రామాయణమ్ 198
............................................................................................
రామా మేమందరమూ ఒకరోజు పర్వతముపై కూర్చొని ఉండగా ఒక స్త్రీ తన ఉత్తరీయమును ,శ్రేష్టమైన అలంకారములను జారవిడిచినది . ఆ స్త్రీ ఆ రాక్షసుని ఒడిలో ఆడుపాము వలే దోర్లుచూ మిక్కిలి బాధతో రోదించుచూ మాకు కనపడినది .
.
ఆమె జారవిడిచిన నగలన్నిటినీ మేము భద్రపరచితిమి ,నేను వాటిని తీసుకొని వచ్చెదను నీవు గుర్తింపుము .
.
మిత్రమా ఆలస్యమెందులకు త్వరగా తీసుకొని రమ్ము అని రాముడు పలుకగా సుగ్రీవుడు వాటిని తానె స్వయముగా గుహలోనికి వెళ్లి తీసుకొని వచ్చి ఆయన ముందుంచాడు .
.
ఆ అలంకారములు ,ఉత్తరీయము చూసిన వెంటనే రాముని కన్నులు పొగమంచు కప్పిన చంద్రుడి వలె బాష్పముచేత ఆవరింపబడినవి .
.
ఒక్కసారిగా హా !సీతా అంటూ ఏడుస్తూ నేలపై బడి మూర్చిల్లి నాడు .
.
మరల కొంతసేపటికి తేరుకొని మాటిమాటికీ తన గుండెలకు ఆ నగలను దగ్గరకు చేర్చుకొని కలుగులో కోపముతో బుసలుకొట్టే పాములాగా నిట్టూర్పులు విడుస్తూ కన్నులనుండి ఎడతెరిపిలేకుండా కన్నీరు కారుస్తూ ప్రక్కనే ఉన్న లక్ష్మణుని వైపు చూస్తూ కడు దీనంగా విలపించసాగాడు .
.
లక్ష్మణా ఇదుగో ఈ అలంకారాలు చూడు పచ్చిక మీద పడటము వలన విరిగిపోకుండా పూర్వమువలెనే ఉన్నవి .
.
అప్పుడు లక్ష్మణుడు,
అన్నా ! నాకు కేయూరాలు కానీ ,కుండలాలు కానీ తెలువవు ,
కానీ ఆవిడ కాలి నూపురాలను మాత్రము నేను గుర్తించగలను.
.
నిత్యమూ ఆవిడ పాదాలకు వందనము చేయుదును కావున అవి నేను గుర్తుపట్టగలను.
.
నిస్సందేహముగా అవి ఆవిడవే !
.
సుగ్రీవుడా ,నా ప్రాణాధిక అయిన సీతను రావణుడు ఎటువైపుగా తీసుకొని వేళ్ళినాడో నీవు చెప్పగలవా!
వానిని ఇప్పుడే యమ సదనమునకు పంపగలను అని రాముడు కోపముతో సుగ్రీవుని వైపు తిరిగి పలికినాడు .
.
NB
( లక్ష్మణుడన్న ఈ మాటలు ప్రాచ్య పాఠమునందు లేవని పెద్దల అభిప్రాయము ).
.
వూటుకూరు జానకిరామారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి