలా వుంది కృష్ణుడి వ్యవహారం. 


ఈవిధంగా గోపిక మాటలకు జవాబు చెప్తున్న బాలకృష్ణుడు మిమ్ము కాపాడుగాక. అని చమత్కారమైన ఆశీస్సు. ...

కామెంట్‌లు లేవు: