7, జూన్ 2021, సోమవారం

తెగిన పేగు* కథ

  


*తెగిన పేగు*  పిశుపాటి ఉమా మహేశ్వరరావు


కన్యాశుల్క దురాచారానికి బలైపోయి, ఉన్న ఊరుని, కన్న వారినీ వదులుకుని, స్వంత ఇంట్లో, పరాయి పంచన బతికినట్టు బతికిన ఒక స్త్రీమూర్తి వ్యథ......ఈ కథ!




సుబ్బారావు ఆఫీసు నుంచి ఇంటికొచ్చి, కాస్త స్థిమిత పడ్డాడో లేదో 

అతని భార్య సావిత్రి వచ్చి, అతనితో నెమ్మదిగా, 

"అత్తగారు మీతో ఏమన్నా మాట్లాడాలి కాబోలు. ఇందాకటి నుంచీ కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నారు” అంది. 

‘ఎందుకు?’ అన్నట్టు ప్రశ్నార్థకంగా చూశాడు సుబ్బారావు.  ‘ఏమో’ , అన్నట్టు పెదవి విరిచింది సావిత్రి. 

సుబ్బారావు తల్లికి ఈమధ్య సుస్తీ చేసి, ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సాధారణంగా అతను ఆఫీసు నుంచి వచ్చాకా, స్నానమూ ,భోజనమూ అయ్యాకా వెళ్ళి, కాసేపు ఆవిడ పక్కన కూచుని మంచీ చెడూ మాట్లాడి వస్తాడు. 

ఆవేళ– సాయంత్రం నుంచే “అబ్బాయి ఇంకా రాలేదా?” అని చాలాసార్లు అడిగింది కోడల్ని నాగలక్ష్మి.  అందుకే సుబ్బారావు ఇంటికి రాగానే అతనితో మాట్లాడడానికి తల్లి ఆతృత పడుతున్నట్టు చెప్పింది సావిత్రి. ఎందుకో అని అతను భోజనం కూడా చెయ్యకుండా తల్లి దగ్గరకెళ్లేడు.


“ఎలా ఉందమ్మా ఒంట్లో?” అడిగేడు సుబ్బారావు, తల్లి పక్కనే మంచం మీద కూచుంటూ. 

“ఎంతసేపైందిరా నువ్వింటికొచ్చి?” అందామె సమాధానంగా.  తల్లి గొంతుకెందుకో కొత్తగా వినిపించింది సుబ్బారావుకి. 

"ఇప్పుడే పది నిముషాలైంది…. నువ్వు మందు పుచ్చుకున్నావా….?” అన్నాడు. “ఊ….” అని ఊరుకుంది. తరవాత ఏమీ మాట్లాడలేదు. తల్లి ఏమన్నా చెబుతుందేమోనని ఎదురుచూసి, ఒక నిమిషం పోయాకా.., "ఎందుకో అడిగేవుట….” అన్నాడు సుబ్బారావు. ఆవిడ ఏమీ జవాబివ్వకుండా అతని మొహంలోకి మార్చి మార్చి చూస్తోంది. తల్లి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని అభిమానంగా నిమురుతూ , 

"ఏమన్నా కావాలా…? అన్నాడు మృదువుగా. ఒక్క క్షణం ఆగి  మెల్లగా, “నువ్వు దక్షిణదేశ యాత్ర కోసం సెలవు పెట్టేవు కదా…. అందామె. 

“అవును” అన్నాడు సుబ్బారావు. అతను లీవ్ ట్రావెల్ కన్సెషన్ మీద సౌత్ ఇండియా ట్రిప్ వెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు. మరో పదిహేను రోజులలో పిల్లలకి సెలవులివ్వగానే బయల్దేరబోతున్నాడు.


"కన్యాకుమారి నుంచి తిరిగి వచ్చేటప్పుడు పాల్ఘాట్ దగ్గిర ఊళ్ళో…. అదే…మా ఊరినీ…మా ఇంటినీ ఓసారి చూపిస్తావా…?” అంది ఆమె. సుబ్బారావు ఉలిక్కిపడ్డాడు. 

తనతండ్రి ఆరోజుల్లో ఈమెని అతి చిన్నతనంలోనే పాల్ఘాట్ నుంచి కొనుక్కు తెచ్చుకుని పెళ్ళి చేసుకున్నాడన్న విషయం అతను గుర్తుకు తెచ్చుకున్నాడు. ఎప్పుడైనా ఒక్కక్షణం ఆ విషయం గురించి అనుకోవడం తప్ప, తన తల్లి మళ్ళీ అక్కడికి వెళ్ళిందీ లేదు.., ఎవరూ అక్కణ్ణుంచి వచ్చిందీ లేదు. ఆమె ఇక్కడ జీవవాహినిలో కలిసిపోయి , తెలుగింటి ముత్తైదువుగా మారిపోయిన డెబ్భై ఏళ్ళ తరవాత…..ఇప్పుడు ఇంత అభిమానంగా తూచి తూచి, ఆగి ఆగి అడుగుతుంటే…., సుబ్బారావు విచిత్రమైన అనుభూతికి లోనయ్యాడు.


యాభై అరవై ఏళ్ల క్రితం వరకూ కూడా ఆంధ్రదేశంలో కన్యాశుల్కం విపరీతంగా ఉండేది. బోలెడు డబ్బుపోసి ఆడపిల్లల్ని కొనుక్కోలేని వాళ్ళు కేరళ దేశం వెళ్ళి, పాల్ఘాట్ నుంచి ఆడపిల్లల్ని చౌకగా కొని తెచ్చుకునేవారు. నాగలక్ష్మి ఆ విధంగా ఐదేళ్ల వయసులోనే ఒక తెలుగింటి ఇల్లాలుగా ఆంధ్రదేశం తీసుకురాబడింది.  

వచ్చేకా ఆమెకు ఇదే లోకమైపోయింది. ఒక్క తాళిబొట్టు--పుట్టింటి మీదా, తోబుట్టువుల మీదా, బంధుమిత్రుల మీదా ఆమెకున్న బంధాల్నీ, అనుబంధాల్నీ తెంచేసింది. అక్కడినుంచి మళ్ళీ వచ్చి చూసినవారూ లేరు. ఇక్కడినుంచి ఈమెను తీసుకెళ్ళి చూపించినవారూ లేరు. 

వయసొచ్చేకా , ఎప్పుడన్నా ఒక్కసారి పుట్టింటివేపెళ్ళి చూసొద్దామని ఆమెకు కోరిక కలిగినా, భర్త హయాంలో అత్తింటివారు ఆ ఊహని మొగ్గలోనే తుంచేశారు. ఆ తర్వాత ఈ సంసారంలో పడి ఆమె తన జన్మ సంగతే మర్చిపోయింది. 


భర్త పోయాకా కొడుకు తనని బాగానే చూసుకుంటున్నాడు. ఇన్నాళ్ళకి యాదృచ్ఛికంగా కొడుకు దక్షిణదేశ యాత్ర చెయ్యబోతున్నాడు. కొంచెం అటూ ఇటూగా ఆ దేశం మీదుగా ప్రయాణించబోతున్నాడు. అందుకే, ఎన్నేళ్లుగానో నిద్రాణమైన కోరిక ఆమెలో మళ్ళీ మేలుకుంది.

"అహ…. నీకేమీ ఇబ్బంది లేకపోతేనే…” అందావిడ మొహమాటంగా. 

ఆ మాటతో చలించిపోయాడు సుబ్బారావు. ఆ ఒక్కమాటలో అతనికి అనేక అర్థాలు గోచరించాయి. 

తను కేరళ ఆడపడుచయి ఉండి, తమ పుట్టింటివారి దారిద్ర్యంవల్ల మరో దేశం వారికి అమ్ముడుబోయి, తన వారికి దూరంగా వచ్చేసి, ఈ రోజుకి కూడా పరాయి వారి పంచన బతుకుతున్నట్టు భావిస్తూ , కన్నతల్లి అధికారం లేదనుకుని ఎంతో మొహమాటంగా తనవారిని చూడాలని ఆమె మనసులో మాటని వెల్లడించిన తీరు…. సుబ్బారావుని కదిలించివేసింది. 

ఇన్నేళ్ళకి తల్లి ఋణం తీర్చుకునే అవకాశం వచ్చినందుకు ఆనందంతో పులకరించి పోయాడు. 

"వెళ్దామమ్మా….. తప్పకుండా తీసుకెళ్తాను. ఎంతో విశ్వాసంగా చెప్పేడు సుబ్బారావు. ఆ మాటకి ఆవిడలో కలిగిన ఆనందంతో ఆమె గొంతు పూడుకుపోయి, అలా మౌనంగా ఉండిపోయింది.


ఇక ఆ మర్నాటి నుంచీ తన ఆఫీసులో కేరళా వెళ్ళి వచ్చిన వాళ్ళందర్నీ పాల్ఘాట్ వెళ్ళే రూటు గురించీ, ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ గురించీ వాకబు చెయ్యడం మొదలెట్టేడు సుబ్బారావు. పెద్దగా ఎవరూ సమాచారం ఇవ్వలేకపోయారు కానీ, ఒకరిద్దరు మాత్రం,

"ముందు పాల్ఘాట్ వెళ్లు….. ఆ తర్వాత చుట్టుపక్కల ఊళ్లను గురించి అక్కడ వాకబు చెయ్… ఏదో ఒక ఆధారం దొరక్కపోదు.” అన్నారు. 


సుబ్బారావుకి ఈ సలహా బాగానే ఉందనిపించింది. ఆ విధంగానే ముందు మద్రాసు, శ్రీరంగం, మైసూరు, బెంగుళూర్లు కానిచ్చుకుంటూ…రామేశ్వరం , కన్యాకుమారీలు కూడా చూసేసి, తిరుగు ప్రయాణంలో ప్రత్యేకంగా పాల్ఘాటుకి చేరుకున్నారు.

వచ్చాడే కానీ స్టేషనులో దిగేకా ఎక్కడికెళ్ళాలో, ఏం చేయాలో పాలుపోలేదు సుబ్బారావుకి. నాగలక్ష్మికి తమ ఊరు పాల్ఘాటుకి అతి దగ్గరలోనే అని తెలుసు. ఆమె భర్త కూడా అప్పుడప్పుడు ఆ ఊరి పేరు చెబుతూండేవాడు. కానీ ఇప్పుడు వయసు పైబడ్డం వల్ల ఆమెకాపేరు నోట్లో ఆడుతోన్నట్టుంది కానీ, పైకి చెప్పలేక పోతోంది. 

సుబ్బారావు క్షణం ఆలోచించి, నేరుగా రైల్వే బుకింగ్ క్లర్క్ దగ్గిరకి పోయి, తానున్న పరిస్థితి వివరించి, అతని సాయంతో పాల్ఘాట్ కు అతి సమీపంలో ఉన్న కుగ్రామాల లిస్టు రాసుకొచ్చి, తల్లికి ఒక్కొక్కటీ చదివి వినిపించాడు.  'వేజ్ఞప్పోడి’ అన్న పేరు వింటూనే , “ఆ…అదే..!” అందావిడ ఆనందంగా. 


సుబ్బారావు ఆ ఊరి గురించి బుకింగ్ క్లర్క్ ని మళ్ళీ అడిగేడు. ‘వేజ్ఞప్పోడి’ అయిదు మైళ్ల దూరం కూడా లేదనీ, ఆ ఊరు పోడానికి ప్రైవేట్ బస్ సర్వీసు తప్ప వేరే మార్గం లేదనీ చెప్పేడు. భాష చాలా ఇబ్బంది పెట్టినా, అలాగే నెట్టుకుంటూ మొత్తానికి ఆ బస్సుని పట్టుకోగలిగేడు సుబ్బారావు.

వేజ్ఞప్పోడిలో కుటుంబంతో సహా దిగేడు సుబ్బారావు. అక్కడ పెద్ద సమస్య ఎదురైంది సుబ్బారావుకి. ఆ కుగ్రామంలో ఇంగ్లీషు ముక్క వచ్చినవాడు ఒక్కడూ తారసపడలేదు అతనికి. 

మగాళ్లు అడ్డకట్టు గళ్ళలుంగీలతోనూ, ఆడాళ్ళు పైటలు లేకుండానూ తిరుగుతున్నారు. గంటన్నర తంటాలు పడగా ఇంగ్లీషు తెలిసిన ఒక ముసలాయన దొరికేడు. ఆయన రిటైర్డ్ టీచరుట. సుబ్బారావు తన విషయం వివరించేడు. ఆయన అంతా విని, సానుభూతిగా ఆమెవంక చూసి పెదవి విరిచాడు. “ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు పట్టుకోవడం చాలా కష్టం” అని చెప్పేడు.

ఆ ఊళ్ళో ప్రతి మూడో ఇంట్లోనూ అమ్మాయిల్ని అమ్ముకున్న వారేనట! ఆ రోజుల్లో ఉన్నంత కాకపోయినా , ఈనాటికీ అదే పరిస్థితిట!! ఒక నిమిషం ఆగి మళ్లీ ఆయనే ,  "కనీసం ఆ ఇంటి ఆనవాలైనా చెబితే, ఉన్న బ్రాహ్మణ కుటుంబాల్లో వాకబు చేయించచ్చు.” అన్నాడు. 

సుబ్బారావు తన తల్లిని మరికొన్ని వివరాలు అడిగేడు. ఎంత ప్రయత్నించినా అమెకేమీ గుర్తు రాలేదు. ఇంతలో హఠాత్తుగా ఆమెకి భర్త చాలా సార్లు చెప్తూండే ,  "మీ ఇంటి పక్క గుళ్ళో నాగమల్లి పువ్వులేరుతూండగా నిన్ను మొదటిసారి చూశాను.” అనే మాట జ్ఞాపకానికొచ్చింది. వెంటనే ఆ గుడి సంగతీ, నాగమల్లి చెట్టు సంగతి కొడుక్కి చెప్పింది. ఆ పెద్దాయన నవ్వేశాడు. "గుళ్ళంటే.. చిన్న ఊరైనా, చాలా గుళ్లున్నాయి. అయినా చూద్దాం…. పదండి” అంటూ దారి తీశాడు. 


ఆయనకి కూడా చాలా కుతూహలం కలిగింది. రెండు మూడు గుళ్ళు వెదికేకా నాలుగో గుడి నిజమైంది. దాన్ని చూస్తూనే ఆవిడకి లీలగా ఏదో పునర్జన్మ గుర్తుకొచ్చింది. గుడికి ఎడంపక్క ఇంటివేపు అనుమానంగా చూసి, అదే అయి ఉండాలి అంది. కానీ అది పెంకుటిల్లని గుర్తు. అదిప్పుడు డాబా అయింది.  "కనుక్కుందాం ఉండండి” అని ఆయన లోపలికెళ్లేడు. సుబ్బారావు కుటుంబ సభ్యులు కూడా వెళ్ళేరు. 

లోపల మండువాలో ఓ ముసలాయన వాలుకుర్చీలో పడుకుని, రేడియో వింటున్నాడు. ఈ మాస్టారు ఆయనతో మలయాళంలో ఏదో మాట్లాడేరు. ఆ ముసలాయన లేచి నించుని ఓసారి సుబ్బారావు తల్లికేసి చూశాడు. తనకో తమ్ముడుండాలి. బహుశా ఇతనేనేమో…. పోలికలున్నాయి. ఆవిడలో ఏదో నమ్మకం బలపడసాగింది. ఆ ఇంటి వాతావరణం చూస్తోంటే.., అప్రయత్నంగా ఆవిడ నోటినుంచి ‘ అప్పు’ అన్న మాటొచ్చింది. 

"అవును…నేనే, నన్ను ఇంట్లో అందరూ ‘అప్పు’ అనే అంటారు. 

అప్పుకుట్టి!” అన్నాడాయన మలయాళంలో. మాస్టారు ట్రాన్సులేట్ చేశారు. 

ఈలోపు ఇంట్లో వాళ్ళందరూ పోగయ్యేరు. వింతగా చూడసాగారు.

నాగలక్ష్మికేదో ఉన్నట్టుండి అనుమానమొచ్చి మండువా మధ్యకి వెళ్లి , ఇక్కడ ఉయ్యాలా ఉండాలి..” అంది. 

"ఓసారి దూలం విరిగింది… అప్పట్నుంచీ తీసేశాం” అన్నాడాయన. ఆవిడకి ఏవేవో జ్ఞాపకాలు చుట్టుముట్టగా పిచ్చెక్కినట్టు తడబడే అడుగులతో ఇల్లంతా కలియ తిరిగింది. దొడ్లో బాదం చెట్టూ, పున్నాగ చెట్టునూ గురించి అడిగింది. ఇలాగే ఏవేవో అడిగింది. చూసేవాళ్ళకి ఏదో పునర్జన్మ తంతులా అనిపించింది. ఓసారి తుఫానుకి పెంకుటిల్లు పడిపోతే కొద్ది భాగాన్ని డాబా వేయించిన సంగతి చెప్పేడాయన. 


ఆయనకి కూడా తన చిన్నతనంలో ఒక అక్కగార్ని ఎవరికో అమ్మేసారని వాళ్లూ వీళ్లూ చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. ఆమెలో తన పోలికలు కూడా లీలగా అగుపడ్డాయి. 

"అమ్మా.. నాన్నా…? ” అడిగిందావిడ. వాళ్ళు పోయి చాలా కాలమైందన్నాడాయన. నలుగురక్కలూ , ఇద్దరన్నలూ కూడా కాలం చేసినట్టు చెప్పి, ఒక తమ్ముడు మాత్రం వేరేచోట ఉద్యోగం చేస్తున్నట్టు చెప్పాడు. 

తనకే డెబ్భైయ్యేళ్లు దాటినప్పుడు…, తన పైవాళ్ళింకా ఎలా ఉంటారు? అనుకుంది ఆమె. ఇంతమందీ పోయారని తెలిసి ఆమెకు దుఃఖం వచ్చింది. కాసేపు పోయాక ఆమె ఓ గదిలోకి వెళ్లి, అక్కడ గోడమీద ఒక గూడు కోసం వెతుక్కుంది. అది కనబడగానే అక్కడే కూచుని భోరుమని ఏడవసాగింది. చిన్నప్పుడు తను ఆ గూట్లో బొమ్మలు పెట్టుకుని ఆడుకునేది. ఓసారి ఆ గూట్లో దీపం పెడుతుంటే చెయ్యి కాలింది. ఆ మచ్చ ఇప్పటికీ ఉంది. 

తను కూడా పుట్టినచోటే మెట్టి, గిట్టే భాగ్యానికి నోచుకుంటే….నా అన్న ప్రతివారికీ దూరమై, మనసులో ఇంత ఏకాకిగా బతకవలసి వచ్చేది కాదు కదా..! అనుకుంది. 

గర్భ దరిద్రుడి కడుపున పుడితే ఎండుటాకులా కొట్టుకుపోవడమే సాంఘికనీమమేమో!! అని దుఃఖించింది.


చాలా చిన్న గ్రామమేమో…వీళ్ళ సంగతి ఇట్టే ఊళ్ళో తెలిసిపోయింది. కొంతమంది ఇంటిదగ్గర పోగయ్యేరు. మాస్టారు బాగా ఆలోచించి, ఆ ఊళ్లోకల్లా పెద్దవాడైన ఓ తొంభై ఏళ్ళ వృద్ధుడికి కబురు పెట్టి రప్పించాడు. ఆయన వయసులో ఉన్నప్పుడు ఇలా వాళ్ళకీ వీళ్లకీ పెళ్ళి బేరాలు కుదిర్చి, పావలో పరకో సంపాదించుకునేవాడు. ఆయన వచ్చి, ఆనీ ఆనని చూపుతో ఆవిడని పరీక్షగా చూశాడు. బాగా జ్ఞాపకం తెచ్చుకుని….,

"నువ్వటే అమ్మా నాగలక్ష్మీ..” అంటూ ఆప్యాయంగా పలకరించి దగ్గరకి తీసుకున్నాడు. ఆ భాష అర్థం కాకపోయినా ఆ స్పర్శలోని భావం ఆమెకి అందింది.  

"చిన్నప్పుడు దీన్ని ఈ చేతుల్తోనే ఎత్తుకున్నాను. ఈ చేతుల్తోనే ఒక తెలుగాయనకు నూట అరవై రూపాయలకి అమ్మేను…” అంటూ ఏవేవో చెప్పేడు. మాస్టారు వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పేరు. 

ఆ ముసలాయన అప్పుని దగ్గరకి పిల్చి, “ఇదిగోరా నాన్నా మీ అక్కయ్య నాగలక్ష్మి. నీకు ఊహ తెలిసేసరికే అది ఈ ఇల్లు, ఊరు దాటి వెళ్లిపోయింది.” అంటూ ఇద్దరి చేతులూ కలిపేడు. 

అంతవరకూ పరాయి వాళ్ళల్లా ఉన్న వాళ్ళిద్దరి మధ్యా ఆ క్షణంలో అక్కా తమ్ముళ్ళ మనే భావన పొంగిపొర్లింది. ఒకరి భాష ఒకరికి రాదు. ‘అక్కా’ అనలేడాయన. ‘తమ్ముడూ’ అనలేదామె. కానీ ఇరువురి చేతులూ మాత్రం గట్టిగా బిగుసుకున్నాయి. ఇద్దరి కళ్లూ ధారాపాతంగా వర్షిస్తున్నాయి. మూగభాషలోనే వాళ్ల అనుభూతుల్ని ఒకరితో మరొకరు పంచుకుంటున్నారు. మధ్య మధ్యలో ముసిలాయన ఏమేమో చెబుతున్నాడు. మాస్టారు ఇంగ్లీషు లోనూ, సుబ్బారావు తెలుగు లోనూ అవస్థ పడుతున్నారు.


అందరూ వింతగా చూస్తున్నారు– ఈ అపూర్వ సంగమాన్ని! కాసేపాగి ఒక్కొక్కరూ క్రమంగా కదిలేరు. భగవంతుడి లీలలు చిత్రం అనుకుంటూ అంతా ఆయన నెత్తిమీదకి తోసేసేరు. నీ మరదలు ఇదిగో అంటే.. నీ మేనల్లుడిడిగో అంటూ ఏవేవో పరిచయాలు అయ్యాయి. తమ్ముడి భార్య కాఫీ తెచ్చి ఇచ్చింది. ఆ కాఫీ వీళ్ళెవరికీ రుచించలేదు. కానీ ఏదో ఆత్మీయత వెల్లివిరిసింది. 

నాగలక్ష్మి అడగదల్చుకున్నవేవో అడిగింది. తమ్ముడు చెప్పగలిగినవేవో చెప్పేడు. మాస్టారు దుబాసీలా బాగా సహకరించారు. కాసేపటికి తనివితీరా మాట్లాడ్డం అయిపోయింది. అందరూ బొమ్మల్లా నిలబడ్డారు. మళ్ళీ మనసుల్లో అంతా శూన్యం ఆవరించుకుంది.

వాళ్ల పరిస్థితి చూస్తే నాలుగు రోజులు ఉండ తగ్గదిగా కనిపించలేదు. 

అక్కా, తమ్ముడూ ఇద్దరూ పెద్దవాళ్లే. నేడో రేపో రాలిపోయేట్టున్నారు. ఆ తర్వాతి తరాలు వేరయిపోయాయి. వందల మైళ్ళ దూరంలో నివాసం. చీటికీ మాటికీ వచ్చిపోయే వ్యవహారం కాదు. భాషా సంప్రదాయాలు వేరు. కనీసం కార్డు ముక్క రాసుకునే యోగ్యత కూడా లేదు. ఇప్పుడు కలిసే బంధమూ కాదు…కొనసాగే అవకాశమూ లేదు. 

కానీ నాగలక్ష్మి వదల్లేక వదల్లేక ఆ ఇంటి చుట్టూ ఓ మూడుసార్లు తిరిగి, అయిన వాళ్ళందర్నీ తనివితీరా అక్కునచేర్చుకుని కాలు బయట పెట్టింది. బస్సు ఊరి పొలిమేర దాటేకా ,  ‘మళ్ళీ జన్మంటూ ఉంటే ఆడదానిగా పుట్టించకు దేవుడా' అని మొక్కుకుంది నాగలక్ష్మి.

                           ******



*ఈ కథ రాసి దాదాపు 37 సంవత్సరాలు దాటింది.*  అప్పటికి యాభై 

అరవై ఏళ్ల క్రితం నుండి మన సమాజంలో పాతుకుపోయిన ఇలా ఆడపిల్లని కొనుక్కోవడం/ అమ్ముకోవడం అనే దుష్ట సంస్కృతిని ప్రతిబింబిస్తూ రచయిత ఈ కథను రాశారు. 

అంటే ఆయన కథ రాసే సమయానికి సకృత్తుగా నైనా ఈ పాల్ ఘాట్ కుటుంబాలు, అమ్మేసిన ఆడవాళ్ళు మన సమాజంలో ఉన్నారన్నమాట. కథలో సుబ్బారావు కుటుంబం పాల్ఘాట్ వెళ్ళినప్పుడు,

"ఆ రోజుల్లో అంత ఉధృతంగా కాకపోయినా ఈనాటికీ అదే పరిస్థితి” అని మాస్టారు చెబుతారు. ఇది అత్యంత విషాదకరం!


అంగడిలో సరుకుని అమ్మినట్టు ఆడపిల్లల్ని …పెళ్ళి పేరిట ముక్కూ-మొహం, భాష, సంస్కృతి…వీటితో ఏమీ సంబంధం లేని కుటుంబాలకి ఏదో వెలకట్టి అమ్మేయడం పరమ నికృష్ట కార్యం కాదూ..! 

పాపం అలా వచ్చిన ఆడపిల్లలు-- తాము ఇక్కడి వాళ్ళం కాదనీ , పరాయి పంచన బతుకుతున్నామనే బానిస భావంతోనే ఉండిపోయేవారు. 

ఏళ్ళ తరబడి సంసారం చేసి, పిల్లల్ని కని, మనవల్ని ఎత్తినా సరే! 

ఎంత కటువుగా ఉన్నా ఇది చారిత్రక సత్యం! 


నాగలక్ష్మిలో చెలరేగిన ఈ భావాల్ని రచయిత చాలా బలంగా చెప్పేరు. కడుపున పుట్టిన (ఆడ) పిల్లల్ని…తమ దారిద్ర్యం కొంతైనా తీరుతుందని ఖరీదు కట్టి అమ్మేయడం ఇంకా ఇప్పటికీ కొన్ని జాతుల్లో ఉన్న దుర్భర పరిస్థితి. మానవత వెల్లివిరిస్తే తప్ప ఇటువంటి పరిస్థితుల్లో మార్పు రాదు.


ఇక మనిషికి స్వంత ప్రాంతం మీదా, పుట్టిన భూమి మీదా ఎంత మమకారం!  అక్కడ తను ఆట్టే కాలం ఉండకపోయినా, ఆ ఊరు, ఆ పేరూ వింటే ఎంతో పులకరించి పోతాడు. 

జీవితంలో ఒక్కసారైనా ఆ నేల, ఆ ఇల్లు, ఆ మనుషుల్నీ చూసుకోవాలని ఉవ్విళ్లూరిపోతాడు. ఏళ్లు గడిచిపోయినా, నాగరికత మారిపోయినా , తన చిన్నతనంలో తిరిగిన ప్రదేశం, తాత తండ్రుల బతికిన చోటు ఓసారి చూడాలని తహతహ లాడిపోతాడు. 

మాతృభూమిపై ఉండే అటువంటి మమకారం ఎంతటిదో హృద్యంగా చెప్పిన కథ ఈ 

 *తెగిన పేగు*.


ఇది చదివి తీరవలసిన కధ 🙏🙏

కామెంట్‌లు లేవు: