16, ఆగస్టు 2022, మంగళవారం

ధర్మాకృతి

 ధర్మాకృతి : శ్రీమఠం ఖైదు అయిన కథ -3


స్వామివారికి కూడా ఒక్కటే మనఃక్లేశము. నా కాలంలో మఠానికి ఇంత క్లిష్ట పరిస్థితి వచ్చిందేమా అని. నేనీ కేసు వ్యాజ్యము లాంటి లౌకిక వ్యవహారాలలో ప్రవేశించాల్సిన అవసరం రాకుండానే సర్వజనామోదకంగా ఏది జరిగితే మంచిదో ఆ మంచి జరిగి ఉండకూడదా! కక్షిదారులు తమకే ఆ ప్రతిష్ఠరావాలని కేసు వేసినపుడు, ఎదురు వ్యాజ్యమాడక వారికే ఆ ప్రతిష్ఠ వదిలితే పోయేదికదా! అని వారు ద్వితీయుని ముందు క్లేశపడినారు. కార్యనిర్వాహణాధికారిగా వున్న వీరికి తాము సరిగా కార్యము నిర్వర్తింపజాలనందులకే స్వామివారికి మనఃక్లేశమేర్పడినదని బాధవేసింది.


బాగుంది! విజయం కలిగిన వెంటనే మనకు అహంకారమెక్కడ పెరిగిపోతుందో అని అమ్మ ఈ రకమైన కష్టములు కలుగజేస్తుంది. ఆమె కృప చేతనే కష్ట నివృత్తికి దారి దొరుకుతుందనే నమ్మకంతో మనస్సులో నొచ్చుకోకుండా మన కర్తవ్యము మనం నిర్వహించుకు పోతూ ఉంటే తుదకు సంతోషం, జయం లభిస్తాయి. ద్వితీయులు శ్రీచరణులపై, అమ్మవారి అనుగ్రహ బలంపై నమ్మిక యుంచి ఈ క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనడానికి తన వల్లనయ్యే అన్ని ప్రయత్నాలూ చేయడానికి తీర్మానించుకొన్నారు. తన ప్రయత్నాలు ఏ రకంగా ఫలిస్తాయో అని స్వామివారితో సహా ఎవరికీ తెలియపరచకుండా, చడీచప్పుడు చేయకుండా తాను నిర్ణయించుకొన్న ప్రణాళికను అమలుపరచ సంకల్పించారు. 


వెంటనే తంజావూరు వెళ్ళారు. అప్పటికే సర్వోజీ రాజా కాలం ముగిసి వారి పుత్రుడు శివాజీ మాహారాజు రాజ్యానికొచ్చారు. వారి వద్దకు పోయిన ఈ ద్వితీయులు మఠగౌరవానికి భంగము వాటిల్లని విధంగా నాజూకుగా విషయం తెలియజేశారు. ఒక పెద్ద వ్యాజ్యం అయింది. తంజావూరు సీమకే ప్రతిష్ఠ తెచ్చిన శ్రీమఠాన్ని తిరుచ్చి నుండి కుంభకోణం పోయేటప్పుడు తంజావూరు ఆహ్వానించి తగిన మర్యాద చేస్తే బాగుంటుందని సూచించారు. రాజావారు ఏ రకమైన ఇబ్బందుల్లో వున్నారో, వెంటనే ఆ సూచనను ఒప్పుకోనూ లేదు, తిరస్కరించనూ లేదు. మూడునాళ్ళు ఆలోచించి తుదకు తన అశక్తతను తెలియబరిచారు. రాజుగార్ని కలిసి శ్రీమఠాన్ని ఈ ఇక్కట్ల నుండి కొంత వరకూ బయటపడవేయవచ్చని దిటవు చేసుకున్న ఈ ద్వితీయుని హృదయం మరల దిగజారిపోయింది. తన ఉద్దేశ్యము మంచిదే అయినప్పటికీ తన గురువులయిన శ్రీచరణులు ఆజ్ఞ తీసుకొనకయే, వారి ఆశీర్వాదము లేకయే ఈ ప్రయత్నము చేసినందున శ్రమ వృధా అయింది అని చాలా బాధపడ్డారు. స్వామివారి వద్దకు తిరిగి వచ్చి తన హృదయ వేదనంతా వెళ్ళబోసుకున్నారు. స్వామివారు ఎంతో దయతో ఓదార్పు వాక్యములు పలికి “అమ్మ దయ! అంతా ఆమె దయకు వదిలి మనం బయలుదేరదాం అంటూ శ్రీమఠం కుంభకోణం తిరుగు ప్రయాణానికి ఆజ్ఞాపించారు. 


శ్రీమఠం కుంభకోణానికి బయలుదేరింది. తిరువానైక్కావల్ నుండి కుంభకోణం పోయేటప్పుడు తంజావూరు మీదుగా పోనవసరం లేదు. కోవలడి మీదుగా మఠం పరివారం, బళ్ళు, లొట్టి పిట్టలు, ఏనుగులు, గుర్రపు బళ్ళు ఈవిధంగా సాగిపోతున్నాయి. వెనుక మేనాపై స్వామి వెళుతున్నారు. బళ్ళు తిరువయ్యార్ కి కావేరి అవతల గట్టున సాగిపోతున్నాయి. హఠాత్తుగా అనేకమంది సిపాయిలు ఆ బళ్ళను చుట్టుముట్టి కావేరిలో దింపి ఇవతలి గట్టు మీదుగా తంజావూరు మార్గం పట్టించారు. బండి వారంతా ఇవి శ్రీమఠం బళ్ళు, మేమీ గట్టునే పడి కుంభకోణం పోవలెనని విన్నవించుకొన్నారు. సిపాయిలు వింటేనా! వారిలో కొందరు ఆ బళ్ళకు కావలిగా పోయారు. వెనుక వస్తున్న ఏనుగులు, గుఱ్ఱములు, ఒంటెలకు కూడా అదే గతి పట్టింది.


స్వామి మేనా కూడా ఆపబడింది. అయితే వారితో ఎంత మర్యాదతో ప్రవర్తించారు. రాజుగారి పురోహితులు పూర్ణ కుంభములతో స్వామిని తంజావూరు విచ్చేయవలెనని ప్రార్థించుతుండగా, నాల్గు ప్రక్కల సిపాయిలు మొహరించి ఉన్నారు. ప్రస్తుత కాలంలో కూడా సిపాయిలు coup చేసినపుడు రాజుగారిని ఎంతో మర్యాదగా గృహనిర్బంధం చేస్తారు కదా! తానావిధంగా చేయబడినానని అర్థం చేసుకున్నారు స్వామివారు.


స్వామివారు అంతకు 6-10సం. ముందు కామాక్షీ దేవి ఆలయము జీర్ణోద్ధారణ, కుంభాభిషేకము చేసిన వారు. అమ్మవారే స్వప్నంలో ఆదేశించి వారి మూలంగా కుంభాభిషేకం చేయించుకున్నది. పిదప ఇప్పుడు అఖిలాండేశ్వరీ తాటంక ప్రతిష్ఠ చేశారు. అయినా తిరువానైక్కావల్ నుండి బయలుదేరే ముందు అంతా అమ్మ దయకు వదలి బయలు దేరుదాం అని కదా బయలుదేరారు. “అమ్మా నీదయ! ఈ రకంగా నడుపుతున్నావా? అయితే ఇదీ సమ్మతమే” అనుకుంటూ సిపాయిల మధ్యలో బ్రాహ్మణుల వేదఘోష నడుమ స్వామి తంజావూరు బయలుదేరారు. 


ఈ రకంగా సిపాయిలను పంపినది సర్వోజీ మాహారాజా వారి పుత్రులు శివాజీ మహారాజా! శ్రీ మఠాన్ని ఆహ్వానించి మర్యాద చేయడానికి తగిన వసతి లేదని మూడు రోజుల ప్రతీక్షానంతరముచెప్పినది వీరే! శ్రీమఠాన్ని శివాజీ మహారాజా అరెస్ట్ చేయించారు అని మొదట్లో చెప్పాను కదా! అది వీరిని ఉద్దేశించి చెప్పినదే. మీరందరూ ఛత్రపతి శివాజీ అని ఏమరుపాటునొంది ఆశ్చర్యపోవాలనే ఆ రకంగా చెప్పాను. కతారసం కోసం ఈ రకంగా కికురించడం కవులకు సహజమే కదా! మీకందరికీ చరిత్ర గుర్తు ఉండి ఉంటే అంత ముందు శతాబ్దంలోని ఛత్రపతి ఈ కథలోనికి ఎలా వచ్చారా అని మీకు వెంటనే సంశయం కలిగి నన్నడిగి ఉండేవారే!


(సశేషం)


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: