1, జూన్ 2022, బుధవారం

మహసరస్వతీ యోగం'..

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

శ్రీ కనకదుర్గా మాతను 24మంది యోగినీ దేవతల సహితంగా ధ్యానిస్తే, 'మహసరస్వతీ యోగం'... 


శంకరులు, "సౌందర్యలహరి" లోని 17వ శ్లోకాన్ని, ఈ విషయాన్నే తెలియచేస్తూ, ఇలా రచించారు,


 సవిత్రీభి ర్వాచాం - శశిమణిశిలాభంగరుచిభి

 ర్వశిన్యాద్యాభిస్త్వాం - సహ జనని సంచింతయతి యఃస కర్తా కావ్యానాం - భవతి మహతాం భగిరుచిభి

 ర్వచోభి ర్వాగ్దేవీ - వదనకమలా మోదమధురైః!! 


యోగిని దేవతలు అనగా ఎవరు....!?


 శ్రీ లలితా సహస్రనామములో, వశిన్యాది వాగ్దేవతలు 

శ్రీ కనకదుర్గా అమ్మవారినే, "యోగిని,యోగదా" అని సంబోధించారు.... 


కనుక శ్రీ కనకదుర్గా అమ్మవారే స్వయంగా యోగినీ దేవత.... 


నిజానికి యోగినీ దేవతలు ఎంతమంది ఉన్నారు...!?


ఎంతోమంది ఉన్నారు...!!


 శ్రీ భాస్కరరాయలుగారు కాశీలో గంగ ఒడ్డునకూర్చొని అమ్మవారిని స్మరించుకొని శ్రీ లలితాసహస్రనామ భాష్యం వ్రాస్తున్నారు.... 


చతుష్షష్ట్యుపచారాఢ్యా అనగా 64 ఉపచారాలతో ఆరాధించబడే తల్లి, చతుష్షష్టి కళామయీ అనగా 64 కళల స్వరూపిణి, *_మహా చతుష్షష్టి కోటియోగినీ గణ సేవితా_* అనగా అరువది నాలుగు కోట్ల మహాయోగినీ గణములు అమ్మవారి సేవిస్తూన్నాయి.... 


మహాయోగిని అనగా ఒక లక్ష మంది యోగినీ దేవతల సేవలందుకునేవారు ఒక మహాయోగిని.... 


శ్రీ భాస్కరరాయలు గారు రాస్తున్న ఈ భాష్యాన్ని చదివిన కాశీ పండితులు ఎగతాళిగా "యోగిని దేవతలను నువ్వు చూసావా..!? అక్కడ ఉన్నది కాబట్టి నిఘంటువు అర్ధాన్ని రాస్తున్నావు" అన్నారు... 


అప్పుడు భాస్కరరాయల వారు వారి నేత్రములకు అమ్మ వారిని స్మరించి గంగా జలమును పూయగా ఎంతోమంది యోగినీ దేవతలు కనిపించి ఆ పండితులకు వారి వారి పేర్లు చెప్పటం మొదలుపెట్టారు... 


శ్రీ కనకదుర్గా మాతయే పరాపర అతి రహస్య యోగిని... ఆవిడయే శ్రీచక్ర బిందు స్థానం అధిదేవత... 


మహా సరస్వతీ యోగాన్ని కలిగించే ఆ 24 మంది యోగినీ దేవతలు ఎవరని ఈ శ్లోకంలో శంకరులు చెబుతున్నారు అంటే, ఎనిమిది మంది వశిన్యాది వాగ్దేవతలు.... 


 ఈ ఎనిమిది మంది వశిన్యాది వాగ్దేవతలు ఎవరంటే,

'వాక్కు' అనగా ప్రకటింపబడిన జ్ఞానం. ఓఒ


అర్ధరహితమైన శబ్దం కాదు .వశిన్యాది వాగ్దేవతల దయ లేకపోతే, మనం పలకలేం , పలికినది తెలుసుకోలేం .


వశిన్యాది వాగ్దేవతలు మొత్తం ఎనిమిది మంది .వీరు సాక్షాత్తు అమ్మవారి నుండి వచ్చిన అమ్మవారి పూర్ణ స్వరూపాలు .


వీరు శ్రీ చక్రంలో బిందువు నుండి మూడవది , త్రైలోక్య చక్రం అనే చతురస్రం నుండి ఏడవది అయిన "సర్వరోగహరచక్రం" లో వుండి ,వీరిని స్మరించినంత మాత్రమున, "ఆది"( మనసుకు వచ్చిన రోగం) మరియు "వ్యాధి"( శరీరానికి వచ్చిన రోగం) లను తొలగించగలరు.


వీరు అక్షర స్వరూపులు. సర్వ మంత్ర స్వరూపులు . వాక్కు విభూతి అనగా వాక్ వైభవము కలవారు . వీరు మన ఉపాధులలో అనగా శరీరములలో ఉండుటవల్లనే మనము మాటలాడగలుగుతున్నాం . దీర్ఘ అక్షరాలను తీసివేస్తే ,అక్షర సంఖ్య 50 .ఆ 50 అక్షరాలను 8 వర్గాలుగా విభజిస్తారు .ఆ ఎనిమిది వర్గాలకు, ఎనిమిది మంది వశిన్యాది వాగ్దేవతలు అధికారిణులు. వీరే ఆ ఎనిమిది మంది వశిన్యాది వాగ్దేవతలు.


1. వశిని అమ్మవారు : అ నుండి అః అనే 16 స్వరాక్షరములకు ఆది దేవి. మన కంఠములొ ఉంటారు. వశీకరణ మంత్రాధి దేవతా. ఈమె దయ ఉంటే లోకంలో అన్ని మన పాదాక్రాంతం అవుతాయి.


 2.కామేశ్వరి అమ్మవారు : 'క' వర్గమునకు దేవి. మన తాళువులలో(దవడలలో ) ఉంటారు. కోరికలను ఈడేర్చే మంత్రాధి దేవతా. ఈమె దయ ఉంటే అన్ని కోరికలు తీరుతాయి. 


3.మోదినీ అమ్మవారు : 'చ' వర్గమునకు దేవి. మన ఔష్టములు (పెదవులలో ) ఉంటారు. ఆనందము, త్రుప్తి కలిగించే మంత్రాధి దేవతా. ఈమె దయ ఉంటే అన్ని ఆనందాలే. 


4.విమలా అమ్మవారు : 'ట' వర్గమునకు దేవి. మన దంతములలో ఉంటారు . ఈమె దయ ఉంటే నిర్మల జ్ఞానం అనగా బ్రహ్మ జ్ఞానం లభిస్తుంది.


5.అరుణా అమ్మవారు : 'త' వర్గమునకు దేవి. మన అంగిళిలో ఉంటారు. ఈమె దయ ఉంటే సకల దేవతల కృప కలుగుతుంది. 


6.జయిని అమ్మవారు : 'ప' వర్గమునకు దేవి మరియు అభ్యంతర వాక్ స్థానము . ఈమె దయ ఉంటే జయం లభిస్తుంది.


7.సర్వేశ్వరీ అమ్మవారు : 'య' వర్గమునకు దేవి మరియు బాహ్య వాక్ స్థానము . ఈమె దయ ఉంటే అధికారం లభిస్తుంది.


8.కౌళినీ అమ్మవారు : 'ష' వర్గమునకు దేవి. మన నాలుక పైన నడయాడు తల్లీ . ఈమె దయ ఉంటే కుండలినీ యోగం లభిస్తుంది.


వీరుకాక ద్వాదశ (12) మంది యోగినులు ఉన్నారు. వారే 


1) విద్యా యోగినీ 2) రేచికా యోగినీ 3) మోచికా యోగినీ 4)దీపికా యోగినీ 5)అమృతా యోగినీ

6) జ్ఞాన యోగినీ 7) ఆప్యాయనీ యోగినీ 8) వ్యాపినీ యోగినీ 9) మేధా యోగినీ10) వ్యోమరూపా యోగినీ 11) సిద్దరూపా యోగినీ 12) లక్ష్మీ యోగినీ


 శ్రీ చక్రములోని దశారద్వయ అనగా 20 కోణములలో, పైన చెప్పబడిన 12 మంది యోగినీ దేవతలు మరియు ఎనిమిది మంది వశిన్యాది వాగ్దేవతలు ఉంటారు.


గంధాకర్షణి, రసాకర్షణి, రూపాకర్షణి, స్పర్శాకర్షణి అని నలుగురు యోగినీ దేవతలు శ్రీ చక్రములోని నాలుగు ద్వారములలో ఉంటారు.


ఈ 24 మంది యోగిని దేవతలను శ్రీ కనకదుర్గా మాతతో కలిపి స్మరించిన వారికి మహాసరస్వతీ యోగం సిద్ధిస్తుంది అని శంకరులు చెప్పిన రహస్యం.


               శ్రీ శంకర భగవత్పాద విరచిత

                       

                          సౌందర్య లహరి.


సౌందర్యలహరి మరియు శ్రీ లలితాసహస్రనామ సమన్వయ సాధనా మరియు శోధనా కొనసాగుతుంది... 


శ్రీ కనకదుర్గా, దేవతా, పరదేవతా, నమోస్తుతే!!


*సేకరణ:* శ్రీ శర్మద గారి పోస్టు నుంచి.

కామెంట్‌లు లేవు: