*దైవీ సంపద..*
*ఏ గుణానికి ఏది మందు?*
➖➖➖✍️
*- బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ శర్మ గారు.*
*‘డిప్రెషన్’, ‘స్ట్రెస్’, 'టెన్షన్’ - ఈ మూడు మాటలూ ఇప్పుడు నిత్యజీవిత నినాదాలై పోయాయి. ప్రతి కుటుంబంలోనూ, ప్రతి రంగంలోనూ మామూలై పోయాయి.*
*వీటికి పరిష్కారాలేమిటి?*
*భారతీయ తత్త్వశాస్త్రం పురాణాది ధార్మిక గ్రంథాల ద్వారా చక్కని సూచనలిచ్చింది. మనం గమనించలేక పోతున్నాం, అన్వయించుకోలేక పోతున్నాం.*
*ఒకప్పుడు భోగాలనిపించుకున్న వాటిని - ఇప్పుడు అవసరాలనుకుని, వాటిని ఎలాగైనా సాధించాలనే ఆశ ఒక ప్రధాన కారణం.*
*అలాగని 'గొర్రెతోక' జీవితాలను సర్దిపుచ్చుకోమని కాదు కానీ, నిరంతరం ఏదో లోటును అనుభూతికి తెచ్చుకుంటూ, ఏదో కావాలనే ఆరాటాన్ని పెంచుకుంటూ సాగి పోవడం తగదు కదా!*
*ఒక నిదానం, ఒక క్రమశిక్షణ - లేకుండా అసంతృప్తి, అసహసం పెంచుకొని - కేవలం ‘సంపాదనయే జీవితం' అనే లక్ష్యాన్ని మనకు మనమే నిబద్ధించుకుని, ఆ దిశగా పరుగులు పెట్టే యాంత్రికతకు అలవాటుపడ్డాం.*
*ఒక పరిధి, ఒక పరిమితి ప్రతిదానికీ ఉంటాయి. అర్థకామాల సంపాదన అవసరమే కానీ, ఆ అవసరం ఏ మేరకు? అని నిర్దేశించే 'ధర్మం' అనే 'రెగ్యులేటర్' ఉండాలి. అది జీవితాన్ని తీవ్రమైన పరుగు పెట్టించకుండా నియంత్రిస్తుంది.*
*ఈ డిప్రెషన్లో బోలెడు రకాలున్నాయి.*
*అన్నిటినీ విశ్లేషించి, చికిత్స చేయడానికి ఎన్నో వైద్యశాలలున్నాయి. అవి పచ్చగా వర్ధిల్లుతున్నాయి.*
*అయితే మన ధార్మిక వాఙ్మయ చికిత్సా విధానం పద్ధతిని కూడా గమనించుకుంటే ముందు జాగ్రత్తలు, చికిత్సలు కూడా సాధ్యమౌతాయి.*
*శరీరంలో వాత, పిత్త, కఫ తత్వాలుంటాయి. ఒక్కొక్క దేహం ఒక్కో తత్త్వం. దానిననుసరించి చికిత్స జరపాలి - అంటుంది ఆయుర్వేదం.*
*అలాగే మానసికంగా సత్వ రజస్తమో గుణాల తత్త్వాలుంటాయి. వాటిని విశ్లేషించగలగాలి. ఒక్కొక్కరి మనస్తత్వంలో ఈ గుణాల పాళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఏదో ఒక్క గుణం మాత్రమే ఈ ప్రపంచంలో ఉండదు. మూడూ కలిసే ఉంటాయి. వేటిని ఎలా నియంత్రించాలో తెలిసి బ్రతకడమే తెలివితేటలు.*
*సాధారణంగా - మానవ జన్మ రజోగుణ ప్రధానమైనది. దేవతలు సత్యగుణ ప్రధానులు. భూతప్రేతాదులు తమోగుణ ప్రధానులు. మనలో ఏ గణాన్ని ఎక్కువ చేసుకుంటే ఏ వర్గంలోకి చేరవచ్చో పై విభజన బట్టీ మనమే ఎంపిక చేసుకోవచ్చు.*
*రజోగుణం వల్ల కామం, క్రోధం కలుగుతాయి. ఇవి తగిన మోతాదులో ఉండాలంటే సత్వగుణ సహాయం కావాలి. వివేకం, జ్ఞానం, సంతోషం, సంతృప్తి, సత్యం, నిగ్రహశక్తి, దయ, సామ్యం వంటి లక్షణాలు సత్వగుణ సంబంధాలు.*
*రజోగుణం వల్ల కలిగే లక్షణాలతో ఒకదానితో తీవ్రమైన అనుబంధం పడుతుంది. అది రాగమైనా, ద్వేషమైనా కావచ్చు. ఏదైనా ఎక్కువ ఆశించడం, ఎక్కువ భావించడం, ఆ చింతనలో అంచనా లెక్కువగా వేసుకోవడం, ఆశలు పెంచుకోవడం వంటి స్వభావాలు రజోగుణ ప్రకోపాలు, దీనితో నిజ జీవితంలో అంచనా ఏ మాత్రం దెబ్బతిన్నా, ఆశించినదానికి విరుద్ధంగా జరిగినా అలజడి, ఒత్తిడి ఏర్పడతాయి.*
*సాత్విక సాధనలలో ముందుగానే మనసును సంస్కరించుకుంటే ఈ రజఃప్రభావాల నుండి జాగ్రత్త పడవచ్చు. అందుకే సాత్వికాహారం, సాత్వికమైన దైవచింతన, నియమబద్ధమైన జీవిత విధానం, శ్రమతో ధర్మబద్ధంగా సంపాదించుకున్న దానితో తృప్తి చెందడం, క్షమాగుణం వంటివి అలవరచుకుంటే మానసిక రుగ్మతలకు దూరంగా ఉండవచ్చు.*
*రజోగుణ ప్రకోపం వల్ల ఒత్తిడికి, ఆందోళనకు గురైతే - కొందరు సత్వగుణంతో నియంత్రించుకోగలరు. ఆధ్యాత్మిక బోధలు, సాధన వంటివి ఈ విధమైన నియంత్రణలో భాగాలు. వేదాంత శాస్త్రం బోధించే 'వస్తు విచారం’ (ఏ విషయంలో ఎంతమేరకు సారం వుందో తేల్చే ఆలోచన) దీనికిసహకరిస్తుంది.*
*అయితే రజోగుణం తీవ్రస్థాయిలో దెబ్బతీసినప్పుడు, ఈ సత్వగుణంలో చికిత్స కొన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. కొందరు ఆ విధమైన ప్రయత్నాన్ని చేయరు కూడా. దానికి బదులుగా తమోగుణ సహాయాన్ని తీసుకుంటారు.*
*నిద్ర, కునుకుపాటు, సోమరితనం, జడత్వం వంటివి తమోగుణ లక్షణాలు.*
*మందులతో నిద్రపుచ్చడం, దేనికీ స్పందించని స్థితికి మెదడును తీసుకువెళ్ళడం - ఈ తమోగుణ చికిత్సా విధానం. ఇప్పుడు ఎక్కువ భాగం ఈ విధానాన్నే అవలంబిస్తున్నారు.*
*ఇది తాత్కాలికంగా రజోగుణ తీవ్రతని తగ్గించినా, తమోగుణం పాళ్ళు పెంచే ప్రమాదం ఉంది. జాడ్యం, మాంద్యం వంటివి సంక్రమించి బుద్ధిశక్తి క్షీణిస్తుంది. ఎన్నో సాధించగలిగిన ధీశక్తి మొద్దుబారుతుంది.*
*ఇలా కాకుండా ఉండాలంటే ఆధ్యాత్మికమైన ధ్యాన యోగ, సంకీర్తనాది సాధనాలు సహకరిస్తాయి.*
*మనం వేదాంతం పలికే జ్ఞాన వైరాగ్యాలే స్ఫూర్తినిస్తాయి.*
*నిరాడంబర జీవితం, మితాహార, విహారాలు, ఉత్తమలక్ష్యమైన భగవచ్చింతన... ఈ మూడూ గొప్ప ఔషధాల్లా పని చేస్తాయి.*
*ఎన్ని పనులు సాధించినా, ఎన్ని వ్యాపకాలున్నా 'మితి' అనే ధోరణిని ఈ మూడింటి ద్వారా సాధించవచ్చు.*
*సంయమనం గల చిత్తాన్ని, తొందరపాటులేని తనాన్ని బాల్యంనుంచే ఆధ్యాత్మిక జీవనసరళితో అలవాటు చేస్తే, ఆ పిల్లలు పెద్దయ్యాక మితిమీరిన రజోగుణానికి లోను కాకుండా, వాటి దుష్ప్రభాలకు గురికాకుండా ఉండగలరు.*
*లంకలోని సీతమ్మ ఈ సాత్విక సాధన వలననే, తన మహాదుఃఖతీవ్రతలో నిలదొక్కుకోగలిగింది. నిరంతరం రామచింతన, రామదీక్షపై విశ్వాసం, ధైర్యం, అశాభావం లాంటి సానుకూల సకారాత్మక భావాలు ఆమెకు ఆలంబనాలయ్యాయి.*
*హనుమంతుని ద్వారా రామవార్తను విన్నాక, అడిగి అడిగి రాముని వర్ణింపజేసి, ఆ రామకీర్తనతో పరవశించి సేదదీరింది.*
*అలాగే అరణ్యవాస కాలంలో ధర్మరాజాదులు సాత్విక సాధనలతో నిలబడగలిగారు. పురాణాల్లో - కష్టాలపాలైన దశలలో సావిత్రి, దమయంతి, నలుడు వంటి వారు ఈ మార్గంలోనే స్వస్థులయ్యారు.*
*ఈ సాత్విక గుణ సమూహానికే 'దైవీ సంపద' అని పేరు పెట్టింది భగవద్గీత.*
*'దైవీ సంపద్విమోక్షాయ'. దైవీ సంపద వలననే దుఃఖం నుండి విడుదల లభిస్తుందని గీతాచార్యుని మాట.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి