2, జనవరి 2025, గురువారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము*


*244 వ రోజు*

*అభిమన్యుని యుద్ధము*


కళింగరాజు పరాజయమును చూసిన కృపాచార్యుడు, శల్యుడు, అశ్వధ్ధామ అక్కడకు వచ్చారు. వారిని చూసిన ధృష్టద్యుమ్నుడు భీముని కిందకు దింపి " భీమసేనా నీవు నా వెనుక ఉండి నన్ను రక్షించు " అని వారి వైపు రథం నడిపి అశ్వథ్థామ రథానికి కట్టిన హయములను తొమ్మిది బాణాలు వేసి చంపాడు. అశ్వథామ శల్యుని రథం ఎక్కి ధృష్టద్యుమ్నుని మీద అస్త్ర ప్రయోగం చేసాడు. ధృష్టద్యుమ్నుడు ఒంటరిగా అశ్వథ్థామ, శల్య, కృపాచార్యులను ఎదుర్కోవడం చూసిన అభిమన్యుడు తన రథం వారి వైపు నడిపి అశ్వథ్థామ, కృపులపై తొమ్మిది బాణాలు వేసాడు. శల్యునిపై బాణపరంపర కురిపించాడు. వారుకూడా అభిమన్యునిపై ఒక్కొక్కరు పన్నెండు బాణాలు సంధించారు. ఆ సమయంలో సుయోధనుని కుమారుడైన లక్ష్మణకుమారుడు అభిమన్యునితో తలపడ్డాడు. మర్మభేదులైన బాణములతో అభిమన్యుని నొప్పించాడు. అభిమన్యుడు ఏభై బాణాలతో లక్ష్మణుని తిప్పి కొట్టాడు. లక్ష్మణుడు అభిమన్యుని విల్లు విరిచాడు. కౌరవ సేన హర్షధ్వానాలు చేసాయి. అభిమన్యుడు వేరొక విల్లు తీసుకుని లక్ష్మణునిపై బాణవృష్టి కురిపించి అతని కవచాన్ని భేదించాడు. ఇది చూసిన సుయోధనుడు తన రథాన్ని అభిమన్యుని వైపు మరలించాడు. సుయోధనునికి సాయంగా భీష్మ, ద్రోణ ఇతర ప్రముఖులు వచ్చారు. అభిమన్యుడు బెదరక నవ్వుతూ వారితో యుద్ధం చేయసాగాడు. అర్జునుడు ఇది చూసి దేవదత్తం పూరిస్తూ అభిమన్యునికి సాయం వచ్చి భీష్మ, ద్రోణులపై శరవర్షం కురిపించాడు. ఇది చూసిన ధర్మరాజు తన సేనలకు సైగ చేసి అందరినీ అక్కడకు తీసుకు వచ్చాడు. అర్జునుడు వివిధ బాణములు వేసి కౌరవసేనను తుత్తునియలు చేస్తున్నాడు. అర్జునిని బాణాలు ఆకాశాన్ని కప్పాయి. విరిగిన కరవాలములు, శరములు, గదలు, తలలు, మొడెములు మొదలైన వాటితో యుద్ధభూమి భాయానకంగా ఉంది. గజారోహకులు అడ్డు వచ్చిన వారిని తొక్కుతూ వీరవిహారం చేస్తున్నారు. శ్రీకృష్ణుడు, అర్జునుడు శంఖాలను పూరించాడు. భీష్ముడు ద్రోణాచార్యులను చూసి " ఆచార్యా ! అర్జునుడు శ్రీకృష్ణుని సారధ్యంలో చెలరేగి పోయాడు. నన్ను కూడా లక్ష్యపెట్ట లేదు. అతడిని ఎదుర్కొనే వీరుడు లేడు. సూర్యుడు పశ్చిమాద్రికి చేరుకున్నాడు. మన సేనలు అలసి పోయాయి. కనుక ఈ రోజుకు యుద్ధం చాలిస్తాము " అన్నాడు ద్రోణాచార్యుడు అందుకు అంగీకరించాడు. యుద్ధం ఆపమని సైన్యాలకు సూచించి అందరూ తమ నివాసాలకు చేరారు.


*మూడవ రోజు యుద్ధం గరుడవ్యూహం అర్ధ చంద్ర వ్యూహం*


మూడవరోజు యుద్ధానికి భీష్ముడు తన సేనలను గరుడవ్యూహంలో నిలిపాడు. ఆవ్యూహానికి తాను ముక్కు భాగంలో నిలిచాడు. ద్రోణుడు, కృతవర్మలను కళ్ళు ఉండే స్థానంలోను, కృతవర్మ, అశ్వథ్థామలు తలభాగంలోను నిలిచారు. త్రిగర్తలతో చేరి భూరిశ్రవసుడు, శల్యుడు, భగదత్తుడు, సౌవీరుడు, జయద్రధుడు కంఠ భాగాన నిలిచారు. సుయోధనుడు, సుయోధనుని తమ్ములు వెన్ను భాగమున నిలిచారు. విందాను విందులు, కాంభోజరాజు, శూరసేనుడు తోక భాగమున నిలిచారు. మగధ, కళింగ రాజులు కుడి రెక్కగా నిలిచారు, కర్ణాటక కోసల రాజులు ఎడమ రెక్కగా నిలిచారు. ధృష్టద్యుమ్నుడు పాండవ సేనలను అర్జునుని కోరికపై అర్ధచంద్ర ఆకారంలో నిలిపాడు. పాండ్య, మగధ రాజులతో భీమసేనుడు చంద్రుని కుడి కొమ్ము భాగాన నిలిచారు. భీమసేనునికి ఎడమ పక్కన విరాటుడు, ద్రుపదుడు, నీలుడు తమ తమ సైన్యంతో నిలిచారు. శిఖండి సహితంగా ధృష్టద్యుమ్నుడు ముందు నిలువగా ధర్మరాజు మధ్య భాగాన నిలిచాడు. వారి పక్కన సాత్యకి, నకులసహదేవులు, ఉపపాండవులు, అభిమన్యుడు, ఘటోత్కచుడు, కేకయ రాజులు తమ సైన్యాలతో నిలిచారు. అర్జునుడు సైన్యాలకు ఎడమ కొమ్ము దగ్గర నిలిచాడు. భేరి తూర్య నాదాలు మిన్నంటాయి. మూడవ రోజు యుద్ధం ఆరంభం అయింది. ఇరు పక్షములు ఒకరితో ఒకరు తలపడ్డాయి.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: