వర్షం - వ్యవసాయం
నాకు సంబంధించిన విషయం చెప్పుకునే ముందు నాకు అత్యంత ఆప్తులైన శ్రీ జి పార్థసారథి గారు పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకున్న సమయంలో ఆయన పొందిన అనుభూతిని తెలియజేస్తాను. శ్రీ జి పార్థసారథి ఐక్యరాజ్యసమితిలో భారతదేశ రాయబారి. ఇందిరా గాంధి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ సలహాదారు కూడా. ఎప్పుడైనా ఢిల్లీ నుండి తమిళనాడుకు వస్తే కంచికి వెళ్ళకుండా, పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకోకుండా ఉండరు. వెళ్ళిన ప్రతిసారీ మహాస్వామి వారు దాదాపు అరగంట సేపు మాట్లాడేవారు. అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అప్పటిదాకా ప్రపంచంలో జరిగిన సంఘటనల గురించి ప్రతి ఒక్క విషయమూ మాట్లాడేవారు. మిగతా దేశాలతో మన దౌత్య సంబంధమైన విషయముల గురించి తగు సూచనలు ఇచ్చేవారు.
పార్థసారథి గారు ఆ విషయాలను అతిశయంతో నాతో పంచుకునేవారు. మహాస్వామివారు చెప్పిన విషయాల గురించి వారి జ్ఞానసంపద గురించి పలుమార్లు నాతో చెబుతూ స్వామివారి మేధస్సు అమోఘం అని కొనియాడేవారు. ఇద్దరమూ స్వామివారికి ఒక నమస్కారం చేసుకునేవారము.
ఒకసారి పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు, స్వామివారు పల్లకిలో కూర్చున్నారు. నేను వెళ్ళి స్వామివారి ముందు కూర్చున్నాను. అప్పుటికి నేను మంత్రి పదవిలో ఉన్నాను. పనైమరత్తుపట్టి నియోజకవర్గం నుండి గెలిచాను.
నా నియోజకవర్గంలో ఉత్తమచోళపురం అనే ఒక గ్రామం ఉంది. అది తిరుమణి ముత్తారు నది ఒడ్డున ఉంది. ఆ ఊళ్ళో కరైపురనాథ స్వామివారి దేవాలయం ఉంది. అది చేరనాడు (చేరనాడు, చోళనాడు, పాండ్యనాడు అని మూడు భాగాలుగా ఉండేది ప్రాచీన తమిళనాడు). ఆ దేవాలయంలోనే అవ్వయ్యార్ పారీ రాజు కుమార్తెలు అంగవై, సంగవైలకు వివాహాలు జరిపించింది. ఆమె ఆదేశాన్ని అనుసరించి చేర, చోళ, పాండ్య రాజులు వచ్చి ఆశీస్సులు అందించారు.
పరమాచార్య స్వామివారు సేలం నుండి కోయంబత్తూరుకు పాదయాత్రగా వచ్చారు. అదే మార్గంలో ఉత్తమచోళపురం ఉంది. దారి ఎదురుగా ఉత్తమ చోళుడు నిర్మించిన శివాలయం ఉంది. మొదటిసారి పనైమరత్తుపట్టి నియోజకవర్గం నుండి ఉపఎన్నికల్లో పోటీ చేశాను. కరైపురనాథర్ అనే పేరున్న ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థించే ఎన్నికల ప్రచారానికి వెళ్లేవాణ్ణి.
పరమాచార్య స్వామివారు ఆ దేవాలయం ముందరకు రాగానే, ఆలయ శివాచార్యులు స్వామివారికి పూర్ణకుంభ స్వాగతం పలికి, ఆలయానికి రమ్మని ఆహ్వానించారు. స్వామివారు కొద్దిగా తల ఎత్తి పైకి చూశారు. అప్పటికి ఆ ఆలయానికి రాజగోపురం లేదు.
అందుకు స్వామివారు, “ముందు ఆలయానికి గోపురం నిర్మించండి. తరువాత వస్తాను” అని చెప్పారు. స్వాగతాన్ని మాత్రం స్వీకరించి ముందుకు నడిచారు. చాలా ఏళ్లపాటు నాకు ఈ విషయం తెలియదు. రెండవ సారి ఎన్నికలు గెలిచినా తరువాత అక్కడి శివాచార్యులు ఈ విషయం నాకు చెప్పారు. నా నియోజకవర్గంలో ఉన్న ఇంత గొప్ప ఆలయాన్ని పరమాచార్య స్వామివారు దర్శించాకుండానే వెళ్ళిపోయారే అని నాకు బాధ కలిగింది. అందుకు కారణం తెలుసుకోదలచి, “నా నియోజకవర్గంలో దేవాలయం మీరు ఎందుకు దర్శించలేదు?” అని అడిగాను. అప్పుడు అర్థం అయ్యింది వారి జ్ఞాపకశక్తి ఎంతటిదో!
“ఉత్తమచోళపురం నీ నియోజకవర్గంలో ఉందా?” అని అడిగారు స్వామివారు. నేను ఊరిపేరు కూడా చెప్పలేదు. అప్పటికి ఈ విషయం జరిగి ఎన్నో సంవత్సరాలు అయ్యింది. నేను మాటలురాక ఆశ్చర్యంతో కూర్చుండిపోయాను. “అక్కడ గోపురం లేదు. ఎందుకు నువ్వే కట్టించారాదు?” అని అడిగారు స్వామివారు.
స్వామివారి ఆదేశం, అనుజ్ఞ అయ్యింది. ఖచ్చితమైన నిర్ణయంతో అక్కడి నిండి బయలుదేరాను. కంచి నుండి నేరుగా ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీ కె.యస్. నారాయణన్ వద్దకు వెళ్లాను. సంబంధ శాఖతో మాట్లాడి కావాల్సినన్ని సిమెంటు బ్యాగులు పంపుతాను అని చెప్పారు. మొత్తం ఖర్చు భరించడానికి ఇప్పుడు ఒకర్ని వెదకాలి. అందుకే ఆరుట్ సెల్వర్ శ్రీ మహాలింగం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఈరోడ్ కైలాస గౌండర్ ని కలిసి వారి అంగీకారాన్ని తీసుకున్నాను. గోపురం ఆకృతి గురించి ఆలోచిస్తుండగా, నంగవల్లి దేవాలయ గోపురం స్ఫురించింది. స్నేహితులతో కలిసి ఒకసారి వెళ్లి చూశాను. చాలా అద్భుతమైన కట్టడం. వెంటనే ఆ స్థపతితో మాట్లాడి ఉత్తమచోళపురం దేవాలయ గోపుర నిర్మాణానికి ఒప్పించాను. ఈ కార్యం మొత్తం చూసుకోవడానికి ఒక వ్యక్తీ కావాలి కదా! దేవాలయ నిర్మాణ కమిటి అధ్యక్షుడిగా శ్రీ ఆర్. జయకుమార్ ని అడుగగా, ఆయన అంగీకరించారు. అప్పుడు శ్రీ రామస్వామి ఉదయర్ పోరూర్ లొ రామచంద్ర వైద్య కళాశాలను నిర్మిస్తున్నారు. కళాశాల నిర్మాణం కోసం రంగూన్ నుండి టేకు కలప తెప్పించారని విన్నాను. వెళ్లి అడగగానే, “తలుపులకోసం నా దగ్గర ఉన్నదాంట్లో నీకు ఎంత కావాలో చెబితే అంత, నా స్వంత లారీలో పంపుతాను” అన్నారు. పన్నెండు అడుగుల ఎత్తు ద్వారంబంధాలు చేయించాము.
ముందు కేవలం మూడంతస్తుల గోపురం నిర్మాణం చేద్దామని అనుకున్నాము. కమిటి అధ్యక్షుడు జయకుమార్ గారి సూచన మేరకు ఐదు అంతస్తుల గోపురం నిర్మాణం చెయ్యాలని తిర్మానిన్చాము. ఆ శివాలయం ప్రశస్తి ఏమిటంటే, చైత్ర పౌర్ణమి రోజు రెండు బస్తాల వండిన అన్నాన్ని అభిషేకించి, మరుసటి రోజు ఉదయం సాంబారు కలిపి ఆ సంబారు అన్నాన్ని భక్తులకు ప్రసాదంగా పెడతారు. అది అక్కడి ఆలయ సాంప్రదాయం. కుంభాభిషేకానికి విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ చేద్దామని అనుకున్నాము. వాషర్ మాన్ పేట్ బియ్యం వర్తకుల సంఘాన్ని కలిస్తే, అందరిని సంప్రదించి ఇరవై బస్తాల బియ్యం ఇస్తామని చెప్పారు. వారే దగ్గరుండి సేకరించి వారి లారిలోనే మాకు పంపారు. నా స్నేహితుడు శ్రీ మెహతా కొడైకెనాల్ కూరగాయల వర్తకుల సమాఖ్యకు అధ్యక్షుడు. ముప్పైవేలమందికి సరిపడా కూరగాయలు లారీలో పంపమని అడిగాను. నా స్నేహితుడు శ్రీనివాసన్ దిండిగల్ వాసి. అతని “సేవరైట్ సేమ్యా” కర్మాగారం నా అధ్యక్షతన మొదలుపెట్టబడింది. కావలసినంత సేమ్యా పంపమని అడిగాను. వంటవారు, వడ్డించేవారు, పనిచేసేవారు మొదలైనవారికి ఇవ్వడానికి నా కోయంబత్తూరు స్నేహితుడు అన్నూర్ బాలు అరవైవేల రూపాయలు పంపాడు. శ్రీలంక మంత్రి సవుమియమూర్తి తొండమన్ ఈ ఉత్సవానికి హాజరయ్యారు. నామగిరిపెట్టై శ్రీ కృష్ణన్ నాదస్వర గానంతో ప్రారంభమైన ఉత్సవాలు మూడు రోజులపాటు వైభవంగా జరిగాయి. చివరిరోజు నా మంత్రి పదవి నాది కాకుండా పోయింది.
మరుసటిరోజు నా విన్నపాన్ని మన్నించి పరమాచార్య స్వామివారు తమ శిష్యులు జయేంద్ర సరస్వతి స్వామివారిని, శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారిని పంపారు. వారు వచ్చి దేవాలయంలో పూజలు చేశారు. ఈరోజు దాకా అలాగే జరుగుతున్నాయి. ఇంత కూలంకుషంగా రాయడానికి కారణం పరమాచార్య స్వామివారి అవ్యాజ కరుణ ఎటువంటిది అని తెలియజేయడానికే. వారి అనుగ్రహ వాక్కు ఎలా నిజమైందో చెప్పడానికే. నా జీవితంలో ఎన్నటికి మరచిపోలేని సంఘటన.
మధుమేహం వల్ల నేను డా. యం. విశ్వనాథన్ గారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాను. ఒక రోజు ఉదయం పది గంటలప్పుడు కొంతమంది ఐ.ఏ.యస్ అధికారులు పూలమాలలతో నావద్దకు వచ్చారు. కారణం అడుగగా, “ఈరోజు నుండి మీరు మా మంత్రి” అని చెప్పారు. పన్నెండు మంది మంత్రుల్ని తొలగించిన పురచ్చి తలైవర్ (యం.జి.ఆర్) వ్యవసాయ శాఖతో పాటు ఇతర శాఖలను కూడా అప్పగించారు. కృతజ్ఞతలు తెలపడానికి నేను రామవరం వెళ్ళలేదు. నా గురించి ఇతర మంత్రులను అడుగగా, నా అనారోగ్య విషయం తెలుసుకుని నేరుగా ఆసుపత్రికి వచ్చారు. “ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని చూడ్డానికి వస్తున్నారు” అని అధికారులు తెలపగానే మూడవ అంతస్తులో ఉన్న నేను నేను డా. విశ్వనాథన్ గదికి వెళ్లాను. ఆయనే వారిని తీసుకుని నా గదికి వచ్చారు. నా గదికి రాగానే తలైవర్ డాక్టరుతో, “రాజారాం గారికి మెరుగైన చికిత్స అందించండి. ఖర్చు ఎంతైనా పర్లేదు” అని చెప్పారు.
వ్యవసాయ శాఖ నాకు ఇచ్చినప్పుడు రాష్ట్రం అంతా కరువు తాండవిస్తోంది. వర్షాలు లేక భూములన్నీ బీటలువాలాయి. ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. కంచి మహాస్వామి వారిని స్మరించుకున్నాను. కంచి మఠానికి వచ్చాను. మఠం మేనేజరు శ్రీ నిలకంఠ అయ్యర్ నన్ను చిన్నతనం నుండి ఎరుగుదురు. నేను రాగానే వారు నన్ను ఆహ్వానించి, “నీరాక గురించి మహాస్వామివారు చాలాసేపటి నుండి అడుగుతున్నారు. నీకోసం చాలాసేపు చూసి, ఇప్పుడే నిద్రకుపక్రమించారు” అని అన్నారు.
“నిశ్శబ్దంగా దూరంగా నిలబడి దర్శించుకుంటాను స్వామివారిని” అని చెప్పి, స్వామివారు నిదురిస్తున్న వేదిక వద్దకు వెళ్లి నమస్కరించాను. కొద్ది నిముషాల తరువాత మహాస్వామివారు కొద్దిగా పక్కకు తిరిగి వెంటనే లేచి కూర్చున్నారు. నన్ను చూసి, “ఎప్పుడు వచ్చావు?” అని అడిగారు.
“ఇప్పుడే” అని చెప్పాను.
“నన్ను కలవాలని అడిగావు అంట కదా! ఎందుకు?” అని అడిగారు.
“రాష్ట్రంలో వర్షాలు లేవు. అలాంటప్పుడు నాకు వ్యవసాయశాఖ ఇచ్చారు. నేలంతా బీటలువాలింది. వర్షాలు లేని ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఎలా ఉండగలను. అది నాకు మచ్చ అవుతుంది. వర్షాల కోసం మీరు ఏదైనా యాగం జరిపించాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను” అని అడిగాను.
“దీనికోసమే ఇక్కడకు వచ్చావా?” అని అడిగారు స్వామివారు. అవునన్నాన్నేను. కొద్దిసేపు ధ్యానంలో ఉన్నారు. కొద్దిసేపటి తరువాత, “సరే! రేపటినుండి పదిహేను రోజులపాటు కామాక్షి అమ్మవారి ఆలయంలో యాగం నిర్వహించమని చెబుతాను” అన్నారు.
సాయింత్రం చెంగల్పేట్ లో ఒక కార్యక్రమం ముగించుకుని కార్లో కూర్చున్నాను. భోజనం తరువాత కారు శ్రీపెరుంబుదూర్ వైపు వెళుతోంది. నిద్రపట్టక పోవడంతో సీటులో కూర్చుని కిటికీ అడ్డం గుండా బయటకు చూస్తే, నేను చూసిన విషయం ఎవరూ నమ్మరు. కారుపై ఎవరో కుండలకొద్దీ నీరు కుమ్మరిస్తున్నట్టు ఎడతెగని వాన. వర్షం ధారాపాతంగా పడుతోంది. పరమాచార్య స్వామివారి వాక్కు కొద్ది గంటల్లోనే నిజమైంది. రాష్ట్రం మొట్ట పొలాలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. పంటలు సమృద్ధిగా పండాయి. త్రాగునీరు పుష్కలంగా లభిస్తోంది. వ్యవసాయానికి సరిపడు నీరు ఉండడంతో నా శాఖకు మంచి పేరుకూడా లభించింది. ఇవన్నీ జరగడం రాష్ట్రంపైన నాపైన పరమాచార్య స్వామివారి ఆశీస్సులే కారణం.
--- రాజారాం కె, మాజీ మంత్రి. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 3
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/KPDSTrust
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి