26, మే 2023, శుక్రవారం

ఎక్కువ లడ్డూలు చేయించు


 ఎక్కువ లడ్డూలు చేయించు


తంజావూరు జిల్లాకు చెందిన ఒక ధనిక భూస్వామి ఆరోజు స్వామివారికి భిక్ష ఏర్పాటు చేశాడు. ఎక్కువ సంఖ్యలో లడ్డూలు తయారు చేయించమని అతణ్ణి ఆదేశించారు పరమాచార్య స్వామివారు.


శ్రీమఠం ఉద్యోగులు, ఆ భూస్వామి చుట్టాలు కొద్దిమంది మాత్రమే ఆరోజు భోజనానికి ఉన్నవారు. అన్ని లడ్డూలు చేయించమని ఎందుకు తెలిపారు అర్థం కాలేదు ఆ భూస్వామికి. బహుశా కొన్ని లడ్డూలను ఏదైనా అనాథ ఆశ్రమానికి గాని, వేద పాఠశాలకు గాని పంపుతారేమో అని అనుకున్నాడు.


అలా కాకుండా, ఆరోజు వడ్డనని పరమాచార్య స్వామివారు పర్యవేక్షించారు. ఎంత వద్దన్నా అందరికీ రెండు కంటే ఎక్కువ లడ్డూలు వడ్డించమని, మిగిలిన వాటిని కూడా అందరికి వడ్డించమని ఆదేశించారు స్వామివారు.


మరలా ఒక విపరీతమైన ప్రకటన చేసి లోపలకు వెళ్ళిపోయారు స్వామివారు. అదేంటంటే స్వయంగా మహాస్వామి వారే ఆదేశించినా వడ్డన చేసిన అన్ని లడ్డూలు తినాల్సిన అవసరం లేదని. ఎక్కువైన వాటిని వదిలేయవచ్చని.

అన్న లక్ష్మిని చెత్తకుప్ప పాలు చెయ్యరాదని తరచూ పిల్లలకు బోధించే స్వామివారు ఇలా చెప్పడం వారికి వింతగా తోచింది. అందరూ ఎక్కువైన లడ్డూలను అరటి ఆకుల్లోనే వదిలేశారు.


పరమాచార్య స్వామివారి ఆదేశం కావున ఆ లడ్డూలను ఎండుద్రాక్ష, జీడిపప్పు, లవంగాలు, యాలకులు బాగా దట్టించి తయారుచేశారు. అటువంటి లడ్డూలను ఇలా ఆకులలో వృధాగా ఉండడం చూస్తున్న భూస్వామి కాస్త బాధపడినా, అకారణంగా పరమాచార్య స్వామివారు ఏదీ చెయ్యరని సంభాళించుకున్నాడు.

తరువాత ఆ భూస్వామితో మాట్లాడుతూ స్వామివారు, “వెనుకవైపు ఆకులు పడవేసిన చోటుకు వెళ్లి చూడు” అని ఆదేశించారు.


ఆ భూస్వామి వెనుకవైపుకు వెళ్ళగా, అక్కడ కొన్ని కురువ కుటుంబాల వారు ఆత్రుతగా ఆ పారవేసిన లడ్డూలను తినడం చూశాడు. ఎప్పుడూ తినని అంతటి మధుర పదార్థాన్ని తమకు అందించినందుకు, వారు అ భూస్వామిని చూడగానే మనస్సులోనే కృతఙ్ఞతలు తెలిపారు.


ఆ భూస్వామి చాలా సంతోషపడ్డాడు. మహాస్వామివారి వద్దకు తిరిగిరాగానే, “వారి కుల ధర్మం ప్రకారం, ఈ కురవలు ఉచ్చిష్టాన్నే ఇష్టపడతారు. అన్నదానానికి వారు అంగీకరించరు. వారికి ఉన్న నియమం అది. మనకు లాగానే వారికి కూడా అదే నోరు, అదే కడుపు కదా? అందుకే ఈరోజు మనం తిన్న లడ్డూల వంటివే వారికి కూడా ఇవ్వాలని సంకల్పించాను. అది నువ్వే చేయ్యగలవని కూడా నాకు తెలుసు. కనుక, ఇప్పుడు వారి దీవెనలు నీకే ఉంటాయి” అన్నారు స్వామివారు.


--- రా. గణపతి, “మహా పెరియవాళ్ విరుంధు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం


సర్వ భూత నివాసోసి....

ఒకసారి పరమాచార్య వారు ఒక వేద పాఠశాల ను సందర్శించారు. వారు ఎప్పుడు వేద పాఠశాల కు వెళ్లినా తప్పకుండ వంటశాలను చూస్తారు. అక్కడి వంటవారు ఆసక్తిగా, రుచిగా పిల్లలకు వండి పెడుతున్నారా అని గమనిస్తారు. అదేలాగున ఇక్కడ కూడా వంటశాల లోనికి వెళ్లారు. వంటాయినా పిల్లలు తినడం కోసం సేవై (సేమియా లాంటిది )వండుతున్నాడు. ఇప్పటిలాగా ఇన్స్టంట్ సేమియా లు రాని రోజులవి.వంటవాడు ప్రయాసతో వాటిని చేయడం చూసి వారు చాలా సంతోషించి,

"దీనిని తరచూ వండుతుంటావా "అని అడిగారు.

వంటవాడు "పాపం పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉండి వేదం నేర్చుకోవడానికి వచ్చారని వారికి రుచిగా చేసి పెడదామని చేస్తున్నాను పెరియవ "

స్వామి "చాలా సంతోషం. రోజు ఈ సేవ చెయ్యు."అంటూ పరమాచార్య బయటకు వెళ్లిపోయారు.

వంటవాడు మనసులో "ఇదేంటి. ఇంత కష్టమైన దానిని రోజు చెయ్యమంటారే "అనుకున్నాడు. కొద్ది సేపు కాగానే స్వామి వంటవాణ్ణి పిలిచి "నేను కోరింది రోజు ఈ సేవ చెయ్యమంటే రోజు సేవై చెయ్యమని కాదు. రోజు పిల్లలకు రుచిగా వండి పెడుతున్నావే అదే పెద్ద సేవ. అది చెయ్యమని.వేద విద్యార్థులకు వండి పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి లేదు. అని నా ఉద్దేశ్యం."అని అనునయించారు.ఇంతకీ వంటవాని మనస్సులో అనుకున్నది స్వామి కి ఎలా తెలిసిందని మీరు అడగరని నాకు తెలుసు.

 ***ఇలాంటి సంఘటనలు కోకొల్లలు గా స్వామి వారున్నపుడు జరిగేవి. "ఈశ్వరసర్వ భూతానం హృద్దేశే అర్జున తిష్టతి ".... అన్న వాసుదేవుని స్మరిద్దాం.

:

 మహాస్వామి వారి అన్నపూర్ణావతారం


పరమాచార్య స్వామివారు ఒక తమిళ సామెతను ఎప్పుడూ చెప్పేవారు, “అందరికీ అన్నం పెట్టు, భేదం చూపకుండా” అని. ఆహారం పెట్టేటప్పుడు ఎవరు, ఏమిటి అన్న ఎటువంటి బేధం చూపరాదని చెప్పేవారు. రాత్రిపూట దొంగలకు కూడా ఆహారం అందించే ఒక కేరళ సంప్రదాయం గూర్చి ఎప్పుడూ తెలిపెవారు. కేరళలోని చేరుక్కుణ్ణం అన్న ప్రాంతంలో ఉన్న అన్నపూర్ణ దేవాలయంలో ఈ పధ్ధతి ఉంది. దేవాలయంలోని భక్తులందరి భోజనాలు అయ్యాక, ఆహార పొట్లాలు కట్టి, వాటిని చెట్టుకు వేలాడదీసేవారు అటుగా వెళ్ళే దొంగలకోసమని.


సంగం సాహిత్యంలో ఉధియన్ చేరాళదన్ అన్న చేర రాజు మహాభారత యుద్ధ సమయంలో పాండవ కౌరవ ఇరు పక్షాల వారికీ అన్నం పెట్టి ‘పేరుం సోట్రు చేరాళదన్’ అన్న పేరు ఎలా పొందాడో తెలిపేవారు.


వేటగాడైన కన్నప్ప శివునికి ఆహారం పెట్టాడు. వేటగాడైన గుహుడు శ్రీరామునికి ఆహారం పెట్టాడు. ఇక్కడ, శ్రీశైలం అడవులలో ఉండే చెంచులు పరమాచార్య స్వామివారిచే ఆహారం పొందారు.


రవాణా వ్యవస్థ అంతగా లేని 1934లో పరమాచార్య స్వామివారు మందీమార్బలంతో కీకారణ్యంలో ఉన్న శ్రీశైలం వెళ్తున్నారు. దారిలో ఒకచోట వారికి చెంచులు ఎదురయ్యారు. ఆ చెంచులు మొదట వీరిని శతృవులుగా భావించి బాణాలు చేతబూని విల్లు ఎక్కుపెట్టారు. కాని స్వామివారి దివ్య తేజస్సు చూసి, తప్పు తెలుసుకుని వీరిని ఆదరించారు.


వీరిని అడ్డగించాలని వచ్చినవారే వీరికి కాపలావాళ్లై, సామాను మోస్తూ, రాత్రిపూట పహారా కాస్తూ పరమాచార్య స్వామివారిని సపరివారంగా తదుపరి చోటుకు చేర్చారు. సెలవు తెసుకునే ముందు అందరూ ఒకచోట చేరారు.


మహాస్వామి వారి వారికి కొంచం ధనం ఇవ్వమని మేనేజరును ఆదేశించగా వారు దాన్ని తాకడానికి కూడా ఇష్టపడలేదు. ఆ చెంచుల నాయకుడు మేనేజరుకు ఎదో చెబితే, వారు దాన్ని నిరాకరిస్తూ తల అడ్డంగా తిప్పి కుదరదన్నారు.

మహాస్వామివారు చిటికె వేసి మేనేజరును పిలిచి, “అతను ఏమి అడిగాడు, నువ్వు ఎందుకు లేదన్నావు?” అని అడిగారు.


“పెరియవా ముందర వారు నృత్యం చేయాలనుకుంటున్నారు”


“నృత్యం చూడడం వల్ల శ్రీమఠం గౌరవం తగ్గుతుందని మేనేజరుగా నీ అభిప్రాయం కనుక నేను వారి నృత్యం చూడనని నువ్వు అన్నావు”

మహాస్వామి వారి మాటల్లో ఎక్కడా కోపం కనబడలేదు. మేనేజరు మౌనంగా నిలబడ్డారు.


ఎంతో గొప్ప కళాకారుల నృత్యాలు కూడా చూడని మహాస్వామివారు వారి నృత్యాన్ని చూడడానికి అంగీకరించారు ఒక షరతు పైన; మగవారు ఎవరైనా నృత్యం చెయ్యవచ్చు. కాని వారితో పెద్దవారు కాని బాలికలు మాత్రమే కలిసి నృత్యం చెయ్యాలి.


“సందర్భాన్ని బట్టి మీకు వివిధ నృత్యాలు ఉన్నాయి కదా; దేవుని కోసం, గెలిచినప్పుడు, ఆటలకోసం అలా. మరుప్పుడు మీరు చెయ్యదలచుకున్న నృత్యం ఎలాంటిది” అని అడిగారు మహాస్వామివారు.


“మేము ఇప్పుడు చెయ్యబోయే నృత్యం కేవలం మాకు అత్యంత దగ్గరైన ఆప్తులకు మాత్రమే” అని తెలిపారు.


పరమాచార్య స్వామి వారు వారి నృత్యాన్ని చూసి, వారినందరినీ ఆశీర్వదించి, వారికి మంచి విందు ఏర్పాటు చేశారు.


--- రా. గణపతి, “మహా పెరియవాళ్ విరుంధు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


సేకరణ 🙏🙏

కామెంట్‌లు లేవు: