🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
🌷
*ఇడ్లీ - ఆకులు*
[By వారణాసి శ్రీరామా కృష్ణ శాస్త్రి 18/04/2023]
" ఏమి తల్లీ ఇప్పటికి ముప్పది ఏండ్లుగా కాపురము చేయుచున్నాను అని చెప్పినావు. మరి ఇప్పుడు విడాకులు ఎందుకు అడిగేదీ ఈ కోర్టు వారికి వివరించి చెప్పమ్మా! అని జడ్జీ గారు అడిగిరి.
ఆ ఇల్లాలు ఇట్లన్నది " నా ఖర్మ బాగో లేక నాకు పదహారో ఏటనే పెండ్లి అయినది.
మా వారికేమో ఇడ్లీల పిచ్చి. ఈ పిచ్చి వారికి వారి అమ్మమ్మ చేసి తిన పెట్టిన అవిటి కుడుముల వల్ల వచ్చినది. ఆయనకు రోజూ ఇడ్లీలు కావలెను. అవి తినిన కానీ దుక్క బలవనని ఆయన నమ్మకము. అవియన్న నాకు డోకు. చివరికి వేవిళ్లు సమయమున కూడా చింతకాయ పచ్చడి నంజుకొని ఇడ్లీలే తింటిని.
డోకులు + వేవిళ్లు కలిపి చచ్చి బ్రతికి నట్లాయితిని. మావారు వూరిలో ఎక్కడ కొత్తగా పాక హోటల్ వెలిసిన ను అక్కడికల్లా వెళ్లి తాను ఇడ్లీలు తినివచ్చి - నాకిన్ని తెచ్చి ఇచ్చును. ఆ మరునాడు నేను ఆ ఇడ్లీలను పోలిన ఇడ్లీలు అల్లం చెట్నీలు కారపు పొడులు చేయవలెను. ఏ మాత్రము తేడా వచ్చినా సహింపరు. నాతో ఎడమొఖం పెడమొహం వేద్దురు. ఆదివారం నాడు ఏదన్న స్టార్ హోటల్ నుండి ఇడ్లీ తెచ్చుకొని, తిని - ఆ మరునాడు నుండీ నేను వారిలాగా సాంబారు సప్లై చేయలేదని నా మీద అలుగుదురు. ఆయన ఏ రోజున ఏ ఊపున ఎన్ని ఇడ్లీలు తిందురో నావూహకు అందదు. రొండు ఇడ్లీకి రొండు జగ్గులు సాంబారు చొప్పున చేయ నా వల్ల అగుటలేదు. నాకు లెక్కలు లో తక్కువ మార్కులు. ఇది కాక ఇడ్లీ పిండి నేనే రుబ్బనిచో ఆయనకు రుచిలో తేడా కొట్టును. మిక్సీ వేసినది ఆయన వంటికి వేడి ఆట. ఇడ్లీలలోకి కారంపొడి నేను దంచవలెను.
అల్లం చెట్నీ రుబ్బవలెను. వెన్న చిలికి అచ్చ నేయి కాచవలెను. *అప్పుడప్పుడు డ్రాయింగ్ కూడా గీసి ఇచ్చి ఇడ్లీ సైజు చెప్పెదరు.* ఆ రకముగా చేసినచో *పట్టు చీర* అని ఆశపెడుదురు. ఈనాటి ఇడ్లీ వల్ల నాకు పట్టు చీర వచ్చునో లేదో అని నాకు టెన్షన్ వచ్చును. ఇప్పటివరకూ నాకు ఒక్క పట్టు చీరా రాలేదు - పిచ్చి తిక్క మాత్రము వచ్చినది. అప్పుడప్పుడు దోస అంత ఇడ్లీ వేయమని - ఇంకో సారి రూపాయ బిళ్ళంత చిట్టి ఇడ్లీలు వేయమని అడుగుదురు. నాకొడుకు ఇప్పడు పాతిక ఏండ్లవాడైనాడు. వాడికి మొదటిలో పూరీల పిచ్చి. వాళ్ళ నాన్నకు తెలియకుండా వాడు పూరీలు తిని నాకు తెచ్చుచుండెడి వాడు. ఇప్పుడు వాడికి గ్యాస్ వచ్చి, వాడు కూడా ఇడ్లీలపై పడినాడు.
పురిటి కి పోయిన నా కోడలు తిరిగి వచ్చినది. ఆ పిల్ల కూడా - తన కొడుకు క్షేమము కొరకై - నాకొడుకు తో పాటు కూచొని ఇడ్లీలు మాత్రమే తినుచున్నది. ఆమె బాలింత కాన, కాచిన నేయి, వేచిన కరివేపాకు కారం పొడి ఆమెకు తప్పక ఉండవలెను. నా కూతురు కొడుకున్నాడు. అందరూ కలిపి వాడికి నేతి ఇడ్లీలు తినుట మప్పినారు. వాడు స్కూల్ ఆటో లో స్కూల్ కు పోవుచూ, ఒక్క క్షణము లోనికి వచ్చి - ఇడ్లీ ఇడ్లీ అని టిఫిన్ బాక్స్ చూపును. అందులో ఇడ్లీతో పాటు ఆవకాయ - టమోటా జ్యూస్ వేయవలెను. అందరూ వెళ్లిరి అనుకొనుచున్నంతలో "అమ్మా ఇడ్లీలు వున్నవానే. నేను ఉల్లి దోసెలు తింటిని గానీ కడుపు నిండలేదు" అనుచూ నా కూతురు వచ్చును. దానికి ఇడ్లీలు మప్పినది దాని తండ్రియే. ఈ రకముగా నేను ప్రతి రోజు సాయంత్రము నాలుగు నుండి ఎనిమిది వరకూ మరునాటి ఇడ్లీలకు ప్రేపరేషన్లు - ఉదయము ఆరు నుండి పది వరకు ఆరారగా వేడి వేడి ఇడ్లీ వేయుచూ తీయుచూ కాలము గడుపుచున్నాను. చుట్టు పక్కల పిల్లలు నన్ను ఇడ్లీ బామ్మ అనుచున్నారు - ఇదంతా ఈయన వల్లనే. సహధర్మచారిణిగా నేనుకూడా ఆయనకు పుట్టినదే తినవలయునని రూలు కదా! ఈయన ఇడ్లీ పిచ్చి వల్ల నేను - బొండాలు బజ్జీలు పూరీలు ఉల్లి దోశలు ఊతప్పలు ఎరుగను. నాబ్రతుగు ఇడ్లీ పాలు చేసినాడు. ఎప్పటికీ విముక్తి కలగనట్లు తోచుచున్నది. నాకు విడాకులిచ్చి నన్ను రక్షింపవలసినదని చెప్పుకొని కోరుచున్నాను" అని ఆ ఇల్లాలు ముగించినది.
జడ్జీ గారు ఓర్పుగా అంతా వినిరి. అడ్డు ప్రసంగాలు చేయలేదు. అందున మన కధ నేరుగా హంస నడక నడిచినది. చివరికి ఆయన ఇట్లనిరి...
*"అమ్మడూ - ఇడ్లీకోసము విడాకులు అడుగుట.. ఇచ్చుట ఈ కోర్టులు ఒప్పవమ్మా - సరే కానిమ్ము కానీ నీవు కోరినన్ని రకాల టిఫిన్లు కోరినన్ని పొట్లాలు నీకు ఇప్పించవలసిందిగా నీ కోడలికి ఆర్డర్ వేయుచున్నాను. ఆమె తన నెల జీతములోనుండి నీకు అన్ని టిఫిన్లు ఇప్పించవలెను. ఇకపై నీముందు ఇడ్లీ పేరెత్తినా, ఇడ్లీ చేయమని నీకు హుకూం వేసినా - మూడు నెలల జైలు శిక్ష తప్పదని నీ మగాడికి హెచ్చరించుచున్నాను.
సేకరణ: శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి