11-40-గీతా మకరందము
విశ్వరూపసందర్శనయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
నమః పురస్తాదథ పృష్ఠతస్తే
నమోఽస్తు తే సర్వత ఏవ సర్వ |
అనన్తవీర్యామితవిక్రమస్త్వం
సర్వం సమాప్నోషి తతోఽసి సర్వః |
తా:- సర్వరూపులగు ఓ కృష్ణా! ఎదుటను, వెనుకను మీకు నమస్కారము మఱియు అన్నివైపులను మీకు నమస్కారమగుగాక! అపరిమితసామర్థ్యము, పరాక్రమము గలవారగు మీరు సమస్తమును లెస్సగ వ్యాపించియున్నారు. కనుకనే సర్వస్వరూపులై యున్నారు.
వ్యాఖ్య:- అర్జునుడు తన హృదయమున పొంగిపొరలుచున్న భక్తిభావాతిశయమును వ్యక్తముచేయుచున్నాడు.
‘అనన్తవీర్యామితవిక్రమః’ - భగవానుడు అపరిమిత శక్తిసామర్థ్యములు కలవాడు. ఒక చిన్న విసనకఱ్ఱతో వీచుకొనిన, కొద్దిగాలి వచ్చును. ఒక్కసారి ఝంఝామారుతము వీచినచో అపరితమగుగాలి ఉద్భవించును. మొదటిది మనుష్యశక్తి. రెండవది దైవశక్తి. బిందెలతో గాని, ఏతాముతోగాని, మిషన్లతోగాని నీరు పారగట్టినచో ఒకింత నీరు ప్రవహించును. కుంభవర్షము కురిసినచో వెల్లువలు పారును. వేలకొలది ఎకరములు నేల తడియును. మొదటిది మనుష్యశక్తి, రెండవది దైవశక్తి. మనుజుని శక్తికిని భగవంతుని శక్తికినిగల తేడా ఇదియే. కనుకనే అర్జునుడు భగవానుని ‘అనంతవీర్యామితవిక్రముడ’ని సంబోధించెను. కావున మనుజుడు తన అల్పశక్తినిజూచి గర్వించక, సర్వశక్తిమంతుడగు పరమాత్మయెడల అకుంఠిత భక్తిభావము గలిగియుండవలెను.
ప్ర:- పరమాత్మ ఇంకను ఎట్టివాడు?
ఉ:- (1) అనంతశక్తిగలవాడు (2) అపరిమిత పరాక్రమశీలుడు (3) సర్వత్రవ్యాపించి యున్నవాడు (4) సర్వరూపుడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి