28, జనవరి 2021, గురువారం

వేదములు

 *69-వేదములు📚((((((((((🕉))))))))))     ఆచార్య వాణి🧘‍♂️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*23. ఉపాంగములు :- న్యాయము*


*తర్కము - ఔచిత్యమును తెలిపే శాస్త్రం :-*


((((((((((🕉))))))))))


*జగత్సృష్టికి కారణం :-*



*సృష్టికి కారణాలు రెండు : నిమిత్తం, ఉపాదానం. మట్టికుండ ఉంటే, దానిని చేయటానికి మన్ను ఉండాలి. కుండ ఉండటానికి కారణం మట్టి. దానిని ఉపాదానమంటారు. కాని మన్ను కుండగా ఎట్లా మారుతుంది? తనంతట తాను కాలేదు కదా. కుమ్మరి మట్టిని కుండగా చేయగలడు. అంటే కుండ ఉండాలంటే కుమ్మరి ఉండాలి. అతడు కారకుడు లేక నిమిత్తం. జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన నిమిత్తం లేక శకునం వేరు.*



*న్యాయవైశేషిక సిద్ధాంతాననుసరించి, అణువులను ఉపాదానంగా తీసుకొని, ఈశ్వరుడు నిమిత్త కారణమై జగత్తుని సృష్టించాడు. మట్టిని కుండగా చేయటానికి, కుమ్మరి ఉండి తీరాలి. అతడే లేకపోతే కుండ అసంభవం. దీనినే ఆరంభవాదమని గాని, అసత్‌కార్యవాదమని గాని అంటారు. ''సత్‌'' అంటే ఉన్నది; ''అసత్‌'' అంటే లేనిది. మట్టిలో కుండ లేదు. లేనికుండ మట్టి నుండి సంస్థిత మవుతుంది. ఆ విధంగానే, అణువులలో లేని జగత్తును ఈశ్వరుడు అణువుల సహాయంతో సృష్టించాడు. న్యాయశాస్త్రపు సిద్ధాంతమిది.*



*సాంఖ్యవాదుల ప్రకారం దేవుడు లేడు. వారి సిద్ధాంతానుసారం ప్రకృతి తన నుండి తానే జగత్తుని కల్పించింది. ఆధునిక నాస్తికుల వాదానికీ దీనికీ తేడా ఉంది. దీనికి కారణమిది : సాంఖ్యులు నిర్గుణ బ్రహ్మను (లేక, పురుషుణ్ణి) జ్ఞానస్వరూపునిగా గుర్తిస్తారు. జడమైన ప్రకృతి యొక్క సక్రమ వ్యాపకాలకి కారణం, పురుషుని సాన్నిధ్య ప్రభావం వల్లనే అంటారు. ఆ సామీప్యమే సృష్టికీ, అందులోని నియమబద్ధతకీ కారణమంటారు. పురుషునకు ఏ వ్యాపకమూ లేదు. సూర్యకిరణాల వల్ల నీరు ఆవిరి అవుతుంది. మొక్కలు పెరుగుతాయి. తడిబట్టలు ఆరుతాయి. ఇవన్నీ సూర్యుని ప్రభావం వల్లనే జరుగుతాయి. సూర్యునికి మాత్రం కొలనుని ఎండిపోయేట్టు చేద్దామని గాని, మొక్కని ఎదిగేట్టు చేద్దామని గాని ఉద్దేశముండదు. మంచునీళ్లల్లో చేతులు పెట్టితే వేళ్లను బండబారుద్దామన్న ఉద్దేశ్యం మంచునీటికి కలదని అనలేము కదా. ఆ విధంగానే పురుషుడు సృష్టికార్యం సల్పాలని సంకల్పింపక పోయినా, పురుషుని ప్రభావం వల్ల ప్రకృతే తన నుండి సృష్టి కార్యాన్ని సల్పుతుంది. ఇది సాంఖ్య సిద్ధాంతం. దీనినే పరిణామ వాదమని కూడ అంటారు.*



*నైయాయికుల అసత్‌ కార్యవాదానికి ప్రతిగా సాంఖ్యులు సత్‌ కార్య వాదాన్ని ప్రతిపాదిస్తారు. వీరిట్లా అంటారు.*



*కుండ కూడ మట్టిలో అంతర్భాగమే. మొదట్లో నూనె గింజలను గానుగవాడు ఆడిస్తే ఆ గింజలలోనే ఉన్న నూనె వస్తోంది. మట్టిలోనే ఇమిడి ఉన్న కుండకి ప్రయత్నం వల్ల ఆ రూపం వస్తుంది. మట్టిని ఉపయోగించటం వల్లనే కుండ వస్తుంది. నూనె గింజల నుండి కుండ తయారు కాదు కదా! అట్లాగే, నూనెని మట్టి నుండి పొందలేము. కుండలో మట్టి కణాలు తప్ప ఏవీ లేవు. ఆ అణువుల అమరికని కాస్త మారిస్తే కుండ తయారవుతుంది.*



*శ్రీ శంకర భగవత్పాదుల వారిట్లా అన్నారు. ''ఆరంభవాదంగాని పరిణామ వాదం గాని సప్రమాణం కాదు. మాయసహాయంతో బ్రహ్మమే సృష్టి రూపం దాల్చాడు. ఆ విశ్వకర్త అయిన కుమ్మరిని విడిచి మట్టిలేదు. అందువల్ల ఆరంభవాదానికి అర్థం లేదు. పరిణామము వలన - అంటే మార్పు వలన - పరమాత్ముడు జగత్తుని పాల నుండి పెరుగువలె సృష్టించాడనటమూ సబబు కాదు. ఎందు వల్లనంటే - అటువంటి పరిణామము సంభవించిన తరువాత పెరుగు మాత్రమే ఉంటుంది కాని పాలుండవు. జగత్సృష్టి తరువాత పరమాత్మ అస్థిత్వం కోల్పోయాడనటం అసందర్భం. పరమాత్ముడు శుద్ధ జ్ఞానం వలె ఒకవైపూ, జీవినిగా - జగత్తుగా మరొకవైపూ ఉంటాడు. ఇదంతా ఆ ''సత్‌'' పదార్థం యొక్క లీల. నాటకంలో పాత్రధరించినంత మాత్రాన ఆ మనిషి నిజస్వరూపాన్ని కోల్పోతాడా? సృష్టి కూడా అంతే. జగత్తులో అనేక రూపాలను ధరించినా ఆ సత్‌ పదార్థానికి మార్పులేదు''. దీని పేరు వివర్తవాదం - శంకరుని సాహసోపేతమైన సిద్ధాంతం.*



*పాముగా భ్రమింపచేసే త్రాడు - వివర్తం. అది పాముగా మారలేదు. అందువల్ల అది ఆరంభవాదం కాదు. త్రాడు త్రాడుగానే ఉంటుంది, పాము కాలేదు. కాని మన అజ్ఞానం వల్ల అది పామువలె కనబడుతుంది. ఇట్లాగే అవిద్యవల్ల బ్రహ్మమే మనకు జగత్తువలె, సృష్టివలె, అందులోని జీవరాశుల వలె కనబడుతుంది.*



*ఆచార్యులవారు ప్రతిపాదించిన సత్యాన్ని గ్రహించటానికి అనేకమైన యుక్తులను న్యాయశాస్త్రం చెప్తుంది. పదార్థం యొక్క నిజ స్వరూపాన్ని తెలిసికోవటానికి ఈ యుక్తులు ఉపయోగ పడుతాయి. వీటివల్ల వైరాగ్యం సిద్ధిస్తుంది. ఈ స్థితి నుంచి సంతోష దుం:ఖాలు లేని స్థితికి వెళ్లవచ్చు. ఆ స్థితిని అపవర్గమంటారు. న్యాయవైశేషిక సిద్ధాంతాలు అక్కడితో నిలచిపోతాయి.*



*ద్వైత సిద్ధాంతం ప్రకారం కూడ అంత కంటె ముందుకు వెళ్లలేము. అద్వైతం ఒకే ఒక సత్‌ ఉన్నదనీ మనము 'సత్‌' అవటమే మోక్షమనీ, జన్మరాహిత్యసిద్ధి అనీ ప్రతిపాదిస్తుంది.*



*న్యాయం మాత్రం మనం అపవర్గమనే ఉత్కృష్టస్థాయికి చేరుకోగలమనీ, ఈ ప్రపంచపు అసంతృప్తి కరమైన జీవనాన్ని అధిగమించగలమనీ చెప్తుంది.*



*ఈ శాస్త్రానికి ఇంకొక విశిష్టత కూడ ఉంది. బౌద్ధులు, సాంఖ్యులు, చార్వాకులు ప్రతిపాదించే సిద్ధాంతాలను ఖండించగల యుక్తులనేకం తెల్పుతుంది. ఈశ్వరుడున్నాడనీ. సృష్టికర్త అనీ కూడ నిరూపిస్తుంది.*


🕉🌞🌏🌙🌟🚩

కామెంట్‌లు లేవు: