*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...*
*శ్రీ స్వామివారి బోధ..ఊరట చెందిన దంపతులు..*
*(యాభై ఐదవ రోజు)*
సత్యనారాయణమ్మ గారిని కనిగిరి లో వదిలిపెట్టి వచ్చిన తరువాత శ్రీ స్వామివారిని శ్రీధరరావు దంపతులు కలిసారనీ..మాట్లాడదాము రమ్మని ఆ దంపతులను ఆశ్రమం లోకి తీసుకువెళ్లారు శ్రీ స్వామివారు..శ్రీ స్వామివారి కెదురుగా కూర్చున్నారు ప్రభావతి శ్రీధరరావు గార్లు..
"అమ్మా..ఏదో దుష్ట శక్తి మీ బంధువు రూపంలో వచ్చి మీ అత్తగారి మనసంతా విరిచేసి..ఆవిడను మీకు కాకుండా చేసిందని మీరు భావిస్తున్నారు కదా..ఎంత వెఱ్ఱి తల్లివమ్మా!..ఆ వచ్చినావిడ మీ పాలిట దుష్ట శక్తి కాదు..మీకు అయాచితంగా.. పరోక్షంగా మేలు చేయడానికి వచ్చిన దేవత అని భావించండి..శ్రీధరరావు గారూ నేను మొదటిసారి మొగలిచెర్ల లోని మీ ఇంటికి వచ్చిన రోజే మీతో ఒక మాట చెప్పాను గుర్తుందా..మీ అమ్మగారికి మృత్యువు పొంచివుంది..ఆమెను రామనామం విడవకుండా చేసుకోమని చెప్పండి అన్నాను..నేను కూడా ఆమెతో మీ ఇంటిలో ఉన్న కాలంలో చెప్పి వున్నాను..ఆమె బాధ్యతను మీనుంచి తొలగించడానికే దైవం ఆ "బంధువు" ను ఇక్కడికి పంపాడు..ఈ అవసాన కాలంలో మీ తల్లిగారు పడే బాధను మీరు చూడలేరు..పడలేరు..ఎక్కువ సమయం లేదామెకు..కొద్దిరోజుల్లోనే వైద్యులు కూడా ఇదే నిర్ధారిస్తారు..
"ఇక మీరిద్దరూ ఆమెకు చేసిన సేవ ఫలితం ఎక్కడికీ పోదు..మిమ్మల్ని ఇప్పుడు విమర్శించిన వ్యక్తులందరూ..మళ్లీ మిమ్మల్ని కీర్తించే రోజు వస్తుంది..ఇక్కడి నుంచి మీ బంధాలన్నీ ఒకటొకటిగా విడిపోతూ ఉంటాయి..ఇది మీకు మరో జన్మ గా అనుకోండి!..మీకు దైవం కొన్ని బృహత్తర బాధ్యతలు అప్పజెప్పబోతున్నాడు..అవి మీరు నెరవేర్చాలి..అందుకు ముందుగా ఈ ప్రతిబంధకాలు తొలగి పోవాలి..ఆ ఏర్పాట్లలో భాగమే ఆ బంధువు మీ వద్దకు రావడం..ఒక కష్టం..ఒక సుఖం..ఒక దుఃఖం..ఒక సంతోషం..వీటన్నింటినీ తట్టుకొని ఒక స్థిరచిత్తం మీకు కలగాలి..వీటన్నిటి కి ప్రేరణే ఈనాడు ఆ భగవంతుడు చేసిన ఏర్పాటు.."
"మరో ముఖ్య విషయం..త్వరలో నా పరంగా మీమీద పెద్ద భారం పడబోతోంది..అందుకూ మీరు సన్నద్ధులు కావాల్సిన అవసరం ఉంది..ఇక మనసు గట్టి చేసుకోండి..నిశ్చింతగా వుండండి.. ఏ బాధా.. ఏ సంతోషం..మీ మార్గం నుంచి వేరు చేయలేవు..ఈ ఆశ్రమం కూడా క్షేత్రంగా మారుతుంది..అప్పుడు అందరూ మీ గురించి ముచ్చటించుకుంటారు.."
"అమ్మా..నువ్వు రచయిత్రివి..నా చరిత్ర వ్రాసే రోజులు వస్తాయి..ఇక ఎక్కువ ఆలోచించకండి..శుభం జరుగుతుంది.." అన్నారు..
శ్రీ స్వామివారి బోధ ఆ దంపతులకు ఎనలేని మానసిక స్తైర్యాన్ని ఇచ్చింది..మన వంతు కర్తవ్యం మనం చక్కగా నెరవేర్చాలి..ఫలితాన్ని ఆ దైవానికి వదిలేద్దాము..అనే భావనలోకి వచ్చేసారు..ఆరోజు నుంచి వారి జీవితంలో పెను మార్పు తీసుకొచ్చింది..పూర్తిగా ఆధ్యాత్మిక మార్గం వైపు వారి జీవనయానం సాగడానికి తోడ్పడింది..శ్రీ స్వామివారి సేవ అనేది తమ జీవితంలో ముఖ్యమైన విషయంగా మారిపోయింది..
ఎందరో సాధకులు..ముముక్షువులు..పండితులు..శ్రీ స్వామివారిని దర్శించడానికి మొగలిచెర్ల రా సాగారు..వారిని ఆదరించడం..సత్సంగ గోష్ఠులు..ఇలా నిత్యం ఒక దైవిక వాతావరణం ఆ దంపతుల చుట్టూ ఏర్పడిపోయింది..వారూ అందులో ఇమిడిపోయారు.
ప్రభావతి గారిని తేలు కుట్టటం..అహంకార నిర్మూలనం..రేపు..
*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...*
*తేలు కుట్టటం..అహంకార నిర్మూలనం..*
*(యాభై ఆరవ రోజు)*
శ్రీ స్వామివారి పేరు, ప్రఖ్యాతులు చుట్టుప్రక్కల గ్రామాల్లో వ్యాపించసాగాయి..శ్రీధరరావు గారింటికి అనేకమంది పండితులూ..ముముక్షువులూ.. సాధకులు రావడం..శ్రీ స్వామివారిని కలవాలని కోరడం..శ్రీ స్వామివారి అవకాశాన్ని బట్టి వారితో మాట్లాడటం..జరుగుతోంది..
దాదాపుగా అందరి నోటా ఒకటే మాట.."ఈయన సాధారణ మానవుడు కాదు..సాక్షాత్తూ ఆ దత్తాత్రేయుడి ప్రతి రూపమే ఈ మొగలిచెర్ల గ్రామ సరిహద్దుల్లో ఆశ్రమం కట్టుకొని సాధకుడి గా మారి నడయాడుతున్నాడు..మీ దంపతులు చేసుకున్న పుణ్యమే ఇది!.." అని..
శ్రీ విక్రాల శేషాచార్యులు గారు, వారి ధర్మపత్ని శ్రీదేవమ్మ గారు (వీరిద్దరూ సంస్కృతాంధ్రములలో మహా పండితులు..శతావధానం చేసిన వారు..శ్రీ వైష్ణవులు..ఆదిదంపతులే కలసి వచ్చినట్లుగా భావిస్తారు వారిని చూసిన వారు..వీరి గురించి ఈ చరిత్ర మొదట్లో ప్రస్తావించడం జరిగింది..) శ్రీ స్వామివారిని చూడటానికి మొగలిచెర్ల వచ్చారు..ఆరోజు శ్రీ స్వామివారు కూడా ఈ దంపతుల కోసమే తీరుబడిగా ఉన్నట్లు..వారితో ఎంతో సేపు చర్చ చేశారు..దాదాపు రెండు గంటలపాటు ఆ దంపతుల తో శ్రీ స్వామివారు ఓపికగా మాట్లాడారు..
తిరిగి వచ్చేటప్పుడు గూడు బండిలో ఆ దంపతులిద్దరూ.."నాయనా శ్రీధరరావు, అమ్మా ప్రభావతీ..మీ పూర్వపుణ్యం వలన ఆ మహనీయుడు మీ బిడ్డగా సేవలందుకొంటున్నాడు.. ఆయనది "పరా" విద్య!..మాది కేవలం పాండిత్యం..జన్మజన్మల సంస్కారం, తపస్సు, సాధన..ఈ మూడింటిముందు మా పాండిత్యం కేవలం గడ్డిపోచ వంటిది..ఆ మహానుభావుడి ని పరీక్షించడానికి మాబోటి వాళ్ళము వెయ్యిమందిమి వచ్చినా చాలము..అది ఆ తల్లి లలితా దేవి కరుణ తప్ప మరోటి కాదు..ఆ జ్యోతి ముందు మా విద్య సూర్యుడి ముందు చిన్న ప్రమిద లో వెలిగే దీపం లాంటిది..మీరు అదృష్టవంతులు!.." అన్నారు..
శ్రీధరరావు ప్రభావతి గార్లు వాళ్ళను మర్యాదచేసి..వారి పాదాలకు నమస్కరించి వాళ్ళను సాగనంపారు..ఆ ప్రక్కరోజే..ప్రభావతి గారి నాన్న గారు కూడా కావలి నుంచి కొంతమంది పండితులను వెంటబెట్టుకొని మొగలిచెర్ల వచ్చి, శ్రీ స్వామివారిని చూసి తిరిగి వెళుతూ..ఆ పండితులందరూ ఈ దంపతుల సేవను పొగిడి వెళ్లారు..
ఈ వరుస ఘటనలతో..ప్రభావతి గారిలో ఒక మూల చిన్న అహంకారం మొలకెత్తింది..తాము ఒక మహనీయుడికి సేవ చేసినందునే ఈ పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి..తామిద్దరం కూడా దైవాంశ సంభూతులమేమో?.. తాము అందరికన్నా అధికులము అనే భావన మెల్లిగా ఏర్పడసాగింది.. మరీ ముఖ్యంగా..పండితులందరూ ఏక కంఠంతో మెచ్చుకోవడం ఆవిడకు ఆనందాన్ని..అహాన్నీ పెంచాయి..
ఆరోజు మధ్యాహ్నం శ్రీధరరావు గారి స్నానానికి నీళ్లు పెట్టి..టవల్ తీసుకొని స్నానాలగదిలో పెట్టబోతున్నారు..అంతలో ఆ టవల్ లో దాక్కొని ఉన్న ఒక తేలు.. అందులోంచి జారి ప్రభావతి గారి కాలిమీద పడి.. ఒక్కసారిగా కుట్టింది..వెఱ్ఱి కేక పెట్టారు ప్రభావతి గారు..ఆ తేలు కూడా ఒక పట్టాన వదిలిపెట్టలేదు..ఈలోపల శ్రీధరరావు గారు వచ్చి తేలును చెప్పుతో కొట్టి చంపేశారు..కానీ అప్పటికే ప్రభావతి గారికి తేలు విషం మోకాలు పై భాగం దాకా ప్రాకిపోయింది..ఆవిడ విపరీతంగా బాధ పడుతున్నారు..సాయంత్రానికి కూడా బాధ తగ్గలేదు..
శ్రీ స్వామివారికి చెపితే ఏదైనా మంత్రం వేస్తారని.. అక్కడికి తీసుకుపొమ్మని గ్రామస్థులు శ్రీధరరావు గారికి చెప్పారు..వద్దని..ఓర్చుకుంటే తెల్లవారేలోపల తగ్గుతుందని శ్రీధరరావు గారు నచ్చచెప్పి వాళ్ళను పంపించివేశారు..
కానీ..శ్రీధరరావు దంపతులను తన తల్లిదండ్రుల వలె భావించే ఒక మనిషి మాత్రం వుండబట్టలేక..సైకిల్ వేసుకొని శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళిపోయాడు..
అక్కడ శ్రీ స్వామివారు ఆశ్రమం బైట తిరుగుతూ వున్నారు..ఈ మనిషి సైకిల్ దిగి, శ్రీ స్వామివారికి నమస్కరించి..ప్రభావతి గారికి తేలు కుట్టిన విషయమూ..ఆవిడ పడుతున్న బాధనూ వివరించాడు..
శ్రీ స్వామివారి సమాధానం..అహం తొలగడం..రేపు..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699)
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి