26, మే 2023, శుక్రవారం

*వేద రక్షణ

 


       *వేద రక్షణ - వాజపేయం*

                ➖➖➖✍️


మా నాన్నగారు *‘జె. పద్మానాభాచార్య వాజపేయ యాజి’* గారికి నాతోపాటు నలుగురు కొడుకులము. 


మా నాన్నగారికి పరమాచార్య స్వామివారిపై అనన్య భక్తిప్రపత్తులు. వారు ఋగ్వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేశారు.


అప్పుడు మేము కుంభకోణంలో నివసించేవాళ్ళం. అప్పుడు పరమాచార్య స్వామివారు మా నాన్నగారిని పిలిచి, *“ఇప్పుడు మధ్వులలో అగ్నిహోత్రులు ఎవరూ లేరు కనుక నువ్వు రోజూ అగ్నిహోత్రం చెయ్యడం ప్రారంభించాలి”* అని ఆజ్ఞాపించారు. 


స్వామివారి ఆదేశానుసారం మా నాన్నగారు అధ్యయనం ప్రారంభించి నిత్యాగ్నిహోత్రి అయ్యారు.


కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు 

మా నాన్నగారు వేదపారాయణం చేస్తున్నారు. కంచి పరమాచార్య స్వామివారు పంపగా వచ్చామని ఇద్దరు వ్యక్తులు వచ్చారు. 


మా నాన్నగారు *’కలకత్తాకు వెళ్లి అక్కడ ఉన్న వేదభవనంలో ఋగ్వేద అధ్యాపకులుగా ఉంటూ అక్కడ ఉన్న మధ్వ సముదాయానికి పౌరోహిత్యం చెయ్యవలసింది’* గా పరమాచార్య స్వామివారు ఆదేశించారని వారు తెలిపారు. 


మహాస్వామివారి ఆజ్ఞ ప్రకారం మా పెద్ద అన్నను తీసుకుని కలకత్తా వెళ్ళారు. అక్కడి వేదభవనంలో ఋగ్వేద అధ్యాపకులుగా ఉంటూ, అక్కడి మధ్వులకు వైదికం చేస్తూ ఉండేవారు. 


నాలుగైదు సంవత్సరాల తరువాత 1968లో ఒక బస్సు ప్రమాదంలో మా అన్నయ్య చనిపోయాడు.


పరమాచార్య స్వామివారు మమ్మల్ని విజయవాడ వేద సదస్సుకు రమ్మన్నారు. అక్కడ స్వామివారిని కలువగా మమ్మల్ని కలకత్తా వదిలి కావేరీ తీరంలో ఉండమని ఆదేశించారు. 


దాంతో మేము సిరుగమణి అగ్రహారం చేరుకున్నాము. అక్కడ శ్రీమాన్ వేంకటేస అయ్యర్ గారు మా వసతికి, నెల భత్యానికి ఏర్పాట్లు చేశారు. నాన్నగారు అక్కడ ఋగ్వేదం నేర్పుతూ, అగ్నిహోత్రం చేస్తూ ఉండేవారు.


శాస్త్రం ప్రకారం నిత్యాగ్నిహోత్రం, ఇష్టి, సోమయజ్ఞం జరిగేవి. పరమాచార్య స్వామివారి అనుగ్రహంతో ఎందఱో మధ్వ విద్యార్థులు వేద రక్షణ నిధి ట్రస్ట్ తరుపున విద్యార్థులుగా చేరి, అధ్యయనం చేసి, పరిక్షలలో ఉత్తీర్ణులయ్యారు. 


ఈనాటికీ సిరుగమణి వేద పాఠశాల నడుస్తోంది. మా చిన్నతమ్ముడు పరశురామన్ అక్కడ అధ్యాపకుడు కూడా.


*ఈరోడ్* లో మా నాన్నగారు వాజపేయ యాగం పూర్తిచేసిన తరువాత మహాస్వామివారి దర్శనం కోసం మహఖాన్ వెళ్ళాము. అక్కడ ఉన్న శ్రీమఠం సేవకులకి వాజపేయ యాగం పూర్తిచేసి స్వామివారి దర్శనానికి వచ్చామని చెప్పాము. 


కాని మహాస్వామివారు మమ్మల్ని మా బసకు తిరిగివెళ్ళమని సమాధానం పంపారు. 

ఏదో కారణానికి మహాస్వామివారి దర్శనం లభించకపోవడంతో మేము బసచేస్తున్న సత్రానికి వచ్చి మిక్కిలి బాధపడుతున్నాము. ఒక గంటసేపటి తరువాత ఏనుగు, గుర్రం, చామరం, వేదఘోష, మంగళ వాయిద్యాలతో కూడిన ఒక బృందం అటుగా వచ్చింది. *“యాగం చేసివచ్చినవారు ఇక్కడ ఎవరో బసచేస్తున్నారు. వారిని సకుటుంబంగా తీసుకునిరమ్మని పరమాచార్య స్వామివారు సండూర్ సంస్థాన మహారాజుగారిని పంపారు”* అని మాతో చెప్పారు. 


ఆ విషయం విని మేము ఆనందాశ్చర్యాలకు లోనయ్యాము.


సామవేద ఘోషతో, కలకత్తా శంకర నారాయణ శ్రౌతి మమ్మల్ని తీసుకుని 

వచ్చారు. సండూర్ మహారాజుగారు మా నాన్నగారికి శ్వేత ఛత్రం పట్టి ఊరేగింపుగా తీసుకునివచ్చారు. మేము మహాస్వామి వారి మకాం చేరుకోగానే స్వామివారు మాతో, *“ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకు ఈ కన్నీళ్ళు? వాజపేయ యాగం చేసినవారిని రాజలాంఛనాలతో తెల్లని గొడుగు క్రింద చూడాలని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. మిమ్మల్ని అలా చూడాలనే నేను వెనక్కు పంపాను”* అని చెప్పారు. 


మహారాజుగారు పట్టిన శ్వేత ఛత్రాన్ని మాకు ఇచ్చి, దాదాపు రెండుగంటల సేపు మాతో మాట్లాడి, మా బాధను తొలగించి మమ్మల్ని ఆశీర్వదించి పంపారు.


ఇది మా జీవితాల్లో ఎప్పటికీ మరచిపోలేని అత్యద్భుతమైన సంఘటన.


--- పి. రామకృష్ణాచార్య, ఋగ్వేద అధ్యాపకులు, మంత్రాలయం. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 1


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

 #కంచిపరమాచార్యవైభవం✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



కామెంట్‌లు లేవు: