1, జూన్ 2022, బుధవారం

"కర్మ మర్మం

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🧘‍♂️78-కర్మ - జన్మ🧘‍♀️*

🕉️🌞🌏🌙🌟🚩


 *8 వ ఆధ్యాయం - "కర్మ మర్మం"*

 *(కర్మ ప్రయోజనం)*



 ఓ చిన్న గదిలో దీపం వెలుగుతుంది. కొందరు ఆ వెలుగులో భగవద్గీత చదువుకుంటున్నారు. మరి కొందరు ఎవరివో చెక్కుల మీద దొంగ సంతకాలు చేస్తున్నారు.



భగవంతుడి కరుణ ఆ దీపం లాంటిది. గీత చదివినవాడు తరిస్తే, దొంగ సంతకాలు పెట్టినవాడు జైలుకి వెళ్ళచ్చు. తప్పు ఆ దీపందా? 



 మన కర్మ ఫలాలని అందించడంలో భగవంతుడు కేవలం సాక్షీభూతుడు మాత్రమే. సూర్యుడి వెలుగులో కొందరు మంచి కర్మలు చేస్తారు. దాని పుణ్యం సూర్యుడికి చెందదు.



 అలాగే కొందరు చెడ్డ కర్మలని చేస్తారు. దాని పాపం కూడా సూర్యుడికి చెందదు. ఇలాగే భగవంతుడు కూడా ప్రతి జీవి హృదయంలో  తటస్థంగా,  ఆ జీవి కర్మలకి సాక్షీ భూతుడుగా మాత్రమే ఉంటాడు.



జీవులు చేసే కర్మలకి ఫలితంగా అనుభవించే సుఖదుఃఖాలతో దేవుడికి ఏ మాత్రం సంబంధం లేదు. దేవుడు కర్మ ఫల ప్రదాత. అంటే బేంకులో కేషియర్ లాంటివాడు.



మన చెక్కుకు తగినంత డబ్బే కేషియర్ ఇస్తాడు - అదీ అందుకు తగ్గ జమ ఉంటేనే. దేవుడు కూడా మన కర్మలని అనుసరించే మనకి ఫలాలని ఇస్తాడు. దీన్ని గురించి శ్రీ మళయాళ స్వామి ఇలా చెప్పారు.



 మనం చేసే కర్మలకి పూర్తిగా మనమే బాధ్యులం తప్ప పరమాత్మ కాదు. ఎలాగంటే, వివిధ వృక్షాలు రకరకాల రుచులు గల పళ్ళని ఇస్తాయి. కొన్ని తియ్యటి పళ్ళని, కొన్ని వగరు, ఇంకొన్ని చేదు, మరికొన్ని పులుపు రుచి గల పళ్ళని ఇస్తాయి.



కాని ఆ వృక్షాలు ఆ పళ్ళని ఇవ్వడానికి కావలసిన శక్తిని భూమి, సూర్యుడు ఇస్తున్నా వాటి ఫలాల గుణ దోషాలకి ఆ రెంటికీ బాధ్యత లేదు. అలాగే మనుషులు చేసే కర్మలకి తగిన శక్తిని పరమాత్మ ఇస్తాడు.



 అంతే కాని ఆ కర్మలకి పరమాత్మ కారణం కాడు. వారి వారి సంస్కార బీజాల వల్ల మనుషులు దుష్కర్మలని చేసి దుఃఖాన్ని, సుకర్మలని చేసి సంతోషాన్ని అనుభవిస్తున్నారు.



*నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః* 

*అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః*

                                -గీత 5-15 


*భావం:-* 


*సర్వవ్యాపి అయిన పరమాత్మ ప్రాణుల పుణ్య పాప కర్మలలో దేనికీ భాగస్వామి కాడు. అజ్ఞానంతో జ్ఞానం కప్పబడి ఉండటంతో ప్రాణులు మోహితులు అవుతారు.*


(తరువాత భాగంలో -  *పరమాత్మకు కర్మ బంధం ఉండదా?* )


🕉️🌞🌏🌙🌟🚩

కామెంట్‌లు లేవు: