2, నవంబర్ 2020, సోమవారం

మహాభారతము ' ...65 .

 మహాభారతము ' ...65  . 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


అరణ్యపర్వం.


ధర్మరాజుని ద్రౌపదీ, భీమసేనులు నిష్టురవాక్యాలతో బాధపెడుతున్న సమయంలో, వ్యాసభగవానులు ధర్మజుని చూడడానికి వచ్చి,  పరిస్థితిని చక్కదిద్దాడు.


వ్యాసుడు పాండవుల పాదపూజ స్వీకరించిన అనంతరం, ' ధర్మజా !  ప్రస్తుతం మీ అన్నదమ్ములు ఐదుగురూ, ద్రౌపదీ వున్న మానసికస్థితి అవగతం చేసుకుని యిక్కడకు వచ్చాను.  మీరు భవిష్యత్తు గురించి దిగులు చెందవలసిన అవసరం లేదు.  భీష్మ  ద్రోణాది వీరులను యెదుర్కొనలేమని చింతించవలదు.  ' ప్రతిస్మృతి ' అనే మంత్ర విద్యతో,  అర్జునుడు,  శివునిదర్శనము, ఇంద్రుని దర్శనం చేసుకుని, అఖండ శక్తివంతములైన అస్త్రాలు సంపాదిస్తాడు.  నేనిప్పుడే ఆమంత్రాన్ని నీకు వుపదేశిస్తాను. ' అని చెప్పి  దూరంగా తీసుకువెళ్లి యెదురుగా కూర్చుండబెట్టుకుని ఆ విద్యను వుపదేశించాడు వ్యాసభగవానుడు.  ' తగిన సమయంలో అర్జునునికి యీవిద్య నీద్వారా అనుగ్రహించు. ' అని చెప్పాడు.


తరువాత, ధర్మరాజుతో, ' మీరు ద్వైతవనానికి వచ్చి చాలాకాలమైంది.  మీరు శత్రువు దృష్టిలో పడకుండా వుండాలంటే, యెక్కువకాలం ఒకేచోట నివసించరాదు.  తిరిగి కామ్యకవనానికి వెళ్ళండి. ' అని హితబోధ చేశాడు.  ఆ విధంగానే పాండవులు కామ్యకవనం చేరారు. 


మారిన  వాతావరణంలో  కొంతకాలం  మనసులు  తేలికపరచుకున్న తరువాత, ఒకనాడు, ధర్మరాజు అర్జునుని పిలిచి, ' ప్రతిస్మృతి '  ని వుపదేశించి '  ఇంద్ర, పరమేశ్వరులను సంతుష్టులను చేసి, దివ్య అస్త్రాలతో  తిరిగిరా ! '  అని ఆదేశించాడు.  అర్జునుడు కూడా ధృడసంకల్పంతో, భక్తిగా అన్నగారికి, ఋషిపుంగవులకు నమస్కరించి,  యెప్పుడు యే అవసరం వస్తుందో అని, క్షత్రియధర్మంగా ధనుర్బాణాలు తీసుకుని, తపస్సు చేయడానికి మొదటగా హిమాలయాల లోనికి వెళ్ళాడు.  ఆపై గంధమాదనపర్వతం  ద్వారా, ఇంద్రకీలపర్వతం చేరుకున్నాడు.  


ఇంద్రకీలపర్వతం పై నున్నప్పుడు, అర్జునునికి '  ఆగు ' అని అశరీరవాణి పలికినట్లు అనిపించింది.   ఆ చుట్టుప్రక్కల పరిశీలించగా, ఒక చెట్టు క్రింద తపస్సు చేసుకుంటూ ఒక ఋషి కనిపించాడు.  ఆ ఋషి ' ఓయీ ! ఎవడవు నీవు ? ఇంత ప్రశాంతప్రదేశంలో, మునిపుంగవులు తిరిగేచోట, ధనుర్బాణాలతో యెందుకు తిరుగుతున్నావు ?   వెంటనే ధనుర్బాణాలు వదలి దండకమండలాలు ధరించు, నీకు తపస్సుచేసే ఆలోచన వుంటే '  అన్నాడు.  అయితే అర్జునుడు, ఆ ఋషికి వినయంతో నమస్కరించాడు గానీ, ధనుర్బాణాలు విడిచిపెట్టలేదు.  


ఆ ఋషి అతని కార్యనిష్ఠకు సంతోషించి, తన నిజరూపంలో ఇంద్రునిగా ప్రత్యక్ష మయ్యాడు అర్జునుని ముందు.  ' ఏం వరం కావాలో కోరుకో ' మన్నాడు.  దివ్యాస్త్రాలు ప్రసాదించమని అడిగాడు అర్జునుడు. ' నీకు దివ్యాస్త్రాలు కావాలంటే, ముందుగా తపస్సుద్వారా ఈశ్వరుని ప్రసన్నం చేసుకో ! '  అని సూచించి, అర్జునుని నమస్కారాలు అందుకుని అంతర్ధానమయ్యాడు, ఇంద్రుడు.


హిమాలయాల్లో అకుంఠిత తపోదీక్షతో వున్నాడు అర్జునుడు.  శరీరాన్ని కృశింపజేసుకుని ఏకాగ్రత పెంచుకునే వుద్దేశ్యంతో,  మొదటి మాసమంతా, మూడురోజులకొకసారి,కేవలం ఫలాలు భుజిస్తూ, తపమాచరించాడు, అర్జునుడు.  క్రమంగా రెండవమాసంలో, ఆరు రోజులకొకసారి  ఫలాహారం తీసుకుంటూ, మూడవనెల వచ్చేసరికి, పక్షానికి ఒకసారి చొప్పున ఆహారం తీసుకోవడం చేశాడు.  


నాలుగవ మాసంలోకి ప్రవేశించినా, తన తపస్సు ఫలించనందుకు ఈశ్వర దర్శనం కానందుకు యెంతో ఆవేదన చెంది, పట్టుదలతో, కేవలం వాయుభక్షణం చేస్తూ తపస్సు కొనసాగించాడు అర్జునుడు.  అర్జునుని వాయుభక్షణ క్రియ వలన, క్రమంగా ప్రకృతి స్తంభించ సాగింది. దేవలోకం అతని తపస్సును గుర్తించింది. ప్రకృతి యింకా భీభత్సంగా మారకముందే,  దేవతలు,  ఈశ్వరుని ఆశ్రయించి, కాపాడమని ప్రార్ధించారు. శివుడు వారికి  అభయమిచ్చి, హిమాలయాలలో వున్న అర్జునునివద్దకు బయలుదేరాడు.


శివుడు అర్జునుని పట్టుదలకు ముచ్చటపడి, అతని పరాక్రమం కూడా పరీక్షించదలచి, కిరాతుని రూపంలో, తన ధనుస్సు ' పినాకం ' ధరించి,  పక్కన పార్వతీమాత, కిరాతస్త్రీ రూపం లో వెంటరాగా, అర్జునుడు తప్పస్సు చేస్తున్న స్థలం చేరారు, ఆదిదంపతులు.  


వస్తూవస్తూనే కిరాతరూపం లో వున్న శివుడు మూకాసురుడు అనే రాక్షసుని వరాహ రూపంలో వచ్చి అర్జునుని తపస్సు భగ్నం చెయ్యమని చెప్పాడు.   వరాహం పెద్ద ధ్వనితో మీదకు వస్తుండగా అర్జునుడు తపస్సు నుండి మేల్కొని, ప్రక్కన వున్న వింటిని తీసుకుని బాణం దానిపై వదిలాడు.  అదేసమయానికి కిరాతుడు కూడా బాణం వదలగా,ఆది చనిపోయినట్లు పడిపోయింది.  


వరాహం చనిపోవడం చూసి, అర్జునుడు ఆగ్రహంతో ఆ కిరాతుని చూస్తూ, ' ఈ జంతువును వధించేహక్కు నీకెక్కడిది ?  నేను ఆత్మరక్షణార్థం బాణం విడిచాను. కానీ నీవు యేకారణం లేకుండా దానినెందుకు చంపావు ? నిన్ను నేను వదలను. ' అంటూ  బాణం తీసుకున్నాడు.


' ఓహోహో ! ఇది మరీ విడ్డూరంగా వున్నది.  నేను కిరాతుడను, నావృత్తి వేటాడడమే.  నీవు క్షత్రియునివలే వున్నావు. ఇక్కడేమి పని.  ఎందుకు ఒంటరిగా వున్నావు  ? ' అని అడిగాడు కిరాతుడు.  '  ఈ వరాహాన్ని ముందు నేనుకొట్టాను. ఇది నా ఆహారం.  నీవు తప్పుకో ' అని గద్దించాడు కిరాతుని రూపంలో వున్న శివుడు.  అర్జునునిపై బాణాలు వెయ్యనారభించాడు.  . 


అయితే, అర్జునుడు  అందుకు ఒప్పుకోక, కిరాతుడు వేసే ప్రతిబాణాన్ని, తట్టుకుని, కిరాతునిపై బాణవర్షం కురిపించాడు. అర్జునుడు యెన్ని బాణాలు వేసినా, అవి శివునిలో లీనమవుతున్నాయి.  కిరాతుని రూపం లో చెక్కుచెదరని చిరునవ్వుతో, శివుడు అర్జునుని   వైపు చూస్తూ బాణప్రయోగం చేస్తున్నాడు.


అర్జునుడు విస్తుబోయి చూస్తున్నాడు, యేమిటి యీమాయ అనుకుంటూ....


స్వ స్తి.

వ్యాసానుగ్రహంతో....


తీర్థాల రవి శర్మ

విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం హిందూపురం

9989692844

కామెంట్‌లు లేవు: