17, ఆగస్టు 2022, బుధవారం

ధర్మాకృతి

 ధర్మాకృతి : శ్రీమఠం ఖైదు అయిన కథ -4


సరి! నిర్బందింపబడి తంజావూరునకు కొనిపోబడిన అనంతరం శ్రీమఠానికి కోలాహలమయిన రాజోపచారం జరగానారంభించింది. వెన్నట్రంగరై సత్రం మొదలయిన పెద్ద సత్రములు శ్రీమఠ నివాసార్ధం ఏర్పాటు చేయబడినవి. ఒక్కో సత్రంలోనూ గుండోదరుని కథలో సుందరేశ్వరుడు సృష్టి చేసిన మాదిరి భక్షణాల గుట్టలు అన్న పర్వతాలు అమర్చబడినాయి. విడవకుండా ఒకదాని తరువాయిగా ఇంకొకటిగా ఈ మర్యాద లేమి? అది అలా ఉండనీయండి. భక్తితో ఆహ్వానించకుండా ఈ మొరటు నిర్బంధ భక్తి ఏమి? అంతా చంద్రమౌళీశ్వరుని పనే!


ద్వితీయునితో శ్రీమఠాన్ని ఆహ్వానించడానికి సావకాశం లేదని త్రిప్పి పంపిన రాత్రి రాజావారికి కలవచ్చింది. స్వామివారికి కామాక్షీదేవి స్వప్నంలో సాక్షాత్కరించి జీర్ణోద్ధరణ కుంభాభిషేకాదులకు ఆనతి నిచ్చిన రీతి రాజావారి కలలో చంద్రమౌళీశ్వరుడు దర్శనమిచ్చి, తాను వసించియున్న మఠమునకూ, తదాచార్య స్వామికీ ఉపచారమొనరింప వలసినదిగా ఆదేశించినారు. అవిధేయుడైన పుత్రునిపై తండ్రికి అతి ప్రేమ ఉండే విధాన రాజావారు కుదరదని తిరస్కరించిన డానికి బహుమానంగా చంద్రమౌళీశ్వరుడే సాక్షాత్కరించారు. అందువలననే వారికంత ఆనందమూ, సంభ్రమమూనూ.


మరి ఈ రాక్షస భక్తో! కొంచెం నాళ్ళ ముందుగానే కదా శ్రీమఠ నిర్వహణాధికారిణి ముఖం మీద కుదరదని చెప్పి, త్రిప్పి పంపివేశారు. రాజ సింహాసనానికి పైనది ఈ ఆది శంకరుల ధర్మాసనం. ఇప్పుడు వచ్చి ఆహ్వానిస్తే నీవు ఆడిన ఆటకల్లా మేము తాళమేస్తామా అని శ్రీమఠమనవచ్చు. వైయక్తికంగా స్వామి మానాభిమానములకు అతీతులయి ఉండవచ్చు. కీడు చేసిన వారిని కూడా మనఃపూర్వకముగా ఆశీర్వదించే వారుగా ఉండవచ్చు. అయితే పీఠగౌరవ విషయంలో కొంచెం అయినా బిగువు సడలించరు కదా! ఇదంతా రాజు ఆస్థాన పురోహితులతో, విద్వాంసులతో ఆలోచించే ఈ అసుర భక్తి ప్రదర్శించారు. అయినా ఇదంతా మనకీ స్వారస్యమైన కథ ప్రసాదించడానికే కావచ్చు.


చంద్రమౌళీశ్వరుడు మంచి లాభం సంపాదించుకొన్నాడు. శివాజీ రాజా చంద్రమౌళీశ్వర పూజార్థం అనేక పాత్రలు, నవరత్న ఖచిత పాత్రలు, బంగారు కవచం తొడిగిన దక్షిణావర్త శంఖం సమర్పించారు. శ్రీవారిని ఎంతో వైభవంగా ఊరేగించారు. జోడు ఏనుగుల వెనుక పెద్ద వెండి అంబారీ కట్టి దానిపై ఊరేగవలెనని స్వామివారిని ప్రార్థించారు. ఇప్పుడు శ్రీమఠంలో పూజకోసం ఉపయోగించే వెండి రథానికి నాలుగింట మూడు వంతులుంటుందిట. ఈ అంబారీ ఎనిమిది కాళ్ళతో అష్టకోణంగా ఉండేదట. స్వామివారు పైకి ఎక్కడానికి అంబారీ కాళ్ళు అవరోధంగా ఉన్నవనీ, అంబారీ కొంచెం వంచితే అనుకూలంగా ఉంటుందనీ గ్రహించారు రాజా గారు. వెంటనే స్వయంగా నిచ్చెనలాంటి వేమి లేకుండానే ఒకే గంతులో ఏనుగునెక్కి అంబారీ గోపురాన్ని ఒక చేత్తో త్రోసిపెట్టి భుజం అంబారీ పీఠం క్రింద మోపి పెట్టి స్వామివారి ఆరోహణకు సౌకర్యం చేసి, ముగిసిన వెంటనే చెంగున క్రిందికి దుమికారట రాజుగారు. రాజ మర్యాదానుసారం అంబారీ ప్రక్క రక్షక స్థానంలో రాజుగారి ఒకే కూతురి భర్త అయిన సహారాం సాహెబు కూర్చుని ఉన్నారు. 


ఆ వెనుక ఇదే మాదిరి అంబారీ కట్టబడిన ఏనుగుల జోడి ఉన్నది. అందులో అంబారీ ముందు ప్రక్క రాజావారు కూర్చుని ఉన్నారు. అది రాచమర్యాద. అది విశేషం కాదు. వెనుక ప్రక్క పరమ మర్యాద సూచకమయిన రక్షక స్థానంతో ఎవరు కూర్చున్నారు అన్నదే విశేషం. పూర్వం ముఖంపై కొట్టి పంపటమే తరువాయిగా చేసి త్రిప్పి పంపబడిన ద్వితీయులు! పూర్వం దక్కవలసిన మర్యాద వడ్డీతో సహా తీర్చుతున్నట్లు రాజావారు తమ ప్రక్క కూర్చుండ పెట్టుకొని ఊరంతా చూసి గౌరవించారు.


ద్వితీయునిది లజ్జా స్వభావం. అది తెలిసిన రాజాగారు ఎవరూ చూడకుండా అంబారీలో ఊరేగే సమయంలో దోసిలి నిండా స్వర్ణ పుష్పాలు గ్రహించి ఈ ద్వితీయునకు బహుకరించారు. ఆ పరమ వైభవంలో అవి తమంతట తామే మూటకట్టుకోవడం లేకిగా అనుచితంగా ఉంటుందని భావించిన వీరు, క్రిందనున్న గుంపులో, తనకు బాగా కావలసిన వృద్ధుని చేతిలో పోశారు. ఆయన ఆ మూటతో పలాయనం చిత్తగించారు. దానిని సరుకు చేయలేదీయన. ఆత్మార్థంగా తాను గురువులకు చేసే కైంకర్యమునకు గురు కటాక్షరూపంగానే ప్రతిఫలం ఉండాలి గానీ, ధనరూపముగా కాదని భావించారు. ఊరందరికీ తెలిపేటట్లు రాజుగారు ఇంకో మర్యాద చేశారు. వారికి ‘హేజీబ్’ అనబడే గౌరవ పదవి ఇచ్చారు. పరమ ప్రతిష్ఠాకరమైన సంస్థకు ప్రతినిధులుగా ఉన్నవారు రాజ్యాంగంతో నేరుగా వ్యవహరించడానికుద్దేశించినది ఈ పదవి. రాజు వీరికి స్వర్ణ పుష్పములకు బహుకరించినది గుంపులో ఎవరికీ తెలియదు. వారంతా స్వామివారి ఊరేగింపు సంరంభం, తమ రాజా వారితో వెళ్ళే ఆయన గొప్పదనం తెలుసుకొని శ్లాఘించడంతో పూర్తిగా నిమగ్నమయి ఉన్నందున అది గ్రహించే అవకాశం లేకపోయింది.


ఆ సంరంభంలో అఖిలాండేశ్వరీ దేవాలయంలో అమ్మవారి సన్నిధిలో ఈ ద్వితీయుడు పాణిగ్రహణ మొనరించిన ఆ ఎనిమిదేళ్ళ చిన్నపిల్ల కూడా ఉన్నారు. ఆ బాల చుట్టూ ఊరి సువాసినులంతా చేరి రాజావారి ప్రక్కన రాజాలాగా వెలిగిపోతున్న నవ యౌవనుడయిన శాస్త్రి గారు ఈమె భర్తే అని బహుధా ప్రశంసింప సాగారట. ఆ మాటలకీ చిన్నపిల్లకు సిగ్గుతో ఏడ్పు వచ్చేది. సిగ్గుతో ఆమె ఎక్కడికి పారిపోతే అక్కడంతా సువాసినులు చుట్టేసేవారట. పాపం ఈ చిన్నపిల్ల ఏం చేస్తుంది. 


(సశేషం)


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: