28, జనవరి 2021, గురువారం

రహస్యం

 *చిలుక చెప్పిన రహస్యం*


అనగనగా ఒక చెట్టు మీద రెండు చిలుకలు కాపురం ఉంటున్నాయి. వాటికి ఓ బుజ్జి చిలుక పుట్టింది. నాన్న చిలుక ఆ వనంలోని చిలుకలకు రాజు. అక్కడి చిలుకలు తమ కష్ట సుఖాలను జ్ఞానియైన ఆ చిలుకరాజుతో పంచుకొనేవి. బుజ్జి చిలుక ను ఆ రెండు  చిలుకలు ఎంతో ప్రేమగా పెంచుతూ రోజూ ఆహారం తెచ్చి పెట్టేవి.  మెలమెల్లగా బుజ్జి చిలుకకు రెక్కలు రావడం మొదలయ్యే సరికి, అమ్మ చిలుక, దానికి ఎగరడం నేర్పింది. ఎగరడం నేర్చుకున్న బుజ్జి చిలుక తన ఆహారాన్ని వెతుక్కుంటూ ఎగిరిపోయింది.

వేరే చిలుకతో జతకట్టి గూడు ఏర్పరుచుకుంది. అదే సమయంలో బుజ్జి చిలుక తల్లి కి జబ్బు చేసి చనిపోతుంది. దానికి ఎంతో బాధ కలుగుతుంది. నాన్న చిలుక మౌనంగా ఉండడంతో దగ్గరకు వెళ్లి "నాన్నా, అమ్మ వెళ్లి పోయి ఒంటరై పోయానని బాధపడుతున్నావా. వద్దు నాన్నా. నేనున్నాను మీకు." అంటుంది ఊరడిస్తున్నట్లుగా.

"పిచ్చి వాడా, ఈ ప్రపంచంలో అందరూ ఒంటరి వారే. ఒక్కరే వస్తారు. ఒక్కరే వెళ్తారు. ప్రతి ప్రాణి పుట్టిన తర్వాత బాల్యం, యవ్వనం, ముసలితనం అనే దశలను అనుభవిస్తుంది. ఈశరీరం ఎప్పుడైతే జర్జరమై పనికిరానిదౌతుందో, అప్పుడు ఈ శరీరాన్ని వదిలి పెడుతుంది. దానినే మరణం అంటారు. ఆ శరీరం నుండి వేరైన ఆత్మ వేరే శరీరంలోకి ప్రవేశించి మరల జన్మిస్తుంది. అదే జననం అంటే." అని వివరించింది చిలుకరాజు.

"అయితే ఇది ఎవరికైనా తప్పదనమాట. మరైతే అమ్మ మళ్ళీ పుడుతుందా నాన్నా." ఆశగా అడిగింది బుజ్జి చిలుక.

"పుట్టవచ్చు. కోడలు కడుపుతో ఉన్నట్లుంది కదా. మళ్ళీ నీ మీద ప్రేమతో నీ బిడ్డగా పుట్టవచ్చు." అంది చిలుకరాజు నవ్వుతూ.

"నాన్నా, ఈ రోజు నాకెంతో ఉపయోగకరమైన విషయాలు తెలుసుకున్నాను నాన్నా." అంటూ తన గూటివైపు ఎగిరి పోయింది బుజ్జి చిలుక.


దేహినోఽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా ।

తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి ।। 13 ।।


నీతి : దీనిని బట్టి తెలిసేదేమంటే ఏ జీవి అయినా పుట్టి, పెరిగి తన జీవితంలో అన్ని దశలూ అనుభవించి, చివరికి చనిపోక తప్పదు. చనిపోయింది శరీరం మాత్రమేనని, ప్రాణం మరో శరీరంలో ప్రవేశించి తిరిగి పుడుతుందని తెలుసుకున్నవారు, చావు గురించి బాధ పడరు.

✍🏻రామశేషు

కామెంట్‌లు లేవు: