5, మే 2023, శుక్రవారం

బ్రాహ్మణ గుర్తింపు

 బ్రాహ్మణ గుర్తింపు 

ఒకసారి నా మిత్రునితో ఏదో   చర్చిస్తూ వున్నప్పుడు  బ్రాహ్మణుల గురించిన చర్చ వచ్చింది.  నా మిత్రుడు తెలుగు వాడు కాదు అతను ఉత్తరదేశపు బ్రాహ్మణుడు. ఉదరనిమిత్తం ఇక్కడికి వచ్చాడు. నాకు ఆయన చెప్పిన విషయం నచ్చింది అది మన సోదర బ్రాహ్మణులతో పంచుకోవాలని ఇది వ్రాస్త్తున్నాను. 

బ్రాహ్మణుడు మూడు గుణముల వలన గుర్తింపబడతాడు అని ఆయన తెలిపారు అవి 

1) స్వరూపు, (ఆకారము)

2) స్వర్ (వాక్కు మాట్లాడే విధానం)

3) స్వభావం. (నడవడిక)

ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. 

మొదటిగా స్వరూపం సహజంగా బ్రాహ్మణులు  చాలావరకు అందంగా, ఆకర్షణీయంగా   వుంటారు దానికి కారణం బహుశా వారు భుజించే ఆహరం అయివుండొచ్చు లేదా వంశపారంపర్యంగా సంప్రాప్తించిన అనువంశిక లక్షణాల వలన కావచ్చు. అంతేకాక వారి వస్త్రధారణ అంటే పంచకట్టుకోవటం, గుండుచేసుకొని పిలక కలిగి ఉండటం. నిత్యము గాయత్రి మంత్రానుష్టానము చేయటము, సత్కర్మలను అనగా జప, తప హోమాదులు చేయటము వలన ముఖము, నుదుట కుంకుమ లేక తిలకం ధరించటం వలన  బ్రహ్మత్వముతో తొణకిసలాడుతూ ఉండి ముఖ కమలము నిత్య  శోభాయమానంగా ఉండి చూపరులను ఆకట్టుకొనే విధంగా తన ముఖ తేజస్సుతో గుర్తింపబడతాడు.

ఇక రెండు స్వరము: బ్రాహ్మణుడి భాష అది ఏ బాష అయినా కానీయండి చక్కటి ఉచ్చారణ, బాషా స్పష్టత, మృదు  బాషత్వము, ఇతరులు వినుటకు ఆసక్తి చూపించేలా భాషించటం ఇవ్వన్నీ కూడా బ్రాహ్మణుడికి తాను చేసే కర్మల వలన కలుగుతాయి. ఈ రకంగా బ్రాహ్మణుడు  సమాజంలో గుర్తించేలాగ చేస్తాయి. 

తదుపరి లక్షణము స్వభావము: బ్రాహ్మణుడి స్వభావము సత్వగుణవంతమై మృదుత్వముగా వుంది అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది. ఎంతటి విపత్కర పరిస్థితులల్లో కూడా తొణకకుండా స్థితప్రజ్ఞత కలిగి బ్రాహ్మణుడు ఉండటమే కాకుండా మోసము, దగా, కుట్రలు చేయటము, దుర్వ్యూహాలు పన్నటం, హింసించటం, ఆగ్రహావేశానికి లోనుకావటం, అన్యాయానికి పాల్పడక పోవటం,  దుర్వేసనాలకు లోను కాకుండా వుండటము, ఎల్లప్పుడూ సమాజ హితం కోరటం అంటే లోకా సమస్తా సుఖినో భవంతు అని కోరుకోవటం ఇలాంటి సద్గుణములు కలిగి ఉండి స్వభావము చేత గుర్తించ బడతాడు. ఇవి బ్రాహ్మణుడిని చుసిన వెంటనే గుర్తించటానికి కనపడే లక్షణాలు.

  ఈ రోజుల్లో మన దురదృష్టానికి చాలా అరుదుగా బ్రాహ్మణులు గుండు పిలక కలిగి వుండటము చూస్తున్నాము, పౌరోహిత్యం చేస్తున్న బ్రాహ్మణులుకూడా శిఖ ధారణ లేనివారు అనేకులు మనకు తారస పడుతున్నారు. పంచ కట్టటం కొందరు పౌరహిత్యులకు భారంగా మారి మధ్యకు ధోవతిని మడిచి లుంగీ లాగ ధరించే వారు కూడా సమాజంలో దర్శనం ఇస్తున్నారు. యజ్ఞ యాగాది క్రతువులమాట పరమేశ్వరుడెరుగు ప్రతి రోజు గాయత్రీ అనుష్ఠానం ఎంతమంది చేస్తున్నారు అనేది ప్రస్నార్ధకమే.  ఇటీవల కంచి కామకోటి  పీఠాధిపతులు ఒక సందర్భంలో పేర్కొన్న విషయం ఇక్కడ ప్రస్తావించదలచాను.  స్వామి ఏమంటారంటే ఈ రోజుల్లో అనేకమంది బ్రాహ్మణ కులసంఘాలు పెడుతున్నారు, బ్రాహ్మణుల అభివృద్ధికి పాటుపడుతున్నాము అంటున్నారు.  కనీసం ఆ సంఘ పెద్దలైన నిత్య సంధ్యావందనం చేస్తున్నారా.  చేయకపోతే చేయండి చేయటమేకాక సంఘసభ్యులకు మార్గదర్కులుగా వుండండి అని హితవు చెప్పారు. బ్రాహ్మణపరిషత్ వారు బ్రాహ్మణులకు అనేక పథకాలద్వారా లాభాలు చేకూర్చటానికన్నా ముందు బ్రహమణులను బ్రాహ్మణులుగా మలిచే ప్రయత్నం చేయవలసిన అవసరం ఎంతయినా వుంది. 

  అగ్రతః చతురో వేదాః 

పృష్ఠతః స శరం ధనుః  

ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం 

శాపాదపి శరాదపి

శిరస్సులో అంటే మదిలో నాలుగు వేదాలు కలిగి వీపున ధనుర్బాణాలు కలిగిన బ్రహ్మమనుడు శాపమును ఇవ్వగలదు, శరమును సందించగలడు అంటే రెండు విధములుగా సమర్ధుడు అని ఫై శ్లోకం చెపుతున్నది.  మనం ఎంతవరకు ఈ శ్లోకాన్ని అన్వయించుకోవటానికి సమర్థులం అని ప్రతి బ్రాహ్మణోత్తముడు యోచించాల్సిన సమయం ఆసన్నమైనది. ఇప్పటికి సనాతనధర్మం మొక్కవోని పటుత్వం కలిగి ఉండటానికి కారణం బ్రాహ్మణులే ఈ విషయాన్నీ ప్రతి బ్రాహ్మడు గుర్తించి ధర్మాచరణలో నిమగ్నుడైహిందూ  సమాజ,  శ్రేయస్సుకై ప్రాకులాడవలెను. 

ఓం తత్సత్ 

ఓంశాంతి శాంతి శాంతిః 

మీ భార్గవ శర్మ

కామెంట్‌లు లేవు: