28, జనవరి 2021, గురువారం

ఏది నాది?

 *ఏది నాది?*...

      🌸🌸🌸

                                                

           నాది నాదనియేవు అని ఏదో పాట ఉంది కదా అట్లే మనమందరం నాది నాదని మురిసిపోతుంటాము కదా! కానీ నిజానికి చూస్తే ఏదీ నాది కాదు. ఏదీ మనది కాదు.

              ఉల్లిపొర ఒక్కొక్కటీ విడిపోయినాక కొనాకు ఏమీ మిగలనట్లే మన జీవితంలో కూడా ఒక్కొక్కటీ విడిపోతూ ఉండగా మనదంటూ ఏమీ లేదని తెలిసిపోతుంది. కానీ ఈ తెలియడం ఒక్కొక్కరికీ ఒక్కొక్క దశలో మాత్రమే అర్థమైతుంది.


*కొందరికి ఎప్పటికీ జీవితమంతా అర్థం కాకపోవచ్చును*


కాకపోవచ్చనేముంది ముక్కాల్ భాగం మందికి అర్థమే కాదు. మాట ఒప్పుకున్నా మనసు ఒప్పుకోవడం కష్టం. మనసు ఒప్పుకున్నా ఆచరణలో పెట్టడం కష్టం.


               చిన్నప్పట్నించీ వాడినబట్టలు, పెరిగిన ఇల్లు, చదివిన బళ్ళు, కలిసిన స్నేహితులు అందర్నీ, అన్నిటినీ ఒక్కొక్కదాన్నీ నాది అనుకునీ, నాది కాదు అనుకునీ సులభంగా విడిచేస్తాం. సులభంగా ఎందుకంటే అంతకన్నా మంచిదో పెద్దదో మనకు తగినదో మనకు దొరుకుతుంటే విడిచిపెడుతుంటాం.దొరుకుతుందనే ఆశవంటిదున్నా కూడా  విడిచిపెడుతుంటాం.


        కానీ ఎప్పుడైతే ఇది పోతే మళ్ళీ రాదనీ దీన్ని విడిచిపెట్టలేననీ ఎప్పుడనుకుంటామో అప్పుడే కమ్మేస్తుంది దుఃఖం. ప్రాణం అల్లాడిపోయేంతగా. నాకు కావాలనీ , నేను విడిచిపెట్టననీ పోరాటాలు/హింసలు ఎన్నో.

అయినా జరిగేది జరక్కమానదు.


        పెళ్ళయితే ఆడపిల్లలు, ఎంతలేదన్నా కాదన్నా కొన్నాళ్ళ తరువాత అయినా మగవాళ్ళు కూడాముక్కాల్ భాగం మంది పుట్టినయింటినీ తోడబుట్టినవారినీ విడిచిపెడుతుంటారు. మగపిల్లలలో ఇంకొంచెం ఆలస్యంగా విడిచి పెడతారు. అందర్నీ, అన్నిటినీ కలుపుకుపోయే సామర్థ్యం అందరికీ ఉండడం కుదరదు. ఎవ్వరూ విలన్లు కాకపోయినా, అందరూ ఒకరి గురించి ఒకరు ఆలోచించే వాళ్ళయినా అంతా కలిపి మోసే భారం ఎక్కువై భారం తగ్గించుకోవాల్సి వస్తుంది . ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా తమ సంపాదన, తమ పిల్లలు, తమ లక్ష్యాలు, లేదా మనశ్శాంతీ ఇదే కష్టమైతే ఏం చేస్తారు పాపం. విడిచిపెడుతుంటారు.


         తర్వాత పిల్లలు పెద్దయితే వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ ప్రపంచం వేరైనపుడు వాళ్ళనూ విడిచిపెట్టాల్సి వస్తుంది. ఎవరూ ఎవరికీ దూరం కాకపోవచ్చు. అయినా ఎక్కడో ఏదో బాధ ఉంటుందేమో కదా!

       తర్వాత తమ పనులు, లక్ష్యములు తమ ఇష్టాలు విడిచి పెట్టాల్సి వస్తుంది. అంతవరకూ ఆయా పనులు చేయటానికి ఉపకరించిన శరీరాంగాలు(దేహాంగాలు) సహకరించవు. అందువల్ల తమ పనుల్లో సహకరించే వ్యక్తులే వెళ్ళి విశ్రాంతి తీసుకోమంటారు. ఇక నీవు పనికి రావని అన్యాపదేశంగా చెపుతుంటారు.(నెగెటివ్ సెన్స్ లో చెప్పట్లేదు. ఫాక్ట్స్ !!) ఉద్యోగాలు, వ్యాపారాలు, వంటిళ్ళూ తమతర్వాతి తరాలకు విడిచిపెట్టాల్సి వస్తుంది. పని సామర్థ్యాలూ, పాలసీ విధానాలు, ఇంటి సామాన్లూ మనవని అనుకోకుండా విడిచిపెట్టాల్సి వస్తుంది.


           తర్వాత పూర్తిగా దేహం మొండికేయడం మొదలు పెడుతుంది.కళ్ళు, చెవులూ పని చేయరు. మాట స్పష్టత ఉండదు. కాళ్ళూ చేతులూ వణుకు రావడం లేదా చచ్చుపడడం జరగవచ్చు. దాంతో అంతవరకూ దేహయాత్రలో నిర్విరామంగా పని చేసిన దేహాంగాలు కళ్ళు, కాళ్ళు అయినా సరే  వాటిపై అభిమానం విడిచి పెట్టాల్సి వస్తుంది. అన్నిటికీ పక్కవాళ్ళ కాళ్ళ చేతులపై ఆధారపడాల్సి వస్తుంది.


       అట్లా ఉండే స్థితిలో ఏమనిపిస్తుంది? ఈ ఇల్లు నాదేనా వీళ్ళు నావాళ్ళేనా అనిపించే రోజూ రావచ్చు. (రావచ్చనే అన్నా.... అపార్థం చేసుకోవద్దు.)అంతకన్నా బెటర్ ఏదీ దొరకకపోయినా విడిచిపెడుతూ ఉండేటపుడు మనుష్యులు ఒకరినొకరు విడిచి పెట్టుకోకపోవచ్చు. కానీ మోహం విడిచేయాల్సిందే.


                      ఈలోకం మీద, తన గడ్డమీద, తన భూమి మీద , తన వాళ్ళమీద ఆఖరికి తన వంటిమీద కూడా......మోహం విడిచిపెట్టుకోవాల్సిందే.


*విడువనివాళ్ళకూ కాలం విడిపిస్తుంది. విడువకపోతే దేహమూ విడువలేక బ్రతుకూ చావుకూ మధ్య ఊగిసలాడాల్సిందే*


       కానీ చాలా చాలా కష్టం పుట్టినప్పటినుంచీ ఏళ్ళ తరబడి దశాబ్దాలతరబడి పెంచుకుంటూ వచ్చిన మోహాన్ని ఒక్కసారిగా విడిచిపెట్టడం. చాలానే కష్టం. కానీ తప్పదు. ప్రతిదశలోనూ విడిచిపెడుతూ ఉండాల. మనం వయస్సు పెరిగే కొద్దీ మోహం తగ్గించుకోవాల.

         నాది అనేది ఏదీ లేదీ ప్రపంచంలో. అన్నీ మనం కొంతకాలం వాడుకుంటామంతే. క్లాస్ రూమ్ లో బెంచీ మాదిరి, ట్రైన్ లో బెర్త్ మాదిరి, సినిమాహాల్లో ఫ్లైట్లో సీట్ల మాదిరి కొంతసేపు వాడుకున్నట్టే అచ్చంగా అదేవిధంగా ఈ లోకంలోని మనుష్యుల్నీ, బంధాల్నీ , వస్తువుల్నీ కొంతకాలం వాడుకుంటాము. అంతే కానీ ఏదీ మనది కాదు. ఏదీ నాదు కాదు.


            చివరగా ఒక చిన్న మాట హాయిగా నవ్వేసుకోండి. కానీ ఇదే పెద్ద జీవనసత్యం అనీ మరిచిపోవద్దు.

ఈ సమయంలో భగవంతుడు ఏం చేస్తుంటాడో అని ఒకరు అడిగితే ఇంకొకరు చెప్పారంట..... ఇప్పుడే కాదు ఎప్పుడూ ఆయన పకపకా నవ్వుతూనే ఉంటాడు. అని....


*ఎందుకు అంటే ఈ భూమి నాదని ఈ భూమి నీదని వాళ్ళ పేర వీళ్ళపేర రాస్తూనే ఉంటారు* *రాయించుకుంటానే ఉంటారు. కానీ ఏ ఒక్కరూ శాశ్వతంగా వాళ్ళ పేరుమీద ఉంచుకోలేకపోయినారు* అని

*అదే భూమికి హక్కు దారులుగా వేలమంది వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు అయినా నాదనుకొనే మనుష్యుల వెఱ్ఱి చూసి భూదేవితో పాటు యముడూ నవ్వుతుంటాడట...

కామెంట్‌లు లేవు: