7, జూన్ 2021, సోమవారం

శఠగోపం అంటే ఏమిటి

 *శఠగోపం అంటే ఏమిటి ? గుడిలో శఠగోపం పెట్టడానికి గల కారణం తెలుసా ?*


శఠగోప్యం అంటే అత్యంత గోప్యమైనది అని అర్థం. శఠగోపం గుడిలోని దేవుడు లేదా దేవత విగ్రహానికి ప్రతీక అంటారు పండితులు. గుడికి వెళ్లిన ప్రతి భక్తునికి ఆలయంలో ఉండే దేవతా విగ్రహాలను తాకే వీలుండదు. అందుకే ఆలయ పూజారి భక్తులకు తీర్థప్రసాదాలిచ్చిన తర్వాత శఠారిని తీసుకొచ్చి భక్తుల తలపై పెట్టి ఆశీర్వచనం ఇస్తాడు. ఆలయ పూజారి శఠారిని తీసుకు వచ్చి భక్తుల తలపై పెట్టడం వలన వారిలో ఉండే చెడు ఆలోచనలు, ద్రోహబుద్ధులు నశిస్తాయని చెబుతారు. అంతే కాదు శఠగోపం అత్యంత గోప్యమైనది కనుక అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా కోరకను తలుచుకోవాలంటారు పండితులు. శఠగోపాన్ని కొన్ని ప్రాంతాల వారు శఠగోపం, శడగోప్యం అని అంటారు. భక్తులు దేవాలయంలో దర్శనం అయ్యాక ప్రదక్షిణలు చేసి, తీర్థం, శఠగోపనం తీసుకుంటారు.


శఠగోపాన్ని పంచలోహాలైన వెండి, రాగి, కంచు మొదలైన వాటితో తయారు చేస్తారు. శఠగోపం వలయాకారంలో ఉంటుంది. వాటిపై భగవంతుని పాదాల గుర్తులు ఉంటాయి. శఠగోపం తలపై పెట్టినప్పుడు పాదాలు మన తలను తాకుతాయి. అలాకాక నేరుగా పాదాలనే తలపై ఉంచితే అవి మొత్తం తలని తాకడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి శఠగోపాన్ని వలయాకారంలో తయారుచేసి పైన పాదుకలు ఉంచుతారు. అంటే మనము కోరికలను శఠగోపం పెట్టినప్పుడు తలుచుకుంటే భగవంతుడి పాదాల వద్ద చెప్పుకున్నట్లే. శఠత్వం అంటే మూర్ఖత్వం అని, గోపం అంటే దాచిపెట్టడం అని కూడా అర్ధం. భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడనేది ఆధ్యాత్మికుల భావన. నేను, నాది అనే భ్రమను తొలగించడానికి శఠగోపం పెడతారు.


శఠగోపం తలమీద పెట్టించుకోవడం వలన ఆధ్యాత్మికంగా మాత్రమే కాక సైన్స్ పరంగా కూడా ఎన్నో ఫలితాలు కలుగుతాయి. శఠగోప్యమును తలమీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్‌, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్‌ బైటికెళుతుంది. తద్వారా శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి.


శఠగోపం మీద విష్ణువు పాదాలుంటాయి. అంటే మనము కోరికలను భగవంతుడికి ఇక్కడే తెలపాలన్నమాట. పూజారికి కూడా వినిపించకుండా మన కోర్కెలను భగవంతునికి విన్నవించుకోవాలి. అంటే మన కోరికే శఠగోప్యము. అది మన నెత్తిన పెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగి మానసిక ఉల్లాసం కలుగుతుంది. దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, శఠగోప్యం తప్పక తీసుకోవాలి. చాలమంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చిన పనైపోయిందని చక, చకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు.

  

కొద్దిమంది మాత్రమే ఆగి, శఠగోప్యం పెట్టించుకుంటారు. మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలూస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం.సహజంగా చిల్లర లేకపోవటం వల్ల, శఠగోప్యమును ఒక్కోసారి వదిలేస్తుంటాము. పక్కకు వచ్చేస్తాము. అలా చెయ్యొద్దు. పూజారి చేత శఠగోప్యము పెట్టించుకోండి. మనసులోని కోరికను స్మరించుకోండి.

కామెంట్‌లు లేవు: