🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. ♦️ *ఆర్య చాణక్య*♦️
*పార్ట్ - 51*
బౌద్ధ క్షిపణకుడు జీవసిద్ధి అర్ధ నిమిలిత నేత్రాలతో ధ్యానంలో ఉన్నాడు. వందలాది మంది పౌరులు అతని అనుగ్రహం కోసం ఆత్రుతతో నిరీక్షిస్తున్నారు. సుకల్పానందుడు, రాక్షసామాత్యాదులు అక్కడికి వచ్చినప్పటికీ వారిని గమనించినప్పటికీ ప్రజలు వారిని గౌరవించాలనే స్థితిలో లేరు. వారందరి దృష్టి జీవసిద్ధిపైననే కేంద్రీకృతమైవుంది. జీవసిద్ధి ఎవరిని అనుగ్రహిస్తాడో వాళ్ళని మాత్రమే పేరు పెట్టి పిలుస్తాడు. అలా పిలిచిన వాళ్ళు తన వద్దకు ఏ పని మీద వచ్చారో చెప్పి, దానికి తగ్గ నివారణ విధానాన్ని కూడా ప్రసాదిస్తాడు. అతను ఎవరిని పిలుస్తాడో ? ఆ అదృష్టవంతుడు ఎవరో ? అందరిలో ఒకే ఉత్కంఠ. తమ పేరు పిలుస్తాడేమో నన్న ఆశ. తనని పిలవాలని మనసులోనే ప్రార్థన. అందుకే, ఆ ఆరాటం వల్లనే అంతమందిలో ఒక్కరు కూడా ప్రభువులనూ, ఆమాత్యుడినీ పట్టించుకోలేదు.
సుకల్పానందునికీ, రాక్షసామాత్యునికీ కూడా ఆత్రుతగానే ఉంది, ఆ తమాషా ఏమిటో చూడాలని... అందుకే వాళ్లు ఉత్కంఠతో జీవసిద్ధి వైపు చూస్తున్నారు. అంతలో...
"దాసు ! రంగదాసూ ....!" అని పిలిచాడు జీవసిద్ధి కళ్ళు తెరవకుండానే. అన్ని వందల మందిలోంచి పది పన్నెండు మంది చేతులు పైకి లేచాయి.
జీవసిద్ధి కళ్ళు మూసుకునే "మీరు కాదు .... దీర్ఘరోగంతో ఆరుమాసాలుగా మంచంలో పడున్న రంగదాసుని... మంచంతో మా ముందుకు తీసుకురండి" చెప్పాడు.
మరుక్షణం జనం మధ్యలోంచి నలుగురు వ్యక్తులు లేచి ఓ మంచాన్ని మోసుకు రాసాగారు. మంచంలో జీవచ్ఛవంలా ఉలుకూ పలుకూ లేకుండా పడున్నాడు ఓ పాతికేళ్ల యువకుడు. కొద్దిసేపట్లో అతన్ని మంచంలోనే జీవసిద్ధి ముందుంచారు.
"ఏరా ! తాళి కట్టిన భార్యని తన్ని తగలేసావు. వేశ్య మాయలో పడి ఇల్లూ వొళ్ళూ గుల్ల చేసుకున్నావు. మాయరోగం ముంచుకొచ్చి మంచంలో పడేసింది. తిండి లేదు. తీర్థంలేదు. ఆరుమాసాల నుంచీ అన్నీ పడకలోనే.... ఆఖరి ఘడియలు తరుముకొచ్చాయి. 'ఇప్పుడా... ఇంకాసేపా..' అంటోంది ప్రాణం. అవునా ?" ప్రశ్నించాడు జీవసిద్ధి కళ్ళు తెరవకుండానే.
ఆ యువకుడితో పాటు వచ్చిన వాళ్ళు చేతులు జోడించి "సత్యం చెప్పారు స్వామీ ! మా రంగదాసుగాడు ఎవరు చెప్పినా వినకుండా ఈ స్థితికి తెచ్చుకున్నాడు. వీడి డబ్బూ దస్కం కాజేసిన ఆడది వీడికి విషప్రయోగం చేసి మరొకడితో లేచిపోయింది. చూసేవాళ్ళు లేక వీడు చావుకు దగ్గరయ్యాడు. వీడు పాపాత్ముడే... కానీ, పాపం వీడి భార్య ఉత్తమురాలు. వీడికీ దుస్థితి దాపరించిందని తెలియగానే దుఃఖంతో స్మృతి తప్పి పడిపోయింది. మూడురోజులైంది. ఆ అమాయకురాలి కోసమైనా వీడికి ప్రాణభిక్ష పెట్టండి స్వామీ ...!" అని వేడుకున్నారు.
"భిక్ష.... హు... కన్నవాళ్ళకి గుప్పెడు మెతుకులు కూడా పెట్టకుండా భిక్షమెత్తుకోమంటూ తరిమేసాడు కదరా ఈ దూర్తుడు.... వీడికి ఇలాంటి శిక్షే సరైనది. కానీ.... ఈ స్థితిలో వీడు పశ్చాతాపంతో మాపేరే స్మరిస్తున్నాడు. ఇకనుంచీ బుద్ధిగా ఉంటానంటూ మనస్సులోనే వేడుకుంటున్నాడు" అంటూ జీవసిద్ధి చేతిని గాలిలో గిరగిరా తిప్పి ఖాళీ చేతిలోంచి అక్షింతలు ఆ రోగి మీదకు విసిరి "ఏరా మేము చెబుతున్నది అంతా సత్యమేనా ? నీకు వాక్కు ప్రసాదించాం మాట్లాడు" అని ఆజ్ఞాపించాడు.
ఆ మాట విన్న మరుక్షణం ఉలుకూ పలుకూలేని ఆ రోగి ఒక్కసారిగా కుడిచేతిని బయటకు చాపి జీవసిద్ధి పాదాల మీద ఆనించి "మీ పాదాల మీద ప్రమాణం చేస్తున్నా స్వామీ. ఇకనుంచీ బుద్ధిగా ఉంటా... నా అమ్మా నాన్నలనీ, ఆలినీ కాయకష్టం చేసి పోషించుకుంటా... మీరు ఎలా చెబితే అలా నడుచుకుంటా ... నా వాళ్ళ కోసమైనా నన్ను కాపాడండి స్వామీ" అని రోదించాడు.
ఆ విచిత్రాన్ని అందరూ గుడ్లప్పగించి చూస్తున్నారు. 'దాదాపుగా శవమై వచ్చినవాడు మాట్లాడుతున్నాడంటే.... అది స్వామి మహత్తు కాక మరేమిటి ?'
"మాట తప్పవుగా...?" ప్రశ్నించాడు జీవసిద్ధి.
రోగి గట్టిగా అతని పాదాలు పట్టుకుని "తమ మీద ఆన స్వామీ ! తప్పను గాక తప్పను ?" అన్నాడు బిగ్గరగా ఏడుస్తూ. వాడినోరు, చెయ్యి తప్ప మిగతా శరీరాంగాలన్నీ కదలిక లేకుండా జీవం లేనట్లుగా పడుండడాన్ని గమనించి విస్తూబోయాడు రాక్షసామాత్యుడు.
"సరే ...!" అంటూ జీవసిద్ధి రెండు చేతులూ పైకెత్తి ఆకాశం వైపు చూచి "తధాగతా ! రక్ష రక్ష... తధాగతా ... పాహి పాహి .... ఈ ఆశ్రితుడిని నా మహత్తుతో ఆరోగ్యదానం చేస్తున్నాను... క్షమ... క్షమ..." అని ప్రార్థించాడు. క్షణం తర్వాత అరచేతుల్ని ఒక్కటిగా కలిపి శంఖంలాగా రూపొందించి నోటి దగ్గర ఉంచుకొని ఊదాడు.
ఒక్కసారిగా ఆ చేతుల్లోంచి శంఖనాదం ధ్వనించసాగింది.
ఆ హఠాత్పరిమానానికి నందులూ, రాక్షసుడూ అదిరి పడి ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. అంతలో ఆ శంఖం మధ్యనించి అకస్మాత్తుగా విభూది దూసుకొచ్చి ఆ రోగి మీద రాలసాగింది.
ఆ దృశ్యాన్ని చూస్తున్న జనం ఉద్వేగాన్ని పట్టలేక "జీవసిద్ధి స్వాముల వారికీ జై..." అంటూ బిగ్గరగా జేజేలు కొట్టసాగారు. నందులకీ, రాక్షసునికీ ఆ దృశ్యం విభ్రాంతిని కలిగిస్తోంది.
జీవసిద్ధి హఠాత్తుగా శంఖనాధాన్ని ఆపేశాడు. మరుక్షణం ఆ చేతుల్లోంచి విభూధి రాలడం ఆగిపోయింది.
(ఇంకా ఉంది)...🙏
సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి