7, జూన్ 2021, సోమవారం

శివ సోత్రం

 శివ సోత్రం (శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం)


కరుణారసము పొంగి తొరగెడు చాడ్పున శశిరేఖ నమృతంబు జాలువార

హరి నీల పాత్రిక సురభి చందనమున గతి నాభి ధవళ పంకజము మెరయ

గురియైన చెలువు ననెరసిన లోకరక్షణ మనంగ గళంబు చాయతోప

ప్రథమాద్రిదోతెంచు భాను బింబమునానురమ్మున కౌస్తుభ రత్న మొప్ప.


సురనదియును కాళిందియుబెరసినట్టి

కాంతి పూరంబు శోభిల్లు శాంతమూర్తి

నామ నంబునానందమగ్నముగజేయ

నెలిమి సన్నిధి సేసె సర్వేశ్వరుండు.


పైన జటాజూటంలో అమృతం కారిపోతున్న చంద్రం వంక, నాభి వంక చూస్తే నల్లటి శరీరం అందులో నుండి చక్కటి కమలం విరిసి ఉన్నది. నాభి భాగంలో చూస్తే శ్రీ మహా విష్ణువు. తల మీద చూస్తే చంద్రరేఖ ఉన్న పరమశివుడు. కొంచెం తేరిపార చూస్తే తెల్లటి కంఠంలో నల్లటి మచ్చ. హలాహలం త్రాగినప్పుడు కంఠం లో ఏర్పడిన మచ్చ తో ఉన్నాడు. అంతే శంకర దర్శనం అయ్యింది. కొంచెం ఆశ్చర్యపోయి కిందకు చూస్తే కౌస్తుభం కనబడింది ఏమి ఆశ్చర్యం? గంగానది కాళింది కలిస్తే ఎలా ఉంటుందో అలా తెల్లటి నల్లటి వర్ణాలు రెండు కలిసి పోయినట్టి హరిహరనాథుడు ప్రత్యక్షమయ్యాడు.అప్పుడు మహానుభావుడు తిక్కన చెప్పుకున్నాడు.


శ్రీ యన గౌరీనాబరగు చెల్వకు చిత్తము పల్లవింపభ

ద్రాయిత మూర్తియై హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూ

పాయ నమశ్శివాయ యని పల్కెడు భక్త జనంబు వైదిక

ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్త్వము గొల్చెద నిష్టసిద్ధికిన్.


తిక్కన హరిహరమూర్తి కి హరునికి హరికి బేధం లేకుండా, లక్ష్మికి గౌరీ కి బేధం లేకుండా ఇద్దరు ఒకటే అన్న భావంతో దర్శనం చేస్తున్న వారందరికీ భద్రత కల్పించడానికి హరిహర నాథుడు తనకు ప్రత్యక్షమయ్యాడని చెప్పుకున్నారు. హరిహర నాథుడు తిక్కన గారు రాస్తున్న భారతాన్ని తనకు అంకితమివ్వమని అడిగారు. అది తిక్కనగారి గొప్పదనం. అలా ఒకే స్వరూపం అయిన హరిహరనాథునకు తాను ఆంధ్రీకరించిన బాగాన్ని అంకితం ఇచ్చారు.

హరిహరనాథుడైన స్వామి పార్వతిదేవికి శివ అష్టోత్తర శతనామ (108 నామాలు) ఉపదేశం ఇచ్చారు. ధ్యాన శ్లోకాన్ని మొదట మనసులో ధ్యానం చేయాలి.


ధవళ వపుషమిందోర్మండలేసన్నివిష్టం

భుజగవలయహారం,భస్మదిగ్ధాంగమీశం

మృగయపరశుపాణిం,చారుచంద్రార్ధ మౌళిం

హృదయ కమలమధ్యే, సంతతం చింతయామి.

శివ అష్టోత్తర శతనామం చదివేటప్పుడు ముందుగా ధ్యాన శ్లోకాన్ని ధ్యానం చేయాలి.


తెల్లని శరీరం తో ఉన్న వాడు చంద్రమండలం లో కూర్చుని ఉన్నాడు. శివలింగానికి పైన ధారా పాత్ర కడతారు. దాని నుండి సన్నటి ధారా పడుతుంటుంది. శివలింగం ఎంత చల్లగా ఉంటే మన కోరికలు అంత తీరుతాయి. స్వామి చల్లగా ఉండాలి. శివలింగానికి అభిషేకం లేకుండా వేడిక్కి పోయేటట్లు ఉంచకూడదు. మిగిలిన దేవతా స్వరూపాలకు అలా ఉండదు. ధారా పాత్ర కి ఒక దర్భ పెట్టి సన్నటి ధార శివలింగం మీద అలా పడుతుండాలి. ఈ రహస్యం యజుర్వేదం లోని రుద్రాధ్యాయం లో చెప్పారు.


ఆపాతాళ నభః స్థలాన్త భువన బ్రహ్మాండ మావి స్ఫరత్

జ్యోతి స్పాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందు వాన్త మృతైః "

అస్తోకాప్లుత మేకమీశమనిసశం రుద్రాను వాకాన్ జపేత్

ధ్యాయే దీప్సి తసిద్ధయే ధ్రువపదం విప్రో  భిషించేచ్ఛివమ్ "


బ్రహ్మాండ వ్యాప్త దేహ భసితహిమరుచాభాసమానాభుజంగైః

కంఠే కాలఃకపర్దా కలిత శశికలాశ్చండ కోదండ హస్తాః "

త్ర్యక్షారుద్రాక్షమాలా స్సులలిత వపుషశ్శాంభవా మూర్తిభేదాః

రుద్రాశ్ర్శీరుద్రసూక్త ప్రకటిత విభవా నః ప్రయచ్ఛన్తు సౌఖ్యమ్"


చంద్రమండలం లోని అమృతం జాలువారి ఆయన మీద పడుతూ ఉంటుంది. కిందకి కారిపోతున్న అమృతాన్ని పాత్రలు చేతితో పట్టుకుని మళ్లీ తీసి తనమీద తానే పోసుకుంటూంటాడు. తనలోతానే రమిస్తూ అమృత అభిషేకాన్ని పొందుతుంటాడు. బ్రహ్మాండాలంతా వ్యాపించి పోయి ఉంటుంది. ఆ శివలింగం.


ఉదయగ్రావము పానవట్ట మభిషేకోద ప్రవాహంబు వా

ర్ధి దరీధ్వాంతము ధూపధూమము,జలద్దీప ప్రభారాశి కౌ

ముది,తార నివహంబు లర్పిత సుమంబుల్ గా తమోదూరసౌ

ఖ్యదమై శీతగభస్తిబింబ శివలింగం బొప్పె ప్రాచీదిశన్.,,


సువర్ణముఖి నది లో స్నానం చేసి బయటకి వచ్చిన ధూర్జటీకి జలాలు అన్ని ఉత్తర దిక్కు సముద్రంలోకి ఎలా పడుతున్నాయో అర్థంమయ్యింది. శివా! ప్రాణకోటి, దేవతలు అందరూ అభిషేకం చేస్తే అలా వెళ్లి పడ్డాయి. అందరూ పూజ చేసిన పువ్వులే ఆకాశంలో నక్షత్రాలయి. ధూపం ఆకాశంలో మేఘ మండలమయి ఎగురుతున్నది. ప్రపంచమంతా శివలింగంగా కనబడుతున్నది. శివలింగం తప్ప వేరొకటి లేదంటాడు.

కామెంట్‌లు లేవు: