2, జనవరి 2025, గురువారం

గణపతి ఉపనిషత్తు

 🙏గణపతి ఉపనిషత్తు 🙏

                 

ముందు గణపతి ఉపనిషత్తు వ్రాసి తరువాత అర్ధం ఇచ్చాను గమనించగలరు.

ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః! భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః!

స్థిరైరంగైస్తుష్ఠువాగ్ం సస్తనూభిః! వ్యశేమ దేవహితం యదాయుః! 

స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః! స్వస్తి నః పూషా విశ్వవేదాః !

స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః! స్వస్తి నో బృహస్పతిర్దధాతు !


               ఓం శాంతిః శాంతిః శాంతిః

అర్థం:

1: ఓం , ఓ దేవా నీ దయవల్ల , శుభకరమైనవి మన చెవులతో విందుము గాక , 2: మనం 

 ఏది శుభప్రదమైనదో మరియు ఆరాధనీయమైనదో అది మన కళ్లతో చూద్దాం ,

3: మన మనస్సుశరీరాలతో స్థిరత్వంతో మనం ప్రార్థిద్దాం , 4: దేవతలు (దేవుని సేవ కోసం) మనకిచ్చిన మన ఆయుష్షును అందిస్తాము . ఇన్ద్రో వృద్ధశ్రవాః । స్వస్తి నః పూషా విశ్వవేదః । స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః । స్వస్తి నో బృహస్పతిర్దధాతు

మహిమ గల ఇంద్రుడుమనకు క్షేమమును ప్రసాదించుగాక, సర్వజ్ఞుడైనపూషణుడుమనకు క్షేమమును ప్రసాదించుగాక, : రక్షణ వలయుడైన తార్క్షయుడు క్షేమమును ప్రసాదించు గాక .​​​​​ మాపై బృహస్పతి మాకు క్షేమాన్ని ప్రసాదించుగాక , : ఓం , శాంతి , శాంతి , శాంతి 


ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్త్వమసి! త్వమేవ కేవలం కర్తాఽసి ! త్వమేవ కేవలం ధర్తాఽసి! త్వమేవ కేవలం హర్తాఽసి! త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి! త్వం సాక్షాదాత్మాఽసి నిత్యమ్!1

ఋతం వచ్మి సత్యం వచ్మి 2 


అవ త్వం మామ్, అవ వక్తారమ్, అవ శ్రోతారమ్, అవ దాతారమ్, అవ ధాతారమ్, 

అవానూచానమవ శిష్యమ్, అవ పశ్చాత్తాత్, అవ పురస్తాత్, అవోత్తరాత్తాత్, అవ దక్షిణాత్తాత్, 

అవ చోర్ధ్వాత్తాత్, అవాధరాత్తాత్, సర్వతో మాం పాహి పాహి సమంతాత్! 3


త్వం వాఙ్మయస్త్వం చిన్మయః! త్వమానందమయస్త్వం బ్రహ్మమయః!

త్వం సచ్చిదానందాఽద్వితీయోఽసి! త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి! త్వం జ్ఞానమయో విజ్ఞానమయోఽసి! 4


సర్వం జగదిదం త్వత్తో జాయతే! సర్వం జగదిదం త్వత్తస్తిష్ఠతి! సర్వం జగదిదం త్వయి లయమేష్యతి! సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి! త్వం భూమిరాపోఽనలోఽనిలో నభః త్వం చత్వారి వాక్పదాని! 5


త్వం గుణత్రయాతీతః! త్వం దేహత్రయాతీతః! త్వం కాలత్రయాతీతః! త్వం అవస్థాత్రయాతీతః!

త్వం మూలాధారస్థితోఽసి నిత్యమ్! త్వం శక్తిత్రయాత్మకః! త్వాం యోగినో ధ్యాయంతి నిత్యమ్!

త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువః స్వరోమ్! 6


గణాదిం పూర్వముచ్చార్య! వర్ణాదీం స్తదనంతరమ్! అనుస్వారః పరతరః! అర్ధేందులసితమ్!

తారేణ ఋద్ధమ్! ఏతత్తవ మనుస్వరూపమ్! గకారః పూర్వరూపమ్ అకారో మధ్యమరూపమ్ అనుస్వారశ్చాంత్యరూపమ్! బిందురుత్తరరూపమ్! నాదః సంధానమ్! సంహితా సంధిః!

సైషా గణేశవిద్యా! గణక ఋషిః! నిచృద్గాయత్రీచ్ఛందః! శ్రీ మహాగణపతిర్దేవతా ఓం గం గణపతయే నమః!7


ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి

తన్నో దంతిః ప్రచోదయాత్ 8


ఏకదంతం చతుర్ హస్తం పాశమంకుశధారిణమ్

రదం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజమ్!

రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససమ్ 

రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితమ్!

భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతమ్ 

ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్పరమ్!

ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః 9


నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేఽస్తు

లంబోదరాయైకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమః 10


ఏతదథర్వశీర్షం యోఽధీతే స బ్రహ్మభూయాయ కల్పతే

స సర్వవిఘ్నైర్న బాధ్యతే స సర్వతః సుఖమేధతే

స పంచమహాపాపాత్ ప్రముచ్యతే !


సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి

ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి 

సాయం ప్రాతః ప్రయుంజానోఽపాపో భవతి 

సర్వత్రాధీయానోపవిఘ్నో భవతి! ధర్మార్థకామమోక్షం చ విందతి


ఇదమథర్వశీర్షమశిష్యాయ న దేయమ్ 

యో యది మోహాద్ దాస్యతి స పాపీయాన్ భవతి 

సహస్రావర్తనాద్యం యం కామమధీతే తం తమనేన సాధయేత్ 11


అనేన గణపతిమభిషించతి స వాగ్మీ భవతి చతుర్థ్యామనశ్నన్ జపతి స విద్యావాన్ భవతి ఇత్యథర్వణవాక్యమ్ బ్రహ్మాద్యాచరణం విద్యాన్నబిభేతి కదాచనేతి 12


యో దూర్వాంకురైర్యజతి స వైశ్రవణోపమో భవతి 

యో లాజైర్యజతి స యశోవాన్ భవతి స మేధావాన్ భవతి 

యో మోదకసహస్రేణ యజతి స వాంఛితఫలమవాప్నోతి

యః సాజ్య సమిద్భిర్యజతి స సర్వం లభతే స సర్వం లభతే 13


అష్టౌ బ్రాహ్మణాన్ సమ్యగ్ గ్రాహయిత్వా సూర్యవర్చస్వీ భవతి 

సూర్యగ్రహే మహానద్యాం ప్రతిమాసన్నిధౌ వా జప్త్వా స సిద్ధమంత్రో భవతి 

మహావిఘ్నాత్ ప్రముచ్యతే మహాదోషాత్ ప్రముచ్యతే మహాపాపాత్ ప్రముచ్యతే 

మహాప్రత్యవాయాత్ ప్రముచ్యతే స సర్వవిద్భవతి స సర్వవిద్భవతి 


య ఏవం వేద ఇత్యుపనిషత్ 14


ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్ఠువాగ్ం సస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు!


ఓం శాంతిః శాంతిః శాంతిః

ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్త్వమసి! త్వమేవ కేవలం కర్తాఽసి ! త్వమేవ కేవలం ధర్తాఽసి! త్వమేవ కేవలం హర్తాఽసి! త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి! త్వం సాక్షాదాత్మాఽసి నిత్యమ్!1

ఋతం వచ్మి సత్యం వచ్మి 2 


హరిః ఓం! గం ! గణపతి బీజం.గణపతి రూపం కూడా ఎల్లాగంటే సంస్కృతంలోని "గ " చూడండి పరిశీలించండి రెండు నిలువు గీతలు ఉంటాయి. ఒక గీత క్రింద వంపు తిరుగుతుంది j ఇల్లాగ అది తొండము. l ప్రక్కగీత దంతం ఇప్పుడు రెండు గీతలు గణపతి యొక్క తొండము,దంతం కాబట్టి గకారమే గణపతి.

నమస్తే గణపతయే... ఓ గణములకు పతియైన వాడా! - నమః తే...నీకు నమస్కారం. (నీ ముందు అహంకార రహితమైన నా మనస్సును సమర్పిస్తున్నాను.)

త్వమేవ ప్రత్యక్షం తత్త్వమసి

త్వమేవ - నీవు మాత్రమే ప్రత్యక్షంగా, "తత్" .. అది ఏదైతే సనాతనమో, ఏదైతే ఆది అంత్యములు లేనిదో, అనిర్వచనీయమో, భావానికీ శబ్దానికీ అతీతమైనదో "అది (అట్టి పరమాత్మ )" నీవు (త్వం) అయి ఉన్నావు (అసి).

త్వమేవ కేవలం కర్తాసి... అన్నింటికీ నీవే కర్తవు,

త్వమేవ కేవలం ధర్తాఽసి! 

 నీవే ధరించే వానివి (ధర్త)

త్వమేవ కేవలం హర్తాఽసి! నీవే లయం చేసుకునే వానివి (హర్త).

త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి

నీవు మాత్రమే సర్వమూ, బ్రహ్మమూ అయి ఉన్నావు కదా (ఖల్విదం)

ఋతం వచ్మి సత్యం వచ్మి

ఋతం-- ఇతః పూర్వం ఋజువు చేయబడిన వాడివి నీవే, సత్యానివీ నీవే. అవ అంటే రక్షించు, కాపాడు ఋతం - సత్యం రెండింటికి తేడా ఏమిటంటే మన అనుభవంతో చెప్పేది సత్యం.మన అనుభవంతో కాకుండా పెద్దలు చెప్పిన విషయం ఋతం. మామ్ -- నన్ను, వక్తారం ... ప్రవచించే వక్తను గురువును , శ్రోతారమ్... జాగ్రత్తగా వినే శ్రోతలను శిష్యులను , దాతారమ్ ... దానం చేసే దాతలను, ధాతారమ్.... బ్రహ్మాదులను, అనూచానంగా(తరతరాలు వస్తున్న ఆచారం) దానిని కాపాడు. అవ శిష్యమ్... శిష్యులను కాపాడు. అర్హత ప్రాతిపదికగా విజ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు. ఆ గురువును భక్తి పూర్వకంగా భావిస్తూ, అతనిచ్చిన అభిగమ్యమైన (పొందదగిన) విజ్ఞానాన్ని పవిత్రంగా, జిజ్ఞాసతో, అభిలాషతో అధ్యయనం చేసే వాడు శిష్యుడు. ఇరువురికీ సామాన్యంగా ఉండవలసిన లక్షణం "అర్హత".

అవ త్వం మామ్, అవ వక్తారమ్, అవ శ్రోతారమ్, అవ దాతారమ్, అవ ధాతారమ్, 

అవానూచానమవ శిష్యమ్, అవ పశ్చాత్తాత్, అవ పురస్తాత్, అవోత్తరాత్తాత్, అవ దక్షిణాత్తాత్, 

అవ చోర్ధ్వాత్తాత్, అవాధరాత్తాత్, సర్వతో మాం పాహి పాహి సమంతాత్! 3


జగత్తును ఆవరించిన ఈ ఆరు దిక్కులను (పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, ఊర్ధ్వ, అధో దిశలు) కాపాడు. సర్వతో మాం పాహి.... ఈ ఆరు దిక్కులచే చక్కగా చుట్టబడిన (సమంతాత్) సర్వమును కాపాడు.

త్వం వాఙ్మయస్త్వం చిన్మయః! త్వమానందమయస్త్వం బ్రహ్మమయః!

త్వం సచ్చిదానందాఽద్వితీయోఽసి! త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి! త్వం జ్ఞానమయో విజ్ఞానమయోఽసి! 4

త్వం వాజ్ఞ్మయః .. నీవే సకల వాక్సంబంధిత శక్తివి, నీవే (చిత్ మయః) జ్ఞాన మూర్తివి, నీవే ఆనంద మయునివి, నీవే పరబ్రహ్మము. నీవే సత్ చిత్ ఆనందమవు. శాశ్వతమైన వానివి నీవే, నీకన్న రెండవది లేదు. ప్రత్యక్షంగా పర బ్రహ్మమవు నీవే. నీవే జ్ఞానానివి, నీవే విజ్ఞానానివి. (పంచేంద్రియాలచే తెలుసుకునేది లేదా గ్రహించేది జ్ఞానం కాగా వీటికి అతీతంగా పొదగలిగినది విజ్ఞానం. భౌతికంగా విజ్ఞానం అంటే... ఆచరించి దాని మంచి చెడ్డలను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నది విజ్ఞానం.)

                    సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ 


               🙏 గణపతి ఉపనిషత్తు 🙏

                     రెండవ భాగం 

సర్వం జగదిదం త్వత్తో జాయతే! సర్వం జగదిదం త్వత్తస్తిష్ఠతి! సర్వం జగదిదం త్వయి లయమేష్యతి! సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి! త్వం భూమిరాపోఽనలోఽనిలో నభః త్వం చత్వారి వాక్పదాని! 5

సర్వం జగదిదం త్వత్తో జాయతే! 

ఈ సకల చరాచర జగత్తు నీనుండే ఉద్భవించినది.

సర్వం జగదిదం త్వత్తస్తిష్ఠతి! 

 ఈ జగత్తంతా నీలోనే ఉంటుంది. 

సర్వం జగదిదం త్వయి లయమేష్యతి

ఈ జగత్తు మొత్తంగా లయమయ్యేదీ నీలోనే. 

సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి

ఈ జగత్తంతా నీవైపే ప్రవహిస్తుంది (త్వయి ప్రత్యేతి) నిన్నే పొందుతుంది. 

త్వం భూమిరాపోఽనలోఽనిలో నభః

నీవే భూమివి, నీరు, వాయువు, అగ్నివి, ఆకాశానివి.

త్వం చత్వారి వాక్పదాని

 పరా పశ్యంతి మధ్యమా వైఖరి గా పేర్కొనబడే వాక్కు యొక్క నాలుగు పదాలు నీవే.

త్వం గుణత్రయాతీతః! త్వం దేహత్రయాతీతః! త్వం కాలత్రయాతీతః! త్వం అవస్థాత్రయాతీతః!

త్వం మూలాధారస్థితోఽసి నిత్యమ్! త్వం శక్తిత్రయాత్మకః! త్వాం యోగినో ధ్యాయంతి నిత్యమ్!

త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువః స్వరోమ్! 6


త్రిగుణాలకు (సత్వ రజస్ తమో) నీవు అతీతునివి, నీవు స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా పేర్కొనబడే దేహత్రయానికీ అతీతునివి. నీవు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అతీతునివి. నీవే కుండలినీ శక్తిగా నిత్యమూ మూలాధార చక్రంలో స్థితమైన (ఉండే) శక్తివి. నీవే మూడు శక్తులకు (ఇఛ్ఛా జ్ఞాన క్రియా శక్తులు) అతీతమైన వానివి.

నిత్యం యోగులచే ధ్యానం చేయబడే వానివి నీవే. త్రిమూర్తులు, ఇంద్రాగ్ని వాయు సూర్య చంద్రాదుల రూపంలో భాసిల్లే వానివి నీవే. ముల్లోకములలో (భూః, భువః సువః) నీవే, ముల్లోకములూ నీవే అయిన వాడివి.


గణాదిం పూర్వముచ్చార్య! వర్ణాదీం స్తదనంతరమ్! అనుస్వారః పరతరః! అర్ధేందులసితమ్!

తారేణ ఋద్ధమ్! ఏతత్తవ మనుస్వరూపమ్! గకారః పూర్వరూపమ్ అకారో మధ్యమరూపమ్ అనుస్వారశ్చాంత్యరూపమ్! బిందురుత్తరరూపమ్! నాదః సంధానమ్! సంహితా సంధిః!

సైషా గణేశవిద్యా! గణక ఋషిః! నిచృద్గాయత్రీచ్ఛందః! శ్రీ మహాగణపతిర్దేవతా ఓం గం గణపతయే నమః!7

"గం" అనేది గణపతి బీజం. దానిని ఉఛ్చరించే పద్దతి చెపుతున్నారిక్కడ. "గ్" ను ముందుగా ఉఛ్చరించాలి అటు పిమ్మట వర్ణములకు ఆది అయిన "అ"కారాన్ని ఉఛ్చరించాలి. తదుపరి అనుస్వరాన్ని ఉఛ్చరించాలి. ఇది "గం" అవుతుంది. అదే గణపతి బీజం. (దీని సాధనచేత ఆ స్వామి గోచరమౌతాడు).

అర్ధేందులసితం... అక్షరములు ధ్వనులకు సంకేతాలు. ధ్వని నాద భరితము. బిందువు తదుపరి వచ్చే నాదాన్ని "అర్ధేందు" అనే సంకేతంతో సూచించారు. ఆ నాదంతో ప్రకాశించే వాడు.

తారేణ రుద్ధం... తార అనగా తరింప చేసే మంత్రము దానినే ఓంకారము లేదా ప్రణవము అంటున్నాము. రుద్ధము పరివేష్టితుడు. ప్రణవము చేత పరివేష్టితుడు లేదా ప్రణవ స్వరూపుడు.

ఇది అతని యొక్క మంత్ర రూపము.

(ఇక పోతే సామాన్యార్థంలో చెప్పుకుంటే....శివ సంబంధమైన వాడు గణపతి కాబట్టి అతడు అర్ధేందుచే (అష్టమినాటి చంద్రుని) ప్రకాశించే వాడు. తారకలచే (నక్షత్రములు) పరివేష్ఠితుడు, అని చెప్పు కోవచ్చు... కాని ఇది సంప్రదాయము కాదు.)

“గం” బీజం సాధన చేసే సమయంలో... "గ్" కారం పూర్వ రూపం, "అ" కారం మధ్యమ రూపం, అనుస్వరం అంత్య రూపం అవుతుంది కాగా బిందువు (౦) ఉత్తర రూపంగా ఉంటుంది. దీనిని పలికి నప్పుడు వచ్చే నాదమే సంధానము. దీనితో అత్యంత సాన్నిహిత్యం కలిగినది సంధి.

ఇది మొత్తంగా (సైషా.. స ఏషా...) గణేశుని విద్య. దీనికి ఋషి గణక ఋషి. అనగా దీనిని దర్శించి ప్రవచించిన వాడు, గణకుడు అనే ఋషి. దీని ఛందస్సు నిచృద్ ఛందం. అధిష్టాన దేవత గణపతి.

“ఓం గణపతయే నమః ఏక దంతాయ విద్మహే, వక్ర తుండాయ ధీమహి, తన్నో దంతిః ప్రచోదయాత్”!

ఏకదంతం చతుర్ హస్తం పాశమంకుశధారిణమ్

రదం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజమ్!

రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససమ్ 

రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితమ్!

భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతమ్ 

ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్పరమ్!

ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః 9

ఏకదంతుడు, నాలుగు చేతులలో.... పాశము, అంకుశము, దంతము, (ఇది ఏనుగు దంతం, త్యాగానికి సంబంధించినది. మహాభారత రచనా కాలంలో తన దంతాన్ని విరిచి వ్రాసాడు) అభయ ముద్రను ధరించినవాడు, ఎలుక వాహనమును ధ్వజముగా కలిగిన వాడు, పెద్దదైన పొట్టను కలిగిన వాడు, చాటల లాంటి చెవులను కలిగిన వాడు, రక్త వర్ణ వస్త్రములను ధరించిన వాడు, ఎర్రనైన సుగంధములను పులుముకున్న శరీరము కలిగిన వాడు, ఎర్రనైన పుష్పములచే చక్కగా పూజిlతుడు, భక్త కోటిపై అమితమైన అనుకంప (దయ) కలిగిన వాడు, భగవంతుడైన వాడు, ఈ జగత్తుకు కారణమైన వాడు, అచ్యుతుడు (జారిపోని వాడు), సృష్టి ఆదిలోనే ఆవిర్భూతుడు, ప్రకృతి పురుషులకు కూడా పరమమైన వాడు, ఎవరైతే ఉన్నాడో (గణపతి) వానిని నిత్యం ఎవరైతే ధ్యానిస్తారో వారు యోగులలో శ్రేష్టునిగా చెప్పబడతారు.

హే వ్రాత పతి (సమూహమునకు భర్త) నీకు నమస్సులు. గణములకు పతియైన నీకు నమస్సులు, ప్రమథ గణములకు పతివైన నీకు నమస్సులు, లంబోదరుని వైన నీకు నమస్సులు, ఏకదంతుని వైన నీకు నమస్సులు (ఏక దంతము త్యాగానికి చిహ్నము) విఘ్నములను నశింప చేసే నీకు నమస్సులు, శివ సుత నీకు నమస్సులు (శివము అంటే మహదానందము.. దానికి పుత్రుడు అంటే ఆనంద మూర్తియే... పోతన గారు కూడా మహానందాంగనా డింభకుడు అని అంటారు. మహా ఆనందము అనే అంగనకు డింభకుడు) వరద మూర్తయే... అపరిమితమైన దయా కారుణ్యాలకు ఆకృతి వస్తే ఎలా ఉంటుంది అంటే అది గణపతి వలె ఉంటుంది అనేందుకు వరద మూర్తయే అన్నారిక్కడ. ఆ వరద మూర్తికి నమస్సులు.

ఇక చివరగా ఫల శ్రుతి....

ఈ అథర్వ శీర్షంను ఎవరైతే శ్రద్ధతో, చక్కగా అధ్యయనం చేస్తారో, వారు (స) బ్రహ్మ స్థానాన్ని పొందుతారు. వారు సర్వ విఘ్నములనుండి విముక్తుడవుతాడు, వారు సర్వత్రా సుఖములను పొందుతారు, వానికి పంచ మహా పాతకముల నుండి విముక్తి కలుగుతుంది.

సాయం సమయంలో దీనిని అనుష్ఠించడం వల్ల పగలు చేసిన పాపములు తొలగిపోతాయి. ప్రాతఃకాలంలో అనుష్ఠించినట్లయితే రాత్రి చేసిన పాపములు తొలిగిపోతాయి. సాయం ప్రాతస్సులలో అనుష్ఠించిన వానికి పాపములు అంటుకొనవు. సర్వత్రా ఏ కార్యములలో నైనా ఏ విధమైన విఘ్నములు కూడా అతనికి కలగవు. అతడు ధర్మార్ధ కామ మోక్షములను పొందగలడు. ఇది అధర్వ శీర్షం.

దీనిని శిష్యులు కాని వారికి ఇవ్వకూడదు. ఇక్కడ శిష్యుడు అంటే నేర్చుకోవాలనే జిజ్ఞాసతో గురువును సభక్తికంగా చేరిన వాడు. అశ్రద్ధ లేనివాడు, ఉపాసన యందు అనురక్తి కలిగిన వాడు. విషయంపైన భక్తిభావన కలిగిన వాడు. అలాంటి లక్షణాలు లేని వానికి ఈ విద్యను ఇవ్వగూడదని చెపుతుంది, ఈ సూక్తం. ఏ ప్రలోభాలకైనా లోనై అలా అనర్హులకు ఈ సూక్తాన్ని ఇచ్చినట్లయితే అతడు పాప కూపంలొ పడిపోతాడని హెచ్చరిస్తుంది.

ఏ ఏ కోరికలతో నైనా సహస్రావర్తనంగా దీనిని అనుష్ఠించినట్లయితే దీని చేత (అనేన) ఆ కోరికలు సాధింపబడతాయి. ఈ ఉపనిషత్ చేత గణపతిని అభిషేకించినట్లయితే అతడు చక్కని వాక్పటుత్వం కలిగిన వాడవుతాడు.

భాద్రపద శుద్ధ చవితినాడు భోజనం చేయకుండా (చతుర్థ్యామనశ్నన్… అన అశనము) ఎవరైతే జపిస్తారో, అతడు విద్వాంసుడౌతాడు. ఇది అథర్వణ వాక్యము.

దీనిని బ్రహ్మ విద్యగా ఆచరించడం వల్ల కొద్దిగా కూడా భయం అనేది ఉండదు (నభిభేతి)

గణపతిని ... ఎవరైతే దూర్వారములచే అర్చిస్తారో అతడు అపర కుబేరుడౌతాడు. పేలాలతో ఎవరైతే అర్చిస్తారో అతడు యశస్కుడు అవుతాడు. మేధోవంతుడౌతాడు. మోదక సహస్రముచే ఎవరైతే అర్చిస్తారో వారికి వాంఛించిన ఫలితం లభిస్తుంది. ఎవరైతే ఆజ్యము (నేయి) సమిధలతో హవనం చేస్తారో వారికి ముమ్మాటికీ సర్వమూ లభిస్తుంది.

ఎనిమిది మంది వేద విదులైన బ్రాహ్మణులను చక్కగా సమకూర్చుకొని గణపతి నెవరైతే అర్చిస్తారో వారు సూర్య వర్చస్సును పొందుతారు.

సూర్య గ్రహణ కాలంలో, మహానది (జీవనది) వద్ద ప్రతిమ సాన్నిధ్యంలో జపించిన వారికి మంత్ర సిద్ధి కలుగుతుంది. వారికి మహా విఘ్నములు, మహా దోషములు, మహా పాపములు తొలగిపోతాయి. అతడు అన్నీ తెలిసిన వాడవుతాడు... ఇది తెలుసుకోండి అంటుంది.. ఈ గణపతి అథర్వశీర్ష ఉపనిషత్తు.

ఓం శాంతిః శాంతిః శాంతిః

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: