5, మే 2023, శుక్రవారం

మురుగన్ భక్తి

 మురుగన్ భక్తి


భారతదేశంలో పుట్టి, ఈనాటికీ, ఇక ఎప్పటికీ ప్రపంచం చేత కొనియాడబడుతున్న మహాపురుషులు పరమహంస పరివ్రాజక మహాసన్నిధాన పూజ్య శ్రీ చన్ద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు. అటువంటి కంచి పరమాచార్యులవారి అనుగ్రహానికి పాత్రుణ్ణి అవ్వడం నా పుణ్యఫలం. ఇన్నేళ్లల్లో నేను చేసుకున్న మహాస్వామి వారి దర్శనాలు, నేను పొందిన స్వామివారి ఆశీస్సులు తలచుకుంటే అవన్నీ ఈరోజు మరలా పొందినట్టు భావిస్తున్నాను.


మహాస్వామి వారి నుండి నాకు లభించిన ఒక మంచి అనుగ్రహం ఉంది. దాదాపు నలభై నిముషాల పాటు మహాస్వామి వారితో ఏకాంతంగా సంభాషించగలగడం. దాన్ని నేను మరచిపోకపోవడమే కాదు, తలచుకుంటే ఈనాటికి నాలో ధార్మిక ప్రకంపనలు కలుగుతాయి. అది బహుశా 1983లో జరిగినది అనుకుంటా. అప్పుడు కాంచి ముని కర్నూలులో మకాం చేస్తున్నారు.


నేను కేసుల నిమిత్తం న్యాయస్థానానికి వెళ్లాను. వాటిని ముగించి, నా భార్యతో కలిసి కాంచి ముని వద్దకు వచ్చి మాట్లాడాను. స్వామివారు నన్ను చూసిన వెంటనే, నా స్వస్థలం గురించి అడిగి, “నీవు తిరుప్పళనం బ్రహ్మశ్రీ పంచపకేశ శాస్త్రి మనవరాలి భర్తవు కదూ?” అని అడిగారు. నా భార్య తాతగారు హరికథా కాలక్షేప చక్రవర్తి. అలాగే మా మావగారు శ్రీ టి.పి. కళ్యాణరామ శాస్త్రి గారి గూర్చి, “అతను ఏమి చేస్తున్నారు? భాగవత కాలక్షేపమే చేస్తున్నారా?” అని అడిగారు. నా ఆశ్చర్యానికి అవధులు లేవు.


నన్ను ఆశ్చర్యపరచింది అంతటి జ్ఞాపకశక్తే. తరువాత నేను నా గురించి స్వామివారికి చెప్పాను. 1937నుండే నేను సుబ్రహ్మణ్యుడి భక్తుడినని; మా నాన్నగారు కందసామి అయ్యర్ చిన్నప్పటి నుండి చివరి రోజుల దాకా ఇంట్లో రోజూ సుబ్రహ్మణ్యుడికి పూజ చేసేవారు; దాన్ని కొనసాగించమని కుటుంబసభ్యులకు తెలిపారు.


దాంతోపాటు, 1937లో చెన్నైలోని కందకొట్టంలో శ్రీ రామలింగం పిళ్ళై గారి “పరిపూజిత పంచామృత వణ్ణం” (పంబన్ స్వామిగా ప్రసిద్ధులైన శ్రీల శ్రీ శుద్ధాద్వైత కుమార గురుదాస స్వామివారు రచించినది)పై ప్రవచనం విన్నానని; దాన్ని స్వరబద్ధంగా అయిదు రాగాలలో పాడడటం నేర్చుకోవడానికి చాలాకాలం సాధన చేశానని; అరుణగిరినాథర్ తిరుప్పుగళ్ మరియు ఈ వణ్ణాలు వేరే తాళాలలో ఉన్నాయని చాలాకాలం క్రితం వాటిని వర్గీకరించాచి, ఎన్నో సభలలో పాడటం జరిగిందని తెలిపాను.


నేను చెప్పిన విషయాన్ని పరమాచార్య స్వామివారు ఎంతో ఆశ్చర్యంతో విని, ఆ వణ్ణాలలో కొద్ది భాగాలను పాడమని, శ్రద్ధగా విని, “అప్పా! నువ్వు చెప్పిన పంబన్ స్వామి గురించి మా స్వామినాథన్ గారు (మహామహోపాధ్యాయ శ్రీ స్వామినాథ అయ్యర్) నాకు ఎందుకు చెప్పలేదు? కనీసం, జగన్నాథన్ (కి. వ. జగన్నాథన్) కూడా నాటో చెప్పలేదు” అని అన్నారు. తరువాత పంబన్ స్వామివారు కాంచీపురం కందకొట్టంలో సేవ చేశారని చెప్పగా, “అప్పా! ఆ విషయం నాకు తెలియదు. నేను అప్పుడు కుంభకోణ మఠంలో ఉండేవాణ్ణి. నువ్వు చెప్పిన ఈ విషయం మొదటిసారి విని నాకు చాలా సంతోషంగా ఉంది” అన్నారు. అంతటి మహాత్ముల సరళత్వాన్ని, గొప్పదనాన్ని ఎలా అక్షరబద్ధం చెయ్యగలం?


స్వామివారు నన్ను ఆశీర్వదించి, ఒక శాలువా ఇచ్చి, “అప్పా! నా పేరు కూడా స్వామినాథన్ యే. మా నాన్నగారి పేరు కూడా సుబ్రహ్మణ్యం యే. మీ నాన్నగారి పేరు కందసామి. సుబ్రహ్మణ్య స్వామి విశేషణం అయిన ‘స్వామి’ గురించే నేను మాట్లాడాను. నీవు మంచి మురుగన్ భక్తుడివి అవుతావు”.


ఆ అనుగ్రహ ఫలాల చేతనే, ఈనాటికీ ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం ఆత్మానుభావం కోసం, పలు సందర్భాల్లో పంబన్ స్వామి సమాధి ఉన్న తిరువాన్మియూర్ లో మరియు అనేక మురుగన్ క్షేత్రాలలో, తిరుప్పుగళ్ ముఖ్యంగా పంచామృత వణ్ణాలు సంగీత ఉపన్యాసం చేస్తున్నాను. మురుగా శరణం!


--- కె. ఇరాజ, న్యాయవాది, చెన్నై - 78. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: