*🌸శుభ సంకల్పం:*
సమయాన్ని లెక్కించాల్సింది గడియారంతో కాదు, అనుభూతితో, ఒక బ్యాంకులో ఏరోజుకారోజు ఉదయమే మన ఖాతాలో 86,400 రూపాయలు జమ అవుతాయనుకుందాం. మొత్తం ఆరోజే ఖర్చు పెట్టాలి. మిగిలింది ఆ రాత్రికల్లా రద్దయిపోతుంది. అప్పుడేం చేస్తాం. డబ్బు విలువ తెలుసు కనుక పైసా మిగల్చకుండా వాడేసుకుంటాం. అలాంటి బ్యాంకే అందరికీ ఉంది. దాని పేరు *'కాలం'*. ప్రతి రోజూ 86,400 సెకండ్లు జమ అవుతాయి. వాడుకున్నది వాడుకోగా మిగిలింది రాత్రికల్లా చేజారిపోయినట్లే. ఆ ఖాతాని ఎవరికి వారే నిర్వహించుకోవాలి. కాలం అందరికీ సమంగానే ఉంటుంది. టైమ్ లేదు- అని చెప్పారంటే నిజంగా సమయం లేదని కాదు, ఆ పని చేయాలనే ఉద్దేశం ఉందా.. లేదా అన్నది ముఖ్యం.
కదిలిపోయే ప్రతి క్షణం కొన్ని జ్ఞాపకాలను, విలువలను, శక్తులను మన పేరున కూడబెడుతూంటుంది. ఆ నిధి చివర్లో మన కళ్లముందు కదలాడుతుంది. జీవితాన్ని ఎలా జీవించామో చెబుతుంది. అప్పుడు అయ్యో అనుకోకుండా తృప్తిగా ఉండాలంటే మన ఖాతాని మనం జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. ఒక రచయితో, చిత్రకారుడో తాను చేసిన పనిని తరచి చూసుకుంటూ, చేయబోయేదాన్ని సరిచేసుకుంటూ ఎలా ముందుకెళ్తాడో అలా వెళ్లాలి. అప్పుడే నిరుటి కన్నా ఈ ఏడాది మరింత మెరుగవుతుంది. *'కాలం ఎగిరిపోతుందన్నది చెడ్డవార్త. దానిని నడిపే సారథివి నువ్వే అన్నది శుభవార్త'* అంటారు ఒక అమెరికన్ రచయిత.
అశుభం శుభం ఎప్పుడవుతుందంటే- కొత్త సంవత్సరాన్ని వేడుకగా మాత్రమే కాక ఒక గొప్ప అవకాశంగా చూసినప్పు ఈరోజు ఒక మంచి పనికి శ్రీకారం చుడితే, 365 రోజుల తరవాత ఒక మంచి ముగింపునూ సృష్టించగలం. ఒక కొత్త నైపుణ్యాన్ని సంపాదించుకోవచ్చు, కెరీర్లో ఒక లక్ష్యాన్ని చేరుకోవచ్చు, అర్థవంతమైన బంధాలను కలుపుకోవచ్చు. *కాలాన్ని కొలవడానికే గడియారం కానీ జీవితం సాగేది హృదయాన్ని అనుసరించే, ఏం సాధించాలని నిర్ణయించుకుంటారో దానికి తగ్గట్టుగా కాలాన్ని ఉపయోగించుకుంటారు జ్ఞానులు.*
కాలం కష్టసుఖాలను మోసుకొస్తుందనుకుంటాం. వాస్తవానికి సమస్య కాలంతో ముడిపడిలేదు.
ద్వంద్వాలకు నిలయమైన ఈ ప్రపంచంలో ఉంది. ఉష్ణం శీతలం, సుఖం దుఃఖం, జయం అపజయం.. ఇలాంటివన్నీ ఉన్న ప్రపంచమిది. కాబట్టి *ఆనందాన్ని అన్వేషించడం ఆపి, ఆధ్యాత్మిక సంతృప్తిని వెతుక్కోమని, అదే శాశ్వతమని, దానికి భక్తియోగం మార్గమని గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు. మనిషిని ఆలోచన నిలబెట్టగలదు, పడేయనూగలదు. భవిష్యత్తు దాని శక్తి మీదే ఆధారపడి ఉంది.*
*విలువైన కాలాన్ని సద్వినియోగపరిచేది ఆ ఆలోచనే. సహనం, సమయాలను మించిన యోధుల్లేరు అంటారు టాల్స్టాయ్. ఆ యోధుల్ని మన సొంతం చేసుకుంటే చాలదూ!*
(✍️-మంత్రవాది మహేశ్వర)
*🪷సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🪷*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి