26, మే 2023, శుక్రవారం

పుష్పదంతుని కథ:*

 



             *పుష్పదంతుని కథ:*

                  ➖➖➖✍️



*గంగాతీరంలో ‘బహుసువర్ణకమ’నే అగ్రహారముంది. అచట బహుశాస్త్రవేత్తయైన ‘గోవిందదత్తుడ’నే బ్రాహ్మణుడున్నాడు. ఆతని భార్య ‘అగ్నిదత్త.’ వారికి సుందరులైనా గాని- మూర్ఖత్వం నిండుగానున్న ఐదుగురు పుత్రులు పుట్టారు.* 


*ఒకనాడు గోవిందదత్తుడింట లేని సమయంలో వారింటికి ‘వైశ్వానరుడ’నే విప్రుడు అతిథిగా వచ్చాడు. అతడు కుమారులకు అభివాదం చేయగా –తిరిగి ప్రతినమస్కారం చేయటం కూడా తెలియని వారు నమస్కారానికి బదులుగా నవ్వారు.*


*ఇట్టి కుసంస్కారుల ఇంటిలో భోజనం చేయకూడదని నిర్ణయించుకొని ‘వైశ్వానరుడు’ వెళ్లి పోవటానికి సిద్ధపడుతున్న సమయంలో ‘గోవిందదత్తుడు’ వచ్చాడు.*


*తన కుమారులు పరమ మూర్ఖులని అందుచే వారినింతవరకు తాను తాకలేదని చెప్పాడు.*


*తండ్రి మాటలు విన్న కుమారులలో నొకడగు ‘దేవదత్తుడ’ను వాడు తండ్రి మాటలకు బాధపడి ఇంక తన జీవితం వ్యర్థమని తలచి తపం చేయటానికి బదరికాశ్రమానికి  వెళ్లాడు.*


*అతడు చిరకాలం శివుని గూర్చి తపస్సు చేసాడు. దాని  ఫలంగా శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. అతడు శివుని-తాను శివునకు   అనుచరునిగా నుండునట్లు వరాన్ని  కోరుకొన్నాడు. శివుడాతనికి 'సకల విద్యలను గడించి భోగాలనుభవించిన తరువాత శివానుచరుడవు కాగల'వనే వరాన్నిచ్చాడు.*


*’దేవదత్తుడు  పాటలీపుత్రానికి చేరుకొని ‘వేదకుంభుడ’నే ఉపాధ్యాయునాశ్రయించాడు. ఆతని విద్యార్థి దశలో గురుపత్ని  హఠాత్తుగా ఆతనిని వరించింది. అతడా పాపానికి వెరచి అటనుండి పారిపోయి ప్రతిష్ఠాననగరానికేగి ‘మంత్రస్వామి’ అనే గురువు నాశ్రయించి సకల విద్యలను పొందాడు.* 


*ఒకరోజు ఆ నగర పాలకుడగు సుశర్మ కూతురు శ్రీ అను నామెను దేవదత్తుడు కిటికీగుండా చూచాడు. ఆమె కూడా ఈతనిని చూసింది. పరస్పరం మోహితులయ్యారు. ఆమె దంతంతో ఒక పుష్పాన్ని గ్రహించి ఆతనిపై విసరి వేసింది.*


*రాకుమార్తె చేసిన ఈ సంకేతాన్ని విప్పలేక దేవదత్తుడు తన గురువు మంత్రస్వామిని అడిగాడు.*


*అప్పుడు గురువు “దంతముచే పుష్పాన్ని ఆమె విసిరింది కాబట్టి పూలు విరివిగా నున్న పుష్పదంత దేవాలయానికి రమ్మని తానక్కడ అతనికోసం నిరీక్షిస్తానని సంకేతితంగా చెప్పిం”దని ఆమె అభిప్రాయాన్ని విప్పి చెప్పాడు.* 


*దేవదత్తుడు పుష్పదంత దేవాలయానికి వెళ్లి ఆమె రాకకై తలుపు చాటున దాక్కొన్నాడు. ఆమె రాగానే ఆమెను కౌగిలించుకొన్నాడు. ఆమె తన సంకేతాన్ని ఎట్లా తెలుసుకున్నావని అడుగగా తన గురువు తనకది చెప్పాడన్నాడు.*


*అపుడామె కోపించి “నీవు విదగ్ధుడవు (చతురుడు) కావంటూ వెళ్లి పోయింది.*


*అప్పుడతడు చేసేదేమీ లేక ప్రాణాలను విడవటానికి సిద్ధమయ్యాడు. శివుడు తానిచ్చిన వరం వ్యర్థమౌతుందనే ఉద్దేశ్యంతో తన ప్రమథగణాల్లో ఒకడైన పంచశిఖుడనే వానినతని వద్దకు పంపాడు. పంచశిఖుడాతని వద్దకు వచ్చాడు. దేవదత్తుని శ్రీ తో కలపటానికి ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. దానిప్రకారంగా అతడొక వృద్ధ బ్రాహ్మణుని వేషం వేసుకొని దేవదత్తునకు స్త్రీ వేషం వేసి సుశర్మ కొలువు దీరియుండగా ఆతని వద్దకు వెళ్లి “రాజా! నాకుమారుడెక్కడకో వెళ్లి పోయాడు. వానిని  వెదకటానికి నేను పోతున్నాను. ఈమె నా కోడలు. నా కొడుకు దొరికే వరకు ఈమెను నీ అంతఃపురంలో దాచియుంచమని కోరాడు.* 


*రాజామెను తన కుమార్తె అంతికానికి పంపాడు. స్త్రీ రూప వేషధారియైన ఆతడు నెమ్మది నెమ్మదిగా శ్రీ కి దగ్గరై –తానెవరో తెలుపుకొన్నాడు.*


*ఇద్దరూ గాంధర్వ విధించే పెండ్లాడారు. రాకుమార్తె గర్భం ధరించగా దేవదత్తుడు పంచశిఖుని తలవగా ఆతడు వచ్చి దేవదత్తుని అంతఃపురంనుండి తప్పించాడు.* 


*పంచశిఖుడు మరునాడు బ్రాహ్మణ వేషంతో రాజు వద్దకు పోయి తన కుమారుడు దొరికాడని తన కోడలిని తన కప్పగిస్తే తాను వెళ్ళి పోతానన్నాడు.*


*రాజు అంతంపురంలో వెదికించగా ఆమె ఎక్కడా కనబడ లేదు. బ్రాహ్మణశాప భయంతో రాజు తన మంత్రులతో విచారింపగా వారు 'ఇతడు నిజమైన బ్రాహ్మణుడు కాడని నిన్ను మోసం చేయటానికి వచ్చిన దేవుడని చెప్పారు.*


*పూర్వం ఇంద్రుడు, యముడు  శిబి చక్రవర్తిని ఏ విధంగా పరీక్షించటానికి వచ్చారో ఆ విధంగానే నిన్ను పరీక్షించటానికి వచ్చా'రన్నారు.* 


*ఇక చేసేదేమీ లేక రాజా ప్రమథగణంతో “ఓ పూజ్యుడా! నన్ను రక్షించు. రాత్రింవబవళ్లు శ్రద్ధతో కావలి కాస్తున్నా నీ కోడలినెవరో రాత్రి అపహరించారు. ఇది చాలా మాయగా ఉన్నద”న్నాడు. అపుడా దేవగణం రాజుతో అట్లయితే 'నాకొడుకునకు నీ కూతునిచ్చి పెండ్లి చేసి నాకు కోడలు లేని లోటును తీర్చ'మన్నాడు.*


*రాజు దానికంగీకరించి దేవదత్తునకు తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసాడు. ఈ విధంగా దేవదత్తుడు శివుడు చెప్పిన ప్రకారంగా చాలాకాలం భోగభాగ్యాలనుభవించాడు. *


*సుశర్మ వానప్రస్థానికై మహీధరమనే వనానికి వెళ్లాడు.   తిరిగి  దేవదత్తుడు శివుని ఆరాధించి మనుష్య శరీరాన్ని వదలి ప్రమథగణమయ్యాడు.*


*ప్రియురాలు ఉదంతముతో పుష్పాన్ని విసరుటయందలి సంజ్ఞను తెలియని వాడగుటచేత ఆతడు ప్రమథగణాల్లో పుష్పదంతునిగా ప్రసిద్దుడయ్యాడు.*


*ఇతడే తరువాత వరరుచిగా ప్రసిద్ధుడయ్యాడు. ఆతని భార్య శ్రీ- జయ అనే పేరుతో పార్వతీదేవికి ప్రతీహారి అయింది. శివుడు పార్వతీదేవికి చెప్పిన బృహత్కథను దొంగచాటుగా విని తన భర్తకు చెప్పి కథావ్యాప్తికి దోహదపడిందీమెయే.*✍️

(కథాసరిత్సాగరం-మొదటిలంబకం-ఏడవ తరంగం)

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

 గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

9493906277

లింక్ పంపుతాము.🙏

కామెంట్‌లు లేవు: