2, జనవరి 2025, గురువారం

తిరుమల సర్వస్వం -106*

 *తిరుమల సర్వస్వం -106*

ఇవే కాకుండా, విజయనగర సామ్రాజ్య చిహ్నమైన *"యాలి"* అనబడే కాల్పనిక జంతువు, కామధేనువు, పుష్పాకృతులు, హనుమంతుడు, జాంబవంతుడు, రామాయణ ఘట్టాలు మొదలైనవెన్నో చెక్కబడి ఉన్నాయి. ఇదివరకు నాణేలపరకామణి (నాణాల లెక్కింపు కేంద్రం) ఈ మంటపంలోనే ఉండేది. శ్రీవారికి చెందిన ప్రాచీన, నూతన ఉత్సవ వాహనాలను కూడా ఈ మంటపం లోనే భద్రపరిచేవారు. తరువాతి కాలంలో, కల్యాణోత్సవ వేడుకలు సంపంగి ప్రాకారంలోని *"శ్రీవేంకటరమణస్వామి కళ్యాణమంటపం"* లోనికి మార్చబడ్డాయి. అలాగే, వాహనాలను బయట నుండే వాహనమండపం లోనికి; నాణేలపరకామణిని తిరుపతి లోని తి.తి.దే. పరిపాలనాకార్యాలయ భవనానికి తరలించారు. తెలుగు పదకవితా పితామహుడు అన్నమాచార్యులచే శ్రీనివాసునికి కళ్యాణోత్సవం చేయబడ్డ ఈ పవిత్ర కళ్యాణమంటపం ప్రస్తుతం చాలా వరకు ఖాళీగానే ఉంటుంది. కొన్ని ఉత్సవ సందర్భాల్లో మాత్రం అర్చకులు, ఆలయ అధికారులు పూజాద్రవ్యాలను శిరస్సులపై నుంచుకొని, స్వామివారిసన్నిధి లోనికి ఈ కళ్యాణ మండపం నుండి బయలుదేరుతారు. శ్రీవారి దర్శనానంతరం ఈ మంటపంలో కూర్చుని కొద్దిగా విశ్రాంతి తీసుకుంటూ, ఉత్తరం వైపున ఉన్న ఆనందనిలయ గోపురాన్ని తనివితీరా దర్శించుకోవచ్చు. 

*నోట్లపరకామణి (నోట్ల లెక్కింపుకేంద్రం)* 

కళ్యాణమంటపానికి ఆనుకొని, ఆలయానికి పడమరదిక్కున ఉన్న విశాలమైన, పొడవాటి మంటపాన్ని ప్రస్తుతం *"నోట్లపరకామణి"* గా వ్యవహరిస్తారు. పూర్వం ఈ మంటపంలో కూడా కొన్ని వాహనాలను భద్రపరిచేవారు. మూలమూర్తికి పూతగా పూసే పునుగుతైలం కూడా ఇక్కడే తయారు చేయబడేది. ప్రసాదవితరణ సైతం ఇక్కడే జరిగేది. కాలాంతరంలో ఇవన్ని వేర్వేరు ప్రదేశాలకు తరలించబడ్డాయి. ప్రస్తుతం శ్రీవారికి హుండీలో రొక్ఖరూపంలో, వస్తురూపంలో సమర్పింపబడే కానుకలను వేరు చేసి, దేశవిదేశాలకు చెందిన కరెన్సీనోట్లను లెక్కించే *"నోట్లపరకామణి"* గా ఈ మంటపాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ మంటపం పగటిపూట నడుము పైభాగంలో ఏ ఆచ్చాదన లేకుండా నోట్లను వేరుచేస్తున్న శ్రీవారి సేవకులతోనూ, నోట్ల లెక్కింపు యంత్రాలతోనూ, నోట్ల కట్టలను బయటకు చేరవేస్తున్న బ్యాంకు సిబ్బంది తోనూ సందడిగా ఉంటుంది. నిబంధనల ప్రకారం నోట్ల లెక్కింపు విధుల్లో ఉన్న శ్రీవారిసేవకులు, బ్యాంకు సిబ్బంది, ఏ విధమైన ఆభరణాలను కానీ, చేతి గడియారాలను కానీ ధరించరాదు. 

‌ ప్రతినిత్యం 3–4 కోట్ల రూపాయలు, బ్రహ్మోత్సవాల్లో దానికి రెండింతల నగదు ఇక్కడ లెక్కించబడుతుంది. ఈ లెక్కింపు కార్యక్రమాన్ని చూస్తుంటే శ్రీమహాలక్ష్మి "ధనలక్ష్మి రూపం" లో శ్రీవారి చెంతనే కొలువుతీరి ఉన్నట్లుగా, ముల్లోకాల యందలి సమస్త సంపదలు ఇక్కడే ప్రోగుపడ్డట్లుగా అనిపిస్తుంది. నోట్ల లెక్కింపు విధుల్లో ఉన్న సిబ్బంది 2-3 షిప్టుల్లో పని చేస్తారు. పరకామణిలో జరిగే కార్యక్రమాలన్నింటినీ సీసీటీవీల ద్వారా విజిలెన్స్ శాఖ వారు నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు.

స్వామివారి దర్శనానంతరం, విమాన ప్రదక్షిణ మార్గంలో వెళుతున్న భక్తులు ఒకరిద్దరిని పిలిచి, ఈ లెక్కింపు కార్యక్రమానికి సాక్షి సంతకాలు తీసుకునే సాంప్రదాయం ఉంది. 

‌ శ్రీవారి కృప ఉంటే, ఈసారి మనమే సాక్షులుగా ఎన్నుకోబడి ఆ వైభవాన్ని కన్నులారా తిలకించి, పునర్దర్శన భాగ్యాన్ని, శ్రీవారి ప్రసాదాన్ని పొందే అవకాశం ప్రాప్తిస్తుంది. 

*చందనపు అర*

 నోట్లపరకామణికి ఉత్తరం దిక్కున, సంపంగి ప్రదక్షిణమార్గంలో వాయువ్యమూలకు, ఇనుపకడ్డీల వాకిళ్ళతో కనిపిస్తున్న చిన్నగదిని *"చందనపు అర"* గా పిలుస్తారు. ప్రతినిత్యం స్వామివారికి అవసరమయ్యే చందనం ఈ గదిలోనే తయారు చేయబడుతుంది. గంధం తీయడానికి అనువుగా వుండే ఎత్తైన సానరాళ్ళు ఏర్పాటు చేయబడి ఉంటాయి. పెద్ద తిరుగలిరాళ్ల లాగా ఉండే వీటిపై గంధం చెక్కలను వడివడిగా అరగదీస్తూ, చందన ద్రవ్యాన్ని తయారుచేసే దేవాలయ పరిచారకులను *"చందనపాణి"* గా వ్యవహరిస్తారు. చందనంతో పాటుగా, నీళ్ళతో తడిచిన మెత్తని పసుపు ముద్దలు కూడా ఇక్కడే తయారు చేయబడతాయి. ఈ గదిలో తయారైన చందనాన్ని, పసుపును శ్రీవారికి జరిగే అన్ని ఉత్సవాల్లో వినియోగిస్తారు. 


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

99490 98406

కామెంట్‌లు లేవు: