28, జనవరి 2021, గురువారం

రామాయణం 199

 రామాయణం 199

.................

రామా ఏల నీవు ఇలా బేలవైతే ,నీవంటి ధీరునికి దుఃఖము శోభనివ్వదు .

ఇదుగో చూడునాభార్యను వాలి అపహరించలేదా ? 

వానరుడ నైన నేను శోకిస్తున్నానా చూడు ,

.

ఆ రావణుడు ఎవ్వడో ఎక్కడ ఉంటాడో వాని సామర్ధ్యమేమో, వానిపరాక్రమమేమో  ,నాకు తెలవదు కానీ ,ముల్లోకాలలో ఎచ్చట ఉన్నా వాని ఆచూకి కనుగొని నీ సీత నీకు దక్కునట్లు చేసెదను .ఇది నా ప్రతిజ్ఞ .

.

ఆపత్సమయమందు, కానీ ధననాశము కలిగి నప్పుడు కానీ ప్రాణాపాయ స్థితి కలిగినప్పుడు కానీ ధైర్య వంతుడు తన బుద్ధితో బాగుగా ఆలోచించుకొనును కానీ కృంగిపోడు.

.

ఎవడు మూఢుడై తన వశములో తానుండక నిత్యమూ దైన్యములో కొట్టుమిట్టాడుకొనునో వాడు ఎక్కువ బరువు వేసిన ఓడ నీటిలో మునుగునట్లు మునిగి పోవును .

.

అని సుగ్రీవుడు అంజలి ఘటించి శోకములో మునిగిపోయి దీనుడై రోదిస్తున్న శ్రీరాముని ఓదార్చెను .

.

సుగ్రీవుని మాటలకు తన సహజ స్థితి ని పొందినవాడై రాముడు సుగ్రీవుని గాఢముగా ఆలింగనము చేసుకొనెను .

.

సుగ్రీవా !ప్రేమతో హితము గోరు స్నేహితుడు ఏమి పలుకవలెనో అవి నీవు పలికినావు .నీ వంటి బంధువు ఇటువంటి సమయములో ఎవరికీ లభించడు కదా!

.

సుగ్రీవా నీవు రాక్షసుని జాడ కనుగొనుటకు ప్రయత్నించుము ,

నేనేమి చేయవలెనో నాకు నీవు చెప్పుము ,

మంచి సుక్షేత్రమైన పొలములో వేసిన పంట చేతికొచ్చినట్లు నీ కార్యము సఫలము కాగలదు .

.

సత్యముపై ఒట్టు పెట్టి పలుకుచున్నాను నీ కార్యము నెరవేరినట్లే అనుకొనుము .అని పలికిన రాముని పలుకులకు సంతసించినవాడై సుగ్రీవుడు  మనస్సులో తనపని నెరవేరినట్లే అని అనుకొనెను .

.

అంత ఇరువురు మిత్రులూ ఏకాంతములో కూర్చొని   తమ సుఖదుఖములను గూర్చి ముచ్చటించుకొనసాగిరి.

.

జానకిరామారావు వూటుకూరు

కామెంట్‌లు లేవు: