*పార్లమెంట్లో లోక్‌సభ స్పీకర్ వద్ద పెట్టే ఎంతో ప్రాముఖ్యం గల 'సెంగోల్' గురించి ఇప్పటికీ భారత ప్రజలకు సరిగ్గా తెలియదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.* మే28న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించాక ప్రధాని నరేంద్ర మోదీ.. 'సెంగోల్'ను లోక్‌సభ స్పీకర్ సీట్ వద్ద పెడుతారని చెబుతూ దాని ప్రాముఖ్యాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే 'సెంగోల్' వెనుక ఉన్న అసలు కథెంటో తెలుసుకుందాం.
*సెంగోల్ అనే ఈ రాజదండాన్ని తొలిసారిగా భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్వీకరించారు.* బ్రిటీష్ వలస పాలనకు ముగింపు పలుకుతూ.. భారత స్వయంపాలనకు, అధికార మార్పిడికి గుర్తుగా దీనిని ఏర్పాటు చేశారు. *'సెంగోల్'.. 'సెమ్మై' అనే తమిళ పదం నుంచి పుట్టింది.* దీనికి తమిళంలో ధర్మం అని అర్థం వస్తుంది.
*'సెంగోల్' ఏర్పాటు వెనుక కథేంటి?*
భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించిన నేపథ్యంలో బ్రిటిష్ ఇండియా చివరి వైశ్రాయ్ అయిన లార్డ్ మౌంట్ బాటన్.. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో ఏర్పాట్లపై చర్చించారు. ఈ క్రమంలోనే అధికారికంగా స్వాతంత్ర్యం ఇచ్చినట్లుగా ఏదైనా ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేయాలని నెహ్రూకు సూచించారు మౌంట్ బాటన్. దీనికి స్పందించిన నెహ్రూ.. వెంటనే భారత చిట్టచివరి గవర్నర్ జనరల్ సీ రాజగోపాలచారిని అడగగా.. ఆయన ఓ సలహా ఇచ్చారు
రాజవంశంలో నూతన రాజు సింహాసనాన్ని అధిష్ఠించే సమయంలో జరిగే ఆచారాల గురించి నెహ్రూకు చెప్పారు రాజగోపాలచారి. *కొత్తగా రాజు అయ్యే వ్యక్తి పూజారి నుంచి రాజదండాన్ని స్వీకరిస్తారని..* అలానే తాము కూడా *బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందడానికి సూచికగా ఈ రాజదండాన్ని స్వీకరిద్దామని* సూచించారు. దీనికి ప్రధానమంత్రి నెహ్రూతో పాటు మౌంట్ బాటన్ కూడా అంగీకరించారు. దీని బాధ్యతను సైతం రాజగోపాలచారికే అప్పగించారు జవహర్లాల్ నెహ్రూ. దీంతో ఆ 'సెంగోల్'ను తయారు చేయించడానికి.. రాజగోపాలచారి వెంటనే నాటి మద్రాసులోని తిరువడుతురయైకి వెళ్లారు. అక్కడే ఉన్న ఓ మఠాన్ని సందర్శించి.. ఈ విషయం చెప్పగా మఠాధిపతులు సైతం దీనికి అంగీకరించారు. *ఉమ్మిడి బంగారు చెట్టి అనే ఓ బంగారు ఆభరణాల దుకాణం.. బంగారు 'సెంగోల్'ను అద్భుతంగా తీర్చిదిద్దింది.* ఐదు అడుగుల పొడవుతో 'సెంగోల్' పైభాగంలో న్యాయానికి ప్రతీకగా నందిని చెక్కారు. అనంతరం ఈ 'సెంగోల్'ను పవిత్ర గంగా జలంతో శుద్ధి చేసి లార్డ్ మౌంట్ బాటన్‌కు అందించారు మఠాధిపతులు. ఆ తర్వాత *స్వాతంత్ర్యానికి గుర్తింపుగా 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి మౌంట్ బాటన్ నుంచి సెంగోల్‌ను స్వీకరించారు నెహ్రూ.* అర్ధరాత్రి స్వాతంత్ర్య ప్రకటన చేయడానికి 15 నిమిషాల ముందు దానిని భారత నూతన ప్రధానికి అందజేశారట. ఆ ప్రక్రియ జరుగుతున్నంతసేపు ప్రత్యేకంగా రూపొందించిన ఒక పాటను ఆలపించారట. ఇదండీ సెంగోల్ వెనుక ఉన్న అసలు కథ. *ప్రస్తుతం ఇది అలహాబాద్‌లోని మ్యూజియంలో ఉంది.* ఇప్పుడు దీనిని ఆదివారం కొత్త పార్లమెంట్ భవనంలో అమర్చనున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి